మణిపుర్‌: ఎవరు శరణార్థి, ఎవరు చొరబాటుదారు? సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? - గ్రౌండ్ రిపోర్ట్

డిటెన్షన్ సెంటర్లో ఉంటున్న లిన్ కెన్ మెంగ్
ఫొటో క్యాప్షన్, డిటెన్షన్ సెంటర్లో ఉంటున్న లిన్ ఖేన్ మెంగ్
    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది మధ్యాహ్నం 12 గంటల సమయం. మణిపుర్ జైలులో అంతా హడావుడిగా ఉంది. దాదాపు 700 మంది ఖైదీలు భోజనాలు ముగించుకుని తమ బ్యారక్‌లకు చేరుకుంటున్నారు.

సైరన్ ఆగిపోగానే జైల్లో నిశ్శబ్దం అలుముకుంది. గార్డుల పర్యవేక్షణలో దాదాపు 50 మంది ఖైదీలు క్యూ రూపంలో మా వైపు వస్తున్నారు.

వీరంతా భారత్‌ పొరుగు దేశం మియన్మార్‌లోని వివిధ ప్రావిన్సుల నుంచి వచ్చారు. వచ్చే రెండు గంటల పాటు వీరి బయోమెట్రిక్ ధృవీకరణ జరుగుతుంది.

మణిపుర్‌ రాష్ట్రంలో విదేశీ నిర్బంధ కేంద్రం(ఫారన్ డిటెన్షన్ సెంటర్ ) లేదు. అందువల్ల రాష్ట్రంలోని అతిపెద్ద జైలైన మణిపుర్ జైలులో తాత్కాలికంగా ఈ డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌లో పురుషులు, స్త్రీలు, పిల్లలు ఉన్నారు.

మియన్మార్‌కు చెందిన 26 ఏళ్ల లిన్ ఖేన్ మెంగ్‌తో‌ మేం మాట్లాడాం. డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో సరిహద్దు దాటి భారత్‌లోకి వచ్చేవాడినని ఆయన చెప్పారు.

2022లో భారత్-మియన్మార్ సరిహద్దులో లిన్ ఖేన్ పట్టుబడి ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు. కానీ, మణిపుర్‌లో కొనసాగుతున్న హింస కారణంగా, తిరిగి వెళ్లడానికి అవకాశాలు తగ్గిపోయాయి.

“నేను భారత్‌‌లో ఆవులను అమ్ముకోవడానికి మియన్మార్‌లోని సాగింగ్ రాష్ట్రం నుంచి వచ్చేవాడిని. తొమ్మిది నెలల కిందట అరెస్టు అయ్యాను. అప్పటి నుంచి డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నాను. నేను ఇక్కడ చిక్కుకుపోయానని నా కుటుంబానికి తెలియదు’’ అన్నారాయన.

మణిపుర్

ఫొటో సోర్స్, Reuters

‘డ్రగ్స్ కేసులో స్నేహితుడి వల్ల పట్టుబడ్డా’

ఈ జైలులో మియన్మార్ నుంచి అక్రమంగా భారత్‌కు వచ్చిన 100 మందికి పైగా ఉన్నారు. మియన్మార్‌లోని చిన్ ప్రావిన్స్‌కు చెందిన యు నింగ్ అలాంటి వారిలో ఒకరు. తాను తరచు భారతదేశ సరిహద్దు గ్రామాలకు చేనేత పని చేయడానికి వచ్చేవాడినని, అయితే ఒక తప్పుడు కేసులో తనను అరెస్టు చేశారని ఆయన అన్నారు.

“నా స్నేహితుడు డబ్ల్యూవై (WY ) టాబ్లెట్‌లను అమ్మేవాడు. (ఇవి మత్తు కోసం ఉపయోగించే నిషేధిత డ్రగ్స్). అతని వల్ల నేను కూడా పట్టుబడ్డాను. నా జైలు శిక్ష పూర్తయింది. కానీ, సరిహద్దులు మూసేయడం వల్ల తిరిగి మా దేశం వెళ్లలేకపోయాను’’ అని యు నింగ్ అన్నారు.

