స్వలింగ వివాహానికి నేపాల్ సుప్రీంకోర్టు ఓకే చెప్పినా... చట్టబద్ధంగా రిజిస్టర్ చేయడానికి ఒప్పుకోని జిల్లా కోర్టు

ఫొటో సోర్స్, MAYA GURUNG
- రచయిత, శ్రీజన శ్రేష్ఠ, రమా పరాజూలి
- హోదా, బీబీసీ నేపాలి
మాయా గురుంగ్, సురేంద్ర పాండేలు చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.
మాయా ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ.. కానీ, ఆమె తన అధికారిక పత్రాలపై జెండర్ మార్చుకోలేదు.
ఆమె పార్టనర్ సురేంద్ర ఒక స్వలింగ సంపర్క పురుషుడు.
వారిద్దరూ అధికారికంగా వివాహం చేసుకుంటున్న తొలి నేపాలీ స్వలింగ జంట కానున్నారు.
ఇప్పుడున్న చట్టాలు మార్చేవరకు ఆగకుండా ప్రస్తుతానికి వీరి వివాహాన్ని నమోదు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వీరిద్దరి వివాహానికి మార్గమేర్పడింది.
ఈ జంట ఇంతకుముందే 2017లో ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నప్పటికీ ఇప్పుడు తమ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు పొందాలనుకుంటున్నారు.
నేపాల్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆ దేశంలో కొందరి నుంచి హర్షం వ్యక్తమవుతోంది. సేమ్ సెక్స్ జంటలకు ఊరటనిచ్చేలా ఈ ఆదేశాలు ప్రగతిశీలంగా ఉన్నాయని, ఇవి చరిత్రాత్మక ఆదేశాలు అని కీర్తిస్తున్నారు.
అయితే, ఇప్పటికీ వీరి వివాహ రిజిస్ట్రేషన్‌కు ఆటంకాలు మాత్రం పూర్తిగా తొలగలేదు.
నేపాల్ రాజధాని కఠ్మాండూలోని జిల్లా కోర్టు జులై 13న వీరి వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి అంగీకరించలేదు. సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని, కింది కోర్టులు ఆ మధ్యంతర ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని కఠ్మాండూ జిల్లా కోర్టు పేర్కొంది.
‘మేం ఎన్నో కలలు కన్నాం. అవన్నీ ఇప్పుడు చెదిరిపోయాయి’ అని మాయా గురుంగ్ ‘బీబీసీ’తో చెప్పారు. కఠ్మాండూ జిల్లా కోర్టు చెప్పింది విన్న తరువాత మేం ఈ దేశ పౌరులం కాదా అనిపించింది అన్నారామె.
పఠాన్‌లోని హైకోర్టులో ఈ జంట అప్పీల్ చేసుకుంది. కానీ, ఇప్పటికి 5 సార్లు విచారణ వాయిదాపడింది.
కఠ్మాండూ కోర్టు ఇప్పుడు వారి పెళ్లి రిజిస్ట్రేషన్‌కు నిరాకరించడం అనేది సెక్సువల్ మైనారిటీస్‌కు చట్టబద్ధమైన రక్షణలు కల్పించే దిశగా నేపాల్ దశాబ్దాలుగా సాధించిన ప్రగతికి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.
వివాహాల విషయంలో సమానత్వం సాధించడానికి ఎల్‌జీబీటీక్యూ సమాజం ఇంకా ఎన్నో పోరాటాలు చేయాల్సి ఉందని ఎల్‌జీబీటీక్యూ హక్కుల గ్రూప్ డైమండ్ సొసైటీని నడుపుతున్న పింకీ గురుంగ్ చెప్పారు.
మాకు అనుకూలంగా అనేకసార్లు వ్యవహరించింది సుప్రీంకోర్టు ఒక్కటే అని పింకీ అన్నారు.
ఎటూ తేల్చకపోవడం వల్ల దేశంలోని సెక్సువల్, జెండర్ మైనారిటీలకు అన్యాయం చేసినట్లు అవుతోందని ఎంపీ సునీల్ బాబు పంత్ అన్నారు. నేపాల్‌లో తనను తాను గే అని బహిరంగంగా ప్రకటించుకున్న తొలి ఎంపీ సునీల్ బాబు.

ఫొటో సోర్స్, MAYA GURUNG
మాయా, సురేంద్రల పెళ్లికి ఎదురవుతున్న సమస్యలను కింది కోర్టు ఆదేశాలు మరింత పెంచాయి.
ఈ జంట కోర్టును ఆశ్రయించడానికి ముందే కఠ్మాండూ నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని పాండే సొంతూరుకి వెళ్లి స్థానిక ప్రభుత్వం నుంచి సిఫారసు లేఖ తేవాల్సి వచ్చింది.
కఠ్మాండూ నుంచి ఆ గ్రామానికి ప్రయాణం నాలుగైదు గంటలే ఉంటుంది. కానీ, వర్షాలు, కొండచరియలు విరగిపడడం వల్ల వారి ప్రయాణం 12 గంటలకు పైగా సాగింది. ‘మేం నాలుగు గంటల పాటు బస్సులో చెమటతో తడిసిపోయాం’ అన్నారు గురుంగ్.
వారు ప్రయాసపడి వెళ్లి లేఖతో కఠ్మాండూ చేరుకున్నాక అధికారులు ఇంకో లేఖ కావాలని అడిగారు. వారు నివసించే ప్రాంతంలోని వార్డ్ ఆఫీసు నుంచి లేఖ తెమ్మన్నారు. ఆ తరువాత రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలన్నారు. దానిపై ఇంటి యజమనా, ఇద్దరు పొరుగువారు సంతకం చేయాలని అధికారులు చెప్పారు.
అంతేకాదు... మాయా గురుంగ్ అంతకుముందు ఒక మహిళను పెళ్లి చేసుకోవడంతో 2013లో ఆ తొలి వివాహం రద్దయినట్లు పత్రాలు కావాలన్నారు. అలాంటి పత్రం ఉంటేనే రెండో పెళ్లికి అర్హత ఉంటుంది. అయితే, దీనివల్ల తాను చాలా ఇబ్బందులుపడ్డానని మాయా గురుంగ్ చెప్పారు.
‘నేను ఏ జెండర్‌లో జన్మించానో మానసికంగా అలా లేనని చిన్నతనంలోనే గుర్తించాను. కానీ, మా నాన్న మా గ్రామానికి పెద్ద కావడంతో కుటుంబ గౌరవానికి లోటు వస్తుందేమోనన్న భయంతో ఎవరికీ చెప్పలేదు’ అన్నారు మాయా గురుంగ్.
13 ఏళ్ల వయసులో మాయా కఠ్మాండూ వచ్చేశారు. అక్కడైతే థర్డ్ జెండర్‌గా ఎలాంటి ఇబ్బంది లేకుండా బతకొచ్చనే ఉద్దేశంతో వచ్చారు.
కానీ, అక్కడికి రెండేళ్ల తరువాత కుటుంబసభ్యులు ఆమెను ఒత్తిడి చేసి వేరే మహిళతో పెళ్లిచేశారు. ఆ మహిళతో ఇద్దరు పిల్లలను కూడా కన్నారు మాయా. అయితే, పెళ్లి తనను డిప్రెషన్‌లోకి నెట్టిందని మాయా చెప్పారు. 2013లో విడాకుల కోసం దరఖాస్తు చేశారు మాయా. అప్పటి నుంచి తన పిల్లలతో కూడా టచ్‌లో లేనట్లు చెప్పారు మాయా. 2013లోనే కోర్టు ఆదేశాల తరువాత నేపాల్ ప్రభుత్వం సిటిజన్‌షిప్ సర్టిఫికేట్లలో థర్డ్ జెండర్‌లను అదే జెండర్‌తో గుర్తించడం ప్రారంభించింది.

ఫొటో సోర్స్, SHREEJANA SHRESTHA / BBC
మాయా గురుంగ్ 2015లో తొలిసారి సురేంద్ర పాండేను కలిశారు. మాయా సోదరి రెస్టారెంట్ సమీపంలోని నవాల్‌పరాసి ప్రాంతంలో వీరు తొలిసారి కలిశారు.
సురేంద్ర పాండే ఎప్పుడూ పురుషులకే ఆకర్షితుడయ్యేవారు. కానీ, మాయాను చూసిన వెంటనే తనతో ప్రేమలో పడ్డారు సురేంద్ర పాండే. తన లైంగికతను ఎలా చెప్పాలనే విషయంలో తనకు ఇప్పుడు స్పష్టత లేదని సురేంద్ర అంటున్నారు.
సురేంద్ర తల్లితండ్రులు చనిపోవడంతో ఆరేళ్ల వయసు నుంచి తన పెద్దక్క వద్దే ఆయన పెరిగారు. ఇప్పుడు మాయాతో సంబంధం ఏర్పడిన తరువాత ఆయన తన పెద్దక్కకు విషయం చెప్పేశారు.
‘మొదట మా అక్క అంగీకరించలేదు. నా గురించి, నా భవిష్యత్తు గురించి ఆమె చాలా ఆందోళన చెందింది. కానీ, నేను భిన్నమైన వ్యక్తినని క్రమంగా ఆమె గుర్తించడం ప్రారంభించారు’ అన్నారు సురేంద్ర.
రెండేళ్లు డేటింగ్ చేసిన తరువాత ఈ జంట 2017లో కఠ్మాండూలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. రెండు కుటుంబాల వారు, కొందరు మిత్రులు ఆ వేడుకకు హాజరయ్యారు.
పెళ్లి తరువాత వారిద్దరూ కలిసి జీవిస్తున్నారు. ‘మేం ఇద్దరూ ఇంటి పనంతా కలిసి చేసుకుంటాం. మాయా వండే చికెన్ కూర అంటే నాకు ఇష్టం’ అన్నారు సురేంద్ర.
తమ పెళ్లి రిజస్టర్ అవుతుందని వారు ఆశాభావంతో ఉన్నారు. అవసరమైతే మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని వారు నిర్ణయించుకున్నారు.
పెళ్లి రిజిష్టర్ అయితే తామిద్దరం ఉమ్మడిగా కొన్న ఆస్తులను యాజమాన్య హక్కులను పంచుకోవడం, జాయింట్ బ్యాంక్ అకౌంట్ తెరవడం వంటి లక్ష్యాలున్నాయని చెప్పారు.
వాటితో పాటు ఆర్థికంగా కొంత స్థిరపడిన తరువాత ఎవరైనా చిన్నారిని దత్తత తీసుకోవాలనుకుంటున్నారు.
అందరు జంటల్లాగే తాము కూడా అప్పుడప్పుడు గొడవలు పడుతుంటామని, కానీ వెంటనే కలిసిపోతామని మాయా, సురేంద్రలు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రూఢకోట: ఈ ఊరి మహిళలు గర్భం దాల్చాలంటేనే భయపడుతున్నారు
- చంద్రయాన్ 3: స్పేస్ క్రాఫ్ట్స్, శాటిలైట్లపై కనిపించే బంగారు రంగు కవరింగ్ ఏమిటి?
- మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...
- దగ్గు మందు మరణాలు: ‘ఇండియా ఔషధం అంటే ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’
- పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్కును ఎలా అంచనా వేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














