వీళ్లు నిద్రపోతూ రూ. లక్షలు సంపాదిస్తున్నారు

ఫొటో సోర్స్, STANLEYMOV
- రచయిత, టామ్ జెర్కెన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మనలో చాలామంది నిద్రలో ఉలికిపడుతుంటాం. అయితే, కొందరు ఇలాంటి ఉలికిపాట్లను కూడా సొమ్ము చేసుకునే పనిలోపడ్డారు.
వీడియో ప్లాట్‌ఫామ్‌లైన యూట్యూబ్, టిక్‌టాక్, ట్విచ్‌లో "స్లీప్ స్ట్రీమర్స్" అనే పేరుతో అనేక వీడియోలు కనిపిస్తాయి. ఇందులో కొందరు వ్యక్తులు నిద్రపోయే దృశ్యాల లైవ్ ఫుటేజ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
ఇటీవల అమెరికాలో జరిగిన అల్లర్లకు కారకుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాయ్ సెనాట్ అనే వ్యక్తి ఈ ఆలోచనకు బీజం వేశారు.
మార్చి నెలలో నాన్-స్టాప్‌గా నెలరోజులపాటు తన నిద్రను లైవ్‌స్ట్రీమ్‌గా ప్రసారం చేయడం ద్వారా ఆయన కనీసం 10,000 డాలర్లు (సుమారు రూ. 8 లక్షలు ) సంపాదించారని అంచనాలు వెలువడ్డాయి.
స్ట్రీమర్‌గా ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఆమరాంత్ ఈ అంశం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు.
జూన్‌లో ఓ పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడుతూ స్లీప్ స్ట్రీమ్ (నిద్రను ప్రసారం చేయడం) ద్వారా తాను సుమారు 15,000 డాలర్లు ( సుమారు రూ.12 లక్షలు) సంపాదించానని చెప్పారు.
వ్యూయర్స్‌కు ఇలాంటి వీడియోలు చూడటం ద్వారా తాము నిద్రలో ఎలా ఉంటామో ఊహించుకునే అవకాశం రావడమే కాక, దీనిని ఒక విధమైన ఎంటర్‌టైన్‌మెంట్‌గా భావిస్తారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఈ ట్రెండ్ ఎప్పుడు మొదలైంది?
నిద్రను లైవ్ స్ట్రీమింగ్ చేయడం అనే ఆలోచన కాస్త వింతగా అనిపించినా, ఇది పూర్తిగా కొత్త విషయమేం కాదు.
2000 సంవత్సరంలో ప్రారంభమైన రియాలిటీ షో ‘బిగ్ బ్రదర్’ ప్రపంచంలో అత్యధికమంది ప్రేక్షకులు చూసిన ప్రోగ్రామ్‌గా పేరు తెచ్చుకుంది.
24 గంటల పాటు జరిగే ఈ షోలో రాత్రిపూట హౌస్‌మేట్‌లు ఎలా నిద్రపోతున్నారో చూసే అవకాశం ప్రేక్షకులకు లభించింది. అలాగే, ఆన్‌లైన్‌లో నిద్ర ప్రత్యక్ష ప్రసారాలు హిట్ అయ్యాయి.
ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ నిద్రిస్తుండగా తీసిన ఒక గంట నిడివి వీడియోను నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీ 2004లో ఆవిష్కరించింది.
స్లీప్‌స్ట్రీమింగ్‌లో కొత్త కొత్త ప్రయోగాలు కూడా మొదలయ్యాయి. నిద్రపోయినందుకు స్ట్రీమర్‌లకు చెల్లించడానికి బదులు, వారిని నిద్రపోకుండా చేసేందుకు ప్రేక్షకులు పేమెంట్ చేయడం ప్రారంభించారు.
నిద్రపోకుండా ఉంటే డబ్బులిస్తామని కొందరు, పెద్దపెద్ద శబ్దాలు చేయడం ద్వారా మరికొందరు, అలర్ట్స్ పంపడం, లైట్లు వేయడం, స్ట్రీమర్‌కు గదిలో నిద్రపట్టకుండా రకరకాల అంతరాయాలు కలిగించడంలాంటి పనులు చేస్తుంటారు ప్రేక్షకులు.
ఇలాంటి వీడియోలు లైవ్-యాక్షన్ వీడియో గేమ్ లాంటివి. ఇందులో స్ట్రీమర్‌లు నిద్ర పోవడానికి ప్రయత్నిస్తుంటారు. ప్లేయర్లులాంటి వ్యూయర్లు వాళ్లను మేల్కొలపడానికి చేయగలిగినదంతా చేస్తుంటారు.
మొదట టిక్‌టాక్‌లో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. ఇందులో జాకీ బోయెమ్, స్టాన్లీమోవ్ వంటి "స్లీప్‌ఫ్లూయెన్సర్"లు ఉండేవారు. తన ఇంటి అద్దె చెల్లించడానికి సరిపడా డబ్బును స్లీప్ స్ట్రీమింగ్ ద్వారా సంపాదిస్తుంటానని స్టాన్లీమోవ్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఫీజుల్లో రకాలు
స్ట్రీమర్ల నిద్రను చెడగొట్టే విషయంలో ప్రత్యేక హక్కుల ( ప్రివిలేజెస్) కోసం వ్యూయర్స్ ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు స్టాన్లీమోవ్‌కు నిద్రపట్టకుండా చేయాలంటే వ్యూయర్స్ ఆయనకు 95 డాలర్లు ( సుమారు రూ. 7800) చెల్లించాల్సి ఉంటుంది.