మియన్మార్‌లో జరుగుతున్న మిలిటరీ ఆపరేషన్ నుండి తప్పించుకోవడానికి కూడా చాలా మంది సరిహద్దులు దాటి భారతదేశంలో అడుగు పెట్టారు.

2021 నుండి మియన్మార్‌ సైనిక పాలనలో ఉంది. పౌరులపై సైనిక అణచివేత కారణంగా వేల మంది పొరుగున ఉన్న మణిపుర్, మిజోరంలలో ఆశ్రయం పొందుతున్నారు.

మణిపుర్
ఫొటో క్యాప్షన్, భారత్-మియన్మార్ మధ్య సరిహద్దు

మియన్మార్‌లో పరిస్థితి ఎలా ఉంది?

పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ (పీడీఎఫ్), కుకీ నేషనల్ ఆర్మీ (కేఎన్ఏ) మధ్య మియన్మార్‌లో ఘర్షణలు జరుగుతున్నాయి.ఈ ఘర్షణలే భారత్‌లోకి శరణార్ధులు, అక్రమ చొరబాటుదారుల రాకకు కారణంగా భావిస్తున్నారు.

మణిపుర్‌లో హింసకు కూడా ఈ అక్రమ చొరబాట్లే కారణమని కేంద్ర ప్రభుత్వం, అలాగే మణిపుర్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నాయి.

మణిపుర్‌లో ఇప్పటివరకు జరిగిన హింస వల్ల 180 మంది మరణించగా, 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

మియన్మార్‌లో జరుగుతున్న సైనిక చర్య ప్రభావం మణిపుర్ సరిహద్దుల్లో కనిపిస్తోందని బీబీసీ మియన్మార్ ప్రతినిధి నియో లీ యే అభిప్రాయపడ్డారు.

“మియన్మార్ నుండి మణిపుర్‌కు పారిపోయిన చాలా మందితో నేను మాట్లాడాను. ఇక్కడి హింస కారణంగా మాత్రమే వారు అక్కడకు వెళ్లారు. కానీ, మణిపుర్‌ హింసాత్మక ఘటనలకు తమను బాధ్యులను చేయడం బాధాకరమని వారు అంటున్నారు. మణిపుర్‌లో శరణార్ధిగా సాయం పొందాల్సి ఉండగా, తమ బయోమెట్రిక్ డేటాను సేకరిస్తూ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారని వారు అంటున్నారు’’ అని నియో లీ యే అన్నారు.

వీడియో క్యాప్షన్, సైనిక పాలనను తట్టుకోలేకనే సరిహద్దు దాటి భారత్ వస్తున్న మియన్మార్ ప్రజలు

మణిపుర్‌లో సరిహద్దు పట్టణంలో నివసిస్తున్న మియన్మార్ మహిళ ఒకరు బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు.

కుకీ-చిన్ తెగకు చెందిన డోయి శ్వే (అసలు పేరు కాదు) మియన్మార్‌లో సైనిక చర్య కారణంగా తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని 2021లో మణిపుర్ చేరారు.

‘‘మియన్మార్‌లో సైన్యం చాలా మందిని అరెస్టు చేస్తోంది. నా సహోద్యోగులు చాలా మంది పట్టుబడ్డారు. పోలీసులు నా కోసం కూడా వెతుకుతున్నారు. నేను అక్కడే ఉంటే, వారు నా కుటుంబాన్ని జైల్లో పెట్టేవారు. 2021లో మేం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ శరణార్థి శిబిరం లేదు. కానీ స్థానికులు మాకు మద్దతు ఇచ్చారు. మానవత్వం చూపి మనుషులంతా ఒకటే అనిపించారు" అని డోయి శ్వే అన్నారు.

ప్రమాదం నుంచి బయటపడ్డామని, ఇప్పుడు భారత్‌లో తమ కుటుంబం సురక్షితంగా ఉందని డోయి భావించారు. కానీ, మూడు నెలలుగా మణిపుర్‌ కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణతో ఇక్కడ కూడా ఆందోళన పెరిగింది.

“ఇంఫాల్, చురచంద్‌పుర్‌‌లలో హింస మొదలైన తర్వాత మాకు భయం పెరిగింది. ఒక తల్లిగా పిల్లల గురించి నేను భయపడుతున్నాను. కొన్ని దుస్తులు, పత్రాలతో ఇక్కడ ఉంటున్నాం. మేం ఎలాగైనా మా దేశం వెళ్లిపోవాలి. కానీ ఎప్పుడు వెళతామో తెలియదు’’ అన్నారామె.

