హవాయి కార్చిచ్చు: ఊరంతా తగలబడ్డా ఆ ఇంటిని మాత్రం అగ్గి ముట్టలేదు, ఏం జరిగింది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, మేడ్‌లైన్ హాల్పర్ట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హవాయి మౌవి దీవిలో చెలరేగిన కార్చిచ్చుకు ఆ ప్రాంతంలో ఉన్న అన్ని ఇళ్లు, చెట్టూపుట్ట అగ్నికి ఆహుతయ్యాయి. చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో బూడిద తప్ప ఇంకేం మిగలలేదు.
కానీ, అదే ప్రాంతంలో ఉన్న ఎర్ర రంగు పైకప్పున్న ఒక ఇల్లు మాత్రం చెక్కు చెదరలేదు. ఆ ఇంటిని అగ్గి ముట్టుకోలేదు. ఈ ఇంటి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
లహైనా పట్టణమంతా దాదాపు ధ్వంసమైనా ఫ్రంట్ స్ట్రీట్‌లో ఉన్న వందేళ్ల నాటి ఒక చెక్క ఇల్లు క్షేమంగా ఉంది.
తమ ఇల్లు మంటల్లో కాలిపోకుండా చెక్కు చెదరకుండా ఉండటాన్ని చూసి ఇంటి ఓనర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.
చూడటానికి ఇది ఫొటోషాప్ చేసినట్లు కనిపిస్తోందని ఇంటి యజమాని ట్రిప్ మిల్లికిన్ హోనోలూలూ సివిల్ బీట్ అనే న్యూస్ వెబ్‌సైట్‌తో అన్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం విదేశీ పర్యటనలో ఉంది.
మౌవి ప్రాంతంలో చెలరేగిన ఈ కార్చిచ్చుకు తప్పిపోయిన, మంటల్లో కాలిపోయిన వారిని వెలికితీసేందుకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇప్పటి వరకు 114 మంది ఈ కార్చిచ్చు కారణంగా చనిపోయారు. 850 మంది ఆచూకీ దొరకడం లేదని అధికారులు తెలిపారు. జాబితాలో ఉన్న 1,200 మందికి పైగా ప్రజలు సురక్షితంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు.
మౌవిలోని చారిత్రాత్మక పట్టణం లహైనా ఈ మంటలకు దారుణంగా దెబ్బతింది. హవాయి చరిత్రలోనే ఇది అతి పెద్ద ప్రకృతి విపత్తుగా పరిగణిస్తున్నారు.
ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సోమవారం హవాయి వెళ్లారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కాలిపోకుండా మిగిలిన ఈ ఇంటి యజమానులు లహైనా పట్టణంలో కార్చిచ్చు చెలరేగినప్పుడు మసాచుసెట్స్ పర్యటనకు వెళ్లారు.
తమ ప్రాంతంలోని ఇళ్లన్ని అగ్నికి ఆహూతయ్యాయనే వార్తలను మిల్లికిన్, ఆయన భార్య దోరా అట్వాటర్ మిల్లికిన్ విన్నారు. తమ ఇల్లు కూడా కాలిపోయి ఉంటుందని భావించారు.
కానీ, తర్వాత రోజు ఉదయం పూట చూపించిన ఏరియల్ ఫుటేజీలో తమ ఇంటికి మంటలు అంటుకోలేదని, తమ ఇల్లు చెక్కుచెదరకుండా ఉందని వారికి తెలిసింది.
‘‘ఆ ఫుటేజిని చూసి మేం బాగా ఏడ్చేశాం’’ అని హోనోలూలూ సివిల్ బీట్‌కి ఆయన తెలిపారు.
‘‘నేను చాలా గిల్టీగా భావిస్తున్నాను. ఇప్పటికీ మేం గిల్టీగానే ఉన్నాం’’ అని మిల్లికిన్, ఆయన భార్య తెలిపారు.
తమ ఇంటికి ఏ కారణం చేత మంటలు అంటుకోలేదో తమకు కచ్చితంగా తెలియదన్నారు.
100 ఏళ్ల నాటి ఈ చెక్క ఇంటిని వీరు రెండేళ్ల క్రితమే కొనుగోలు చేశారు. అంతకుముందు చెరకు పంటల ఉద్యోగుల కోసం బుక్‌కీపర్స్ హౌస్‌గా దీన్ని వాడేవారు.