నిద్రపట్టకుండా చేయడానికి అలర్ట్స్ పంపించడం వంటి అవకాశాలు ఏర్పాటు చేస్తారు ఈ స్ట్రీమర్స్.
"నేను స్లీప్‌స్ట్రీమింగ్ చేసినప్పుడు దాన్ని యూట్యూబ్ కంటెంట్‌గా వాడుకుంటాను. అంటే నిద్ర మధ్యలో నేను కరెంట్ షాక్‌తో కేకలు వేస్తుంటాను. నాకు కేకలు వేయడం అంటే డబ్బు సంపాదించడమే’’ అని స్టాన్లీ మోవ్ బీబీసీతో అన్నారు.
"కొంతమంది వ్యక్తులకు ఇతరులు బాధపడుతుంటే చూడటాన్ని, లేదా బాధ పెట్టడాన్ని ఇష్టపడతారు’’ అన్నారాయన.
నిద్రపోనివ్వకుండా చేసే రకరకాల ప్రయత్నాలకు రకరకాలుగా ఫీజులు వసూలు చేసే స్టాన్లీ, ప్రస్తుతానికి ఈ తరహా స్ట్రీమింగ్‌లకు బ్రేక్ ఇచ్చినట్లు వెల్లడించారు. ‘‘నాలో కలిగిన కొన్ని మానసిక సమస్యల కారణంగా దీన్ని కొన్నాళ్లు పక్కనబెడుతున్నాను’’ అన్నారాయన.
‘‘నేను గత మూడేళ్లుగా ఈ పని చేస్తున్నాను. వారానికి 3 వీడియోలు చేస్తాను. నా కంటెంట్ విషయంలో నాపై చాలా ఒత్తిడి, భారం ఉంటాయి. అయినా సరే, దీన్ని నాకోసం, నాదైన స్టైల్‌లో చేస్తుంటాను. నిద్రను స్ట్రీమింగ్ చేస్తుండగానే మానసికంగా వీడియో ఎడిటింగ్ కూడా జరిగిపోతూ ఉంటుంది’’ అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఒంటికి మంచిదేనా?
స్లీప్ స్ట్రీమింగ్ ద్వారా డబ్బులు వస్తాయి. నిజమే. కానీ, ఇది ఆరోగ్యానికి మంచిదేనా?
ఈ విషయంలో రెండు రకాల ఆలోచనలు ఉన్నాయని స్లీప్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ లిండ్సే బ్రౌనింగ్ అన్నారు.
‘‘సరిపడా రాత్రి నిద్ర శరీరానికి ఎంతో అవసరమని సైన్స్ చెబుతోంది. దీనివల్ల అనేక లాభాలు ఉంటాయి’’ అన్నారు డాక్టర్ లిండ్సే.
నిజమే. కానీ, జీవితంలో అందరికీ అన్ని అవకాశాలు ఉండవు. ఒకవేళ పిల్లలకు ఆరోగ్యం బాగుండకపోతే తల్లిదండ్రులు రాత్రంతా మేల్కొని ఉండాల్సి రావచ్చు. మనం సరైన నిద్రను అనుభవించలేకపోవడానికి వంద కారణాలు ఉండొచ్చు’’ అన్నారామె.
"నేను నిద్రలేమితో బాధపడే వారి కోసం పని చేస్తుంటాను. చాలామందికి నిద్రపోవాలని ఉంటుంది. కానీ, వారి మెదడు వారిని అందుకు అనుమతించదు. నిద్రలేమి సమస్యను నయం చేయడంలో ప్రధానమైన విషయం ఏంటంటే, ఈ సమస్య వల్ల కొంపలు మునుగుతాయన్న భయాన్ని వారిలో లేకుండా చేయడం’’అన్నారామె.
పైకి చూస్తే, స్లీప్ స్ట్రీమింగ్ మంచిదికాదపిస్తుందని, కానీ, ఇది వీకెండ్‌లో మద్యం తాగడంలాంటిదేనని ఆమె అన్నారు.
‘‘మద్యం తాగడం గొప్ప విషయమేమీ కాదు. కానీ, మీరు స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు’’ అన్నారు లిండ్సే.
‘‘మనకు చేతినిండా డబ్బులు ఇచ్చే ఇలాంటి పనిని రెండు, మూడు వారాలకొకసారి చేయడంలో తప్పేముంది’’ అన్నారామె.
ఎలక్ట్రిక్ షాక్‌ల విషయం పక్కనబెడితే, ఆమరాంత్, కాయ్ సెనాట్ వారు కంటి నిండా నిద్రపోతుంటే చూడటానికి వచ్చేవారందరిలో ఒక కమ్యూనిటీ భావన కలుగుతుందని స్ట్రీమర్లు అభిప్రాయపడుతున్నారు.
‘‘జనం వీటిని చూడటానికి ఏమీ ఇబ్బంది పడటం లేదు. మేం ఒంటరులం కాదని చాలామంది ఫీలవుతుంటారు’’ అని అంటున్నారు స్టాన్లీ.
ఇవి కూడా చదవండి:
- యూసీసీ: హిందూ, ముస్లిం చట్టాలపై ఉమ్మడి పౌర స్మృతి ప్రభావమేంటి... వారసత్వ ఆస్తి హక్కులు కూడా మారిపోతాయా?
- భారత విద్యార్థులను అమెరికా ఎందుకు తిప్పి పంపుతోంది? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏం చేయకూడదు?
- గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు
- పీరియడ్స్ సమయంలో అథ్లెట్ల శిక్షణ ఎలా కొనసాగుతుంది... వారు ఎదుర్కొనే సమస్యలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















