ప్రకాశం - దళిత యువకుడి కులాంతర వివాహం: అబ్బాయి అక్కపై యువతి తల్లిదండ్రుల దాడి.. బట్టలు ఊడిపోతున్నా ఈడ్చుకుంటూ పోయారన్న బాధితురాలు

మౌనిక
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

దళిత యువకుడు, రెడ్డి కులానికి చెందిన అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోగా అది ఇష్టం లేని అమ్మాయి తల్లిదండ్రులు ఆ యువకుడి అక్క మీద దాడి చేశారు. దాడిలో తన బట్టలు ఊడిపోయినా పట్టించుకోలేదని బాధితురాలు ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో ఈ దాడి జరిగింది.

బొట్లపాలెంలో నివసిస్తున్న జె.సాయిరామ్‌ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకు తల్లి అనురాధ, అక్క మౌనిక ఉన్నారు.

అదే ఊరికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి కూతురు భార్గవిని సాయిరామ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి తర్వాత మార్చిలో సాయిరామ్ ఇంటిపై బ్రహ్మారెడ్డి, ఆయన బంధువులు దాడి చేశారు.

ఇప్పుడు మళ్లీ దాడి జరిగింది. ఆగస్టు 14 అర్ధరాత్రి సాయిరామ్ తల్లి అనురాధ , అక్క మౌనిక మీద బ్రహ్మారెడ్డి, ఆయన భార్య పుల్లమ్మ దాడి చేశారని ఎఫ్‌ఐఆర్‌(నంబరు 233/2023)లో రాశారు.

బాధితులు వారి ఇంటికి సమీపంలోని మంచినీటి కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

‘‘దాడిలో సాయిరామ్ తల్లి అనురాధ స్వల్ప గాయాలతో తప్పించుకుని బయటపడ్డారు. కానీ మౌనికను మాత్రం కుళాయి నుంచి సుమారు రెండు మీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మారెడ్డి ఇంటి వరకూ ఈడ్చుకుని వెళ్లారు. తొలుత కళ్లల్లో కారం చల్లారు. ఆ తర్వాత దాడి చేశారు’’ అని ఎఫ్‌ఐఆర్‌లో ఉంది.

ఈడ్చుకుని వెళ్తున్న సమయంలో తన వస్త్రాలు చినిగిపోయి, ఊడిపోయినా వారు అలాగే లాక్కుని వెళ్లారని మౌనిక బీబీసీతో అన్నారు.

‘‘గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి ఇంటి వసారాలో నా కాళ్లు చేతులు కట్టేశారు. మెడ మీద కత్తి పెట్టి బెదిరించారు. ఇనుప రాడ్డుతో తలపై బాదడంతో గాయమైంది. పెట్రోల్ పోసి నిప్పంటించే యత్నం కూడా చేశారు’’ అని ఆమె బీబీసీతో చెప్పారు.

మౌనికకు తొలుత దర్శి ఆస్పత్రిలో, ఆ తర్వాత ఒంగోలు రిమ్స్‌లో చికిత్స అందించారు.

ప్రస్తుతం ఆమె ఇంటికి చేరుకున్నారు.

దాడి జరిగిన రెండు రోజుల తర్వాత కూడా మౌనిక మెడ మీద గోళ్లతో రక్కిన గుర్తులు కనిపిస్తున్నాయి.

కత్తి గాటు నుంచి తప్పించుకునే క్రమంలో వేళ్లకు అయిన గాయాలు ఇంకా మానలేదు.

ఆస్పత్రిలో ఉండగా బాధితురాలు మౌనికను పరామర్శించిన పోలీసు అధికారులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఆస్పత్రిలో ఉండగా బాధితురాలు మౌనికను పరామర్శించిన పోలీసు అధికారులు

పోలీసులు రావడం ఆలస్యం అయ్యుంటే...

బ్రహ్మారెడ్డి దంపతుల దాడిలో తప్పించుకున్న తర్వాత సాయిరామ్ తల్లి అనురాధ, పోలీసులకు ఫోన్ చేశారు.

తన బిడ్డను అపహరించి, చంపేందుకు యత్నిస్తున్నారంటూ ఆమె 100కి కాల్ చేసి చెప్పారు. అర్ధరాత్రి 12.30 గంటలకు పోలీసులకు ఈ సమాచారం అందింది.

ఒంగోలులోని పోలీసు కార్యాలయం నుంచి దర్శి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందగానే అక్కడ విధులు నిర్వహిస్తున్న సుభాని, మౌలాలీ అనే ఇద్దరు హోం గార్డులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

దర్శికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో బొట్లపాలెం ఉంది.

బాధితురాలిని బంధించిన స్థలానికి 15 నిమిషాల్లోనే పోలీసులు చేరుకుని రక్షించడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ మీడియాకు తెలిపారు.

పోలీసులు రావడం ఆలస్యం అయ్యుంటే మద్యం మత్తులో ఉన్న బ్రహ్మారెడ్డి తనకు నిప్పంటించి ఉండేవారని మౌనిక చెప్పారు.

బొట్లపాలెం గ్రామం

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బొట్లపాలెం గ్రామం

కులాంతర వివాహమే కారణమని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు

మౌనికతోపాటు ఆమె తల్లి అనురాధ మీద దాడికి కులాంతర వివాహమే అసలు కారణమని ఎఫ్ఐఆర్‌లో రాశారు.

సాయిరామ్‌, భార్గవిల పెళ్లికి బ్రహ్మారెడ్డి కుటుంబం అంగీకరించకపోవడంతో వారిద్దరూ ఊరు విడిచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ మార్చి 2న ప్రకాశం జిల్లా ఎస్పీని వారిద్దరూ కోరారు.

24 ఏళ్ల సాయిరామ్, 19 ఏళ్ల భార్గవి మేజర్లు కావడంతో వారి ఇష్టాన్ని గౌరవించాలని, ఎలాంటి గొడవలు లేకుండా చూసుకోవాలని అమ్మాయి తల్లిదండ్రులను దర్శి తహశీల్దార్ ఆదేశించారు.

ఈ పెళ్లి తర్వాత బ్రహ్మారెడ్డి బంధువులు కొందరు నాడు సాయిరామ్ ఇంటి మీద దాడికి దిగారు.

తలుపులు పగలగొట్టి ఇంట్లో ప్రవేశించడమే కాకుండా సాయిరామ్ తల్లి అనురాధ, అక్క మౌనికలను కులం పేరుతో దూషించి గాయపర్చారనే ఆరోపణలతో బ్రహ్మారెడ్డి సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అరెస్ట్ అనంతరం నిందితులు బెయిల్‌పై బయటికి వచ్చారు.

బొట్లపాలెంలో రెడ్డి కులం వారిదే ఆధిపత్యం. గ్రామంలో గతంలోనూ దళితుల మీద దాడులు జరిగాయి.

ప్రస్తుత ఘటనలో నిందితుడు బ్రహ్మారెడ్డిది సాధారణ రైతు కుటుంబం.

సాయిరామ్, మౌనికల తల్లి అనురాధ

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సాయిరామ్, మౌనికల తల్లి అనురాధ

ఇప్పుడైనా కఠినంగా శిక్షించాలి: మౌనిక

బెయిల్ మీద బయటకు వచ్చిన బ్రహ్మారెడ్డి, తమ కుమార్తె భార్గవి ఆచూకీ చెప్పాలంటూ సాయిరామ్ తల్లి అనురాధను, అక్క మౌనికను వేధించారని, చివరకు వారిని చంపేందుకు యత్నించారని పోలీసులు చెబుతున్నారు.

ఆరు నెలల క్రితమే కేసు పెట్టినా తమకు పోలీసులు తగిన రక్షణ కల్పించకపోవడంతో మళ్లీ తమ మీద దాడి జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

"మాకు బొట్లపాలెంలో రక్షణ లేదు. మార్చి నెలలో మా ఇంటి మీద దాడి చేసిన కేసులో పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడైనా వారిని కఠినంగా శిక్షించాలి. లేదంటే మమ్మల్ని బతకనివ్వరు. పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేసినా ఆగస్టు 15 తెల్లవారుజామునే నా ప్రాణాలు తీసేవాళ్లు. అప్పటికే నా ఛాతీ మీద కాళ్లతో తన్నారు. గొడ్డలి వెనక్కి తిప్పి కొట్టారు. పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు.

కేవలం లోదుస్తులతోనే నన్ను ఈడ్చుకుంటూ వెళ్లారు. కాళ్లు చేతులు కట్టేసి బ్రహ్మారెడ్డి, ఆయన భార్య కలిసి నన్ను చంపాలని చూశారు. కాబట్టి మాకు గంగవరంలో ఇంటి స్థలం ఇస్తే అక్కడికే వెళ్లిపోతాం" అంటూ బాధితురాలు మౌనిక బీబీసీతో అన్నారు.

మార్చిలో కూడా నిందితులపై తగిన చర్యలు తీసుకొన్నామని పోలీసులు చెప్పారు.

మౌనిక ఏఎన్ఎం శిక్షణ పొందారు. ఆమె గంగవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు.

బ్రహ్మారెడ్డి ఇంటికి తాళం వేసి ఉంది. వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ఈ అంశంపై మాట్లాడలేదు.

బాధితురాలి ఇంటి వద్ద పోలీసుల కాపలా

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, బాధితురాలి ఇంటి వద్ద పోలీసుల కాపలా

వేగంగా శిక్ష పడేలా చేస్తాం: ఎస్పీ

మౌనిక మీద హత్యాయత్నానికి యత్నించిన బ్రహ్మారెడ్డి, ఆయన భార్య పుల్లమ్మలను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చగా, వారికి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వారిని దర్శి సబ్ జైలుకు తరలించారు.

కిడ్నాప్, దాడి చేసి తీవ్రంగా గాయపర్చడం, హత్యాయత్నం, కులం పేరుతో దూషించడం, ఇతర సెక్షన్ల కింద కేసు పెట్టారు.

"ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష తప్పదు. ఘటన మా దృష్టికి రాగానే స్పందించాం. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాం. స్కానింగ్, ఎక్స్‌రేలో అంతా నార్మల్‌గా ఉందని తేలింది. ఆమెను డిశ్చార్జ్ చేశారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశాం. కేసు విచారణ త్వరగా జరిపి, వేగంగా శిక్షలు పడేందుకు అనుగుణంగా ఛార్జిషీట్ దాఖలు చేస్తాం. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాం" అని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ బీబీసీతో అన్నారు.

సమాచారం రాగానే వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బందిని ఆమె అభినందించారు.

ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ఒంగోలుకు చెందిన దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు నీలం నాగేంద్ర డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుని, నిందితులను కట్టడి చేయకపోతే ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.

వీడియో క్యాప్షన్, ప్రకాశం: ‘నా బట్టలు ఊడిపోతున్నా ఈడ్చుకుంటూ పోయారు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)