9 హత్యలు చేసిన వ్యక్తిని పోలీసులు పిచ్చివాడని వదిలేశారు... ఆ తరువాత మరో 30 మందిని కిరాతకంగా చంపేశాడు

రమణ్ రాఘవ్

ఫొటో సోర్స్, LILY KULKARNI

    • రచయిత, అరుంధతీ రనడే జోషి
    • హోదా, బీబీసీ కోసం

ముంబయి మాయానగరిలో ఒకటి, రెండూ కాదు. ఏకంగా తొమ్మిది మందిని అతడు హత్య చేశాడు. పోలీసులకు తానే ఆ హత్యలు చేశానని కూడా చెప్పాడు. కానీ, అతడి మానసిక ఆరోగ్యం సరిగా లేదని, ఏదేదో చెబుతున్నాడని భావించి పోలీసులు వదిలిపెట్టేశారు.

అయితే, ఆ తర్వాత కాలంలో ముంబయితోపాటు దేశం మొత్తాన్నీ అతడు వణికేలా చేశాడు. మొత్తంగా 40 మంది ప్రాణాలను అతడు బలి తీసుకున్నాడు. అతడే రమణ్ రాఘవ్.

ఎలాంటి ఆధునిక ఆయుధాలు లేకుండా అతడు అత్యంత క్రూరంగా అమాయక ప్రజలను తలపై బండరాళ్లతో కొట్టి హత్య చేశాడు. కొందరిని ఇనుప వస్తువులతో కొట్టి చంపాడు.

అత్యంత దారుణమైన, అమానవీయ రీతిలో అతడు చేసే హత్యలపై కొన్ని డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్‌లతోపాటు సినిమాలు కూడా వచ్చాయి.

అనురాగ్ కశ్యప్ రమణ్ రాఘవ్ 2.0 కూడా దీనిలో ఒకటి.

నిజ జీవిత రమణ్ రాఘవ్ పాత్ర నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ పాత్రను తీర్చిదిద్దారు. అయితే, అది పూర్తిగా రమణ్ రాఘవ్‌ కథ కాదు. అసలు వాస్తవంలో ఏం జరిగింది?

ఇలా దారుణంగా హత్యలు చేయాలని దేవుడే తనకు ఆజ్ఞాపించినట్లు పోలీసులకు ఆ సీరియల్ కిల్లర్ చెప్పాడు. పోలీసులతో అతడు చెప్పిన చాలా విషయాలు అప్పటి పత్రికల్లో ప్రధానంగా వచ్చేవి.

అయితే, అసలు రమణ్ రాఘవ్ ఎవరు? ఎందుకు అతడు అంతమందిని హత్య చేశాడు? చివర్లో అతడిని ఏం చేశారు?

రమణ్ రాఘవ్ నివసించిన గుడిసె

ఫొటో సోర్స్, LILY KULKARNI

ఫొటో క్యాప్షన్, రమణ్ రాఘవ్ నివసించిన గుడిసె

మాయానగరిలో భయం

అప్పట్లో ముంబయి ఎలా ఉండేదో 1960ల నాటి పాత సినిమాల్లో చూడొచ్చు. నేటి తరహాలో మరీ అంత రద్దీగా లేకపోయినప్పటికీ అప్పటికీ ఇది పెద్ద నగరమే.

దేశంలోని నలు మూలల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చేవారు. వీరికి అక్కడి విలాసవంతమైన మాయానగరి ఆహ్వానం పలికేది. కొందరు అక్కడి ఫుట్‌పాత్‌లపై కూడా జీవించేవారు.

అయితే, 1965-66లలో ఫుట్‌పాత్‌లు, ఆ పక్కనే ఉండే గుడిసెల్లోని చాలా మంది వరుసగా హత్యకు గురయ్యేవారు.

ఎవరో గుర్తుతెలియని వ్యక్తి చీకట్లో బహిరంగ ప్రాంతాల్లో నిద్రపోతున్న వారిపై దాడులు చేసేవాడు. మొత్తంగా ఆనాడు సెంట్రల్ రైల్వే జీఐపీ లైన్ పరిసరాల్లో జీవిస్తున్న19 మందిపై దాడి జరిగింది. వీరిలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

ఎవరో మతిస్థిమితం లేని వ్యక్తి ఈ హత్యలు చేసి ఉంటారని మొదట్లో పోలీసులు అనుమానించారు. అయితే దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారెవరూ తమపై ఎవరు దాడిచేశారో చూడలేదు. కాబట్టి నేరస్థుడిని గుర్తుపట్టడం చాలా కష్టమైంది.

మొత్తానికి ఈ దాడులపై విచారణ ప్రారంభించారు. రాత్రి పూట పోలీసులు కూడా గస్తీ కాసేవారు. కొన్నిరోజులకు రమణ్ రాఘవ్ అని పేరు పెట్టుకున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతడిని పోలీసులు విడుదల చేశారు. అంతేకాదు ముంబయి నుంచి అతడిని బహిష్కరించారు.

రెండేళ్ల తర్వాత అదే రమణ్ రాఘవ్‌ అలియాస్‌ ‘సింధీ దల్వాయి’ అలియాస్‌ ‘తంబి’ అలియాస్‌ ‘అన్నా’ అలియాస్‌ ‘వేలుస్వామి’ లాంటి చాలా పేర్లతో మాయానగర్‌కు తిరిగి వచ్చి ఎంతో మంది అమాయక పేదలను దారుణంగా చంపేశాడు.

పోలీసు అధికారి రమాకాంత్ కులకర్ణి

ఫొటో సోర్స్, LILY KULKARNI

ఫొటో క్యాప్షన్, పోలీసు అధికారి రమాకాంత్ కులకర్ణి

రెండేళ్ల తర్వాత..

1968 మధ్యలో మరోసారి ఇలాంటి హత్యలే ముంబయి వీధుల్లో మళ్లీ చోటుచేసుకోవడం మొదలైంది. వీధుల్లో నిద్రపోతున్న అమాయకుల తలపై బరువైన పనిముట్లతో ఓ వ్యక్తి కొట్టి చంపడం మొదలుపెట్టాడు.

రమణ్ రాఘవ్ అలియాస్ సింధీ దల్వాయి ఈ 24 హత్యలు చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నప్పటికీ, వాస్తవానికి ఈ సంఖ్య చాలా ఎక్కువని పత్రికల్లో వచ్చేది. అప్పుడే కొత్తగా నియమితులైన యువ పోలీసు అధికారి రమాకాంత్ కులకర్ణి చేతికి ఈ కేసు వచ్చింది.

రమాకాంత్ కులకర్ణి ఆ తర్వాత మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవి నుంచి పదవీ విరమణ చేశారు. ఆయనను అప్పట్లో షెర్లాక్ హోమ్స్‌తో పోల్చేవారు.

తన పదవీ విరమణ తర్వాత, 'ఫుట్‌ప్రింట్స్ ఆన్ ద శాండ్ ఆఫ్ క్రైమ్' అనే పుస్తకాన్ని ఆయన రాశారు. అందులో ‘సీరియల్ కిల్లర్’ అనే కేసులో రమణ్ రాఘవ్‌ను ఎలా పట్టుకున్నారో వివరంగా రాసుకొచ్చారు.

"నేరస్థుడిని పట్టుకున్న తర్వాత కేసు ముగుస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది’’ అని ఆయన ఆ పుస్తకంలో రాశారు.

‘‘పోలీసులకు నిందితుడు నేరుగా చెప్పిన విషయాలు న్యాయ వ్యవస్థలో ఆమోదయోగ్యం కాదు. అంటే అతడు మెజిస్ట్రేట్ ముందు ఆ విషయాలను మరోసారి చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనికి బలం చేకూర్చే ఆధారాలను పోలీసులు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే నేరం రుజువు అవుతుంది’’ అని ఆయన చెప్పారు.

రమణ్ రాఘవ్

ఫొటో సోర్స్, LILY KULKARNI

సీరియల్ కిల్లర్‌ను ఎలా పట్టుకోవాలి?

రమాకాంత్ కులకర్ణి ముంబయి పోలీసుల పాత రికార్డులను తనిఖీ చేసినప్పుడు, రెండేళ్ల క్రితం జరిగిన ఓ హత్యకు సంబంధించి ఒక వ్యక్తిని ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నట్లు గమనించారు.

ఆ వ్యక్తి పేరు రమణ్ రాఘవ్. ప్రస్తుత కేసులోనూ అతడే నిందితుడు అయ్యుండొచ్చని రమాకాంత్ కులకర్ణి అనుమానం వ్యక్తం చేశారు. దానికి అనుగుణంగానే విచారణ చేపట్టడం మొదలుపెట్టారు. అయితే, అప్పట్లోనే రమణ్ రాఘవ్‌ను చాలా పేర్లతో పిలిచేవారు. పోలీసుల వద్ద అతడి రికార్డులు కూడా లేవు.

వీధుల్లో తిరిగే నేరస్థుడు కావడంతో అతడికి చిరునామా ఉండే అవకాశం లేదు. ఏ పోలీస్ స్టేషన్‌లోనూ అతని గురించిన వివరాలు దొరకలేదు.

వీధుల్లో తిరుగుతూ జీవితం గడిపే ఓ వ్యక్తి కోసం ఆ రోజుల్లో ముంబయి నగరం మొత్తం వెతకడం అంత తేలిక కాదు. అదే సమయంలో రమణ్ రాఘవ్‌కు వ్యతిరేకంగా వారి దగ్గర గట్టి ఆధారాలు కూడా లేవు.

అయితే, సబ్ ఇన్‌స్పెక్టర్ అలెక్స్ ఫియాలో అప్రమత్తంగా ఉండటంతో రమణ్ రాఘవ్‌ పోలీసులకు చిక్కాడు.

అసలు రమణ్ రాఘవ్‌ను ఎలా పట్టుకున్నారో 'క్రైమ్ వైర్'కు అప్పట్లోనే ఫియాలో చెప్పారు. ‘‘నా జేబులో సీరియల్ కిల్లర్ స్కెచ్ ఉండేది. నేను ఆ రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడే స్కెచ్‌లో వ్యక్తి పోలికలతో ఖాకీ షార్ట్, నీలం చొక్కా వేసుకొని ఓ వ్యక్తి అక్కడకు వచ్చాడు’’ అని ఫియాలో వివరించారు.

‘‘అతడు గొడుగు వేసుకొని కనిపించాడు. అయితే, అప్పుడు వర్షం పడటం లేదు. వెంటనే ఎక్కడి నుంచి వచ్చారని అతడిని నేను అడిగాను. దీంతో మలాడ్ నుంచని అతడు సమాధానం చెప్పాడు. రెండు రోజుల క్రితం అక్కడే నలుగురు హత్యకు గురయ్యారు. దీంతో అనుమానం మరింత బలపడింది’’ అని ఆయన తెలిపారు.

అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా.. అతని వద్ద ఒక కళ్లజోడు, టైలర్‌కు సూది తగలకుండా చూసే మెటల్ థంబ్ ఉన్నాయి. మలాడ్ ఊచకోతలో ఒక దర్జీ కూడా హత్యకు గురయ్యాడు. ఇవి ఆయనవే.

మొత్తానికి రమణ్ రాఘవ్ 1968 ఆగస్టు 27న అరెస్టయ్యాడు. ఆ తర్వాత కోర్టులోనూ తను చేసిన నేరాలను అతడు ఒప్పుకున్నాడు.

రమణ్ రాఘవ్

ఫొటో సోర్స్, LILY KULKARNI

ఫొటో క్యాప్షన్, రమణ్ రాఘవ్ నుంచి స్వాధీనం చేసుకున్న కళ్లద్దాలు

చికెన్ తిన్న తర్వాతే నోరు విప్పాడు..

రమణ్ రాఘవ్ మతిస్థిమితం కోల్పోయాడని చెప్పడంలో సందేహం లేదు. కానీ అతడు ఎంత క్రూరంగా, భయానకంగా ఉంటాడోనని పోలీసులు అప్పట్లో మీడియాతో మాట్లాడేవారు.

రమాకాంత్ కులకర్ణి పుస్తకం ప్రకారం.. రమణ్ రాఘవ్ నోరు అంత తేలిగ్గా నోరు విప్పలేదు. పోలీసులకు అసలు పరీక్ష అక్కడే మొదలైంది.

నీకు ఏం కావాలని అడిగినప్పుడు.. ‘మూర్గా’ అని అతడు సమాధానం చెప్పాడు. దీంతో అతడి కోసం చికెన్ తెప్పించారు.

ఆ తర్వాత సువాసనలు వెదజల్లే నూనె, అద్దం తీసుకురావాలని అడిగాడు. ఆ నూనెతో అతడు తలకు మర్దనా చేసుకున్నాడు. ఆ తర్వాత అతడు మాట్లాడటం మొదలుపెట్టాడు.

ఆ తర్వాత పోలీసులను తను హత్య చేసిన ప్రదేశాలకు తీసుకెళ్లాడు. అంతేకాదు హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్‌ను ఉంచిన ప్రదేశం కూడా చూపించాడు. అన్ని మేజిస్ట్రేట్ ముందు చెబుతానని కూడా చెప్పాడు.

రమణ్ రాఘవ్

ఫొటో సోర్స్, LILY KULKARNI

తొలుత ఉరి శిక్ష

దిగువ కోర్టులో తను చేసిన నేరాలను రమణ్ రాఘవ్ స్పష్టంగా ఒప్పుకున్నాడు. అతడు మానసికంగా కుంగిపోయినట్లు కనిపించడం లేదని కోర్టు గుర్తించింది. దీంతో మరణశిక్ష విధించింది.

అయితే, ఈ మరణ శిక్షను హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంటుంది. దీంతో ఈ కేసు హైకోర్టుకు వెళ్లింది.

రమణ్ రాఘవ్ ఏదైనా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడా, నేరం జరిగిన సమయంలో అతడి మానసిక పరిస్థితి ఎలా ఉంది? లాంటి విషయాలను తెలుసుకోవడానికి హైకోర్టు మానసిక వైద్యుల బృందాన్ని నియమించింది.

తను దేవుడి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నానని కోర్టులో అతడు చెప్పాడు.

‘‘వీరందరినీ చంపేయాలని దేవుడు నాకు చెప్పాడని అతడు వివరిస్తున్నాడు. అంటే అతడి మతి స్థిమితం సరిగ్గా లేనట్లు అనిపిస్తోంది. అతడు పారనోయిడ్ స్కిజోఫ్రేనియాతో బాధపడుతున్నాడు. కాబట్టి ఈ మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నాం’’ అని 1987 ఆగస్టు 4 హైకోర్టు చెప్పింది.

వీడియో క్యాప్షన్, కత్తితో బ్యాంకు దోపిడీకి వచ్చిన దొంగను ఎదుర్కొన్న లేడీ మేనేజర్

పారనోయిడ్ స్కిజోఫ్రేనియా అంటే?

స్కిజోఫ్రేనియా ఒక మానసిక వ్యాధి. దీనితో బాధపడేవారికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది. అంటే ఏదో వర్చువల్ ప్రపంచంలో ఉన్నట్లుగా వారు ప్రవర్తిస్తుంటారు.

దీనితో బాధపడేవారు తమతో తామే మాట్లాడుకుంటారు. వారికి నెగిటివ్ ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఇతరులను చంపేయాలనే ఆలోచనలు కూడా దీనిలో భాగమే.

రమణ్ రాఘవ్‌తో మాట్లాడిన మానసిక నిపుణుడు ఆనంద్ పాట్కర్ ఆ తర్వాత ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడారు. తీవ్రమైన పారనోయిడ్ స్కిజోఫ్రేనియా బాధపడేవారిలో ఇలాంటి హత్యచేసే ఆలోచనలు కూడా వస్తుంటాయని ఆయన చెప్పారు.

పుణెలోని ఎరవాడ జైలులో మరణం

ముంబయి చరిత్రలోనే భయంకరమైన ఈ సీరియల్ కిల్లర్‌కు చివరికి జీవిత ఖైదు విధించారు. ఆ తర్వాత పూణెలోని ఎరవాడ జైలుకు తరలించారు.

ఆ తర్వాత అతడికి చికిత్స అందించారా? లేదా అతడి మానసిక స్థితి ఎలా ఉండేది? లాంటి సమాచారం అందుబాటులో లేదు.

1995 ఏప్రిల్‌లో రమణ్ రాఘవ్ మూత్రపిండాలు విఫలం కావడంతో ఎరవాడ జైలులోనే మరణించాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)