ఫేక్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి గౌరవ డాక్టరేట్ల ప్రదానం.. అందుకున్న వారిలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఫొటో సోర్స్, V Srinivas Goud/Twitter
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లోని ‘క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ’ కొన్నేళ్లుగా నడుస్తోంది. దీనిని 2020 నుంచి ఫేక్ యూనివర్సిటీల కేటగిరీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నోటిఫికేషన్‌లో పెడుతోంది.
యూజీసీ నోటిఫికేషన్ ప్రకారం ఇది రెండు చిరునామాలతో ఉంది.
అందులో మొదటి చిరునామా: 32-23-2003, 7వ లేను, కాకుమానివారి తోట, గుంటూరు.
రెండో చిరునామా: ఫ్లాట్ నం.301, గ్రేస్ విల్లా అపార్టుమెంట్, 7/5, శ్రీనగర్, గుంటూరు.
దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో పరిశీలించినప్పుడు సమాచారం అందుబాటులో లేదు.
రాజకీయ నాయకులను మచ్చిక చేసుకునే వ్యూహంలో భాగంగా ఈ సంస్థ వారికి గౌరవ డాక్టరేట్లు అందిస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు బీబీసీకి లభించాయి.
ప్రస్తుత తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు 2018లో గౌరవ డాక్టరేట్ అందించింది ఈ యూనివర్సిటీయే.
అప్పట్లో ఆ ఫోటోలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన ట్విటర్(ఎక్స్) హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇదే సంస్థ 2017లో ఎర్రగొండపాలెం అప్పటి ఎమ్మెల్యే డేవిడ్ రాజుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. కానీ, ఇదొక ఫేక్ యూనివర్సిటీ. దీనికి ఎలాంటి గుర్తింపూ లేదు.
ఇలా ఫేక్ యూనివర్సిటీలు పెట్టి విద్యార్థులను మభ్య పెడుతున్న సంస్థల వివరాలను ఇటీవల యూజీసీ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 20 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లుగా యూజీసీ గుర్తించింది. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించింది.
యూజీసీ ఇచ్చిన ఫేక్ యూనివర్సిటీల జాబితా
- క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ(గుంటూరు, ఆంధ్రప్రదేశ్)
- బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా(ఆంధ్రప్రదేశ్)
- ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్(దిల్లీ)
- కమర్షియల్ యూనివర్సిటీ(దిల్లీ)
- యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ(దిల్లీ)
- వొకేషనల్ యూనివర్సిటీ(దిల్లీ)
- ఏడీఆర్-సెంట్రిక్ జ్యురిడికల్ యూనివర్సిటీ(న్యూదిల్లీ)
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(న్యూదిల్లీ)
- విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్(దిల్లీ)
- ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ(స్పిరిట్యువల్ యూనివర్సిటీ)(దిల్లీ)
- బడగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ(కర్ణాటక)
- సెయింట్ జాన్స్ యూనివర్సిటీ(కేరళ)
- రాజా అరబిక్ యూనివర్సిటీ(మహారాష్ట్ర)
- శ్రీ బోధి అకాడమీ ఆప్ హైయ్యర్ ఎడ్యుకేషన్(పుదుచ్చేరి)
- గాంధీ హిందీ విద్యాపీఠ్(అలహాబాద్, యూపీ)
- నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి(కాన్పుర్, యూపీ)
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ(అలీఘడ్, యూపీ)
- భారతీయ శిక్షా పరిషద్(లఖ్ నవూ, యూపీ)
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్(కోల్‌కతా)
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసర్చ్(కోల్‌కతా)

ఫొటో సోర్స్, bouiinternational.org
ఆంధ్ర ప్రదేశ్: మరో ఫేక్ యూనివర్సిటీ విశాఖలో...
ఏపీలో రెండు ఫేక్ యూనివర్సిటీలలో ఒకటి గుంటూరులోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ అని చదివారు కదా!
మరొకటి విశాఖపట్నంలో ఉన్నట్లు యూజీసీ ప్రకటించింది.
బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ పేరుతో హౌస్ నం.49-35-26, ఎన్.జి.వోస్ కాలనీ, విశాఖపట్నం… చిరునామాతో నడుస్తోంది.
దీని వెబ్‌సైట్ పరిశీలిస్తే ఐదు అకడమిక్ కోర్సులు నిర్వహిస్తున్నట్లుగా ఉంది. 50 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు సూచిస్తోంది.
ఈ యూనివర్సిటీ ఫేక్ అని గుర్తించడం గురించి, యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచిన 8912745745, 8912720027 నంబర్లలో సంపద్రించేందుకు బీబీసీ ప్రయత్నించింది.
