హవాయి: ఈ మ్యాప్‌లు, ఫొటోలు చూస్తే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమవుతుంది....

హవాయి

ఫొటో సోర్స్, Maxar

ఫొటో క్యాప్షన్, గతంలో తీసిన శాటిలైట్ చిత్రాలు, ఇప్పటి చిత్రాలు పక్కపక్కన పెడితే ఇలా కనిపించాయి.

హవాయిలోని మౌవీ ద్వీపంలో మొదలైన కార్చిచ్చుకు ఇప్పటి వరకు 80మంది మరణించారు. అగ్నికీలల వల్ల అక్కడ జరిగిన విధ్వంసం కనీవిని ఎరుగని రీతిలో ఉంది.

నిత్యం పర్యాటకులతో పచ్చగా కనిపించే ప్రాంతాలన్నీ ఇప్పుడు భస్మీపటలమైన కనిపిస్తున్నాయి.

హవాయి రాష్ట్ర చరిత్రలోనే ఇది అతి పెద్ద విధ్వంసమని ఆ రాష్ట్ర గవర్నర్ జోష్ గ్రీన్ అన్నారు.

హవాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అగ్నికి ఆహుతయ్యాక ఓ ప్రాంతం ఇలా కనిపించింది.

మరణాల సంఖ్యా ఇంక పెరగవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వందలమంది మిస్సయ్యారు. వేలమంది సహాయ శిబిరాలకు చేరుకున్నారు.

చాలా ప్రాంతాలలో ఇప్పటికీ కరెంటు లేదు. ఇంతటి విపత్తును తాము జీవితంలో చూడలేదని హవాయి ద్వీపవాసులు చెబుతున్నారు.

హవాయి

ఫొటో సోర్స్, Google/GettyImages

ఫొటో క్యాప్షన్, సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలను కూడా కార్చిచ్చు చుట్టేసింది.

కార్చిచ్చు ప్రారంభానికి ముందు ఈ ప్రాంతాన్ని ఒక హరికేన్ చుట్టుముట్టింది. ఆ తర్వాత కూడా ఇక్కడ గాలుల ప్రభావం కొనసాగుతూ వచ్చింది. ఈ గాలుల కారణంగానే మంటలు వేగంగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.

హరికేన్ ప్రభావాన్ని విమానాల ద్వారా అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది, ఆ తర్వాత మొదలైన కార్చిచ్చు తీవ్రతను చూసి షాకయ్యారు.

హవాయి

ఫొటో సోర్స్, Google/Google Earth, EPA

ఫొటో క్యాప్షన్, పచ్చగా ఉన్న పట్టణమంతా బూడిద రంగులోకి మారింది.

ఒకప్పుడు హవాయి రాష్ట్రానికి రాజధాని అయిన లహైనా నగరం ఈ కార్చిచ్చు తాకిడికి తీవ్రంగా దెబ్బతింది. చారిత్రక ప్రదేశమైన ఈ నగరంలో ఇప్పుడు దాదాపు అన్ని ఇళ్లు అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి.

ఇక్కడున్న 1500 ఇళ్లు నాశనమయ్యాయని శాటిలైట్ సంస్థ ICEYE వెల్లడించింది. ఈ ప్రాంతంలో దాదాపు 12వేలమంది నివసిస్తున్నారు.

హవాయి

ఫొటో సోర్స్, Google/Reuters

ఫొటో క్యాప్షన్, దూసుకొస్తున్న అగ్నికీలల నుంచి తప్పించుకోవడం చాలామందికి కష్టమైంది.

మౌవి పట్టణంలో ఉన్న లైట్ హౌస్ ఒక్కటి మంటల ప్రమాదం నుంచి తప్పించుకుంది. కానీ, దానికి సమీపంలో ఉన్న అనేక భవనాలు మంటల్లో కాలి నేలమట్టమయ్యాయి.

122 సంవత్సరాల చరిత్ర ఉన్న ఓ హోటల్ కూడా కాలిపోయింది.

హవాయి

ఫొటో సోర్స్, Google/Reuters

ఫొటో క్యాప్షన్, వీధులకు వీధులు ఇలా మంటల్లో కాలిపోయాయి.

మంటలు వేగంగా వ్యాపించడంతో తప్పించుకోవడానికి ఏం చేయాలో పాలుపోక చాలామంది ప్రజల సమీపంలోని హార్బర్ వైపు పరుగులు పెట్టారు. నీళ్లలోకి దిగి మంటల నుంచి తమను తాము కాపాడుకున్నారు.

హవాయి

ఫొటో సోర్స్, Google/Reuters

ఫొటో క్యాప్షన్, కాలిపోయిన చర్చి ప్రాంతం

మౌవీ ప్రాంతంలో ఇటీవలి కాలంలో నెలకొన్న కరువు, పొడి వాతావరణ పరిస్థితులు కూడా ఈ మంటలు వేగంగా విస్తరించడానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

హవాయి రాష్ట్రంలో 80శాతం ప్రాంతంలో పొడి వాతావరణ పరిస్థితి ఉందని యూఎస్ డ్రాట్ మోనిటర్ సంస్థ వెల్లడించింది.

హవాయి

ఫొటో సోర్స్, @Lei_dubzz(Instagram)/GettyImages

ఫొటో క్యాప్షన్, భారీ వృక్షాలు సైతం కాలిపోయాయి.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇదే ద్వీపంలో జన్మించారు. ఇక్కడ కొనసాగుతున్న కార్చిచ్చు, దీవిలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

‘‘ఇంత అందమైన దీవి నుంచి బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఎవరికైనా బాధాకరం’’ అని ఆయన ఎక్స్ (ట్విటర్) లో కామెంట్ చేశారు.

వీడియో క్యాప్షన్, భూతల స్వర్గం కాలిబూడిదైంది, ఏమీ మిగల్లేదు....

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)