అఫ్గానిస్తాన్‌‌: తాలిబాన్‌లు మహిళల్ని 5 రకాలుగా ఎలా అణిచివేస్తున్నారంటే...

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, SUPPLIED

    • రచయిత, యోగిత లిమాయే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘’మా విధానాలకు లోబడి చదువుకునేందుకు, పని చేసుకునేందుకు మహిళలను అనుమతిస్తాం. మా సమాజంలో మహిళలు చురుకైన పాత్ర పోషిస్తారు,’’ రెండేళ్ల క్రితం, అంటే 2021 ఆగస్టు 15న అఫ్గానిస్తాన్ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఏర్పాటైన మొదటి విలేఖరుల సమావేశంలో తాలిబన్లు చేసిన ప్రకటన ఇది.

రెండేళ్ల తర్వాత పరిస్థితి చూస్తే, ఇచ్చిన హమీలను తాలిబాన్ ప్రభుత్వ చర్యలతో క్రమంగా అణగదొక్కారు. తాలిబాన్ పాలనలో మహిళా హక్కుల అణచివేతలు ప్రపంచంలోనే అత్యంత కఠినమైనవిగా మారాయి. మహిళలపై మతపరమైన ఆంక్షలను అమలు చేశారు. తాలిబాన్ ప్రభుత్వ నాయకత్వం నుంచి ప్రాంతీయ పాలకుల వరకూ అందరూ క్రమంగా ఇటువంటి ఆంక్షలనే అమలు చేస్తూ వచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో బీబీసీ బృందం క్షేత్రస్థాయిలో అఫ్గాన్ బాలికలతోనూ, మహిళలతోనూ మాట్లాడి, వారి అనుభవాలను రికార్డు చేసింది. కుంచించుకుపోతున్న తమ జీవితాల్లో వాళ్లు పడుతున్న వేదన, వారిలోని భయాలను, ఆశలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది.

అఫ్గానిస్తాన్

సెప్టెంబర్ 2021: బాలికా విద్యపై ఆంక్షలు

అధికారం చేపట్టిన నెల రోజుల తర్వాత మహిళల విషయంలో తాలిబాన్ ధోరణి ఏవిధంగా ఉండబోతుందో సూచనప్రాయంగా తెలిసింది. అఫ్గాన్ విద్యా మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన తర్వాత అబ్బాయిల కోసం సెకండరీ స్కూళ్లను తెరిచారు. ఈ ప్రకటనలో బాలికల ప్రస్తావన లేదు.

స్థానికంగా మమ్మల్ని స్కూళ్లకు వెళ్లొద్దని చెప్పారని పదిహేడేళ్ల విద్యార్థిని ఆ సమయంలో బీబీసీతో చెప్పారు. ‘’పదకొండేళ్లుగా హింసనూ ప్రమాదాలనూ లెక్కచేయకుండా ఎంతో కష్టపడి చదువుకుని డాక్టర్ అవ్వాలనుకున్నా. కానీ ఇప్పుడదంతా నాశనమైంది,’’ అని ఆమె ఏడుస్తున్నారు. స్కూలుకి వెళ్తూ ఆమె సోదరులకు వీడ్కోలు చెబుతున్నారు.

అదే వారంలో కాబూల్ నగర పాలనా విభాగంలోని మహిళా ఉద్యోగులకు ఇళ్లలోనే ఉండమని నగర మేయర్ చెప్పారు. కేవలం మగవాళ్లు చేయలేని పనులకు మాత్రమే మహిళా ఉద్యోగులను విధుల్లో కొనసాగించారు.

కానీ ఇప్పటికీ కొందరు మహిళలు ఆశావహంగా ఉన్నారు. ‘’వాళ్లు యూనివర్సిటీలను తెరిచే ఉంచారు. కాబట్టి వాళ్ల విధానాన్ని త్వరలోనే మార్చుకుంటారు,’’ అని ఒక యూనివర్సిటీ విద్యార్థిని మాతో అన్నారు.

ఇదే సమయంలో ధర్మ ప్రచార పాప నివారణ మంత్రిత్వ శాఖ(ది మినిస్ట్రీ ఆఫ్ ది ప్రాపగేషన్ ఆఫ్ వర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్) పరిధిలోని తాలిబాన్ మోరల్ పోలీసింగ్ ప్రధాన కార్యాలయానికి బీబీసీ బృందం వెళ్లింది. గతంలో మహిళా వ్యవహారాల శాఖ ఉండే ప్రాంగణంలోనే ఈ శాఖను ఏర్పాటు చేశారు. తాలిబాన్ అధికారం చేపట్టిన కొన్ని వారాల తర్వాత మహిళా వ్యవరాల శాఖను రద్దు చేశారు.