‘‘ఈ రెండు ఫోన్ నంబర్లు మనుగడలో లేవు’’ అనే రెస్పాన్స్ వస్తోంది.
ఫేక్ యూనివర్సిటీల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి బీబీసీతో మాట్లాడారు.
‘‘యూజీసీ జాబితా ప్రకటించిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో ఫేక్ యూనివర్సిటీలుగా గుర్తించినవి కార్యకలాపాలు కొనసాగిస్టున్నట్లుగా లేవు. మేం పరిశీలించాం. అడ్మిషన్ తీసుకుంటున్నట్లుగా లేవు. గౌరవ డాక్టరేట్లు మాత్రం ఇస్తున్నాయి. ఫేక్ యూనివర్సిటీ ఎవరైనా నడిపిస్తుంటే పోలీసు కేసు పెడతాం’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, bouiinternational.org
యూనివర్సిటీలు ఎన్ని రకాలు?
దేశంలో ప్రధానంగా నాలుగు కేటగిరీలలో యూనివర్సిటీలున్నాయి.
1956లో వచ్చిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చట్టం ప్రకారం.. ఏదైనా యూనివర్సిటీ ఏర్పాటు కావాలంటే యూజీసీ గుర్తింపు కచ్చితంగా ఉండాలి.
ప్రస్తుతం దేశంలో యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు మొత్తం 1102 ఉన్నాయి.
అందులో..
సెంట్రల్ యూనివర్సిటీలు – 56
స్టేట్ యూనివర్సిటీలు – 474
డీమ్డ్ యూనివర్సిటీలు – 125
స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీలు - 447
ఇవి కాకుండా ఎలాంటి గుర్తింపు, అనుమతి లేకుండా దేశంలో యూనివర్సిటీలు పుట్టుకొస్తున్నాయి.
చిన్న భవనాన్ని అద్దెకు తీసుకుని యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు.

రెగ్యులేటరీ వ్యవస్థ ఉండాలి: రవీందర్
ఫేక్ యూనివర్సిటీలను కట్టడి చేసే విషయంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ బీబీసీతో మాట్లాడారు.
‘‘ఫేక్ యూనివర్సిటీల కట్టడికి జాతీయ స్థాయిలో రెగ్యులేటరీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే మంచిది. విద్యార్థులు, ప్రజలలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. అలాగే ప్రైవేటు యూనివర్సిటీల ఫీజులు కూడా ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు యూనివర్సిటీని మంజూరు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు నియంత్రించే అధికారం కూడా ప్రభుత్వం వద్ద ఉండాలి’’ అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఉన్నత విద్యలో మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ తరహా నియంత్రణ వ్యవస్థను తీసుకువస్తే మంచిదని రవీందర్ అభిప్రాయపడ్డారు.
ఫేక్ యూనివర్సిటీల విషయంలో ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేయాలని, విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ అడ్మిషన్ తీసుకోకూడదని ఆయన సూచించారు.
‘‘విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ ఫేక్ యూనివర్సిటీలపై క్రిమినల్ కేసులు పెట్టాలి’’ అని రవీందర్ చెప్పారు.

చెక్ చేసుకుంటే మంచిది: హేమచంద్రారెడ్డి
విద్యార్థులు ఏదైనా యూనివర్సిటీలో చేరే ముందుగా అన్ని వివరాలు తనిఖీ చేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
‘‘సాధారణంగా యూనివర్సిటీలు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ చట్టాల కింద ఏర్పాటవుతాయి. డీమ్డ్ విభాగంలో ఏర్పాటవుతాయి. ఎవరైనా విద్యార్థులు ప్రవేశాలు తీసుకునేప్పుడు యూజీసీ వెబ్‌సైట్‌లో ఫేక్ యూనివర్సిటీల జాబితా తనిఖీ చేసుకోవడం మంచిది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీ అయితే స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌కు సందేహం పంపితే నివృత్తి చేస్తాం. అలాగే రాష్ట్ర యూనివర్సిటీల వివరాలైతే స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వెబ్‌సైట్‌లో కూడా ఉంటాయి’’ అని ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి బీబీసీతో అన్నారు.
ఇలా ఫిర్యాదు చేయొచ్చు
యూజీసీ చట్టంలోని సెక్షన్ 22 - డిగ్రీలు లేదా పట్టాలు ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని తెలియజేస్తోంది.
కేంద్ర ప్రభుత్వ చట్టం లేదా రాష్ట్ర చట్టం లేదా ప్రాంతీయ చట్టం లేదా యూజీసీ చట్టంలోని సెక్షన్ 3లో పేర్కొన్నట్లుగా డీమ్డ్ కేటగిరీ కింద ఏర్పాటైన విద్యాసంస్థలు మాత్రమే డిగ్రీలు ఇవ్వడానికి వీలుంటుంది.