మణిపుర్
ఫొటో క్యాప్షన్, డోయి శ్వే తన కుటుంబంతో సహా భారత్ వచ్చేశారు.

తెగల మధ్య ఘర్షణలు

మణిపుర్‌లో మెయితీ, కుకీ కమ్యూనిటీల మధ్య వైరం నెలకొని ఉంది. స్వాతంత్ర్యం తరువాత క్రైస్తవ మతాన్ని అనుసరించిన కుకీ కమ్యూనిటీ షెడ్యూల్డ్ తెగ హోదాను పొందింది. అయితే మెయితీలు హిందువులుగా కొనసాగారు. వీరిలో షెడ్యూల్డ్ కులాలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు(ఈడబ్ల్యూఎస్)తోపాటు ఇతర వర్గాల వారు ఉన్నారు.

కుకీ‌ ఆధిపత్య ప్రాంతాలలో మెయితీలు భూమిని కొనుగోలు చేయలేరు. అయితే, మెయితీలకు గిరిజన హోదాను కుకీలు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం కూడా దీనికి మరో కారణం.

ప్రస్తుత సంక్షోభానికి పొరుగున ఉన్న మియన్మార్‌లోని చిన్, సగాయింగ్ ప్రావిన్సుల నుండి పారిపోయి వచ్చిన చిన్‌ కుకి తెగ ప్రజలు కూడా కారణమన్న ఆరోపణలు వచ్చాయి. వీరిని మణిపుర్ రాష్ట్ర ప్రభుత్వం 'అక్రమ చొరబాటుదారులు'గా అభివర్ణించింది.

ఇండో-మియన్మార్ సరిహద్దు వెంబడి డ్రగ్స్ ఉత్పత్తి, అమ్మకాలకు పాల్పడే ‘సాయుధ కుకీ చొరబాటుదారులు' ఈ హింసలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని మెజారిటీ మెయితీలు నమ్ముతున్నారు.

మే 3న మణిపుర్‌లో హింస మొదలైన రెండు నెలల తర్వాత, ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, “మన రాష్ట్రం, మియన్మార్ మధ్య 398 కి.మీ. పొడవైన సరిహద్దు ఉంది. దీనిని పూర్తిగా పర్యవేక్షించడం సాధ్యం కాదు" అన్నారు.

మణిపుర్
ఫొటో క్యాప్షన్, మణిపుర్ డిటెన్షన్ సెంటర్‌లో విదేశీయులు

‘ఇక్కడ ఎవరు ఉన్నారో తెలుసుకోకుండా సరిహద్దులు గీశారు’

కుకీలు స్వయంపాలనను కోరుతుండగా, కేంద్ర ప్రభుత్వం తిరస్కరిస్తూ వస్తోంది. మరోవైపు 'అక్రమ చొరబాటుదారుల' ఆరోపణలను 'కల్పిత కథ'గా అభివర్ణిస్తూ, కుకీ ప్రజలు ఈ ప్రాంత చరిత్ర గురించి మాట్లాడుతున్నారు.

మణిపుర్‌లోని నిర్బంధ కేంద్రాలలో ఉన్న మియన్మార్ ఖైదీల తరపు న్యాయవాది డేవిడ్ వైఫీ మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయ సరిహద్దులను గీసేటప్పుడు ఇక్కడ ఎవరు నివసిస్తున్నారో బ్రిటిష్ ప్రభుత్వం పరిగణించలేదు’’ అని అభిప్రాయపడ్డారు.

‘‘నాతోపాటు అనేక తరాలవారు ఇక్కడ సరిహద్దుల్లో నివసిస్తున్నాం. మేమంతా భారతీయులం. కానీ, నా చెల్లెలు మియన్మార్‌కు చెందిన కుకీ తెగ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వాళ్లు సరిహద్దుల్లో ఉంటున్నారు. ఆమె ఇక్కడకు వస్తే చొరబాటుదారు అనడం సరికాదు’’ అన్నారాయన.

భారతదేశంలోని మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌‌ రాష్ట్రాలు మియన్మార్ దేశంతో 1,643 కి.మీ.ల సరిహద్దును పంచుకుంటున్నాయి.

ఇరుదేశాల ప్రజలు స్వేచ్ఛాయుతంగా అటు ఇటు వెళ్లడానికి అనుమతించేలా గతంలో ఒక ఒప్పందం( ఫ్రీ మూవ్‌మెంట్ రెజీమ్) కుదిరింది. దీని ప్రకారం సరిహద్దుల్లో నివసించే గిరిజనులు వీసా లేకుండా సరిహద్దులు దాటి 16 కిలోమీటర్ల పరిధి వరకు వెళ్లవచ్చు. కానీ, 2022లో ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు.

గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశం మియన్మార్ నుండి టేకులాంటి విలువైన కలప దిగుమతిని పెంచింది. మియన్మార్ కూడా భారతీయ కంపెనీల నుండి ఆయుధాలు, సైనిక పరికరాలను కొనడం ప్రారంభించింది. అయితే, ఈ వాణిజ్యం కోవిడ్ -19 సమయంలో కాస్త, ఆ తర్వాత ఫ్రీ మూవ్‌మెంట్ రెజీమ్ రద్దుతో మరికాస్త మందగించింది.

మణిపుర్లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నందున, మియన్మార్‌ నుంచి ఇక్కడికి వస్తున్న వ్యక్తులు ఎవరనేది దర్యాప్తు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇలాంటి వారిని దాదాపు 2,500 మందిని గుర్తించారు.

ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం మియన్మార్‌‌లో సైనిక పాలన కారణంగా సుమారు 80,000 మంది శరణార్థులు భారత్‌ సహా పలు సరిహద్దు దేశాలకు పారిపోయారు.

మియన్మార్‌తో దౌత్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని, అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలని భారత్ కోరుకుంది. కానీ, ఇక్కడికి వచ్చిన శరణార్థులను వెనక్కి పంపడంలో ఎలాంటి పురోగతీ లేదు.

మణిపుర్

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES

ఫొటో క్యాప్షన్, మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్

మియన్మార్ నుంచి వచ్చే వారిలో ఎవరిని ఏమనాలి?

మియన్మార్ నుండి వచ్చే వారిలో ఎవరిని అక్రమ చొరబాటుదారులనాలి, ఎవరిని యుద్ధ శరణార్థులనాలి అన్న విషయం ఇప్పటికీ సందిగ్ధంగానే ఉంది.

మణిపుర్‌లో కొనసాగుతున్న హింసాకాండకు కేవలం "అక్రమ చొరబాట్లు" మాత్రమే కారణమని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తున్న తరుణంలో, ఇది ఎంత వరకు నిజమో తెలుసుకోవడానికి మేం మణిపూర్ సమాచార శాఖ మంత్రి సపమ్ రాజన్‌ను సంప్రదించాం.

“మాకు ఏ వర్గంపైనా వ్యతిరేకత లేదు. బయటి నుండి వచ్చిన వారి గురించి మాత్రమే ఆందోళన చెందుతున్నాం. చాలా మంది మా రాష్ట్రానికి అక్రమంగా వస్తున్నారు. కాబట్టి మేం ఈ సమస్య గురించి మాట్లాడుతున్నాం. ఇందుకోసమే ప్రజల బయోమెట్రిక్‌ డేటా తదితరాలను తీసుకుంటున్నారు. ఇది ప్రారంభం మాత్రమే. సరిహద్దులో త్వరలోనే ఫెన్సింగ్ ప్రారంభమవుతుంది’’ అని ఆయన చెప్పారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సరిహద్దుల్లో ఫెన్సింగ్‌ ఏర్పాటు అంశాన్ని ఇటీవల పార్లమెంటులో ప్రస్తావించారు.

‘‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, ఇండో-మియన్మార్ సరిహద్దుల్లో ఎలాంటి ఆటంకాలు లేవు కాబట్టి, పెద్ద సంఖ్యలో కుకీ సోదరులు ఇక్కడికి రావడం ప్రారంభించారు. వారు అటవీ ప్రాంతంలో కుటుంబాలతో స్థిరపడటం ప్రారంభించాక మణిపుర్ ప్రజల్లో అభద్రతా భావం నెలకొంది’’ అని ఆయన అన్నారు.