ఈ శాఖలో మహిళా ఉద్యోగులను అనుమతిస్తున్నారని మాతో చెప్పారు కానీ అక్కడ మాకెవ్వరూ కనిపించలేదు.

బాలికల స్కూళ్లను ఎందుకు మూసేశారు? అని అక్కడ కూర్చుని ఉన్న తాలిబాన్ అధికార ప్రతినిధిని అడిగాను. ఆయన చుట్టూ తాలిబాన్ ఫైటర్లున్నారు.

దానికి సమాధానంగా ''వాళ్లే స్కూళ్లకు వెళ్లట్లేదు'' అని ఆయన చెప్పారు.

ఆయన చెప్పినదాన్ని సవాలు చేయగా, ‘’దేశవ్యాప్తంగా బాలికల కోసం స్కూళ్లను తెరుస్తాం. ప్రస్తుతం దేశ భద్రతను మెరుగుపర్చేందుకు పని చేస్తున్నాం’’ అని సమాధానమిచ్చారు.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, NAVA JAMSHIDI/BBC

డిసెంబరు 2021 - మార్చి 2022: ప్రయాణాలపై ఆంక్షలు

మహిళల ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. బాలికల విద్య హామీలను వదిలేశారు.

ఈ ఆంక్షలపైన అఫ్గాన్ మహిళలు వీధుల్లోకొచ్చి నిరసనలు చేపట్టారు. విద్య, ఉద్యోగ హక్కుల కోసం డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు తాలిబాన్ ప్రభుత్వం చాలాసార్లు హింసాత్మకంగా వ్యవహరించింది.

‘’ఎలక్ట్రిక్ కేబుల్స్‌తో నన్ను కొట్టారు’’ అని ఆందోళనలో పాల్గొన్న ఒక మహిళ బీబీసీకి చెప్పారు. తన స్నేహితురాలి ఇంట్లో ఆమె మమ్మల్ని రహస్యంగా కలిశారు. తాను పట్టుబడకూడదని వేర్వేరు ప్రదేశాల్లో ఆమె తలదాచుకుంటున్నారు.

2022 జనవరిలో దాదాపుగా నలుగురు మహిళా యాక్టివిస్టులను నిర్బంధించారు. వాళ్లను కొన్ని వారాలపాటు నిర్బంధించి కొట్టారు.

ఆంక్షలను క్రమంగా అమలు చేస్తూ వచ్చారు. ఎవరైనా 72 కిలోమీటర్లు(45 మైళ్లు) దాటి ప్రయాణం చేసే మహిళలకు మగతోడు తప్పనిసరిగా ఉండాలని ది మినిస్ట్రీ ఆఫ్ ది ప్రాపగేషన్ ఆఫ్ వర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ ఆదేశాలు జారీ చేసింది.

ఈ పరిణామాల తర్వాత అనూహ్యంగా అనుకోని ఆశ చిగురించింది.

అందుకు కారణం, తాలిబాన్ విద్యా శాఖ 2023, మార్చి 21న ఒక ప్రకటన చేసింది. కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ స్కూళ్లకు వెళ్లొచ్చని చెప్పారు.

బాలికల స్కూళ్లు కూడా తిరిగి తెరుచుకుంటాయని చాలా మంది తాలిబాన్ అధికారులు మాతో చెప్పారు.

రెండు రోజుల తర్వాత కొందరు విద్యార్థినులు సయిద్ ఉల్ షుహాదా స్కూలులోకి వెళ్తున్నపుడు బీబీసీ బృందం పరిశీలించింది. క్లాసులోని బెంచీల మీద పేరుకుపోయిన దుమ్ముని వాళ్లు తుడుస్తున్నారు. క్లాస్‌రూంలకు తిరిగి వచ్చిన ఆనందంలో ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు. కానీ, కొన్ని నిమిషాల్లోనే వాతావరణం మారిపోయింది.

స్థానిక తాలిబాన్ విద్యాశాఖ అధికారి, స్కూలు హెడ్ టీచర్‌కు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ స్కూలు మూసేస్తున్నట్టు తెలిపారు.

దాంతో బాలికలు ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. ''అసలిదేం దేశం? మేము చేసిన పాపం ఏమిటి?'' అని ఫాతిమా వాపోయింది.

అయితే, తమ చర్యలను తాలిబాన్ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. సంప్రదాయ ఇస్లాం, అఫ్గాన్ విలువలను తిరిగి చేరుకుంటున్నట్టు చెప్పుకున్నారు.

