కార్గిల్: డీజిల్ లేకుండా గాలితో నడిచే భారీ నౌక

ఫొటో సోర్స్, CARGILL
- రచయిత, టామ్ సింగిల్టన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెరచాప తరహా దృఢమైన పరికరాల సాయంతో గాలిని ఉపయోగించుకుంటూ నడిచే ఓడ ఒకటి తన సముద్ర ప్రయాణానికి సిద్ధమైంది.
షిప్పింగ్ సంస్థ ‘కార్గిల్’కు చెందిన ఈ నౌక భవిష్యత్తులో నౌకాయాన రంగం కాలుష్య రహితంగా మారడానికి సాయపడుతుందని ఆశిస్తోంది.
ఈ రకమైన టెక్నాలజీ వల్ల ఇంధన వినియోగం తగ్గి నౌకారంగ కర్బన ఉద్గారాలు తగ్గుతాయి.
షిప్ ఎక్కడికి వెళ్లనుంది?
ఈ ఓడను ఇంధన వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో రూపొందించారు.
చైనా నుంచి బ్రెజిల్‌కు ప్రయాణించనుంది ఈ పిక్సిస్ ఓషన్ కార్గో షిప్. అంతేకాదు ఇది ఆధునిక ప్రపంచంలో మొట్టమొదటి ‘గాలితో నడిచే ఓడ’.
ఈ టెక్నాలజీని ఉపయోగించి నౌకను నడిపినప్పుడు, దాని నుంచి వెలువడే కార్బన్ పరిమాణం కూడా గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.
ప్రపంచంలో మొత్తం కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో షిప్పింగ్ రంగం వాటా 2.1 శాతం.
సముద్రం ద్వారా నౌకలతో వస్తువులను రవాణా చేయడానికి ఈ సంప్రదాయ పద్దతే ఎంతవరకు ఉపయోగపడనుందని అంచనా వేయడానికి కూడా ఇది ఒక అవకాశం.
ఓడలను డీజిల్ వంటి ఇంధనాలతో నడపడానికి బదులుగా, గాలి సహాయంతో నడిపినపుడు వెలువడే కార్బన్ ఉద్గారాలు 30 శాతం వరకు తగ్గుతాయని అంచనా.
MarineTraffic.com లోని సమాచారం ప్రకారం పిక్సిస్ ఓషన్ కార్గో షిప్ దాదాపు 229 మీటర్ల పొడవు, 43 వేల టన్నుల బరువు ఉంది.

ఫొటో సోర్స్, CARGILL
గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్
షిప్పింగ్ పరిశ్రమ "డీకార్బనైజ్డ్, గ్రీన్ ఫ్యూచర్ వైపు ప్రయాణిస్తోంది" అని కార్గిల్ ఓషన్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రెసిడెంట్ జాన్ దిలేమాన్ తెలిపారు.
ఇలాంటి గొప్ప లక్ష్యాన్ని అంత తొందరగా సాధించడం ