హైదరాబాద్‌లో కూర్చుని అమెరికన్లకు గాలం వేస్తున్నారు, పోలీసులకు చిక్కిన ముఠా

కాల్ సెంటర్ స్కామ్

ఫొటో సోర్స్, Cyberabad Police

    • రచయిత, సతీశ్ బళ్ల
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్‌లో కూర్చుని అమెరికన్లను మోసం చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది.

అమెరికా ప్రభుత్వ అధికారులుగా, ఆ దేశ పోలీసులుగా చెప్పుకొంటూ కొందరూ, అమెజాన్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లుగా చెప్పుకుంటూ ఇంకొందరూ అమెరికా, కెనడా దేశ పౌరులను ట్రాప్ చేస్తున్నారు.

వాళ్లను జైళ్లలో పెడతామని బెదిరించి, వేల డాలర్లు గుంజి, వాటిని గిఫ్టు కార్డుల రూపంలో చవకగా అమెరికా పౌరులకే అమ్ముతున్నారు.

ఆ తర్వాత వాటిని క్రిప్టోకరెన్సీగా మార్చి, ఆపైన హవాలా మార్గాలలో భారతదేశానికి తెప్పిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన యువతను ఉద్యోగాల్లో నియమించుకుని హైదరాబాద్ కేంద్రంగా గుజరాత్‌కి చెందిన వ్యక్తి నడిపిస్తోన్న ఈ మోసంపై తెలంగాణ పోలీసులు కూపీలాగి పట్టుకున్నారు. వారి నుంచి వేలాది మంది అమెరికన్ పౌరుల బ్యాంకు అకౌంట్ల వివరాలు సహా అనేక వివరాలు స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాదు, కాల్ సెంటర్ తప్పు చేస్తే యాజమాన్యమే కాదు, అందులో పని చేసే సిబ్బంది మీద కూడా కేసులు పెడుతున్నారు పోలీసులు.

అందుకే ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 115 మంది అరెస్ట్ చేశారు మాదాపూర్ పోలీసులు.

సైబరాబాద్ పోలీసులకు చిక్కిన ఆన్‌లైన్ నేరగాళ్ల ముఠా

ఏ1 మహమ్మద్ అన్సారీ మోహిర్ఫాన్, ఏఆర్జే సొల్యూషన్స్

ఏ2 ఘాంచీ అకీబ్, ఏజీ సొల్యూషన్స్

ఏ3 ప్రదీప్ వినోద్ రాథోడ్, వెర్టెజ్ సొల్యూషన్స్

ఏ4 ఒస్మాన్ ఘనీ ఖాన్, వెర్టెజ్ సొల్యూషన్స్

ఏ5 శివం ప్రధాన్, వెర్టెజ్ సొల్యూషన్స్‌లో ఫ్లోర్ లీడర్

ఏ6 దీపు థాపర్, వెర్టెజ్ సొల్యూషన్స్‌లో ఫ్లోర్ లీడర్

వీళ్లు కాక మరో 109 మంది ఈ కేసులో ఉన్నారు.

సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మాదాపూర్ డీసీపీ సందీప్ చెప్పిన వివరాల ప్రకారం, వీరు రోజుకు సగటను 10-20 మంది అమెరికన్ పౌరులను మోసం చేస్తూ సుమారు రోజుకు 20 వేల డాలర్లు వసూలు చేస్తున్నారు.

కాల్ సెంటర్ స్కామ్

ఫొటో సోర్స్, Cyberabad Police

అమెరికా ప్రభుత్వ అధికారుల పేరుతో మోసం

ఈ మోసం ఎలా జరుగుతోందో సైబరాబాద్ పోలీసులు వివరించారు..

వీళ్లు హైదారాబాద్‌లో కాల్ సెంటర్ పెట్టి, అమెరికా ప్రభుత్వ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ సెల్ నుంచి ఫోన్ చేసినట్టుగా అమెరికా పౌరులకు కాల్స్ చేస్తారు.

‘‘మీ పేరుతో మెక్సికో నుంచి ప్యాకేజీ వచ్చింది. మేం దాన్ని అనుమానం వచ్చి పరిశీలిస్తే అందులో డ్రగ్స్ లేదా ఇతర అక్రమ వస్తువులు, సామగ్రి ఉన్నాయని చెబుతారు.

అవతలి వారు బెదిరిపోగానే, వాళ్ల నుంచి వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం మొదలుపెడతారు. వాళ్ల పిన్ కోడ్ వంటివి అడుగుతారు.