మరోవైపు అతి సంప్రదాయవాద మత గురువులు, గిరిజన పెద్దలు, వాళ్ల మద్దతుదారులు ప్రభుత్వానికి బాసటగా నిలిచారు. తాలిబాన్లు అఫ్గాన్ అధికారాన్ని చేజిక్కించుకోవడంలో వీళ్లంతా సాయం చేశారు. పెద్దల నమ్మకాలకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయాలుంటే, వీళ్లందరి మద్దతు కోల్పోతారని ప్రభుత్వం భయపడుతోందని బీబీసీకి కొందరు చెప్పారు.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, AFP

మే 2022: కొత్త డ్రెస్ కోడ్

మరో రెండు నెలలు గడిచేలోపు, అంటే 2022 మే 7న, మహిళలు తల నుంచి కాలి వరకూ పూర్తిగా కప్పుకునేలా బట్టలు ధరించాలని ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని అఫ్గాన్ సుప్రీం లీడర్ ముల్లా హైబతుల్లా అఖుండ్జాదా బలపరిచారు.

నడివయసు మహిళలు, యువతులు తప్పనిసరిగా కళ్లను వదిలి మిగిలిన ముఖమంతా కప్పుకోవాలని జారీ చేసిన ఆదేశాల్లో ఉంది.

అలానే తమ కుటుంబాల్లోని మహిళలు ఈ నిబంధనలను పాటించేలా మగవారే చూసుకోవాలని, లేని పక్షంలో చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.

దీని ప్రభావం వాస్తవ రూపంలో కనిపించడం మొదలైంది. బయట వీధుల్లో మహిళల వస్త్ర ధారణలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రంగుల బట్టలు, హై హీల్స్, జీన్స్, హిజాబ్ ధరించిన మహిళలు, అప్పటి నుంచి పొడవాటి నల్ల గౌన్లను వాడటం మొదలుపెట్టారు. ముఖాలను కప్పుకుంటున్నారు. బూట్లు ధరిస్తున్నారు.

చాలా మంది మహిళలు నల్లటి బుర్ఖాలు ధరించడం కూడా మొదలైంది.

‘’విద్య, ఉద్యోగాలకు మమ్మల్ని అనుమతిస్తే, మేము ఏం వేసుకోవాలనేదాన్ని పట్టించుకోం,’’ అని ఒక మహిళ అన్నారు.

అయితే, ప్రజా జీవితంలోంచి మహిళలు క్రమంగా మాయమవుతున్నారు. కుటుంబాలను పోషించుకోలేని మహిళలను సైతం ఉద్యోగాలకు అనుమతించకపోవడంతో, పేదలుగా మారుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. వీధుల్లో సాయం కోసం అడుక్కుంటూ కనిపించడం పెరుగుతోంది.

మరోవైపు, చాలా మంది ఆడపిల్లలకు చిన్నవయసులోనే కుటుంబ సభ్యులు బలవంతంగా వివాహాలు చేస్తున్నారు. వారికి విద్య, ఉద్యోగ అవకాశాలు లేకపోవడమే అందుకు కారణం.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్: 'బతకడానికి ఏ దారి లేకపోతే... నా బిడ్డల్ని కూడా అమ్ముకోక తప్పదు'

2022 అక్టోబర్ - డిసెంబర్: నిషేధాజ్ఞలు

మహిళలు యూనివర్సిటీలకు వెళ్లడం, పార్కులకు వెళ్లడం, సేవా సంస్థల్లో పని చేయడంపై నిషేధం విధించారు.

అక్టోబరు 2022 వరకూ, పెద్దగా ఆంక్షలు లేకుండానే కొన్ని నెలలు గడిచాయి. స్కూలు చదువులో చివరి ఏడాది పూర్తికాని విద్యార్థినులను కూడా యూనివర్సిటీ అర్హతా పరీక్షలకు అనుమతించడంతో అందరిలోనూ మళ్లీ ఆశలు చిగురించాయి.

తాలిబాన్ నాయకులతో మేం మాట్లాడినపుడు, మహిళల విద్య విషయంలో తాలిబాన్‌‌ల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి.

‘’బాలికలు స్కూళ్లకు వెళ్లడం కొందరు మత గురువులకు ఇష్టం లేదు. ఈ విషయంలో ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది,’’ అని తాలిబాన్ అధికార ప్రతినిధి జాబియుల్లాహ్ ముజాహిద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

కానీ, కందహార్ కేంద్రంగా ఉన్న తాలిబాన్ అత్యున్నత నాయకత్వ వైఖరిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు. క్రమంగా ఏడాది చివరకి మహిళల స్వేచ్ఛ తగ్గుతూ వచ్చింది.

నవంబరు నెలలో మినిస్ట్రీ ఆఫ్ వర్చ్యూ అండ్ వైస్ అధికార ప్రతినిధి బీబీసీతో మాట్లాడారు. షరియా చట్టాలను పాటించకపోవడం వల్ల మహిళలు కాబూల్‌లో పార్కులకు వెళ్లడంపై నిషేధం విధించినట్లు చెప్పారు.

అయితే, ఒక నగరంలో ప్రకటించిన ఇలాంటి ఆంక్షలు క్రమంగా అఫ్తానిస్తాన్ అంతటా అమలవుతాయి.

