టమోటా: మొన్న మెక్‌డొనాల్డ్స్, ఇప్పుడు బర్గర్ కింగ్ ఏం చేశాయంటే..

బర్గర్

ఫొటో సోర్స్, Getty Images

టమోటా ధరలు విపరీతంగా పెరగడంతో తమ భారతీయ అవుట్‌లెట్లలో లభించే ఆహార పదార్థాల్లో టమోటాను వాడటం మానేసినట్లు బర్గర్ కింగ్ సంస్థ చెప్పింది.

టమోటాల సరఫరా, నాణ్యత సమస్యల కారణంగానే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఫాస్ట్ ఫుడ్ చైన్ బర్గర్ కింగ్ తెలిపింది.

ఇటీవలే మెక్‌డొనాల్డ్స్ సంస్థ కూడా భారత్‌లో తమ మెనూ నుంచి టమోటాను తప్పించినట్లు తెలిపింది.

ఇప్పుడు బర్గర్ కింగ్ కూడా ఇదే పని చేయడంతో దేశంలో టమోటా వాడకాన్ని నిలిపేసిన రెండో బర్గర్ చెయిన్‌గా బర్గర్ కింగ్ సంస్థ నిలిచింది.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా టమోటా పంటకు నష్టం కలగడంతో మార్కెట్‌లో కొరత ఏర్పడిందని నిపుణులు అంటున్నారు.

బర్గర్ కింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ వారం మొదట్లో అమెరికా శాండ్‌విచ్ చెయిన్ సబ్‌వే కూడా భారత్‌లో తమ మెనూలోంచి టమోటాలను తొలగించినట్లు వార్తాసంస్థ రాయిటర్స్ తెలిపింది.

అంతేగాకుండా, ఏళ్లుగా శాండ్‌విచ్‌తోపాటు ఉచితంగా అందిస్తున్న చీజ్ ముక్కలను కూడా ఇవ్వడం మానేసింది.

ఇటీవలి కాలంలో భారత్‌లో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగాయి.

వర్షాలతో టమోటా పంట సాగు, సరఫరాకు నష్టాలు కలగడంతో జులైలో కేజీ టమోటా ధర 250 రూపాయల గరిష్ఠానికి చేరింది.

ఈ నెల మొదటి నుంచి టమోటా ధరలు తగ్గుముఖం పట్టాయి.

సరఫరా సంక్షోభాన్నినియంత్రించడం కోసం పొరుగున ఉన్న నేపాల్ నుంచి భారత్ టమోటాల దిగుమతిని ప్రారంభించింది.

బర్గర్ కింగ్

ఫొటో సోర్స్, Getty Images

‘నా బర్గర్‌లో టమోటాలు ఎందుకు లేవు?'

ఇలా దిగుమతి అయిన టమోటాలను దేశ రాజధాని దిల్లీతో పాటు రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్‌లలో వీటిని కేజీకి 50 రూపాయల చొప్పున అమ్ముతున్నారు.

బర్గర్‌కింగ్ బుధవారం తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో, ‘‘నా బర్గర్‌లో టమోటాలు ఎందుకు లేవు’’ అనే శీర్షికతో కొత్త సెక్షన్‌ను జోడించింది.

తమ భారతీయ ఫ్రాంచైజీ నాణ్యత విషయంలో అత్యున్నత ప్రమాణాలను అనుసరిస్తుందని, త్వరలోనే తమ మెనూలో మళ్లీ టమోటాలు దర్శనమిస్తాయని బర్గర్ కింగ్ చెప్పింది. అప్పటివరకు పరిస్థితులను అర్థం చేసుకొని, సహనం వహించాలని వినియోగదారులను అభ్యర్థించింది.

జులైలో మెక్‌డొనాల్డ్స్ సంస్థ కూడా ఉత్తర, తూర్పు భారత్‌లో చాలా అవుట్‌లెట్లలో మెనూ నుంచి టమోటాలను తప్పించింది. అయితే టమోటాల నాణ్యతలో రాజీ పడలేకే ఈ నిర్ణయం తీసుకున్నామని, పెరిగిన ధరలు ఇందుకు కారణం కాదని మెక్‌డొనాల్డ్స్ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.