దీంతో అమెరికన్లు వీరికి భయపడి వారి వివరాలన్నీ చెబుతారు. కావాలనే రెండు అడ్రస్‌లు చెబుతారు, అందులో ఒకటి వాళ్ల ఒరిజనల్ అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ వినగానే, అవును. అది మా ఇల్లే..’’ అని కస్టమర్లు ధ్రువీకరిస్తారు.

‘‘మీరు లేనప్పుడు మీ ఇంట్లో స్టేట్ మార్షల్స్ (అక్కడ పోలీసుల తరహా) అనే గవర్నమెంటు డిపార్టుమెంట్ వాళ్లు రైడ్ చేశారు.

వాళ్లకు మీ ఇంట్లో ఆర్థిక నేరాలకు సంబంధించి, డ్రగ్స్‌కి సంబంధించిన పత్రాలు దొరికాయి’’ అని చెబుతారు.

అక్కడితో ఆగరు. అదెంత పెద్ద నేరమో వివరిస్తూ, ‘‘ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్ కంట్రోల్ లెక్కల ప్రకారం ఏటా యూఎస్, మెక్సికో, కొలంబియాల మధ్య రెండున్నర మిలియన్ డాలర్ల లావాదేవీలు జరుగుతున్నాయంటూ భయపెడతారు.

‘‘ఫెడరల్ డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ మిమ్మల్ని అనుమానితుడిగా గుర్తించింది.’’ అని భయపెడతారు.

యూఎస్ కోడ్ అంటే మన ఐపీసీ తరహాలో సెక్షన్ 841,18, 19, 56, 57 అంటూ కొన్ని చట్టాలు, సెక్షన్లు చెబుతారు.

‘‘టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్ పాసో కౌంటీ అనో, మరో ప్రదేశమో పేరు చెప్పి అక్కడ కేసులు పెట్టామంటూ పక్కా ప్రొఫెషనల్‌గా, అచ్చం పోలీసుల్లాగే మాట్లాడి మీమీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది’’ అని చెబుతారు.

అందుకు తగ్గట్టుగానే చదువు కంటే కూడా, మంచి అమెరికన్ యాస ఇంగ్లిష్ మాట్లాడే ఉద్యోగులనే వీళ్లు కాల్ సెంటర్లలో చేర్చుకుంటారు.

వీళ్లు ఆ ఇంగ్లీషు పరిజ్ఞానంతో పాటు కాల్ సెంటర్‌లో నేర్చుకున్న అమెరికన్ పోలీసుల పరిభాష కలిపి అవతలి వారిని బెదిరించేస్తారు.

‘‘అప్పటి నుంచి వాళ్లను మెల్లిగా వారి దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం మొదలు పెడతారు. అనేక ప్రశ్నలు అడిగి తొందర పెడతారు.

మీకు అరెస్టు వారెంట్ విడుదలైంది.. అని చెప్పి కాసేపు మాట్లాడిన తరువాత దాన్నుంచి బయట పడాలంటే అంటూ హింట్ ఇస్తారు.

బహుశా మీ ఐడెంటిటీ థెఫ్ట్ అంటే మీ వివరాలు మరెవరో దొంగిలించి మీ పేరుతో నేరం చేసి ఉండొచ్చంటూ కాస్త ఊరడిస్తారు.

మీరు తప్పు చేయలేదు అంటే మార్షల్స్‌తో మాట్లాడాలి. అప్పుడు వాళ్ల ఏమైనా చేయగలరంటూ నచ్చచెబుతారు. ఆ తరువాత మళ్లీ డ్రామా మొదలౌతుంది.

అవతలి వ్యక్తిని లైన్లో పెట్టి కాల్ యూఎస్ మార్షల్‌కి బదిలీ చేసినట్టు ఐవీఆర్ ఆడియో అవీ వస్తాయి. అప్పుడు వాళ్ల టీమ్ లీడ్ లైన్‌లోకి వస్తాడు.

వాళ్ల టీమ్ లీడే యుఎస్ మార్షల్ ఆఫీసురులాగా మాట్లాడతాడు.

మీ కాల్ రికార్డు చేస్తున్నామంటూ మొదలుపెడతాడు.’’ అని వివరించారు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర.

కాల్ సెంటర్ స్కామ్

ఫొటో సోర్స్, Cyberabad Police

డబ్బు కట్టలేం అంటే బేరం ఆడి తగ్గిస్తారు కూడా..

