‘ప్రేమ్ కుమార్‌’ సినిమా రివ్యూ: పీట‌ల‌ మీద పెళ్లి ఆగిపోయిన కుర్రాడి పరిస్థితి ఏంటి?

ప్రేమ్ కుమార్ రివ్యూ

ఫొటో సోర్స్, Instagram/abhishekmaharshi

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

మ‌నం చాలా సినిమాలు చూసుంటాం. హీరోయిన్‌కు మ‌రొక‌రితో ఇష్టం లేని పెళ్లి జ‌రుగుతుంటుంది.

తాళి క‌ట్టేలోగా హీరో వచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్లిపోతాడు. లేదంటే, పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లి చేసుకొంటాడు. తర్వాత `శుభం` కార్డు ప‌డుతుంది.

మ‌రి, పెళ్లి ఆగిపోయిన ఆ కుర్రాడి ప‌రిస్థితేంటి? ఈ విష‌యాన్ని చాలా మంది పట్టించుకోరు. ఆ ఆలోచనే `ప్రేమ్ కుమార్‌` సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పేప‌ర్ బోయ్‌, ఏక్ మినీ క‌థ లాంటి సినిమాతో ఆక‌ట్టుకున్న సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టించిన సినిమా ఇది.

చాలా సినిమాల్లో కామెడీ రోల్స్ చేసిన అభిషేక్ మ‌హ‌ర్షి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు.

ఐడియా బాగుంది. టీమ్ కూడా కొత్త‌గా ఉంది. మ‌రి, ఈ ఐడియాను సినిమాగా మ‌ల‌చ‌డంలో కొత్త ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడా, లేదా?

ప్రేమ్ కుమార్ చిత్రం

ఫొటో సోర్స్, Instagram/abhishekmaharshi

పాపం ప్రేమ్ కుమార్‌

ప్రేమ్ కుమార్ (సంతోష్ శోభ‌న్‌)ది విచిత్ర‌మైన జాత‌కం. పీట‌ల‌పై పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. ఎంత ప్ర‌య‌త్నించినా ఒక్క సంబంధం సెట్ అవ్వ‌దు. ఓ చిన్న ఇంట‌ర్వ్యూతో సోష‌ల్ మీడియాలోనూ పాకేస్తాడు ప్రేమ్‌.

వృత్తిపరమైన జీవితంలోనూ వైఫల్యాలు వెంటాడతాయి.

ఆ తర్వాత, పీట‌ల‌పై పెళ్లిళ్లు ఆపేయ‌డం, లేదంటే భార్యాభర్తల గొడ‌వ‌ల్ని సెటిల్ చేయ‌డం అనే ‘పని’ మొదలుపెడతాడు.

కథానాయిక నేత్ర (రుచితా సాదినేని) పని దీనికి భిన్నం. పెళ్లిళ్లు సెట్ చేసి, సెల‌బ్రేట్ చేస్తుంటుంది. సినిమా స్టార్ రోష‌న్ మ్యారేజ్ ఈవెంట్ చేయ‌డానికి అడ్వాన్స్ తీసుకొంటుంది నేత్ర‌.

ఈ పెళ్లి ఆప‌డానికి ఒప్పందం చేసుకొంటాడు ప్రేమ్ కుమార్‌.

మ‌రి రోష‌న్ పెళ్లి జ‌రిగిందా, ఆగిపోయిందా? ప్రేమ్ కుమార్‌, నేత్ర‌ల‌లో గెలిచింది ఎవ‌రు? అనేది అసలు కథ.

ప్రేమ్ కుమార్ రివ్యూ

ఫొటో సోర్స్, Instagram/abhishekmaharshi

శుభం కార్డుతో మొద‌లు

సాధార‌ణంగా సినిమాల‌న్నీ శుభం కార్డుతో ముగుస్తాయి. ఈ సినిమా `శుభం` కార్డుతో ప్రారంభం అవుతుంది.

ప్రేమ్ కుమార్ పెళ్లి ఆగిపోవ‌డంతో ఈ క‌థ మొద‌లవుతుంది. ప్రేమ్ కుమార్ పాత్ర‌నీ, అత‌ని క‌ష్టాల్నీ, పెళ్లి పాట్ల‌నీ.. చెబుతూ క‌థ‌లోకి ప్రేక్ష‌కుల్ని లాక్కెళ్లే ప్ర‌య‌త్నం చేశారు.

ప్రేమ్ కుమార్ వ్యాపార ప్ర‌య‌త్నాలు, డిటెక్టివ్‌ అవతారం ఇవ‌న్నీ ఫ‌న్నీగా అనిపిస్తాయి.

నేత్ర రాక‌తో క‌థ‌లో కాస్త ఆస‌క్తి రేగుతుంది. నేత్ర‌కూ, ప్రేమ్ కుమార్‌కూ ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటో తెలిశాక‌ అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అంగ‌న‌, రోష‌న్‌ల‌వి ఉప క‌థ‌లే అయినా వాటినీ క‌థ‌లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

వీరిద్ద‌రి పెళ్లిని జ‌రిపించ‌డానికి హీరో, ఆప‌డానికి హీరోయిన్‌ ఎలా ప్ర‌య‌త్నిస్తారు అనేదే ఈ క‌థ‌లో కీ పాయింట్. దాంతోనే సెకండాఫ్ మొత్తం న‌డిపించేశారు.

ప్రేమ్ కుమార్ రివ్యూ

ఫొటో సోర్స్, Instagram/abhishekmaharshi

పలుచబడిన ఎమోషన్

సినిమా చూస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుడు ఏదో ఓ పాత్ర‌తో ఐడెంటిఫై అవ్వాలి. ఏదో ఓ పాత్ర‌ని ఫాలో అవ్వాలి. ప్రేమ్ కుమార్ విష‌యంలో రెండూ జ‌ర‌గ‌వు.

నేత్రకు, ప్రేమ్ కుమార్‌కు మధ్య ఏముందో ప్రేక్ష‌కుల‌కు సెకండాఫ్ వ‌ర‌కూ చెప్ప‌లేదు ద‌ర్శ‌కుడు.

అది ప‌క్క‌న పెడితే, ప్రేమ్ ఎంత ప్రేమిస్తున్నాడ‌న్న విష‌యం ద్వితీయార్ధంలో కూడా చూపించ‌లేదు.

ప్రేమ్‌‌ను తాను ప్రేమిస్తున్నాన‌న్న విష‌యం నేత్ర‌కు క్లైమాక్స్ వ‌ర‌కూ అర్థం కాదు. అలాంట‌ప్పుడు ఈ పాత్ర‌ల‌తో కానీ, వాళ్ల ప్రేమ‌క‌థ‌తో గానీ ప్రేక్ష‌కుడు ఎందుకు ప్ర‌యాణం చేయాలి?

పైగా, కామెడీ కూడా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. తెరపై న‌టీన‌టులంతా తామేదో కామెడీ చేస్తున్నామ‌ని ఫీల‌వ్వ‌డం మిన‌హాయిస్తే, థియేట‌ర్లో కూర్చున్న ప్రేక్ష‌కుల‌కు న‌వ్వు రాదు.

ద‌ర్శ‌కుడికి ఇదే తొలి సినిమా.

త‌న‌కు తెలిసిన వాళ్లంద‌రికీ త‌లో పాత్ర పంచాల‌న్న ఉద్దేశమో, లేదంటే త‌న‌కొచ్చిందంతా రాసేయాల‌న్న త‌ప‌నో తెలీదు కానీ సీన్లు ఎక్కువై ఎమోష‌న్ ప‌ల‌చ‌బ‌డింది.

ప్రేమ్ కుమార్ రివ్యూ

ఫొటో సోర్స్, Instagram/abhishekmaharshi

శ్రుతి మించిన సంతోష్ నటన

సంతోష్ నటన సహజంగా ఉంటుంది. త‌ను తెర‌పై అటూ ఇటూ క‌దులుతున్న‌ట్టు ఉంటుంది తప్ప, న‌టించిన‌ట్టు ఉండ‌దు. కానీ, ఎందుకనో ఈ సినిమాలో త‌న న‌ట‌న కాస్త శ్రుతి మించిన‌ట్టు అనిపిస్తుంది. రుచితా సాదినేనికి ఇదే తొలి సినిమా.

లుక్స్‌, న‌ట‌న రెండింటిలోనూ యావ‌రేజ్ మార్కులే ప‌డ‌తాయి. స్నేహితుడి పాత్ర‌లో కృష్ణ తేజ్ క‌నిపించాడు. త‌న‌ది హీరోతో స‌మానంగా ఉండే పాత్ర‌. త‌న న‌ట‌న‌, కామెడీ కాస్త బెట‌ర్‌గా అనిపిస్తాయి.

నెల్లూరు సుద‌ర్శ‌న్‌, వైవా హ‌ర్ష‌, అశోక్ కుమార్ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర న‌టించి ఓకే అనిపించుకున్నారు.

ప్రేమ్ కుమార్ రివ్యూ

ఫొటో సోర్స్, Instagram/abhishekmaharshi

బాగా వాడేశారు

సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అయిన కొన్ని మీమ్స్‌, ట్రోల్స్‌ ఈ సినిమాలో బాగా వాడుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లోనూ అది క‌నిపిస్తుంది.

‘‘ఇంకా చాలా ఉన్నాయ్‌, మేమే దాచాం’’ అనే నందమూరి బాల‌కృష్ణ పాపుల‌ర్ డైలాగ్‌‌ను సంద‌ర్భోచితంగా వినిపించారు.

ద‌ర్శ‌కుడు ఈ మీమ్స్‌పై పెట్టిన శ్ర‌ద్ధ స్క్రిప్టుపై పెట్ట‌లేదు. మంచి పాయింట్‌ను ఎత్తుకున్నా, దాన్ని ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా తీర్చిదిద్ద‌లేక‌పోయాడు.

పాత్ర‌ల తాలుకూ ఆర్క్‌, స‌న్నివేశాల్లో బ‌లం, క‌థ‌లో సంఘ‌ర్ష‌ణ‌, ఇవేం లేక‌పోతే ఎలాంటి క‌థ‌లైనా మెప్పించలేవనే దానికి ‘ప్రేమ్ కుమార్’ ఉదాహరణ.

టేకింగ్, మేకింగ్ విష‌యంలో షార్ట్ ఫిల్మ్‌కు, వెబ్ సిరీస్‌కు మ‌ధ్య‌లో ఉందీ సినిమా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)