తెలంగాణ: కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మహిళలకు ఏడే సీట్లు.. విమర్శలపై కవిత ఏం చెబుతారు?

కేసీఆర్, కవిత

ఫొటో సోర్స్, BRS

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తరువాత 2014-2018 మధ్య పనిచేసిన మొట్టమొదటి మంత్రివర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా తన మంత్రి మండలిలో ఒక్కరంటే ఒక్క మహిళను కూడా చేర్చుకోలేదు.

ఎంత ఇష్టం లేని వారైనా కనీసం మహిళా సంక్షేమ శాఖ అయినా మహిళకు ఇవ్వడం భారతదేశంలోని చాలా రాష్ట్రాలతోపాటు గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనిపించేది.

కానీ, ఆ దఫా కేసీఆర్ కేబినెట్లో ఆడవాళ్లే లేకపోవడంతో, ఆడవారికి ఒక్క మంత్రి పదవి అయినా ఇప్పించండి అంటూ ఒక వ్యక్తి హైకోర్టుకు వెళ్లారు.

బహుశా ఈ దశాబ్దంలో భారతదేశంలోని ఏ పెద్ద రాష్ట్రమూ చేయనట్టుగా ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. కేవలం మంత్రి పదవులే కాదు, టికెట్ల పంపిణీలోనూ బీఆర్ఎస్ మహిళల విషయంలో ఆ ధోరణి కొనసాగిస్తోంది.

కేసీఆర్

ఫొటో సోర్స్, BRS

తాజా జాబితాలో ఏం చేశారు?

తాజాగా ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో కేవలం ఏడుగురు మహిళలకే టికెట్లు ఇవ్వడంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి.

పైగా స్వయంగా కేసీఆర్ కుమార్తె గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దిల్లీ స్థాయిలో ఆందోళన చేయడంతో, ఆవిడను టార్గెట్ చేస్తూ విమర్శలు పెరిగాయి.

టీఆర్ఎస్ పెట్టిన తరువాత నుంచి జరిగిన సార్వత్రిక ఎన్నికలు అంటే, 2004 నుంచీ, 2018 వరకూ జరిగిన ఎన్నికల్లో తెలగాణ ప్రాంత లెక్క తీసుకుంటే, అతి తక్కువ సీట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీయే.

ఈ నాలుగు ఎన్నికల్లో కలిపి మహిళలకు అత్యధికంగా కాంగ్రెస్ 38 సీట్లు, టీడీపీ 35 సీట్లు, బీజేపీ 32 సీట్లు ఇవ్వగా టీఆర్ఎస్ మాత్రం కేవలం 16 సీట్లే ఇచ్చింది. అసలు 2009 ఎన్నికల్లో అయితే ఒక్క స్త్రీకి కూడా సీటు ఇవ్వలేదు కేసీఆర్.

మహిళా రిజర్వేషన్ బిల్లు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఇదే తొలిసారి కాదు

తాజా జాబితాలో బీఆర్ఎస్ పార్టీ 115 స్థానాలకు గానూ 7 స్థానాల్లో మహిళలకు సీట్లు ఇచ్చింది. కేసీఆర్ మహిళలకు తక్కువ సీట్లు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు.

2018లో కూడా ఒకేసారి 107 పేర్లతో కేసీఆర్ జాబితా ప్రకటించగా, అందులో కేవలం 4 సీట్లు మాత్రమే మహిళలకు ఇచ్చారు. గొంగిడి సునీత, పద్మా దేవేంద్ర రెడ్డి, కోవా లక్ష్మి, రేఖా నాయక్‌లు మాత్రమే అప్పట్లో టికెట్లు సంపాదించారు.

