చంద్రయాన్-3 Vs. లూనా-25 : ‘మినీ స్పేస్ రేస్’ అనడం కరెక్టేనా... ఇస్రో ఏమంటోంది?

చంద్రుడి దగ్గరికి చంద్రయాన్-3

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్
    • నుంచి, దిల్లీ

భారత మూడవ లూనార్ మిషన్ ‘చంద్రయాన్-3’ తన లక్ష్యానికి దగ్గరగా చేరుకుంటోంది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా చంద్రయాన్-3 వెళ్తోంది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరుకోలేదు.

చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోన్న చంద్రయాన్-3 ల్యాండర్ గురువారం నాడు ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి విజయవంతంగా విడిపోయింది.

ప్రొపల్షన్ నుంచి విడిపోయిన ల్యాండర్ మాడ్యూల్ నెమ్మదిగా చంద్రుడి దిశగా దిగువ కక్ష్యలోకి చేరుకుంటుంది. భారత కాలమానం ప్రకారం ఈ ‘డీబూస్టింగ్’ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరుగుతుందని ఇస్రో తెలిపింది.

ఆగస్ట్ 23న చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగనున్నాయి.

అయితే, ఇదే సమయంలో రష్యా కూడా ఇటీవలే చంద్రుడిపైకి తన లూనార్ మిషన్ లూనా-25 ప్రయోగించింది.

ఒకవేళ చంద్రయాన్-3 కంటే ముందే రష్యా మిషన్ చంద్రుడిపైకి చేరుకుంటే.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి మిషన్‌‌ అనే గుర్తింపు దానికి దక్కదు.

గత వారం రష్యా లాంచ్ చేసిన ‘లూనా-25‘ ఆగస్ట్ 21న లేదా ఆగస్ట్ 22న చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఐదు దశాబ్దాల సుదీర్ఘ కాలం తర్వాత అంటే 1976 తర్వాత రష్యా స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా తన చంద్రుడి మిషన్‌ను లాంచ్ చేసింది.

ఆగస్ట్ 21 లేదా 22 తారీఖుల్లో చంద్రుడిపై దీన్ని విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ చేయాలని చూస్తోంది.

ఒకవేళ ఇది విజయవంతమైతే, చంద్రయాన్-3 రెండో స్థానంలో నిలవనుంది.

చంద్రయాన్-3 వర్సెస్ లూనా-25

ఫొటో సోర్స్, ANI

చంద్రయాన్-3 వర్సెస్ లూనా-25

అయినప్పటికీ, అమెరికా, మాజీ సోవియట్ యూనియన్, చైనా తర్వాత చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది.

రష్యా ఆగస్టు 11 శుక్రవారం ‘లూనా-25’ అంతరిక్ష నౌకను ప్రయోగించింది.

రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కోస్మోస్ ఇచ్చిన సమాచారం ప్రకారం లూనా-25ను సూయజ్ 2.1బీ రాకెట్ ద్వారా వోస్తోనీ కాస్మోడ్రోమ్ నుంచి లాంచ్ చేశారు.

బుధవారం ఇది చంద్ర కక్ష్యలోకి చేరుకుందని రాస్‌కాస్మోస్ తెలిపింది.

అయితే, చంద్రయాన్-3ను జూలై 14నే లాంచ్ చేశారు.

ఆగస్ట్ 5 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడానికి ముందు భూమి చుట్టూ కూడా కొన్ని కక్ష్యలు పరిభ్రమించనుంది.

చంద్రయాన్-3 తన ప్రయాణంలో భూమి, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి నుంచి ప్రయోజనాన్ని పొందాలనుకుంటోంది.

దానివల్ల అది చాలా తక్కువ ఇంధనంతోనే తన ప్రయాణం పూర్తి చేయగలుగుతుంది.

ఆగస్ట్ 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించినప్పటి నుంచి చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోన్న ఈ స్పేస్‌క్రాఫ్ట్, సాఫ్ట్ ల్యాండింగ్‌కు సిద్ధమవుతోంది.

చంద్రుడిపైకి ఎగిరిన చంద్రయాన్-3

ఫొటో సోర్స్, ISRO/EPA-EFE/REX/SHUTTERSTOCK

ఫొటో క్యాప్షన్, చంద్రుడిపైకి ఎగిరిన చంద్రయాన్-3

అంతరిక్షంలో చిన్న పరుగు పందెం

చాలా మంది ప్రజలు ఇరు దేశాలు ప్రయోగించిన ఈ మూన్ మిషన్‌ను అంతరిక్షంలో చిన్న పరుగు పందెంగా(మినీ స్పేస్ రేస్‌గా) అభివర్ణిస్తున్నారు.

ఇది పరుగు పందెం కాదని, చంద్రుడిపైన కొత్త ‘మీటింగ్ పాయింట్’ను తాము పొందనున్నట్లు ఇస్రో చైర్మన్ బీబీసీకి తెలిపారు.

1960ల్లో ఇస్రో ఏర్పాటు చేసిన తొలి రోజు నుంచి కూడా ఏ పందెంలో ఇస్రో పాల్గొనలేదని ఈ అంతరిక్ష పరిశోధనా సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు.

‘‘అంతరిక్ష నౌకను తయారు చేయడం, చంద్రుడిపైన ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని, గుర్తించని వైపు చేరుకునేలా అందుబాటులో ఉన్న మా సాంకేతిక అంశాలకు అనుగుణంగా మేం ఈ లూనార్ మిషన్ ప్లాన్‌ను సిద్ధం చేశాం’’ అని తెలిపారు.

‘‘లూనా-25 కూడా ఎంతో కాలం క్రితం ప్లాన్ చేసిన లూనార్ మిషన్. వారు కూడా కొన్ని సాంకేతిక విషయాలను దృష్టిలో ఉంచుకుని దానిని సిద్ధం చేసి ఉండొచ్చు. దాని గురించి మాకు తెలియదు’’ అని అన్నారు.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, EPA

చంద్రుడి ఉపరితలంపై భారత చంద్రయాన్-3 ఎలా చేరుకుంటుంది?

చంద్రయాన్-3 భారత మూడవ లునార్ మిషన్. భారత్ ఇంతకు ముందు చేపట్టిన రెండు మిషన్లు కూడా విజయవంతమయ్యాయి.

దీంతో చంద్రయాన్-3ని కూడా విజయవంతమవుతుందని అంచనాలున్నాయి.

చంద్రుడిపైకి చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని భారత్ తొలిసారి 2008 ఏడాదిలో ప్రయోగించింది.

చంద్రయాన్-1 సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన ఇస్రో చంద్రుడి మీద నీరు ఉన్నట్లు ప్రకటించింది.

ఈ సమాచారంతో చంద్రుడిపైన పగటి పూట వాతావరణం ఉన్న వాస్తవాన్ని గ్రహించారు.

ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌తో చంద్రయాన్-2ను 2019 జూలైలో ఇస్రో ప్రయోగించింది. కానీ, ఇది పాక్షికంగానే విజయం సాధించింది.

కానీ, దీని ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుడి చుట్టూ తిరుగుతూ, దాన్ని అధ్యయనం చేస్తోంది.

చంద్రయాన్ 2లోని ల్యాండర్-రోవర్‌లు సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే చివరి నిమిషంలో సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో పాక్షికంగానే ఇది విజయం సాధించింది.

దీని నుంచి పాఠాలు నేర్చుకొని చంద్రయాన్-3 డిజైన్‌లలో ఇస్రో మార్పులు చేసింది.

చంద్రయాన్-3లోని సాంకేతిక అంశాలను, ప్రమాదాలను భారత స్పేస్‌ ఏజెన్సీ ఒకదాని తర్వాత ఒకటి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఈ ప్రయోగాన్ని చేపట్టిందని ఇస్రో చీఫ్ శ్రీధర్ పానికర్ సోమనాథ్ అన్నారు.

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3

ఫొటో సోర్స్, ANI

చంద్రయాన్-3 బరువు 3,900 కేజీలు కాగా, దీని ఖర్చు సుమారు రూ.615 కోట్లు.

ఇస్రో వ్యవస్థాపకులు విక్రమ్ పేరుతో రూపొందించిన ల్యాండర్ మోడ్యూల్‌ బరువు 1,500 కేజీలు కాగా, ప్రజ్ఞాన్ రోవర్ బరువు 26 కేజీలుగా ఉంది.

ప్రజ్ఞాన్ అంటే సంస్కృతంలో జ్ఞానం అని అర్థం.

ఈ వెహికిల్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత, మెల్లగా శాస్త్రవేత్తలు ఈ రాకెట్ వేగాన్ని తగ్గించి, ఎక్కడైతే విక్రమ్ సాఫ్ట్ ల్యాండ్ అవ్వగలుగుతుందో అక్కడికి చేరుకుంటారు.

వచ్చే కొన్ని రోజులు రెండు విషయాలను జాగ్రత్తగా ఈ ల్యాండర్ మోడ్యూల్ చేపడుతుందని గురువారం ప్రొపల్షన్ మోడ్యూల్ నుంచి విడిపోయిన తర్వాత భారత తొలి మూన్ మిషన్ అధినేత మైల్‌స్వామి అన్నధురై బీబీసీతో అన్నారు.

తొలుత మెల్లగా ఇది చంద్రుడికి చేరువ కానుంది. ప్రతిరోజూ 100 కి.మీలు ప్రయాణించే ఇది, ల్యాండింగ్‌కు ఒక రోజు ముందు 30 కి.మీలు కక్ష్యలోకి చేరుకుంటుంది.

ఒకసారి ఇది చంద్రుడిపైన సాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత, ఇది అంతా ఏర్పాట్లు చేసుకునేందుకు కొన్ని గంటల సమయం పడుతుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న ముఖ్యమైన డేటాను, ఫోటోలను సేకరించి, వాటిని పరిశోధనల కోసం భూఉపరితలంపైకి పంపుతుంది.

చంద్రుడి ఉపరితలంపై ఉన్న భౌతిక లక్షణాలను, ఆ ఉపరితలంపై ఉన్న వాతావరణం గురించి తెలుసుకునేందుకు రోవర్ తన పరికరాలను కూడా తీసుకెళ్లింది.

చంద్ర ఉపరితలం కింద ఏం జరుగుతుందో అధ్యయనం చేసేందుకు టెక్టోనిక్ యాక్టివిటీ కూడా చేపట్టనున్నారు.

చంద్రయాన్ 3 ప్రయోగం

ఫొటో సోర్స్, EPA

చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇప్పటి వరకు ఎవరూ వెళ్లలేదు. అక్కడ ఏముందో తెలుసుకోలేదు.

ఇక్కడ ల్యాండర్, రోవర్లను దించడం ద్వారా.. అక్కడి మట్టిని పరిశీలించాలని ఇస్రో ప్రయత్నిస్తోంది.

దక్షిణ ధృవం దగ్గర ఉన్న మట్టిలో గడ్డకట్టిన మంచు అణువులను కనిపెట్టాలని ప్రయత్నిస్తోంది.

ఇలాంటి గడ్డకట్టిన పరిస్థితుల్లో చాలా అంశాలు నిక్షిప్తమై ఉంటాయి. అంటే... సూర్య కుటుంబం పుట్టుక, చంద్రుడు, భూమి పుట్టుకల గురించిన రహస్యాలు, చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు, ఏర్పటయ్యే సమయంలో ఎలాంటి పరిస్థితులుండేవి వంటి విషయాలు తెలుసుకోవచ్చు.

ఈ సమాచారంతో చంద్రుడి పుట్టుకకు కారణాలు, దాని భౌగోళిక స్వరూపం, లక్షణాలు కూడా తెలుసుకోవచ్చు.

ఇలాంటి అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద మంచు అణువులు కూడా ఇక్కడ గడ్డకట్టిన నేలల్లో ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా.

చంద్రయాన్-3, లూనా-25ల ప్రధాన లక్ష్యాల్లో ఒకటి గడ్డకట్టిన మట్టిలో నీటి జాడల్ని వెలికితీయడం.

దీని ద్వారా చంద్రుడిపైన భవిష్యత్‌లో మానవ నివాసానికి కావాల్సిన పరిస్థితులను సృష్టించేందుకు ఉపయుక్తంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)