అంతా చెప్పాక, మీరు దీన్నించి బయట పడాలి అంటే జరిమానా విధిస్తున్నామంటూ.. 5-6 వేల డాలర్ల జరిమానా వేసినట్టు చెబుతారు.

ఎవరైనా మేం అంత డబ్బు కట్టలేం అంటే బేరం ఆడి తగ్గిస్తారు కూడా. వాటిని గిఫ్టు కార్డుల కింద కొనమంటారు.

యాపిల్ లేదా అమెజాన్ గిఫ్టు కార్డులు కొంటే అప్పుడు ఆ పార్శిళ్లను వెనక్కు పంపేస్తామంటూ కబుర్లు చెబుతారు.

కొన్న తరువాత, కేసులు వెనక్కు తీసుకుంటారని చెబుతారు. అలా వారు గిఫ్టు కార్డులు కొన్న తరువాత వాటి రిడీమ్ కోడ్‌లను అడిగి నోట్ చేసుకుంటారు కాల్ సెంటర్ ఉద్యోగులు.

ఆ కోడ్‌లను వాటి అసలు ధర కంటే చవగ్గా, పాక్స్ ఫుల్ (Paxful) అనే వెబ్ సైట్ ద్వారా అమ్ముతారు.

పాక్స్ ఫుల్‌లో ఉన్న కోడ్ రిడీమ్ అయితే, ఆ కోడ్ వాడుకున్న వారు ఈ కాల్ సెంటర్ వారికి క్రిప్టో కరెన్సీలో డబ్బు ఇస్తారు.

వాటిని వీరు యూఎస్డీటీ స్టేబుల్ కాయిన్ కింద మారుస్తారు. దాన్ని తరువాత ట్రస్ట్ అనే క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్ నుంచి ఆ డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చుకుంటారు.

అక్కడ నుంచి క్రిప్టోని అమ్మి ఇండియన్ కరెన్సీ కింద ఆన్‌లైన్‌లో డబ్బు తీసుకుంటారు. localbitcoin.com వంటి వెబ్ సైట్లనూ వాడతారు. ఒక రకంగా డిజిటల్ హవాలా రూపంలో భారతదేశానికి ఆ డబ్బును తెప్పించుకుంటారు. ఇది ఒక మోడల్..

ఆపిల్ గిఫ్ట్ కార్డులు

ఫొటో సోర్స్, Cyberabad Police

అమెజాన్ ఫేక్ కాల్ సెంటర్

యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ సిబ్బందిలా కాకుండా ఆన్‌లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ కాల్ సెంటర్ సిబ్బందిగా చెప్పుకుంటూ మోసం చేసే మోడల్ మరొకటి ఉంది.

‘‘ఈ పద్ధతిలో ముందుగా కస్టమర్లకు ఆటోమేటిక్ వాయిస్ కాల్ వెళుతుంది.

మీరు అమెజాన్‌లో ఐఫోనో, మ్యాక్ బుక్కో, ఏర్ పాడ్సో ఆర్డర్ చేశారా, చేస్తే ఒకటి నొక్కండి అంటూ మొదలవుతుంది.

తరువాత కస్టమర్ కేర్ ప్రతినిధిగా చెప్పుకునే అతను లైన్లోకి వచ్చి మీ ఆర్డర్ ఐడి చెప్పండి. రేపు డెలివరీ వస్తుంది అంటారు.

అదేంటీ నేనేమీ ఆర్డర్ చేయలేదు అని అవతలి వ్యక్తి చెబుతారు. లేదు మీరే ఆర్డర్ చేశారు. మీ అకౌంట్‌లో డబ్బు కూడా కట్ అవుతుంది అంటారు. కావాలంటే మీ ఫోన్ చూసుకోండి. మీకొక మెసేజ్ వచ్చే ఉంటుంది అంటారు.

మీరు వెరిఫికేషన్ అథంటికేషన్ చేస్తేనే ఆర్డర్ వచ్చింది అని నమ్మబలుకుతారు ఈ నకిలీ కాల్ సెంటర్ ఉద్యోగులు. అంతేకాదు, వారిని కాసేపు లైన్లో పెట్టి, మేం సెక్యూరిటీ చెక్ చేశాం, మీరే ఆర్డర్ చేసినట్టు మా దగ్గర పక్కా వివరాలు ఉన్నాయి అంటారు.

కాల్ సెంటర్ స్కామ్

ఫొటో సోర్స్, Cyberabad Police

ఖరీదైన వస్తువులు డెలివరీ చేస్తున్నట్లు చెబుతారు. ఈ ట్రాన్సాక్షన్ వల్ల మీ క్రెడిట్ స్కోర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అంటారు.

మాటల్లో పెట్టి పేరు, వారి వయసు, అడ్రస్ వంటి వివరాలు రాబడతారు. కానీ తాను ఆర్డర్ చేయలేదని బాధితుడు చెప్పగానే, సరే అయితే మీతో మా పై అధికారులు మాట్లాడతారు అంటే కాల్ కట్ చేస్తారు.’’ అంటూ ఆ ప్రక్రియను వివరించారు మాదాపూర్ డీసీపీ సందీప్.

కష్టమర్లు తాము ఆర్డర్ చేయలేదు కదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పడు వీళ్లే మళ్లీ మరో అనుమానం పెడతారు. ఈ మధ్య మీరేమైనా కాఫీ షాపులకు వెళ్లారా? లేదా పబ్లిక్ వైఫై వాడారా? ఎవరికైనా మీ వివరాలు (క్రెడెన్షియల్స్) ఇచ్చారా? అని అడిగి, బహుశా ఎవరో మీ వివరాలు దొంగిలించి మీ పేరిట ఆర్డర్ చేసి ఉంటారు. ఐడెంటిటీ థెఫ్ట్ జరిగిందంటూ ఊరడిస్తారు.

అప్పుడు మళ్లీ అసలు ముగ్గులోకి దించుతారు.

‘‘మీరు ఈ ఆర్డర్ కాన్సిల్ చేయాలంటే మీ బ్యాంకు నుంచే జరుగుతుంది. మీ కాల్‌ను బ్యాంకుకు బదిలీ చేస్తాం అంటారు.

మీరు ఇదంతా కాన్సిల్ చేయాలి అంటే కాన్సిలేషన్ చార్జీలు ఉంటాయి. 200-300 డాలర్ల వరకూ పడుతుందని చెప్పి, మళ్లీ అమెజాన్ గిఫ్టు కార్డులు కొనిపిస్తారు.

అక్కడి నుంచి మామూలే, గిఫ్టు కార్డులు అమ్మి, క్రిప్టో కరెన్సీ నుంచి భారత కరెన్సీగా అక్రమంగా మారుస్తారు.

కాల్ సెంటర్ స్కామ్

ఫొటో సోర్స్, Cyberabad Police

అమెరికన్ల వివరాలు వీళ్లకి ఎక్కడివి?

యూఎస్, కెనడా పౌరుల డాటాను వీరు ఒక ప్రైవేటు వెబ్ సైట్ నుంచి కొంటారు.

కాల్ సెంటర్స్ ఇండియా డాట్ కామ్ (callcentersindia.com) అనే వెబ్ సైట్ అమెరికన్ల పేర్లు, నంబర్లు, ఇంటి అడ్రస్లు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు వంటి వివరాలను ఒక్కో ప్యాకేజీ కింద అమ్ముతుంది.

పోలీసులు పట్టుకున్నప్పుడు వీరి దగ్గర అలా కాల్ చేసినవి, కాల్ ఎత్తనివి, తరువాత మాట్లాడతాం అన్నవి.. అలా కేటగిరీల వారీగా వివరాలు ఉన్నాయి.

అవతలి వారికి నమ్మకం కలిగించడం కోసం మనుషులతో పాటూ ఐవీఆర్ (అంటే ఫోన్ వచ్చినప్పుడు ఫలానా ఆప్షన్ కోసం ఫలానా బటన్ నొక్కండి అని ఆటోమేటిగ్గా మాటలు వినిపించే ఏర్పాటు) కూడా వీళ్లు ఏర్పాటు చేశారు.

దాని కోసం నిమిషానికి 45 పైసల చొప్పున ఐవీఆర్ సర్వీసుకు వీళ్లు చెల్లిస్తున్నారు. కస్టమర్లతో ముందుగా టెలికాలర్లు, తరువాత లీడ్స్ మాట్లాడతారు.

చిత్రం ఏంటంటే ఈ మోసాలపై అమెరికా ప్రభుత్వం నుంచి భారత పోలీసులకు ఎటువంటి సమాచారమూ లేదు.

ఇక్కడ నకిలీ కాల్ సెంటర్లు నడుపుతున్నారన్న అనుమానంతో సైబరాబాద్ పోలీసులు సోదాలు చేస్తే ఈ వ్యవహారం బయట పడింది. వీరి దగ్గర వేలాది నంబర్లు ఉన్నాయి.

‘‘వీళ్లు రోజుకు 20 వేల కాల్స్ వరకూ చేస్తారు. వాటిల్లో రోజుకు 20 – 30 మంది లైన్లోకి వస్తే, మొత్తంగా రోజుకు సుమారు 20 వేల డాలర్ల వరకూ మోసం చేసి సంపాదిస్తారు.’’ అని వివరించారు పోలీసు అధికారులు.

కాల్ సెంటర్ స్కామ్

ఫొటో సోర్స్, Cyberabad Police

ఉద్యోగుల అరెస్టు ఎందుకు?

సాధారణంగా ఇటువంటి కేసుల్లో సంస్థ యజమానులు, కీలక వ్యక్తులనే అరెస్టు చేస్తారు. కానీ ఈ కేసులో ఉద్యోగులు అందర్నీ అరెస్టు చేశారు. ఏకంగా 115 మంది అరెస్టు అయ్యారు.

‘‘వాళ్లు ఉద్యోగంలో చేరేప్పుడే వాళ్లకు తెలుసు. తాము మోసం చేయడానికి ఉద్యోగం చేస్తున్నామని. అందుకే వారిని కూడా అరెస్టు చేశాం.’’ అన్నారు స్టీపెన్ రవీంద్ర.

సంస్థ యజమానులు గుజరాతీలు కాగా, వాటిలో పనిచేసే వారు రకరకాల రాష్ట్రాల నుంచి ఉన్నారు. దిల్లీ నుంచి 12, గుజరాత్ 11, అస్సాం 12, హర్యాణా 1, మహారాష్ట్ర 17, నాగాలాండ్ 36, బెంగాల్ , ఝార్ఖండ్‌ రాష్ట్రాల వారు ఉన్నారు.

పోలీసులు ముందుగా ఒకటే కాల్ సెంటర్ అనుకుని వెళితే, నాలుగు చోట్ల నడుస్తున్నట్టు తేలింది. అమెరికా ప్రభుత్వం పేరుతో ఏజీ సొల్యూషన్స్, ఏఆర్జీ సంస్థలు మోసం చేస్తే, అమెజాన్ పేరుతో వర్టెక్స్ చేస్తోంది.

ఏజీ, ఏఆర్జీ ఒకరి కంపెనీ కాగా, వర్టెక్స్ వేరొకరిది. ఏజీ సంస్థలో కీలకమైన అన్సారీ ఐదారేళ్ల పాటూ కాల్ సెంటర్లో పనిచేసి తరువాత ఇందులోకి దిగాడు.

పోలీసులు మొత్తం నాలుగు లొకేషన్లలో సోదాలు నిర్వహించి రెండు కంపెనీలకు సంబంధించిన వారిని పట్టుకున్నారు.

మాదాపూర్ స్టేషన్ కి చెందిన సీఐ ఎన్ తిరుపతి, ఎస్సైలు కే గౌతమ్, పీ రవి కిరణ్, పీ నరసింహా రావు, ఎస్ వెంకటేశ్, శ్వేతలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

మాదాపూర్ విఠల్ రావు నగర్‌లో ఈ కాల్ సెంటర్ నడుస్తోంది. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, పోలీసులకు తెలిసిన సమాచారం ఆధారంగా కూపీలాగి కేసు పెట్టారు పోలీసులు.

వీరిపై సుమోటో కేసులు 901, 902 నంబర్లతో నమోదయ్యాయి.

ఏఆర్జీ సొల్యూషన్స్ కంపెనీ గుజరాత్ అహ్మదాబాద్‌లో రిజిష్టర్ అయింది. ఈ ఏఆర్జీ సొల్యూషన్స్ ఆఫీసులో అన్సారీ, అకీబ్ ముఖ్యులు. ఇక్కడ మొత్తం 28ని అరెస్టు చేశారు.

వర్టెక్స్ సొల్యూషన్స్ సంస్థలో ప్రదీప్, వినోద్, ఉస్మాన్ ఘనీ, ప్రధాన్‌లు ముఖ్యులు. ఇక హైదరాబాద్‌కి చెందిన జుబేర్ మోయిన్ ఖాన్, ఇక్కడే ఉంటున్న సాగర్ ఛౌదరి కూడా ఈ కేసుల్లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)