చంద్రుడి మీద నుంచి చూస్తే భూమి కనిపిస్తుందా? జాబిలి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు...

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, Getty Images

చందమామ గురించి అనేక పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. వందల సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు, మేధావులు చంద్రుడి గురించి అనేక కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

అనేక దేశాలు చంద్రుడి మీదకు మానవ రహిత, మానవ సహిత వ్యోమనౌకలను పంపి పరిశోధనలు సాగిస్తున్నాయి.

భారత్ కూడా చంద్రయాన్-3 ద్వారా చంద్రుని అన్వేషణలో పడింది. అయిేతే, చంద్రుడి మీద ఇన్ని పరిశోధనలు జరిగినా, చంద్రుడి గురించి తెలియని కొన్ని కీలక విషయాలు ఉన్నాయి. అందులో కీలకమైన పది అంశాలు మీకోసం....

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, Getty Images

1- చంద్రుడు గుండ్రంగా లేడు

ఎవరిదైనా ముఖం గుండ్రంగా ఉంటే దాన్ని వర్ణించడానికి చంద్రుడితో పోలుస్తాం. మనకు కనిపించే ఫొటోలలో, బొమ్మల్లో కూడా చంద్రుడు గుండ్రంగా ఉన్నట్లే కనిపిస్తాడు. నిండు పౌర్ణమి రోజున చంద్రుడిని చూసినప్పుడు కొలతలు వేసి గీసినట్లు గుండ్రంగా కనిపిస్తాడు. కానీ, నిజానికి ఒక ఉపగ్రహమైన చంద్రుడు బంతిలాగా గుండ్రంగా ఉండడు.

చంద్రుడి ఆకారం ఓవల్ షేప్ అంటే గుడ్డు లేదంటే బాదంపండు ఆకారం. ఈ ఆకారం కావడం వల్ల భూమి మీద నుంచి చంద్రుడిని పూర్తిగా చూడలేము.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, Getty Images

2- చంద్రుడిని పూర్తిగా చూడలేం

మనం ఎప్పుడు చూసినా చంద్రుడిలో గరిష్టంగా 59% ప్రాంతాన్ని మాత్రమే చూడగలం. మిగతా 41% చంద్రుడు మనకు కనిపించడు.

మనం చంద్రుడి మీదకు వెళ్లి ఆ 41% ప్రాంతంలో ఉండి చూస్తే, మనకు భూమి కనిపించదు.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, NASA

3- 'బ్లూ మూన్'కు అగ్నిపర్వతాల పేలుళ్లకు లింక్

చంద్రుడు అప్పుడప్పుడు నీలి రంగులో కనిపిస్తాడు. దాన్ని బ్లూ మూన్‌ అని అంటుంటారు. వాస్తవానికి చంద్రుడి రంగులో మార్పు ఏమీ ఉండదు.

కొన్ని వాతావరణ పరిస్థితులు కారణంగా చంద్రుడు మనకు కళ్లకు నీలి రంగులో కనిపిస్తాడు. అయితే, ఈ పేరు ఎలా వాడకంలోకి వచ్చింది?

1883లో ఇండోనేషియాలోని క్రాకటోవా ద్వీపంలో అగ్నిపర్వతం పేలినప్పుడు భారీ ఎత్తున ధూళి మేఘాలు ఏర్పడ్డాయి. ఈ మేఘాల కారణంగా ఆకాశంలో మొత్తం రంగు మారినట్లుగా కనిపించడమే కాకుండా, చంద్రుడు నీలిరంగులోకి మారినట్లు కనిపించాడు. అప్పటి నుంచి బ్లూ మూన్ అనే పేరు స్థిరపడింది. చంద్రుడు నీలిరంగులో కనిపించడాన్ని బ్లూమూన్ అనడం ప్రారంభించారు.

క్రాకటోవా ద్వీపంలో జరిగిన పేలుడు భూమి మీద జరిగిన అతి పెద్ద అగ్నిపర్వతం పేలుడుగా చెబుతారు. కొన్ని రిపోర్టుల ప్రకారం ఈ పేలుడు శబ్దం ఇటు మారిషస్ నుంచి అటు పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ వరకు వినిపించిందని చెబుతారు.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, Getty Images

4-చంద్రుడిపై సీక్రెట్ ప్రాజెక్ట్

చంద్రుడి మీదకు మానవ సహిత వ్యోమనౌకలను పంపించడం 1960 తర్వాతనే సాధ్యమైంది. అయితే అంతకు ముందే, చంద్రుడి మీద అణుబాంబును పేల్చాలని అమెరికా ఒక సీక్రెట్ ప్రాజెక్టును నడిపింది.

అప్పటికే అమెరికా, రష్యాలు స్పేస్ రేస్‌లో ఉండగా, తన అధిపత్యాన్ని చాటుకోవడానికి అమెరికా చంద్రుడి మీద అణుబాంబు పేల్చి, దానిని భూమి మీద మనషులకు కనిపించేలా చేయాలని ప్లాన్ చేసింది.

ఈ సీక్రెట్ ప్రాజెక్ట్ పేరు 'ఎ స్టడీ ఆఫ్ లూనార్ రీసెర్చ్ ఫ్లైట్స్' లేదా ప్రాజెక్ట్ 'ఎ119'.

తన ప్రయోగం ఖగోళ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడం అమెరికా ప్రధాన ఉద్దేశంగా చెబుతారు.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, Getty Images

5-చంద్రుడిపై గుంటలు ఎలా ఏర్పడ్డాయి

చందమామ ఉపరితలంలపై అక్కడక్కడా గుంటలు ఉన్నట్లు చంద్రుడిని దగ్గరగా తీసిన ఫొటోలలో కనిపిస్తాయి. వీటిని క్రేటర్స్ అంటారు.

ఇవి సుమారు నాలుగు బిలియన్ సంవత్సరాల కిందట, కొన్ని ఖగోళ వస్తువులు చంద్రుడిని ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే, చంద్రుడి మీద పెద్ద కప్ప ఉందని, ఆ కప్ప ఈ గుంటలపై కూర్చుంటుందని నమ్ముతారు.

అంతేకాక, సూర్యగ్రహణం రోజున ఒక డ్రాగన్ సూర్యుడిని మింగేస్తుందని కూడా చైనీయులు నమ్ముతారు. అందుకే వారు సూర్యగ్రహణం రోజున పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ ఆ డ్రాగన్‌ను తరిమికొడుతున్నామని భావిస్తారు.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, Getty Images

6- భూభ్రమణ వేగాన్ని తగ్గిస్తున్న చంద్రుడు

చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు, దానిని పెరిజీ అంటారు. ఈ సమయంలో సముద్రాలలలో అలల స్థాయి బాగా పెరుగుతుంది.

దీనివల్ల భూమి భ్రమణ శక్తిలో మార్పు వస్తుంది. భూమి తిరిగే వేగం తగ్గుతుంది. ప్రతి వంద సంవత్సరాలకు 1.5 మిల్లీసెకన్లుపాటు దీని వేగం మందగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, Getty Images

7- చంద్రకాంతి

భూమి మీదకు వచ్చే సూర్యకాంతి పూర్ణ చంద్రుడి కాంతి కన్నా 14 రెట్లు ప్రకాశవంతంగా ఉంటుంది. మనం సూర్యకాంతికి సమానమైన కాంతిని చంద్రుడి నుంచి పొందాలంటే ఇప్పుడున్న చంద్రుడిలాంటి చంద్రుళ్లు 398,110 మంది అవసరమవుతుంది.

చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు భూమి నీడ చంద్రుడి మీద పడుతుంది. అప్పుడు చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రత 260 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు తగ్గిపోతుంది. చంద్రగ్రహణం సాధారణంగా 90 నిమిషాల లోపు ఉంటుంది.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, Getty Images

8-లియోనార్డో దావించీ ఏం కనుగొన్నారు.

కొన్నిసార్లు చంద్రుడు ఉంగరంలా కనిపిస్తాడు. మనం దానిని అర్ధచంద్రాకారం లేదా బాలచంద్రుడు అని కూడా అంటుంటాం. చూడటానికి సూర్యుడు చంద్రుని మీద ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తాడ. ఈ సమయంలో చంద్రుడిలో కొంత భాగం మాత్రమే ప్రకాశవంతంగా ఉంటుంది.

దీనిని బట్టి చంద్రుడు కుచించుకుపోతాడని కొందరు నమ్ముతుండగా అది నిజం కాదని లియోనార్డో దావించీ చెప్పారు. భూమి మీద పడిన సూర్యుడి కిరణాలు రిఫ్లెక్ట్ అయ్యి, చంద్రుడిలో కొంత భాగం మీద పడటం వల్ల ఇలా కొంత భాగం ప్రకాశవంతంగా కనిపిస్తుందని ఆయన మొదటిసారి వెల్లడించారు.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, Getty Images

9-చంద్రునిపై క్రేటర్లకు పేర్లు ఎవరు నిర్ణయిస్తారు

ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ చంద్రుని మీద క్రేటర్స్ (బిలాలు)కు మాత్రమే కాకుండా, ఇతర ఖగోళ వస్తువులకు కూడా పేర్లు పెడుతుంది.

చంద్రుని మీద ఉన్న క్రేటర్స్‌కు ప్రసిద్ధ శాస్త్రవేత్తలు, కళాకారులు, అన్వేషకుల పేర్లు పెట్టారు.

అపోలో క్రేటర్, మేయర్ మోస్కోవిన్స్ (మాస్కో సముద్రం) సమీపంలోని క్రేటర్లకు అమెరికన్, రష్యన్ వ్యోమగాముల పేరు పెట్టారు.

మేయర్ మోస్కోవిన్స్ అనేది చంద్రుడి మీద కనిపించే సముద్ర ప్రాంతం.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, Getty Images

10-చంద్రుని దక్షిణ ధ్రువంలో రహస్యాలు

చంద్రయాన్-3 చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం చాలామందికి తెలియని, ఒక రహస్య ప్రాంతంగా పరిగణిస్తారు.

నాసా చెప్పిన దాని ప్రకారం ఈ ప్రాంతంలో చాలా లోతైన గుంటలు, పర్వతాలు ఉన్నాయి, బిలియన్ల సంవత్సరాలుగా ఇక్కడ సూర్యకాంతి పడలేదు.

వీడియో క్యాప్షన్, Chandrayaan 3 : చంద్రయాన్ 2 ఎందుకు విఫలమైంది? చంద్రయాన్ 3లో టెక్నాలజీని ఎలా మార్చారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)