చంద్రయాన్-3: అంతరిక్ష నౌక చుట్టూ ఉండే పసుపు పచ్చ ఫిల్మ్‌ను బంగారంతో చేస్తారా?

వ్యోమనౌక

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, సంకేత్ సబ్నీస్
    • హోదా, బీబీసీ మరాఠీ ప్రతినిధి

చంద్రయాన్-3 నుంచి విడివడిన ల్యాండర్ ‘విక్రమ్’ భారత కాలమానం ప్రకారం ఆగస్ట్ 23 సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగాల్సి ఉంది.

అంతా అనుకున్నట్లు సవ్యంగా సాగితే భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఇదో కీలక మైలురాయిగా నిలుస్తుంది.

చంద్రయాన్ 3 ప్రయోగం తరువాత స్పేస్ సైన్స్‌పై చాలా మందిలో ఆసక్తి పెరిగింది.

కొన్ని రోజులుగా చంద్రయాన్-3 గురించి అందరి నోటా మరింతగా వినిపిస్తోంది.

చంద్రయాన్ 3 ప్రయోగం తరువాత మనలో చాలా మంది స్పేస్ క్రాఫ్ట్ చిత్రాలు, ప్రయోగం చిత్రాలు, వీడియోలు, ఇస్రో విడుదల చేసిన అనేక ఇతర దృశ్యాలు చూసుంటాం. సోషల్ మీడియాలో షేర్ చేసి ఉంటాం.

అయితే, ఈ స్పేస్ క్రాఫ్ట్ చుట్టూ బంగారు రంగులో కవరింగ్ చూసే ఉంటారు. మరి, గోల్డ్ ఫోయిల్‌లా కనిపించే ఈ పూత ఎందుకు ఉంటుంది?

దీనిపై ముంబయిలోని నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్ అరవింద్ పరంజపేతో బీబీసీ మాట్లాడింది.

‘‘బంగారు రంగులో కనిపించినా అది బంగారం కాదు, అలాగే ఫోయిల్ కూడా కాదు. స్పేస్‌క్రాఫ్ట్‌లు, శాటిలైట్‌కు బంగారు రంగులో చుట్టినట్లుగా కనిపించేదాన్ని మల్టీ లేయర్ ఇన్సులేషన్(ఎంఎల్ఐ ) అంటారు. ఉష్ణ నిరోధంగా దీన్ని ఉపయోగిస్తారు. ఫిల్మ్‌ను అనేక పొరలుగా చుడతారు’’ అని ఆయన చెప్పారు.

పైన కనిపించే పొర బంగారు రంగులో ఉన్నా లోపల తెలుపు, వెండి రంగుల్లోనూ పొరలు ఉంటాయని అరవింద్ తెలిపారు.

విక్రమ్ ల్యాండర్

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, విక్రమ్ ల్యాండర్

ఈ ఫిల్మ్ దేనితో తయారు చేస్తారు?

ఈ బంగారు రంగు ఫిల్మ్‌ను పాలిస్టర్‌తో తయారుచేస్తారని, దానిపైన అత్యంత పలుచని అల్యూమినియం పొర ఉంటుందని అరవింద్ చెప్పారు.

స్పేస్ క్రాఫ్ట్ మొత్తాన్నీ వీటితో చుట్టరని, రేడియేషన్‌కు గురైనప్పుడు పాడయ్యే అవకాశం ఉన్న భాగాలనే దీంతో కవర్ చేస్తారని ఆయన వివరించారు.

అలాంటి సున్నిత భాగాలు ఎన్నున్నాయి అనేదాన్ని బట్టి ఎంత ఫిల్మ్ పేపర్ అవసరం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పారు.

గోల్డెన్ షీట్స్

ఫొటో సోర్స్, ISRO

ఉష్ణోగ్రతల్లో హఠాత్తుగా వచ్చే మార్పులను తట్టుకొనేలా...

భూమి నుంచి రోదసిలోకి అంతరిక్ష నౌక ప్రయాణించేటప్పుడు ఉష్ణోగ్రతలు మారుతుంటాయి.

స్పేస్‌క్రాఫ్ట్ సున్నిత పరికరాలపై ఈ మార్పులు ప్రభావం చూపుతాయి.

ఉష్ణోగ్రతలో హఠాత్తుగా వచ్చే మార్పులు ఒక్కోసారి పరికరాలు పనిచేయకుండా ఆగిపోవడానికి కారణం కావొచ్చు.

అలాంటి పరిస్థితిని నివారించడానికే ఈ ఉష్ణమాపక పొరలతో పరికరాలను కప్పిఉంచుతారు.

ఇజ్రాయెల్ స్పేస్‌క్రాఫ్ట్

ఫొటో సోర్స్, Getty Images

స్పేస్‌క్రాఫ్ట్స్‌ను ఉష్ణమాపక పొరలతో కప్పడానికి సంబంధించిన పూర్తి సమాచారం అమెరికా ప్రభుత్వ ‘నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ శాటిలైట్ డాటా, ఇన్ఫర్మేషన్ సర్వీస్’లో పొందుపరిచారు.

దాని ప్రకారం... శాటిలైట్ కానీ స్పేస్ క్రాఫ్ట్ కానీ అంతరిక్షంలో ఎలా ప్రయాణిస్తుంది, ఎక్కడ చేరుతుందనే వివరాలను బట్టి అవి సూర్యరశ్మికి ఏ స్థాయిలో ఎక్స్‌పోజ్ అవుతాయో, ఎంత ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటాయో అంచనా వేసి ఎంఎల్ఐ షీట్లను రూపొందిస్తారు.

-200 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి -300 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల నుంచి కూడా రక్షణ కల్పించేలా వీటిని తయారుచేస్తారు.

Moon

ఫొటో సోర్స్, Getty Images

అంతరిక్ష ధూళి నుంచి కూడా రక్షణ

ఈ ఎంఎల్ఐ షీట్‌లు రేడియేషన్, ఉష్ణం నుంచే కాదు అంతరిక్ష ధూళి నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.

అంతరిక్ష ధూళి కారణంగా స్పేస్ క్రాఫ్ట్ పరికరాలపై ఉండే సెన్సర్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రమాదం నుంచి తప్పించడానికి కూడా ఈ షీట్‌లు ఉపయోగపడతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)