నాయకుడి ఆజ్ఞ కోసం 17ఏళ్లు అడవిలో ఎదురు చూసిన రహస్య దళం, చివరకు ఏం తెలిసిందంటే....

పాస్టర్ వై హిన్ నీ

ఫొటో సోర్స్, MICHAEL HAYES

ఫొటో క్యాప్షన్, పాస్టర్ వై హిన్ నీ
    • రచయిత, జార్జ్ రైట్
    • హోదా, బీబీసీ న్యూస్, లండన్

75 సంవత్సరాల పాస్టర్ వై హిన్ నీ అమెరికాలోని నార్త్ కెరోలినాలో ఉన్న ఓ చర్చిలో దైవ సందేశాన్ని వినిపిస్తున్నారు. అయితే, ఇప్పుడు దేవుడి సేవలో ఉన్న ఆయన, యువకుడిగా ఉన్న రోజుల్లో 20 ఏళ్లపాటు అడవిలో పోరాట జీవితాన్ని సాగించారు.

వియత్నాం యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఆ దేశపు దళాలతో పోరాడుతున్న తన సహచరులకు ఆయన దేవుడి సందేశాన్ని వినిపించేవారు. కానీ, ఆయన ఏకే 47ను మాత్రం ఆయన వదిలిపెట్టలేదు.

అడవుల్లో రహస్య జీవితం గడుపుతూ, ఈ ప్రపంచానికి దూరంగా ఉంటున్న హిన్ నీ, అతని తిరుగుబాటుదారుల బృందం తిండి కోసం నానా తిప్పలు పడ్డారు.

డబ్బు కోసం పులులను చంపి చర్మాలను అమ్ముకునేవారు. దాని మీద వచ్చిన డబ్బును వారు ఖెమెర్ రూజ్ దళాలకు ట్యాక్స్‌లాగా చెల్లించాల్సి వచ్చేంది. ఆయనతోపాటు ఈ రహస్య సైన్యం 1992 వరకు ఆయుధాలను వదిలిపెట్టలేదు. చివరకు హిన్ నీ యే చర్చలు జరిపి అజ్ఞాత జీవితం నుంచి బయటకు వచ్చారు.

1968 జనవరి 30న హిన్ నీ తొలిసారి చావుకు చేరువగా వెళ్లి వచ్చారు. వియత్నాంలో కమ్యూనిస్టు నార్త్ కోసం పోరాడుతున్న వియట్‌కాంగ్ దళాలు, టెట్(కొత్త సంవత్సర వేడుకల) వేడుకల మాటున అమెరికా దళాల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై భారీ ఎత్తున రాకెట్ దాడులు చేశాయి.

వియత్నాంలో పుట్టి పెరిగిన హిన్ నీ, అప్పట్లో వియత్నాం సెంట్రల్ హైలాండ్స్‌లోని అతిపెద్ద నగరం బూవన్ మా థూట్‌లో అమెరికన్ క్రిస్టియన్ మిషనరీలతో కలిసి పని చేసేవారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయనను, ఎనిమిదేళ్ల వయసు ఉండగా, తల్లిదండ్రులు మిషనరీకి అప్పగించారు.

ఆయన్ను దత్తత తీసుకున్న గాడ్ మదర్ కరోలిన్ గ్రిస్‌వోల్డ్, ఈ రాకెట్ దాడి జరిగినప్పుడు నిద్రలో ఉన్నారు. కమ్యూనిస్టు దళాలు చర్చిలో కూడా పేలుడు పదార్ధాలు పెట్టి పేల్చేశాయని తర్వాత మిషనరీలు ఒక రిపోర్టులో పేర్కొన్నాయి.

వియత్నాం యుద్ధంలో మోంటాగ్నార్ట్స్‌ను నియమించుకున్న అమెరికా ప్రత్యేక దళాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, వియత్నాం యుద్ధంలో మోంటాగ్నార్ట్స్‌ను నియమించుకున్న అమెరికా ప్రత్యేక దళాలు

ఈ దాడుల్లో కరోలిన్ తండ్రి లియోన్ అక్కడికక్కడే మరణించారు. ఆ సమయంలో హిన్ నీ తన స్నేహితుడి ఇంట్లో ఉన్నారు. దాడి విషయం తెలిసి ఇంటికి పరుగెత్తి శిథిలాలలో ఉన్న కరోలిన్‌ను రక్షించారు. కానీ, కాసేపటికే ఆమె మరణించారు.

‘‘ నా గాడ్ మదర్ చాలా బాధపడుతూ మరణించారు. నన్ను మాత్రం ఆ దేవుడు కాపాడాడు’’ అన్నారు హిన్ నీ. మిషనరీలలో పనిచేసే చాలామంది హత్యకు గురయ్యారు. కొందరిని బంధించారు. అయితే, హిన్ నీ ఓ బంకర్‌లో దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నారు.

ఇన్ని సమస్యలు ఎదురైనా ఆయన ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగారు. బైబిల్ స్కూల్‌లో చేరారు. చర్చిలో పని చేశారు. 1975లో కీలకమైన యుద్ధం జరిగే వరకు ఆయన అజ్ఞాత పోరాట దళాలలో చేరలేదు.

అమెరికా మద్ధతున్న దక్షిణ వియత్నాం దళాలు యుద్ధంలో ఓడిపోయి, బువన్ మా థూట్ నగరం నుంచి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. బాంబుల వర్షం కురుస్తుండగా, హిన్ నీ తోపాటు 32మంది బైబిల్ స్కూలు విద్యార్ధులు మైళ్ల దూరం నడిచి అక్కడి నుంచి తప్పించుకున్నారు.

అదే సమయంలో వియత్నాంలో మోంటాగ్నార్ట్స్ (మైనార్టీలకు స్వయంప్రతిపత్తిని డిమాండ్ చేస్తున్న సాయుధ తిరుగుబాటు దళం) అని పిలిచే యునైటెడ్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ అప్రెస్డ్ రేసెస్ (ఫుల్రో)కు సంబంధించిన మనుషులు ఆయన్ను సంప్రదించారు.

ఈ మైనారిటీ తెగ ప్రజలు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నరన్న నెపంతోపాటు అనేక కారణాల వల్ల చాలా ఏళ్ల నుంచి హింసకు అనుభవిస్తున్నారు.

1973లో వియత్నాం యుద్ధం నుంచి అమెరికా విరమించుకోవడానికి ముందు ఈ తెగ ప్రజలు ఆ దేశానికి ఫ్రంట్ లైన్‌ వారియర్స్‌గా పని చేశారు. హిన్‌ నీకి మిషనరీలతో ఉన్న సంబంధాలు, ఆయన ఇంగ్లీషులో మాట్లాడే తీరు తమను తిరిగి అమెరికాతో సంబంధాలు కొనసాగించడానికి అవకాశం కల్పిస్తుందని ఈ తెగ నాయకులు భావించారు.

తనలాంటి క్రైస్తవులతో కలిసి పనిచేయడం సంతోషం కలిగించిందని హిన్ నీ చెప్పారు. 1975 మార్చి 10న ఆయన వారితోపాటు అడవులలోకి వెళ్లిపోయారు. మొదటి నాలుగు సంవత్సరాలు వియత్నాంలోనే ఉంటూ, ఆ దేశపు సైన్యానికి దొరక్కుండా తప్పించుకు తిరిగారు.

‘‘కాల్చడం, పారిపోవడం, కాల్చడం పారిపోవడం ఇదే మా పని. మా దగ్గర మంచి ఆయుధాలు కూడా ఉండేవి కావు’’ అని హిన్ నీ చెప్పారు. అయితే, ఆయన ఎప్పుడూ ప్రత్యక్షంగా ఆయుధాన్ని ఉపయోగించలేదు. కానీ, ఆత్మరక్షణ కోసం ఏకే 47 తుపాకీ ఆయన దగ్గర సిద్ధంగా ఉండేది.

1979 నాటికి, వియత్నాం సైన్యం ఫుల్రో సభ్యుల కోసం సెర్చ్ ఆపరేషన్‌ను విస్తృతం చేసింది. దీంతో ఫుల్రో దళాలు పశ్చిమాన ఉన్న కంబోడియాలోకి పారిపోయాయి.

"అక్కడ ఉండలేకపోయాం. సరిహద్దు దాటాం, కానీ, అది మరో ప్రమాదకరమైన ప్రయాణం" అని హిన్ నీ చెప్పారు.

వియత్నాంను విడిచిపెట్టడం వారికి కొత్త ప్రమాదాలను తెచ్చిపెట్టింది. అప్పటికి కంబోడియాలో పోల్‌పాట్ నాయకత్వంలోని ఖెమెర్ రూజ్ గెరిల్లా దళాలు కంబోడియా తూర్పు సరిహద్దులను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయి.

వియత్నాం మ్యాప్
ఫొటో క్యాప్షన్, వియత్నాం మ్యాప్

ఖెమెర్ రూజ్ 4 సంవత్సరాల పాలనలో కంబోడియాలో దాదాపు 17 లక్షలమందిని చంపేసిందని చెబుతారు. ఆ తర్వాత వియత్నాం మద్ధతున్న దళాల చేతిలో ఖెమెర్ రూజ్ పాలన అంతమైంది.

ఫుల్రో ఈ ప్రాంతంలో ఉండటానికి ఖెమెర్ రూజ్ అనుమతి అవసరం కాబట్టి మొండుల్కిరి ప్రావిన్స్‌లోని అరణ్యాలలో ఉండే స్థానిక కమాండర్లను హిన్ నీ కలుసుకున్నారు.

‘‘మనకు ఉమ్మడి శత్రువు ఉన్నాడని వారికి చెప్పాను. వియత్నాం నుంచి కమ్యూనిస్టులు ఇటువైపు వస్తే, మనం వారిని ఎదుర్కోవాలని చెప్పాను’’ అని హిన్ నీ వివరించారు.

హిన్ నీ పని చేస్తున్న దళాలు అక్కడ నివసించడానికి ఖెమెర్ రూజ్ అనుమతించింది. ఇందుకు ప్రతిఫలంగా పులి, కొండ చిలువ చర్మాలు, జింక కొమ్ములను తమకు సేకరించి ఇవ్వాలని ఖెమెర్ రూజ్ డిమాండ్ చేసింది.

తమ బృందం పులులను ఉచ్చుల ద్వారా బంధించడం మొదలుపెట్టిందని హిన్ నీ చెప్పారు. పులులతో ఉన్న ప్రమాదాన్ని నిజం చేస్తూ ముగ్గురు దళ సభ్యులు వాటి చేతిలో చనిపోయారు. కానీ, ఖెమెర్ రూజ్‌తో ప్రమాదం దానికన్నా ఎక్కువగా ఉంది.

కంబోడియా అడవి లోపల ఫుల్రో సేవ

ఫొటో సోర్స్, NATE THAYER COLLECTION

"వారు చాలా కోపంగా ఉంటారు. ప్రతిదీ లెక్క ప్రకారం చేయాలి. ట్యాక్సులు కట్టకపోతే అక్కడి నుంచి వెళ్లిపోవాలని మమ్మల్ని వాళ్లు చాలాసార్లు బెదిరించారు’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

వియత్నాం దళాలతో అప్పుడప్పుడు పోరాడుతూ, నిరంతంరం ఒక అడవి నుంచి మరొక అడవికి ప్రయాణిస్తూ గడిపేవారమని ఆయన వెల్లడించారు. ఏ అడవిలో కూడా నెలకంటే ఎక్కువ రోజులు ఉండేవాళ్లం కాదని ఆయన చెప్పారు.

ఈ సమయంలో అడవిలో జంతువుల్లా బతికామని, ఏది దొరికితే అది తినేవాళ్లమని, మైళ్ల దూరం నడుస్తూ వెళ్లాల్సి వచ్చేదని, కనిపించిన జంతువునల్లా చంపేవాళ్లమని హిన్ నీ చెప్పారు. దళ సభ్యురాలైన హెచ్. బువాను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆ అడవిలోనే ముగ్గురు పిల్లలను కన్నారు. అందులో ఒకరు ఆ అడవిలోనే మరణించారు.

అయితే, ఈ సాయుధ పోరాట దళంతో కలిసి నడుస్తున్నా, ఆధ్యాత్మికతను విడిచి పెట్టలేదు. ఏదైనా కొత్త ప్రాంతానికి రాగానే అక్కడ ఒక శిలువను నిలబెట్టేవారు హిన్ నీ. క్రిస్మస్ పండగ జరుపుకోవడం ఎప్పుడూ మిస్ కాకుండా చూసుకునేవారు.

ఫుల్రో దళంలో ఆయన కేవలం ఆధ్యాత్మిక ప్రసంగాలు వినిపించే పాస్టర్ మాత్రమే కాదు. చర్చల్లో కీలక అనుసంధాన కర్త. అంటే ఖెమెర్ రూజ్ దళాలతో మాట్లాడే బాధ్యత ఆయనది.

దానితోపాటు బీబీసీ, వాయిస్ ఆఫ్ అమెరికా, వియత్నామీస్ రేడియోలాంటి వాటిని ట్యూన్ చేసుకుని వింటూ, మిగిలిన ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు.

కోల్డ్ వార్ ముగిసిన తర్వాత ఫుల్రో దళాల పరిస్థితి అధ్వాన్నం

ఫొటో సోర్స్, Y HIN NIE

ఫొటో క్యాప్షన్, వార్ ముగిసిన తర్వాత ఫుల్రో దళాల పరిస్థితి అధ్వాన్నం

అయితే, కోల్డ్ వార్ ముగిసిన తర్వాత ఫుల్రో దళాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. 1991 నాటికి అప్పటి ప్రధాని హున్ సేన్ నాయకత్వంలోని కంబోడియా దళాలతో చర్చలు జరపడం హిన్ నీ కి కష్టంగా మారింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫుల్రో దళాల గురించి చాలామంది మర్చిపోయారు.

కొద్దిమంది ఖెమెర్ రూజ్ దళాల సభ్యులు, కంబోడియ సైనికులకు తప్ప, ఫుల్రో ఫైటర్లు అడవిలో సజీవంగా ఉన్నారన్న విషయం చాలామందికి తెలియదు. బాహ్య ప్రపంచానికి అసలే తెలియదు.

1992లో హిన్ నీ ఐక్యరాజ్య సమితి అధికారులతో చర్చలు ప్రారంభించిన సమయంలోనే శాంతి పరిరక్షణ మిషన్‌లో భాగంగా దేశంలో ఎన్నికలు నిర్వహించేందుకు కంబోడియా ప్రభుత్వం ముందుకొచ్చింది.

ఈ సందర్భంగా హిన్ నీ ఐక్య రాజ్య సమితి అధికారులకు ఫ్రెంచ్ భాషలో ఒక సందేశం పంపారు. ‘‘మేం ఫుల్రో దళాలకు చెందినవారం. స్వేచ్ఛ కోసం ఎదురు చూస్తున్నాం. మీ సాయం కావాలి’’ అని అందులో పేర్కొన్నారు.

రెండు నెలల తర్వాత ఐక్యరాజ్య సమితి అధికారులు హిన్ నీని కలిశారు. ‘‘వాళ్లు నన్ను వారం రోజులపాటు బంధించి, నేను ఈ అడవిలో ఎందుకు ఉన్నానో కనుక్కునే ప్రయత్నం చేశారు. నేను ఖెమెర్ రూజ్ సభ్యుడినని అనుమానించారు. కానీ, నేను ఆ దళ సభ్యుణ్ని కాదని వారికి చెప్పాను’’ అని హిన్ నీ వివరించారు.

1992లో ఫుల్రో దళాల క్యాంపు

ఫొటో సోర్స్, MICHAEL HAYES

ఫొటో క్యాప్షన్, 1992లో ఫుల్రో దళాల క్యాంపు

మరోసారి ఐక్యరాజ్య సమితి అధికారులతో సమావేశం జరిపినప్పుడు కంబోడియన్ దళాలతో పోరాడేందుకు తనకు మరిన్ని ఆయుధాలు కావాలని అడిగినట్లు హిన్ నీ వెల్లడించారు. కానీ, దానికి వారు తిరస్కరించారు.

‘‘మీరు కేవలం 400 మంది ఉన్నారు. కంబోడియా దగ్గర లక్షలమంది సైనికులు ఉన్నారు. మీరు చావాలని మేం కోరుకోవడం లేదు’’ అని ఐక్యరాజ్య సమితి అధికారులు చెప్పారు.

అమెరికాకు చెందిన జర్నలిస్టుల ఒకరు హిన్ నీ ని కలిశారు. ఆ తర్వాత ఆయన ‘ఫుల్రో ఫైటర్ల ఆఖరి దళం’ అన్న పేరుతో రాసిన కథనంతో బాహ్య ప్రపంచానికి హిన్ నీ పని చేస్తున్న దళం గురించి తెలిసింది.

ఖెమెర్ రూజ్ దళాల చేతిలో 17 ఏళ్ల కిందటే మరణశిక్షకు గురైన తమ నాయకుడి ఆదేశాల కోసం వీరు ఎదురు చూస్తున్నారని, ఆ నాయకుడు ఎవరో కూడా వీళ్లకు తెలియదని నామ్ ఫెన్ పోస్ట్ పత్రికకు రాసిన కథనంలో ఆ అమెరికన్ జర్నలిస్టు రాశారు.

‘‘మా నాయకుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి మీరేమైనా సాయం చేస్తారా? ఆయనను కలుసుకోవడానికి, ఆయన ఆదేశాల కోసం మేం 1975 నుంచి ఎదురు చూస్తున్నాం. ఆయనెక్కడున్నాడో మీకేమైనా తెలుసా’’ అని తనను ఫుల్రో కమాండర్ వై పెంగ్ ఆయున్ అడిగినట్లు అమెరికన్ జర్నలిస్టు వెల్లడించారు.

తమ నాయకుడు మరణించాడని తెలియగానే దళ సభ్యులు చాలామంది కన్నీరు పెట్టుకున్నారు. ఆయన మరణ వార్తను హిన్ నీ తన రేడియోలో ఎప్పుడూ వినలేదు.

అప్పటికి వియత్నాం యుద్ధం ముగిసిందని తెలిసినా, అమెరికా సైన్యంకు తమకు ఇంకా సాయం చేస్తుందని హిన్ నీ సహా చాలామంది దళ సభ్యులు గుడ్డిగా నమ్మారు.

‘‘నాకు కోపం రాలేదు. కానీ, అమెరికన్లు మమ్మల్ని మరిచిపోయినందుకు చాలా బాధేసింది. అమెరికా వాళ్లు మాకు పెద్దన్న లాంటి వాళ్లు. వాళ్లు మమ్మల్ని వదిలేయడం బాధ కలిగించింది’’ అని అమెరికన్ జర్నలిస్టుతో హిన్ నీ చెప్పారు.

హిన్ నీ

ఫొటో సోర్స్, Y HIN NIE

ఫొటో క్యాప్షన్, హిన్ నీ

తమ నాయకుడు చనిపోయాడని తెలియడంతో ఆయుధాలు విడిచిపెట్టడానికి ఫుల్రో దళాలు ముందుకు వచ్చాయి. సాధారణ శరణార్ధి నిబంధనలకు భిన్నంగా కొన్ని నెలల కాలంలోనే వీరు విమానాల్లో అమెరికాకు చేరుకున్నారు.

1992 అమెరికా వచ్చిన హన్ నీ, తన భార్య, మిగిలిన పిల్లలతో కలిసి గ్రీన్స్‌బరోలో స్థిరపడ్డారు.

అక్కడికి చేరుకున్నాక ఆయన మౌనంగా ఉండిపోలేదు. తమ తెగ ప్రజలపై వియత్నాంలో సాగిన మారణ హోమం గురించి అమెరికన్ కాంగ్రెస్‌లో మాట్లాడారు. హిన్ నీ ఇప్పటికీ వియత్నాం ప్రభుత్వ మీడియా నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు.

ఫుల్రో దళాలు ఇంకా ఉన్నాయని, హిన్ నీ లాంటి వారు వారికి సహకారం అందిస్తున్నారని వియత్నాం ప్రభుత్వం అనుమానిస్తోంది.

‘‘మతం పేరుతో కొన్ని వర్గాలు ప్రజలను రెచ్చగొట్టి వియత్నాం దేశాన్ని ముక్కలు చేయాలని భావించే వర్గాలకు హిన్ నీ లాంటి వారు సహకరిస్తున్నారు. ’’ అని వీఓవీ (వాయిస్ ఆఫ్ వియత్నాం) న్యూస్ ఏజెన్సీ ఆరోపించింది.

ఇప్పటికీ మోంటాగ్నార్డ్స్ తెగ ప్రజల విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం వివక్ష చూపుతోందని, వారిని అణిచి వేస్తోందని ఆరోపణలు వినిపిస్తుంటాయి. కానీ, వియత్నాం ప్రభుత్వం దీనిపై స్పందించ లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)