ఆయా చట్టాల కింద ఏర్పాటు కాకపోతే యూనివర్సిటీ పేరు వాడుకునేందుకు వీలుండదు.
ఈ విషయంపై యూజీసీ కార్యదర్శి ప్రొ.మనీష్ ఆర్.జోషి ఒక లేఖ విడుదల చేశారు.
‘‘ఫేక్ యూనివర్సిటీల నుంచి తీసుకున్న డిగ్రీలు ఉన్నత విద్యకు పనికి రావు. అలాగే ఉద్యోగాలకు పనికిరావు. యూనివర్సిటీలో చేరే ముందు యూజీసీ వెబ్ సైట్ www.ugc.ac.in లో చూసుకోవాలి. అందులో నకిలీ యూనివర్సిటీల జాబితా చూసుకుని వాటిల్లో ప్రవేశాలు తీసుకోకపోవడం మంచిది. యూజీసీ చట్టానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న యూనివర్సిటీలకు సంబంధించిన సమాచారాన్ని [email protected] కు పంపించాలి’’ అని జోషి సూచించారు.
ఏటా అవే యూనివర్సిటీలు
యూజీసీ విడుదల చేస్తున్న జాబితాలో ఏటా అవే యూనివర్సిటీల పేర్లు ఉంటున్నాయి.
ఫేక్ యూనివర్సిటీల కేటగిరీలో 2022లో విడుదల చేసిన జాబితా ప్రకారం 21 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు ప్రకటించింది.
దాదాపు ఈ ఏడాది ప్రకటించిన యూనివర్సిటీలన్నీ గత ఏడాది కూడా ఉన్నాయి.
‘‘ఈ ఫేక్ యూనివర్సిటీలు ఇచ్చే పట్టాలు, డిగ్రీలు చెల్లవు. భవిష్యత్తులో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. యూనివర్సిటీ గుర్తింపు లేకుండా యూనివర్సిటీ బోర్డు పెట్టి పట్టాలు ఇవ్వడం నేరంగా పరిగణించాలి. ఏ రాష్ట్రంలో అలాంటి యూనివర్సిటీ ఉందో, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సుమోటోగా నోటీసు ఇచ్చి కఠిన చర్యలు తీసుకునే వీలుంది’’ అని విద్యావేత్త, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.తిరుపతిరావు బీబీసీతో అన్నారు.
తెలంగాణలోనూ గుర్తింపు లేకుండా ప్రవేశాలు
తెలంగాణలోనూ రెండు ప్రైవేటు యూనివర్సిటీల విషయంలో వివాదం రేగింది.
గుర్తింపు పూర్తిగా రాకుండా ప్రవేశాలు తీసుకోవడంతో విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారు.
గురునానక్, శ్రీనిధి కళాశాలలను యూనివర్సిటీలుగా అప్ గ్రేడ్ చేస్తూ నిరుడు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనికి గవర్నర్ నుంచి ఆమోదం లభించలేదు. దీనివల్ల యూనివర్సిటీల హోదా తీసుకునేందుకు వీలుండదు. దీనికి విరుద్ధంగా 2022-23 సంవత్సరానికి యూనివర్సిటీలుగా అడ్మిషన్లు తీసుకున్నాయి. దీనిపై వివాదం రేగింది.
ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బిల్లు గవర్నర్ వద్ద పెండింగులో ఉండగానే, అడ్మిషన్లు తీసుకోవడంతో మేనేజ్ మెంట్ కోటా సీట్లు తగ్గించడం సహా పలు చర్యలు చేపట్టింది.
అలాగే ప్రవేశాలు పొందిన ఇంజినీరింగ్ విద్యార్థులను అదే యాజమాన్యానికి చెందిన కాలేజీల్లో సర్దుబాటు చేయడంతోపాటు ఇతర కోర్సులకు చెందిన విద్యార్థులను వేర్వేరు కళాశాల్లో సర్దుబాటు చేస్తూ గత నెలలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
- రూఢకోట: ఈ ఊరి మహిళలు గర్భం దాల్చాలంటేనే భయపడుతున్నారు
- చంద్రయాన్ 3: స్పేస్ క్రాఫ్ట్స్, శాటిలైట్లపై కనిపించే బంగారు రంగు కవరింగ్ ఏమిటి?
- మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...
- దగ్గు మందు మరణాలు: ‘ఇండియా ఔషధం అంటే ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’
- పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్కును ఎలా అంచనా వేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