ఇదే మంత్రిత్వ శాఖకు మరోసారి వెళ్లగా, లోపలికి వెళ్లేందుకు మహిళలకు అనుమతి లేదని చెప్పారు. మేము విదేశీయులం కాబట్టి మాకు మినహాయింపునిచ్చారు.

దగ్గరలోని ఒక రెస్టారెంట్ పైనుంచి కాబూల్‌లో ఓ ఎమ్యూజ్‌మెంట్ పార్కు కనిపిస్తోంది. పార్కులో చిన్నారులతో పాటు వాళ్ల తండ్రులు మాత్రమే కనిపిస్తున్నారు. తాలిబాన్ ఫైటర్లున్నారు. గుంపులుగా ఉన్న మగ పిల్లలు కేరింతలు కొడుతున్నారు. అక్కడ కనీసం ఒక్క మహిళ కూడా కనిపించలేదు.

అంతేకాదు, జిమ్, స్విమ్మింగ్ పూల్స్‌కు మహిళలు వెళ్లడాన్ని నిషేధించారు.

‘’అఫ్గానిస్తాన్‌లోని బాలికలు ప్రతిరోజూ కొత్త ఆంక్షల మధ్య నిద్రలేస్తున్నారు,’’ అని ఒక విద్యార్థిని బీబీసీతో అన్నారు. ‘’అదృష్టం కొద్దీ తాలిబాన్ల పాలన రాకముందే నేను మాధ్యమిక విద్యను పూర్తి చేశాను. కానీ, ఇప్పుడు యూనివర్సిటీల్లో అమ్మాయిలకు చదువుకునే అవకాశం లేకుండా చేస్తారని భయంగా ఉంది’’ అని ఆమె అన్నారు.

ఆమె భయం నిజమైంది. 2022 డిసెంబరు 22న తాలిబాన్ ఉన్నత విద్యాశాఖ మంత్రి, అన్ని పబ్లిక్, ప్రైవేట్ యూనివర్సిటీలు వెంటనే మహిళల విద్యను రద్దు చేయాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఇది కొనసాగుతుందని చెప్పారు.

నాలుగు రోజుల తర్వాత మరోసారి కొరడా ఝుళిపించారు. అఫ్గానిస్తాన్‌లో పని చేస్తున్న స్థానిక, అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని, లేకుంటే వారి అనుమతులు రద్దు చేస్తామని తాలిబాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది.

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, NAVA JAMSHIDI/BBC

జులై 2023: బ్యూటీ సెలూన్లపై నిషేధం

తాలిబాన్ గస్తీ నుంచి దూరంగా, మహిళలు బయటకు వెళ్లి ఇతరులను కలుసుకునే అతికొద్ది ప్రదేశాల్లో హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్లు కూడా ఒకటి.

కానీ, జులై 4న వీటిని మూసివేయాలని తాలిబాన్ ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రజల్ని పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయలేదు.

సెలూన్ల ద్వారా దాదాపు 60 వేల మంది మహిళలు ఉపాధి పొందుతున్నట్లు అంచనా.

‘’నా కుటుంబానికి నా సంపాదనే ఆధారం. నా భర్తకు ఆరోగ్య సమస్యలున్నాయి. పని చేయలేరు. నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి?’’ అని ఒక సెలూన్ యజమాని వాపోయారు.

ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ ఇంటి నుంచే సెలూన్ నిర్వహిస్తున్నానని, తనకు వేరే మార్గం లేదని ఆమె చెప్పారు.

ఆంక్షల మధ్యనే మహిళలు తమ జీవనోపాధికి మార్గాలను అన్వేషిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్‌లోనే రహస్యంగా స్కూళ్లను నడుపుతున్నారు. కొన్ని ఎన్జీవోలు ఇప్పటికీ మహిళలను రహస్యంగా ఉద్యోగాల్లో కొనసాగిస్తున్నాయి.

భద్రత, వైద్యం, హస్త కళలు ఇంకా మరికొన్ని రంగాల్లో పని చేసేందుకు మహిళలను అనుమతిస్తున్నారు.

అఫ్గాన్ మహిళలు అరుదుగా వీధుల్లోకొచ్చి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. హింసాత్మక అణచివేతలను, నిర్బంధాలను లెక్కచేయకుండా నినదిస్తున్నారు.

‘’మేము ఇరవైయ్యేళ్ల కిందట తాలిబాన్ అణచివేతకు గురైన మహిళలం కాదు. మాలో చాలా మార్పు వచ్చింది. వాళ్లిది అంగీకరించాల్సిందే. దాని కోసం మా ప్రాణాలు పోయినా పర్లేదు’’ అని నిరసనల్లో పాల్గొన్న ఒక మహిళ అన్నారు.

ఇవి కూడా చదవండి: