ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జెండా కనిపించదా? ఇండియా రెజ్లింగ్ ఫెడరేషన్‌పై వేటుతో ఆటగాళ్ల ఒలింపిక్ కలలు చెదిరిపోయాయా

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అభినవ్ గోయల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో సెప్టెంబర్ 16 నుంచి 24 వరకూ జరగనున్న ప్రపంచ కుస్తీ పోటీల్లో (వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్) వందలాది మంది రెజ్లర్లు పోటీ పడనున్నారు.
అయితే, ఈ పోటీల్లో సత్తా చాటే అవకాశం ఎవరికి లభిస్తుందనేది నిర్ణయించడానికి ఆగస్ట్ 25, 26 తేదీలలో పంజాబ్‌లోని పాటియాలాలో ట్రయల్స్ నిర్వహించారు.
ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడం రెజ్లర్లకు చాలా ముఖ్యం. ఎందుకంటే, ఈ టోర్నమెంట్‌లో పతకాలు సాధించిన వారికి 2024లో పారిస్‌లో జరగబోయే ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనేందుకు నేరుగా అవకాశం లభించే అవకాశం ఉంటుంది.
అయితే, ఇటీవల ఆగస్టు 24న వచ్చిన ఒక వార్త భారత రెజ్లర్లకు నిరాశకు గురిచేసింది. ఇప్పుడు భారత క్రీడాకారులు పతకాలు గెలిచినా జాతీయ జెండా కనిపించదు. జాతీయ గీతం కూడా వినిపించదు. ఇక నేరుగా పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం గురించి మరిచిపోవాల్సిందే.
భారత రెజ్లింగ్ సమాఖ్య (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)కి సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడమే అందుకు కారణం.
దీంతో భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ తాత్కాలికంగా రద్దు చేసింది.
అయితే, ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్నలు ఏంటంటే, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ హెచ్చరికలు చేసినా భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు? అందుకు బాధ్యులెవరు?

ఫొటో సోర్స్, ANI
రెజ్లర్లు ఏమంటున్నారు?
వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్ణయం తర్వాత భారత రెజ్లర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
భారత రెజ్లింగ్‌కు ఆగస్టు 24 ఒక చీకటి రోజని ఒలింపిక్ పతక విజేత సాక్షి మలిక్ అన్నారు.
''బ్రిజ్‌భూషణ్ సింగ్, అతని అనుచరుల కారణంగా ఈ దేశ రెజ్లర్లు మూడు రంగుల జెండాతో ఆటలో పాల్గొనలేకపోతున్నారు.మూడు రంగుల జెండా దేశ గౌరవం. పోటీలో గెలిచిన తర్వాత జాతీయ జెండాను ప్రదర్శించాలని ప్రతి క్రీడాకారుడు కోరుకుంటారు. బ్రిజ్‌భూషణ్, అతని అనుచరులు దేశానికి ఎంత నష్టం చేస్తారు'' అని ఆమె అన్నారు.
ఈ నిర్ణయం భారత రెజ్లింగ్‌కు పెద్ద దెబ్బ అని ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ పేర్కొన్నారు.
''రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలతో పాటు దేశంలోని అన్ని పోటీల్లో రాణిస్తున్న యువ ఆటగాళ్ల భవిష్యత్తుకు ఇది శరాఘాతం లాంటిది. కుస్తీని అణచివేయడం ఈ దేశానికి దురదృష్టం. ఇది కుస్తీని దోపిడీ చేయడమే'' అని ఆయన ట్వీట్ చేశారు.
బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగే దీనికి కారణమని, ఆయన వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించిందని మరో ఒలింపిక్ విజేత బజ్‌రంగ్ పునియా ట్వీట్ చేశారు.
''బ్రిజ్ భూషణ్ కారణంగా భారత రెజ్లింగ్‌కు జరిగిన నష్టం ఇది. అప్పుడే పరిస్థితిని సరిగ్గా అంచనా వేస్తే, నిజాలు తెరపైకి వచ్చేవి. మాఫియా కారణంగా త్రివర్ణ పతాకం అవమానానికి గురైంది'' అని వినేశ్ ఫోగట్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సస్పెన్షన్ వల్ల నష్టం
ఎన్నికలు నిర్వహించాలని భారత రెజ్లింగ్ సమాఖ్యను జులై 3న వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ హెచ్చరించింది. కానీ, ఇప్పటి వరకూ ఎన్నికలు జరగలేదు.
దీంతో భారత రెజ్లింగ్ సమాఖ్యలో సభ్యులుగా ఉన్న రెజ్లర్లు వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే, జాతీయ జెండాతో సంబంధం లేకుండా తమ సొంతగా పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంది.
''రెజ్లర్ బంగారు పతకం సాధిస్తే ఆ దేశ జాతీయ జెండా ఎగురవేయడం, ఆ దేశ జాతీయ గీతం వినిపించడం సంప్రదాయం. అయితే, ఈసారి వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో అది కనిపించదు'' అని స్పోర్ట్స్ జర్నలిస్ట్ అదేశ్ కుమార్ గుప్తా అన్నారు.
''వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలిచినా నేరుగా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేకపోవడం ఒక్కటే కాదు, పారిస్ ఒలింపిక్స్‌కి వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలు కూడా ఒక క్వాలిఫయింగ్ ఈవెంట్. ఇందులో ప్రతి దేశానికి ఒక నిర్దేశిత కోటా ప్రకారం మాత్రమే అవకాశాలు ఉంటాయి. భారత్ తరఫున పోటీల్లో పాల్గొనే అవకాశం లేకపోవడం వల్ల, ఆ ప్రయోజనాలు కూడా భారత రెజ్లర్లు కోల్పోయినట్టే'' అని ఆయన వివరించారు.
దేశం తరఫున ఆడిన వారికి మాత్రమే ఈ కోటా వర్తిస్తుంది. వ్యక్తిగతం పాల్గొన్న ఏ అథ్లెట్‌కూ ఈ ప్రయోజనం దక్కదు.

ఫొటో సోర్స్, ANI
ఎందుకీ పరిస్థితి
2023 జనవరిలో ప్రముఖ రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజ్‌రంగ్ పునియా భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
కనీస సౌకర్యాలు లేవని, ఆర్థిక అవకతవకలు, క్రీడాకారుల ఎంపిక, ఒంటెత్తు పోకడల గురించి చాలా ఆరోపణలు వాటిలో ఉన్నప్పటికీ, మహిళా రెజ్లర్లపై లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారనే విమర్శలు తీవ్రమైనవి.
ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికపై అసంతృప్తికి గురైన క్రీడాకారులు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏప్రిల్‌లో మరోసారి నిరసనకు దిగారు.
దీంతో భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలను నిలిపేసిన క్రీడా మంత్రిత్వ శాఖ, దాని బాధ్యతలను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు అప్పగించింది. ఒలింపిక్ అసోసియేషన్ ముగ్గురు సభ్యుల అడ్ - హక్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ బాధ్యతలను భూపేంద్ర సింగ్ బజ్వాకి అప్పగించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య వ్యవహారాలను ఆయన నేతృత్వంలోని కమిటీ నిర్వహిస్తోంది. 15 మంది సభ్యులున్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
ఈ ఎన్నికలకు జమ్మూ కశ్మీర్ హైకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి మహేశ్ మిత్తల్‌ను రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికలపై కోర్టు నిషేధం
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ప్రెసిడెంట్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ట్రెజరర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, మరో నలుగురు వైస్ ప్రెసిడెంట్లతో పాటు ఐదుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్.. సభ్యులుగా ఉంటారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఎన్నికల్లో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఇద్దరు సభ్యులు ఓటు వేసే హక్కు ఉంది.
ఈ క్రమంలో జూలై 11న ఎన్నికలు నిర్వహించేందుకు అడ్ - హక్ కమిటీ నిర్ణయించింది. అయితే, దానికి వ్యతిరేకంగా అస్సాం రెజ్లింగ్ ఫెడరేషన్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది.
ఇండియన్ రెజ్లింగ్ అసోసియేషన్‌లో సభ్యత్వం పొందేందుకు తమకు కూడా అర్హత ఉందని అస్సాం రెజ్లింగ్ అసోసియేషన్ తెలిపింది.
అలాగే, ఇతర ఇద్దరు సభ్యులకు కూడా ఓటు హక్కు ఉండాలని వాదనలు వినిపించింది.
వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. అయితే, ఆ తర్వాత సుప్రీం కోర్టు ఆ స్టేను ఎత్తివేసింది. ఆ తర్వాత అస్సాం కూడా ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి అయింది. ప్రస్తుతం దేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 50 మంది సభ్యులకు ఓటు వేసే వీలు కల్పించారు.
అస్సాం వివాదం ముగిసిన తర్వాత ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహించాలని మరోసారి అడ్‌హక్ కమిటీ నిర్ణయించింది. కానీ ఈసారి హర్యానా ప్రభుత్వం పంజాబ్-హర్యానా హైకోర్టు ఆశ్రయించింది.
హర్యానా రెజ్లింగ్ అసోసియేషన్‌కు బదులుగా తమ ఇద్దరు సభ్యులకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని హర్యానా అమెచ్యూర్ రెజ్లింగ్ సమాఖ్య కోరింది.
దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆగస్టు 28 వరకు ఎన్నికలపై స్టే విధించింది.

ఫొటో సోర్స్, Getty Images
మూల్యం చెల్లిస్తున్న క్రీడాకారులు
ఈ ఎన్నికల్లో భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవికి అనితా శ్యోరానా, సంజయ్ కుమార్ సింగ్ పోటీ పడుతున్నారు.
అనితా శ్యోరానాతో బీబీసీ మాట్లాడింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం, భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
'సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ పలుమార్లు హెచ్చరించినా ఎన్నికలు నిర్వహించలేకపోయారు. ఈసారి వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో మన ఆటగాళ్లు భారత త్రివర్ణ పతాకం కింద ఆడలేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. ఇది వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది'' అని ఆమె బీబీసీతో అన్నారు.
“ప్రతి సమాఖ్యలో ఒక మహిళ ఉండటం అవసరం. గత కొన్ని సంవత్సరాలుగా మహిళా క్రీడాకారులు లైంగికంగా దోపిడీకి గురవుతున్న తీరును బట్టి, వివిధ స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించడం చాలా అవసరం. నేను 20 ఏళ్లు రెజ్లింగ్ చేశాను. మహిళల సమస్యలను బాగా అర్థం చేసుకోగలను'' అని చెప్పారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య నిబంధనల ప్రకారం ప్రతి నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరగాలి. అలాగే, ఒక వ్యక్తి మూడు సార్లు, లేదా 12 ఏళ్లకు మించి అధ్యక్షుడిగా ఉండకూడదు. ఈ నిబంధనతో బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు ఈసారి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు.
ప్రస్తుతం ఆయన లైంగిక వేధింపుల కేసులో బెయిల్‌పై ఉన్నారు.
''అయితే, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్‌లో సభ్యత్వం విషయంలో భారత రెజ్లింగ్ సమాఖ్య సస్పెన్షన్‌కు గురవడం ఇదే తొలిసారి. దీనికి ఆటగాళ్లు మూల్యం చెల్లించాల్సి వస్తోంది'' అని ఆదేశ్ కుమార్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చంద్రయాన్ 3 దిగిన ప్రదేశం పేరు శివశక్తి పాయింట్
- స్వలింగ వివాహానికి నేపాల్ సుప్రీంకోర్టు ఓకే చెప్పినా... చట్టబద్ధంగా రిజిస్టర్ చేయడానికి ఒప్పుకోని జిల్లా కోర్టు
- విశాఖపట్నం - అమెరికన్ కార్నర్: యూఎస్ వెళ్లాలనుకునే వారికి ఉచితంగా సేవలు
- ఫుకుషిమా రియాక్టర్: అణు వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలిన జపాన్, ఈ నీటి వల్ల చేపలు చచ్చిపోతాయా, మనుషులకు ప్రమాదమెంత?
- కుక్కలు మనుషులకు ఎలా దగ్గరయ్యాయి? ఒకప్పటి పెంపుడు జంతువులైన తోడేళ్లు ఎందుకు దూరమయ్యాయి?