‘‘ఇల్లు మరమ్మతులు లేకుండా ఇచ్చారు. దాంతో మేం ఇంటిని పునరుద్ధరించాలని కోరాం. ఈ మరమ్మతులు ఇంటిని కాపాడి ఉండొచ్చు.’’ అని భార్యాభర్తలు అమెరికా మీడియాకు తెలిపారు.
తారుతో ఉన్న ఇంటి పైకప్పును హెవీ-గేజ్ మెటల్‌కి మార్చారు. ఇంటి చుట్టూ రాళ్లు పెట్టారు. దాని చుట్టూ ఉన్న ఆకులను తొలగించారు. కానీ, ఇవేమీ కూడా ఇంటిని మంటలకు అంటుకోకుండా ఆపలేవని అన్నారు.
‘‘ఇది పూర్తిగా 100 శాతం చెక్క ఇల్లు. మంటల నుంచి కాపాడేందుకు దీనిలో ప్రత్యేకంగా ఏమీ లేదు.’’ అని దోరా అట్వాటర్ మిల్లికిన్ లాస్ ఏంజిల్స్ టైమ్స్‌కి తెలిపారు.

ఫొటో సోర్స్, GOOGLE, GETTY IMAGES
మంటలు చెలరేగినప్పుడు, చాలా ఇళ్ల పైకప్పుల నుంచి పెద్ద మొత్తంలో చెక్కముక్కలు మంటల్లో కాలిపోయాయి.
‘‘ఒకవేళ దీని పైకప్పు తారు రేకులతోనే ఉంటే, కచ్చితంగా మంటలు అంటుకునేవి. లేదంటటే, రూఫ్ అయినా కింద పడేది. ఇంటి చుట్టూ ఉన్న ఆకులతో ఇది మండిపోయేది’’ అని ఆమె అన్నారు.
పక్క ఇళ్లకు ఈ ఇల్లు దూరంగా ఉండటం వల్లనే మంటలు అంటుకోకపోవడానికి కారణమై కూడా ఉండొచ్చన్నారు.
లహైనా ప్రాంతం మళ్లీ మామూలుగా మారిన తర్వాత తాము ఈ ప్రాంతానికి తిరిగి రావాలని అనుకుంటున్నామని ఇంటి ఓనర్లయిన ఆ జంట చెప్పింది.
అప్పుడు, ఇల్లు కోల్పోయిన చాలా మందికి తమ ఇంటిని ఆశ్రయంగా అందించనున్నామని అన్నారు.
‘‘చాలా మంది సర్వం కోల్పోయారు. మేం ఒకరికొకరం అండగా నిల్చోవాల్సి ఉంది. తిరిగి మా పట్టణాన్ని నిర్మించుకోవాలి. ఈ పునర్నిర్మాణంలో ప్రతిఒక్కరికీ సాయం అవసరం’’ అని మిస్ మిల్లికిన్ అన్నారు.

ఫొటో సోర్స్, HAWAII WING CIVIL AIR PATROL/EPA
ఆస్తులన్నీ బూడిద
ఇల్లూ, వాకిలి కాలిపోగా, తాను ఉంటున్న ప్రాంతం నుంచి దూరంగా పారిపోయిన బ్రైస్ బరోయిడాన్‌లాంటి వారు మౌవి ద్వీపంలోని లహైనా ప్రాంతంలో చాలా మంది ఉన్నారు.
‘‘తిరిగి వచ్చేటప్పటికీ ఇల్లయినా ఉంటుందని అనుకున్నా. కానీ అది కూడా మిగల్లేదు. ఆస్తులన్నీ బూడిదయ్యాయి’’ అని బరాయిడాన్ అన్నారు.
‘‘ఇది నా ఒక్కడి పరిస్థితే కాదు, మా వీధిలో ఎవరికీ ఇప్పుడు ఇల్లు లేదు’’ అని ఆయన బీబీసీతో అన్నారు.
తాము నివసించే ఈ ప్రాంతంలో అనేక ఇళ్లను కర్రతోనే తయారు చేస్తారని, మంటలు తీవ్రం కావడానికి ఇది ఒక కారణం కావచ్చని కెంపర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రూఢకోట: ఈ ఊరి మహిళలు గర్భం దాల్చాలంటేనే భయపడుతున్నారు
- చంద్రయాన్ 3: స్పేస్ క్రాఫ్ట్స్, శాటిలైట్లపై కనిపించే బంగారు రంగు కవరింగ్ ఏమిటి?
- మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...
- దగ్గు మందు మరణాలు: ‘ఇండియా ఔషధం అంటే ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’
- పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్కును ఎలా అంచనా వేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