మణిపుర్-మిమయన్మార్ సరిహద్దును సందర్శించినప్పుడు, మాకు అలాంటి అనేక గ్రామాలు కనిపించాయి. అందులో కొన్ని ఇళ్లు భారత్‌లో భాగం కాగా, మరికొన్ని మియన్మార్‌ భూభాగంలో ఉన్నాయి.

మణిపుర్
ఫొటో క్యాప్షన్, చింఖోలాల్ థాన్సింగ్‌

మణిపుర్‌లో కుకీ తెగ వారు ఏమంటున్నారు?

సరిహద్దులో నివసించే ప్రజల భాష, దుస్తులు, ఆహారపు అలవాట్లు కూడా అలాగే ఉంటాయి. వీరిలో మెయితీ, కుకీ కమ్యూనిటీలకు చెందిన వారు ఉంటారు. తమ వర్గానికి చెందిన వారినందరినీ "అక్రమ చొరబాటుదారుల" కేటగిరీలో ఉంచడం బాధ కలిగించించిందని మణిపుర్‌లోని కుకీ తెగ వారు అంటున్నారు.

చురచంద్‌పూర్‌లో ఉండే కుకీ పీపుల్స్ అలయన్స్ ఉపాధ్యక్షుడు చింఖోలాల్ థాన్సింగ్‌ ఈ అంశంపై మాట్లాడారు. ‘‘సిరియా నుంచయినా, హింస జరుగుతున్న మరే దేశం నుంచయినా శరణార్థులు యూరప్ దేశాలకు, బ్రిటన్, అమెరికాలకు వలస వెళుతుంటారు. అలాగే మియన్మార్‌లో సైనిక పాలనతో ఇబ్బందులు పడుతున్న శరణార్థుల మానవ హక్కులను పరిరక్షిస్తూ వారిని భారత్‌లోకి స్వాగతించాలి’’ అని ఆయన చెప్పారు.

అయితే వందల ఏళ్లుగా కలిసి బతుకుతున్న కుకీ, మెయితీ ప్రజల మధ్య శత్రుత్వం ముదురుతోందనేది క్షేత్రస్థాయి వాస్తవం.

మణిపుర్

ఫొటో సోర్స్, MANISH JALUI/BBC

ఫొటో క్యాప్షన్, మణిపుర్ హింస అనంతర దృశ్యాలు

65 ఏళ్ల ఎన్ పులింద్రో సింగ్ ఇండో-మియన్మార్ సరిహద్దులోని మోరే పట్టణంలో వ్యాపారం చేస్తుండేవారు.

ఆగ్రహంతో ఉన్న ఓ గుంపు మే 4న ఆయన ఇంటిని, గోడౌన్‌ను తగలబెట్టింది. భారత సైన్యం ఆయన కుటుంబాన్ని రక్షించి ఇంఫాల్‌కు తీసుకెళ్లింది.

పులీంద్రో సింగ్ ఇంఫాల్‌లోని ప్రత్యర్ధి కమ్యూనిటీకి చెందిన ఓ ఖాళీ ఇంట్లో తన కుటుంబంతో ఉంటున్నారు. పొరుగున ఉన్న మియన్మార్‌తో పెరుగుతున్న వాణిజ్యంలో మోరే పట్టణానికి చెందిన వ్యాపారుల పాత్ర కీలకం కావడంతో వారంతా తిరిగి స్వస్థలానికి చేరుకోవాల్సిన అవసరం ఉంది.

“కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బలగాలను మోరేలో మోహరించినప్పుడే మేం మళ్లీ వెనక్కి వెళతాం. మణిపురి ప్రజలను మోరెలో నివసించడానికి అనుమతించకపోతే, మణిపుర్‌ ఆర్ధిక వ్యవస్థకు ఎంతో కీలకమైన వ్యాపారం దెబ్బతింటుంది. అప్పుడు రాష్ట్రం మొత్తం నష్టపోతుంది’’ అని పులింద్రో సింగ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, మణిపుర్‌: ఇంటికి కులాల పేర్లతో బోర్డులు ఎందుకు పెట్టుకుంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)