2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్.. "జాతి నిర్మాణంలో భాగంగా అన్నిరంగాల్లో మహిళా శక్తిని ఉపయోగించుకోకుండా ఏ దేశం బాగుపడదు" అని పేర్కొన్నారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో మాత్రమే టీఆర్ఎస్ అత్యధికంగా 10 సీట్లు మహిళలకు ఇచ్చింది. అదే ఆ పార్టీ ఆల్ టైమ్ రికార్డు. అందులో ఆరుగురు గెలిచారు. వారిలో పద్మా దేవేంద్ర రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు.

కేసీఆర్

ఫొటో సోర్స్, BRS

ఆ తర్వాత అసలు లేదు..

ఎక్కువ సీట్లు ఇచ్చాం అనుకున్నారో, డిప్యూటీ స్పీకర్ చాలనుకున్నారో ఇక ఆ తరువాత ఏర్పడిన కేబినెట్లో ఆయన మహిళలు ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు.

దార శ్రీశైలం అనే వ్యక్తి 2018 ఆగస్టులో మహిళలకు కేబినెట్‌లో స్థానం ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే మంత్రివర్గంలో పదవులు ఇవ్వడం పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టం కాబట్టి, హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది.

రెండవసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత 2018లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాత్రమే ప్రమాణం చేశారు. తరువాత విస్తరణలో 10 మందికి అవకాశం ఇచ్చినా అందులోనూ ఒక్క మహిళ కూడా లేరు.

కేబినెట్లో ఎందుకు మహిళలు లేరో, వారికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నారనే విషయమై టీఆర్ఎస్ నాయకులు ఎన్నడూ సమాధానం చెప్పలేదు.

సబిత ఇంద్రారెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/KALVAKUNTLACHANDRASHEKARRAO

ఫొటో క్యాప్షన్, సబిత ఇంద్రారెడ్డి

2019లో సబిత, సత్యవతి

తిరిగి 2019 సెప్టెంబరులో జరిగిన విస్తరణలో మాత్రం సబిత, సత్యవతిలకు స్థానం కల్పించారు. తమ సొంత పార్టీ నుంచి గెలిచిన ఏ మహిళా ఎమ్మెల్యేకూ మంత్రి పదవి ఇవ్వని కేసీఆర్, కాంగ్రెస్ నుంచి చేరిన సబితకూ, ఎమ్మెల్సీ సత్యవతికి అవకాశం కల్పించారు. అలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత మొట్ట మొదటి మహిళా మంత్రులుగా సబిత, సత్యవతి నిలిచారు.

2004 ఎన్నికల్లో కేవలం ఇద్దరికే సీట్లు ఇచ్చింది టీఆర్ఎస్. రామాయంపేట నుంచి పద్మా దేవేంద్ర రెడ్డి, పరకాల నుంచి బండారి శారారాణి మాత్రమే పోటీ చేశారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ 18, కాంగ్రెస్ 5, బీజేపీ 2 సీట్లిచ్చాయి. 2009 ఎన్నికల్లో ఒక్క మహిళలకూ టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు.

పద్మా దేవంద్ర రెడ్డి సైతం మెదక్ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వకపోవడంతో రెబెల్‌గా పోటీ చేస్తే పార్టీ సస్పెండ్ చేసింది. ఎన్నికల్లో ఓటమి తరువాత మళ్లీ ఆమె టీఆర్ఎస్‌లో చేరారు.

ఆ ఎన్నికల్లో 7 సీట్లు టీడీపీ మహిళలకు ఇవ్వగా, కాంగ్రెస్ 13, బీజేపీ 10 సీట్లు ఇచ్చింది. 2014లో 10 మందికి సీట్లు ఇచ్చారు కేసీఆర్. ఆ ఎన్నికల్లో బీజేపీ మహిళకు 5, కాంగ్రెస్ 9, టీడీపీ 9, వైయస్సార్సీపీ

ఆరుగురుకు సీట్లు ఇచ్చింది. 2018లో బీజేపీ 15 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా, కాంగ్రెస్ 11 సీట్లు, టీడీపీ 1 సీటు ఇచ్చాయి.

షర్మిల

ఫొటో సోర్స్, YS SHARMILA REDDY/FB

ఫొటో క్యాప్షన్, షర్మిల

‘బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ…’

అయితే మహిళల టికెట్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కంటే ఆయన కుమార్తె కవిత ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ఆవిడ మహిళా రిజర్వేషన్ కోసం ఆందోళన చేయడమే.

అసెంబ్లీ, పార్లమెంటుల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వు చేయాలని కోరే బిల్లు కోసం ఆమె దిల్లీలో ఆందోళన చేపట్టారు. అప్పట్లో కేసీఆర్ మహిళలకు టికెట్లు ఇవ్వకపోవడం గురించి ప్రశ్నించగా, ‘‘తమ సొంత పార్టీ సహా, అన్ని పార్టీల్లోనూ మార్పు రావాలని’’ ఆమె సమాధానం చెప్పారు.

తాజా టికెట్ల వ్యవహారంతో ప్రతిపక్షాలన్నీ కవితను టార్గెట్ చేశాయి. ‘‘దిల్లీలో దొంగ దీక్షలు కాదు, రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలి. బీ ద చేంజ్ యూ వాంట్ టూ (నువ్వేం మార్చాలనుకుంటున్నావో, ముందు నువ్వు అలా మారు)’’ అని ట్విట్టర్లో విమర్శించారు షర్మిళ.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

‘‘బంగారు కుటుంబ సభ్యులు దిల్లీలో దొంగ దీక్షలు చేస్తారంటూ’’ కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి.

కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో విమర్శలు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

కల్వకుంట్ల కవిత

ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK

‘మీరెన్ని ఇస్తారో మేమూ చూస్తాం..’

ఈ విమర్శలపై కవిత స్పందించారు. ‘‘బీఆర్ఎస్ పార్టీ మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. అప్పట్లో బలం ఉన్న కాంగ్రెస్, ప్రస్తుతం బలం ఉన్న బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు పాస్ చేయించడం లేదో చెప్పాలి? కాంగ్రెస్ వాళ్లు ఓడిపోయే ఉత్తర ప్రదేశ్ లో 33 శాతం సీట్లు ఇచ్చారు తప్ప, కర్ణాటకలో కేవలం 15 సీట్లే ఇస్తే, అందులో ముగ్గురే గెలవగా, ఒకరే మహిళా మంత్రి ఉన్నారు. ఇక బీజేపీ మహిళా రిజర్వేషన్ విషయంలో రెండుసార్లు మోసం చేసింది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం ఉన్నది కాబట్టే దేశంలో 14 లక్షల మంది మహిళలు స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చట్టసభల్లోనూ రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురానిదే పరిస్థితులు మార్పు సాధ్యం కాదు. అసలు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు మహిళలకు ఎన్ని టికెట్లు కేటాయిస్తాయో చూద్దాం’’ అంటూ వ్యాఖ్యానించారు కవిత.

బీఆర్ఎస్ పార్టీ టికెట్ల పంపిణీపై వారు వెళ్లగక్కుతున్న అక్కసును తాము అర్థం చేసుకుంటున్నామని, టికెట్లు రాని అభ్యర్థులను లాక్కోవడానికి వారు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజకీయ అభద్రతభావాన్ని మహిళ ప్రాతినిధ్యానికి ముడి పెట్టవద్దని హితవు పలికారు.

పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచి మూడో వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకుందో చెప్పాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు కవిత.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

వీడియో క్యాప్షన్, ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?

‘‘33 శాతంలో సగం కూడా ఇవ్వలేదు’’

‘‘మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలని అందరూ కోరితే అందులో సగం కూడా కాదు కదా.. కేవలం 6 శాతం మాత్రమే ఇచ్చారు. వాటిలో కూడా రిజర్వుడు స్థానాలు మినహాయిస్తే ముగ్గురు రెడ్లు ఉన్నారు, బీసీలు లేరు. ఇది ఒక రకంగా తెలంగాణ సమాజాన్ని ప్రతిబింబిస్తోంది. తెలంగాణ అధికార యంత్రాంగంలో మహిళల సంఖ్య బావుంది కానీ, రాజకీయంగా లేదు. తెలంగాణ తేవడంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైనది. మిలియన్ మార్చ్ సహా ఏ పోరాటం, ఆందోళన చూసినా మహిళలు కీలకపాత్ర పోషించారు. కానీ వారికి పాలనలో భాగస్వామ్యం ఇచ్చే సమయంలో మాత్రం కేసీఆర్ తన ఫ్యూడల్ పద్ధతి బాగా చూపిస్తున్నారు’’ అని బీబీసీతో అన్నారు మహిళా, ట్రాన్స్ జెండర్ హక్కుల నాయకురాలు కె సజయ.

‘‘మొత్తంగా తెలంగాణ సమాజంలో వేర్వేరు వర్గాల ఆకాంక్షలు పెరగడంతో, మహిళల ఆకాంక్షలను ప్రత్యేకంగా ఎవరూ గుర్తించడం లేదు. పాలనలో మహిళల భాగస్వామ్యం లేకపోవడంతో అది అన్ని రంగాలపై కూడా పరోక్షంగా పడుతోంది. దీనివల్ల మహిళలపై దాడులు, హింస పెరుగుతున్నాయి. మహిళలపై దాడుల కేసులను జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఈ విషయం బయట పడుతుంది. మేల్ సుప్రిమసీ పెరగడానికి కారణం అవుతోంది. ఆ ప్రభావం సామాజికంగా కనిపిస్తోంది’’ అని ఆమె అన్నారు.

సజయ ప్రస్తుతం మహిళా ట్రాన్స్ జెండర్ సంఘా జేఏసీ సభ్యురాలిగా ఉన్నారు. ఆ జేఏసీ, ప్రతీ తెలంగాణ ఎన్నిక సందర్భంగానూ, ప్రత్యేకంగా మహిళా, ట్రాన్స్ హక్కుల మానిఫెస్టో విడుదల చేస్తోంది.

‘‘మహిళల భద్రత, షీ టీములు, కేసీఆర్ కిట్ ఇలాంటివన్నీ చెబుతున్నారు కానీ అవి రాజకీయ భాగస్వామ్యానికి ప్రత్యామ్నాయం కాదు. పైగా ఆ పథకాలన్నీ ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో అంతర్జాతీయ సంస్థల సూచనలతో నడుస్తూనే ఉంటాయి. అన్ని ప్రభుత్వాలూ ఆ పనిచేస్తాయి. కానీ పాలనలో మాత్రం 6 శాతమే ఎక్కువనే ధోరణి కనిపిస్తోంది. ఆయన ఎవర్నీ మాట్లాడనివ్వకపోవడం వంటి ఫ్యూడల్ ధోరణి ఇందులో ఉంది’’ అని అన్నారామె.

‘‘కేసీఆర్ కుమార్తెగా కాకుండా, కవితను ఒక రాజకీయ నాయకురాలిగా మాత్రమే చూసినప్పటికీ, ఆమె దిల్లీలో చేసిన ఆందోళన కోసం అదే స్థాయిలో తన పార్టీలో సంస్కరణలకు ఆమె ఏమాత్రం ప్రయత్నించలేదు. కనీసం ఆ దిశగా పెదవి విప్పలేదు కాబట్టే ఇప్పుడు మిగిలిన పార్టీలు ఆమెను లక్ష్యంగా విమర్శలు చేస్తున్నాయి. తాను కొత్త అంశంపై పోరాటం లేవనెత్తినప్పుడు, తాను స్వయంగా సభ్యురాలిగా ఉన్న పార్టీ వైఖరే ముందు ప్రస్తావనకు వస్తుంది. కవిత విషయంలో అదే జరిగింది’’ అని అన్నారు సజయ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)