చైనాలో టెక్ రంగం పెట్టుబడులపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతున్న అమెరికా... ఈ ట్రేడ్ వార్ ఎలా ఉండబోతోంది?

అమెరికా

ఫొటో సోర్స్, GETTY IMAGES

చైనా, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతినడంతో అమెరికా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా చైనా టెక్నాలజీ రంగంలో అమెరికన్ పెట్టుబడులపై యూఎస్ నిషేధం విధించనుంది.

చైనాలో హైటెక్ రంగాల్లో ఎలాంటి పెట్టుబడులు పెడుతున్నారో వెల్లడించాలని అమెరికా ప్రభుత్వం తన దేశంలోని కంపెనీలను కోరనుంది.

ప్రైవేట్ కంపెనీల విదేశీ లావాదేవీలను పరిశీలించేందుకు కూడా ఈ నిర్ణయం దోహదపడుతుంది.

ఇది చైనాను సున్నితంగా టార్గెట్ చేయడమేనని యూఎస్ చెబుతోంది.

అయితే, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉన్న సంబంధాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.

ఈ నిర్ణయం నిరాశకు గురిచేసిందని చైనా పేర్కొంది.

''చైనాపై అమెరికా నిరంతరం అణచివేత ధోరణి అవలంబిస్తోంది. ఆంక్షలు విధిస్తోంది'' అని వాషింగ్టన్‌లోని చైనీస్ ఎంబసీ అధికార ప్రతినిధి లియు పెంగ్యు అన్నారు.

చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని, ఇరుదేశాల మధ్య దూరం పెరగాలని అమెరికా కోరుకోవడం లేదని వైట్ హౌస్ చేస్తున్న వాదనలకు, తీసుకుంటున్న చర్యలకు సంబంధం ఉండడం లేదన్నారు. ''యూఎస్ తమ వాదనలను గౌరవించాలని కోరుతున్నాం'' అని లియు అన్నారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశాలతో అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నదేశాల్లో పెట్టుబడులు పెట్టకుండా నిరోధించేలా నియమ నిబంధనలు రూపొందించే ప్రక్రియ ప్రారంభమైంది. క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ రంగాల్లో పెట్టబడులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ టెక్నాలజీల్లో విస్తృతంగా పెట్టుబడులు పెడుతున్న సంస్థలు యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేయాలని ప్రభుత్వం కోరనుంది.

అయితే, పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఈ నియమాలు వర్తించవని భావిస్తున్నారు. (అంటే, స్టాక్ మార్కెట్ ద్వారా కంపెనీల్లో పెట్టే పెట్టుబడులు). కానీ, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ లేదా ఇతర సంస్థల ద్వారా చేసే పెట్టుబడులపై దృష్టి సారించే అవకాశం ఉంది.

నియమ నిబంధనలు రూపొందించిన తర్వాత ఎలాంటి పెట్టుబడులపై ఆంక్షలు ఉంటాయి, ఏ పెట్టుబడులపై ఆంక్షలు ఉండవనే విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఇవి అమల్లోకి రావడానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది.

అమెరికా

ఫొటో సోర్స్, GETTY IMAGES

''ఇది దేశ భద్రత దృష్ట్యా తీసుకుంటున్న చర్య అని, ఆర్థికపరమైనది కాదు'' అని సీనియర్ అధికారులు మీడియాతో చెప్పారు. ఓపెన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు అమెరికా కట్టుబడి ఉందని వారు చెప్పారు.

''నూతన విధానంపై కసరత్తు చేస్తున్నాం. మరికొన్ని ప్రతిపాదనలపై చర్చించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి ఇది విదేశీ పెట్టుబడులపై పర్యవేక్షణ మాత్రమే'' అని అట్లాంటిక్ కౌన్సిల్‌కి చెందిన సీనియర్ అధికారి సారా బారుల్ డంజ్‌మన్ చెప్పారు.

''ఇది కచ్చితంగా ఒక పెద్ద నిర్ణయమే. పాత విధానంతో పోలిస్తే దీని ప్రభావం కూడా భారీగానే ఉంటుంది.'' అని ఆమె అన్నారు.

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో పెట్టుబడులు పెట్టడంపై ఆంక్షలు చాలా అరుదు. యూఎస్ - చైనా ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్ట్ 2022లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఇలాంటి నిబంధనలు జపాన్, కొరియాలో మాత్రమే అమల్లో ఉన్నాయి.

ఈ ఆంక్షలు అమెరికా సంస్థల సెన్సిటివ్ టెక్నాలజీల సేల్స్, అమెరికన్ కంపెనీల్లో చైనా పెట్టుబడులపై ఆధారపడి ఉన్నాయి. చైనా సైన్యంతో సంబంధాలున్న సంస్థలలో పెట్టుబడులను గతంలో ట్రంప్ ప్రభుత్వం నిషేధించింది.

ఈ నిర్ణయంపై బైడెన్ ప్రభుత్వానికి వాషింగ్టన్ నుంచి విస్తృతమైన మద్దతు ఉంది. ఇది నిధుల ప్రవాహంపై నియంత్రణను పెంచడంతో పాటు, అమెరికా పెట్టుబడులు చైనా సైన్యానికి చేరే ప్రమాదాన్ని తగ్గించే చర్యగా పరిగణిస్తున్నారు.

పెట్టుబడి అంక్షలపై అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అందులో కొంత విజయవంతమైందన్న సంకేతాలు ఉన్నాయి.

విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు విధించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మేలో వ్యాఖ్యానించారు. సెన్సిటివ్ టెక్నాలజీల్లో పెట్టుబడులకు సంబంధించి ఈ వేసవి మొదట్లో యూరోపియన్ కమిషన్ కొన్ని ప్రతిపాదనలు కూడా చేసింది.

అయితే, ఈ నిర్ణయం పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇంకా స్పష్టంగా తెలియదు.

2022లో విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చిన దేశాల్లో యూఎస్ తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. అయినప్పటికీ, భౌగోళిక, రాజకీయ సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో స్వదేశంలోనూ, ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టబడులు భారీగా పడిపోయినట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి.

యూకేలో ప్రతి ఐదుగురిలో ఒకరు తమ పెట్టుబడులను స్వదేశంలో కాకుండా విదేశాల్లో పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్స్ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో తేలింది.

చైనాలో అమెరికా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విలువ గతేడాది 8 బిలియన్ డాలర్లకు పడిపోయింది. గత రెండు దశాబ్దాల్లో ఇదే కనిష్టమని రోడియమ్ గ్రూప్ తెలిపింది.

ఈ ఆంక్షల నేపథ్యంలో చైనా కూడా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కంప్యూటర్ చిప్‌‌లు తయారు చేసేందుకు వినియోగించే కొన్ని కీలకమైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

అమల్లోకి రానున్న కొత్త ఆంక్షల కారణంగా దేశంలో పెట్టుబడులపై ప్రభావం చూపే అవకాశం లేదని ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలెన్ అభిప్రాయపడ్డారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సంబంధాలు మెరుగుపడేందుకు జులైలో ఆమె చైనాలో పర్యటించారు.

అయితే, వ్యాపార ఖర్చులు పెరిగిపోవడం, నూతన టెక్నాలజీలో వెనకబడిపోవడం ద్వారా అది చివరకు అమెరికాను దెబ్బతీస్తుందని ఇండియానా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాంజ్‌మన్ చెప్పారు.

ఈ నిర్ణయం మంచిదా, కాదా అనేది దాని అమలుపై ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు.

''ఇది అన్నింటికీ వర్తింపజేయడం సరికాదు. జాతీయ భద్రతకు సంబంధం లేని విషయాలపై ఆలోచించాల్సి ఉంటుందని, దానివల్ల శాస్త్రీయ ఆవిష్కరణల నుంచి మనం దూరం కాకుండా ఉండడానికి వీలుంటుంది'' అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి: