‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమా రివ్యూ: దుల్కర్ సల్మాన్ గ్యాంగ్‌స్టర్‌గా మెప్పించాడా?

ఫొటో సోర్స్, Facebook/Wayfarer Films
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ప్రతీ హీరోకీ సేఫ్ జోన్ అంటూ ఒకటి ఉంటుంది. దాన్ని దాటుకొని వచ్చినప్పుడే తమలోని నటుడ్ని కొత్తగా ఆవిష్కరించుకోవడానికి వీలు దక్కుతుంది. ఈ ప్రయత్నాన్ని ప్రతిసారీ చేస్తుంటారు దుల్కర్ సల్మాన్.
తనపై లవర్ బోయ్ ఇమేజ్ ఉంది. అయితే విభిన్నమైన కథలు, పాత్రలతో తనలోని లవర్ బోయ్‌ని దాచేయడానికి ఆయన ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా చేసిన ప్రయత్నం 'కింగ్ ఆఫ్ కొత్త'.
'ఓకే బంగారం', 'సీతారామం' సినిమాలతో చక్కటి ప్రేమికుడిగా మెప్పించిన దుల్కర్, ఇప్పుడు ఓ గ్యాంగ్‌స్టర్ అవతారం ఎత్తారు. మరి ఈసారి కూడా దుల్కర్ మెప్పించారా? కొత్తగా కనిపించారా? ఇంతకూ ఈ కింగ్ ఆఫ్ కొత్తలో కొత్తగా ఏముంది? దర్శకుడు అభిలాష్ జోషి సినిమా ఎలా తీశారు?

ఫొటో సోర్స్, Facebook/Wayfarer Films
కథాంశం ఏమిటి?
కొత్త అనే ప్రాంతం అది. దానికి ఓ చరిత్ర ఉంది. బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతాన్ని కారాగారంలా వాడేవారు. తమని ఎదిరించిన వాళ్లని అక్కడ ఊచకోత కోసేవారు. అలా ఆ ప్రాంతానికి రక్తపు మరకలు అలవాటైపోయాయి.
ఇప్పుడు కూడా కొత్తలో పాత కథే నడుస్తోంది. ఇక్కడ కన్నాభాయ్ అనే ఓ గ్యాంగ్ స్టర్ ఉన్నాడు. కొత్తకు తనే కింగ్. తనను ఏ పోలీసూ ఎదిరించలేడు.
ఈ ప్రాంతానికి షాహుల్ హుస్సేన్ అనే సీఐ కొత్తగా వస్తాడు. తను మాత్రం నిజాయతీపరుడు. కన్నాభాయ్‌కు ఎదురు తిరిగి ఘోరంగా అవమానానికి గురవుతాడు.
కన్నాని ఎదిరించేవాడు, కొత్త ప్రాంతంలోనే లేడు. అందుకే ఉత్తర ప్రదేశ్ నుంచి రాజు (దుల్కర్ సల్మాన్)ని రంగంలోకి దించుతారు. తను కూడా ఒకప్పుడు కొత్తకు కింగే. కానీ ఆ ప్రాంతాన్ని వదిలేసి, యూపీ వెళ్లిపోయాడు.
ఆరేళ్ల తరవాత రాజు మళ్లీ కొత్త ప్రాంతానికి తిరిగి వస్తాడు. వచ్చి ఏం చేశాడు? అసలు కింగ్‌లా బతికిన వాడు.. ఊరు వదిలి ఎందుకు వెళ్లిపోయాడు? కన్నాభాయ్‌కీ, రాజూకీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

ఫొటో సోర్స్, Twitter/WayfarerFilms
కథనం ఎలా ఉంది?
గ్యాంగ్ స్టర్ సినిమాలు దాదాపుగా ఒకే ఫార్మాట్‌లో సాగుతాయి. కానీ ప్రత్యేకంగా నిలబడాలంటే ఆ కథల నేపథ్యం, పాత్రల చిత్రణ, టోన్- ఇవన్నీ కొత్తగా ఉండాలి.
`కింగ్ ఆఫ్ కొత్త` కథ విషయంలో కొత్తగా ఏం లేకపోవొచ్చు. కానీ.. ఆ టోన్ మాత్రం కాస్త కొత్తగా కనిపిస్తుంది. కన్నా భాయ్ అరాచకం చూపిస్తూ కథలోకి ప్రేక్షకుడ్ని తీసుకెళ్లాడు దర్శకుడు.
సీఐ షాహుల్ కొత్త అనే ప్రాంతానికి రావడం, కన్నాను ఎదిరించాలనే ప్రయత్నంలో భంగపడడం, కన్నాను కట్టడి చేయాలంటే రాజు (దుల్కర్) వల్లే సాధ్యం అని తెలుసుకోవడం.. ఆ తరవాత రాజు ఎంట్రీ ఇవ్వడం.. జరిగిపోతాయి.
కథలోకి హీరో పాత్రని ప్రవేశ పెట్టడానికి దాదాపు 25 నిమిషాల సమయం తీసుకొన్నాడు దర్శకుడు. ఈ సెటప్ అంతా చూస్తే.. కచ్చితంగా ఈ సినిమాతో దర్శకుడు ఓ కొత్త గ్యాంగ్ స్టర్ కథ చూపిస్తున్నాడన్న నమ్మకం ప్రేక్షకుడికి కలుగుతుంది.
దుల్కర్ ఎంట్రీ, తన హీరోయిజం.. ఇవన్నీ కూడా ఆసక్తిని కలిగిస్తాయి. అయితే... ఈ నమ్మకం సడలిపోవడానికి ఎంతో సమయం పట్టదు.
రాజూభాయ్ ఎంట్రీ తరవాత సన్నివేశాలన్నీ సాదా సీదాగా సాగిపోతాయి. రాజు -కన్నా మధ్య ఫ్రెండ్ షిప్. రాజు - తారల మధ్య లవ్ ట్రాక్- వీటిలో ఏమాత్రం కొత్తదనం కనిపించదు.
ఓ గ్యాంగ్ స్టర్ పక్కనే ఉంటూ, స్నేహంగా మసులుతూ ఆ గ్యాంగ్ స్టర్‌నే వెన్నుపోటు పొడవాలని చూసే కన్నాలాంటి పాత్రలు గ్యాంగ్ స్టర్ కథలకు కొత్తేం కాదు. అదే ప్యాట్రన్‌లో ఈ కథ కూడా సాగిపోవడం ఆసక్తిని రేకెత్తించదు.
రాజు - తార (ఐశ్వర్య లక్ష్మి) లవ్ ట్రాక్ కూడా అత్యంత సాదాసీదాగా నడుస్తుంది. వీరిద్దరూ ప్రేమించుకొన్నారా, లేదా? తార మనసులో ఏముంది? అనేవి చిక్కుముడులుగానే ఉంటాయి.

ఫొటో సోర్స్, Twitter/dulQuer
ఇది ఫ్రెండ్‌షిప్ స్టోరీనా?
ఈ సినిమాలో హీరో గ్యాంగ్ స్టరే కానీ, మంచోడు. ఇదీ రొటీనే. చాలా సినిమాల్లో ఇలాగే చూపిస్తుంటారు.
హీరోకు ఓ కుటుంబం ఉంటుంది. తండ్రి కూడా రౌడీనే. తనని చూసే రాజు కూడా రౌడీలా మారాలనుకొంటాడు. గ్యాంగ్ స్టర్ అయిపోతాడు.
తండ్రి మాత్రం తన చివరి రోజుల్లో ఓ టైలర్‌గా జీవితాన్ని గడుపుతుంటాడు. ఎంత గ్యాంగ్ స్టర్ అయినా, ఒంట్లో శక్తి పోయినప్పుడు సాధారణ, సగటు జీవిగానే మిగిలిపోతాడన్నది దర్శకుడి తాలుకూ మెటాఫర్ కావొచ్చు.
దాన్నయినా స్పష్టంగా చెప్పగలిగితే, ఇలాంటి కథల్ని ఎంచుకోవడంలో దర్శకుడికి ఓ సామాజిక బాధ్యత కూడా ఉందన్న సంతృప్తి కలిగేది.
కథానాయకుడికీ, తన కుటుంబానికీ మధ్య ఓ అగాథం ఉంటుంది. తండ్రి మాట్లాడడు. తల్లి కూడా అంతే. దానికి కారణాలు కూడా స్పష్టంగా చెప్పలేకపోయాడు దర్శకుడు.
అన్ని బంధాల్లో కంటే స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చాడు హీరో.
కన్నాతో ఎన్ని గొడవలు ఉన్నా, కన్నా ఎంత ద్రోహం చేసినా హీరో క్షమించేస్తూ ఉంటాడు. ఆ కోణంలో చూస్తే ఇదో ఫ్రెండ్‌షిప్ స్టోరీ అనుకోవాలి. కానీ ఆ ఫ్రెండ్‌షిప్ కూడా వన్ వేలోనే సాగుతుంది.
కన్నా ఏం చేశాడని, రాజు తన స్నేహానికి అంత ప్రాధాన్యం ఇస్తున్నాడన్న విషయం అర్థం కాదు. రాజు ఊరు వదిలి వెళ్లిపోవడం సినిమాటిక్‌గానే ఉంటుంది తప్ప, సహజంగా కనిపించదు.
దుల్కర్ సల్మాన్‌కు అన్ని ఎలివేషన్లా?
కొత్త ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయిన రాజు.. తిరిగి వస్తే ఎలా ఉంటుందన్నది సెకండాఫ్. తిరిగొచ్చాక.. శత్రు సంహారం చేయడం, పాత్రల తాలుకూ నిజ స్వరూపం బయటపెట్టడం తప్ప ఏం జరగలేదు.
తొలి సగంలో దర్శకుడు హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు. ద్వితీయార్ధంలో రక్తపాతం, హింస ఎక్కువయ్యాయి.
కథను ముగించడానికి దర్శకుడి ముందుకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ శుభం కార్డు పడలేదు. ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో మిగిలి ఉంది అనే ఆత్రుతతో సన్నివేశాల్ని పెంచుకొంటూ పోయాడు. ఎప్పుడో అయిపోయిన సినిమాను కావాలని దర్శకుడు సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది.
ఈ మధ్య దర్శకులకూ, హీరోలకూ ఎలివేషన్లంటే మమకారం పెరిగిపోయింది. హీరోను పరిచయం చేసినప్పుడు ఓ ఎలివేషన్ ఇస్తే సరిపోతుంది. కానీ ప్రతీ సన్నివేశాన్నీ ఓ ఇంట్రడక్షన్‌లానే తీర్చిదిద్దడం ఫ్యాషన్ అయిపోయింది.
కమర్షియల్ మాస్ హీరోలకు ఇలాంటి ఎలివేషన్లు బాగుంటాయి. కానీ.. లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న దుల్కర్‌కు ఇంతటి ఎలివేషన్, అందులోనూ ప్రతీసారీ అవసరమా అని అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, facebook/wayfarer films
ఐశ్వర్య లక్ష్మి పాత్ర ఎలా ఉంది?
గ్యాంగ్ స్టర్ కథలంటే మన హీరోలకు ఎక్కువ. ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా, మరో ప్రయత్నం చేస్తుంటారు. స్టైలిష్ యాక్షన్‌కు ఇలాంటి కథల్లో స్కోప్ ఎక్కువ దొరుకుతుంది.
దుల్కర్ కూడా అదే ఉద్దేశంతో ఈ కథను ఎంచుకొని ఉంటాడు. ఇలాంటి పాత్రల్లో దుల్కర్‌ని చూడటం కొత్తే. రఫ్, మాస్, రగ్డ్ లుక్‌లో దుల్కర్‌ను చూడడం ఇదే తొలిసారి.
ఓ నటుడిగా తన పాత్రకు ఎంత చేయాలో అంతా చేసేశారు దుల్కర్. తనలోని రొమాన్స్‌నీ, అల్లరిని చూసే అవకాశం మాత్రం ఈ పాత్ర ఇవ్వలేదు. ఈ విషయంలో దుల్కర్ అభిమానులు కాస్త నిరుత్సాహపడొచ్చు.
ఐశ్వర్య లక్ష్మిని ఈ సినిమాలో హీరోయిన్ అనలేం. ఆమె ఓ పాత్ర చేసిందంతే! రాజు ఫ్లాష్ బ్యాక్‌లో ఆ పాత్ర ఓ ఎపిసోడ్ అంతే. ఐశ్వర్య కనిపించింది కొద్దిసేపే. కానీ ఆ పాత్ర ఎందుకో గందరగోళానికి గురవుతుంటుంది.
కన్నా పాత్రలో కనిపించిన షబ్బీర్ చక్కటి నటన ప్రదర్శించాడు. ఆ పాత్రలో భిన్న కోణాలు ఉన్నాయి. జింబన్ వినోద్ కూడా ఓ డానే. కానీ తన ఇంగ్లిష్ డైలాగ్ డెలివరీ ఉన్నంతలో కాస్త ఫన్ పండిస్తుంది.
లేడీ విలన్‌గా మంజు (న్యాల ఉష) నటనలో, ఎక్స్‌ప్రెషన్స్‌లో సీరియస్‌నెస్ కనిపించింది. `నరసింహా`లో నీలాంబరికి కొత్త వర్షన్ అనుకోవొచ్చు.

ఫొటో సోర్స్, Facebook/Wayfarer Films
‘కొత్త’ ఆడియన్స్‌కు కొత్త కాదు
ఇది రొటీన్ గ్యాంగ్ స్టర్ కథే అయినా, కాస్తో కూస్తో కొత్తగా అనిపించడానికి కారణం- ఈ సినిమాను 'కొత్త' అనే బ్యాక్ డ్రాప్‌లో చెప్పడమే. 1980 ప్రాంతంలో జరిగే కథ ఇది. అప్పటి వాతావరణాన్ని సెట్స్ ద్వారా పునః సృష్టించారు. ఆ కలరింగ్ వింటేజ్ లుక్‌ను తీసుకొచ్చింది.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే అనిపిస్తుంది. పాటలకు స్కోప్ లేదు. ఒకట్రెండు పాటలున్నా పెద్దగా రిజిస్టర్ కావు. కొన్ని సంభాషణలు బాగున్నాయి.
''రక్తంతో తడిచిన కత్తిని పన్నీరుతో కడిగితే.. పువ్వులా మారింది'', ''పలకరించడానికి పిల్లులు, కుక్కలూ ఉన్నాయి కాబట్టే చాలా ఇళ్లల్లో ముసలివాళ్లు ఇంకా బతికే ఉన్నారు'' లాంటి డైలాగుల్లో డెప్త్ కనిపించింది.
దుల్కర్ స్వయంగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా ఇది. తన సినిమానే కాబట్టి, వీలైనంత వరకూ లావిష్‌గా తీసే ప్రయత్నం చేశారు.
దర్శకుడు అభిలాష్ జోషి ఓ గ్యాంగ్ స్టర్ కథ చెప్పాలనుకొన్నారు. సెటప్ వరకూ కొత్తగా ఆలోచించారు. కానీ పాత కథే చెప్పారు. అది కూడా ఆసక్తి కలిగించని పాత స్టైల్‌లో.
'కింగ్ ఆఫ్ కొత్త'లో కొత్తగా ఏముంది? అని అడిగితే.. ఇలాంటి సినిమా దుల్కర్‌కు కొత్త అని చెప్పొచ్చు. కానీ ఆడియన్స్‌కు మాత్రం కాదు.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ: కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మహిళలకు ఏడే సీట్లు.. విమర్శలపై కవిత ఏం చెబుతారు?
- చంద్రయాన్ 3: స్పేస్ క్రాఫ్ట్స్, శాటిలైట్లపై కనిపించే బంగారు రంగు కవరింగ్ ఏమిటి?
- మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...
- దగ్గు మందు మరణాలు: ‘ఇండియా ఔషధం అంటే ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’
- పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్కును ఎలా అంచనా వేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














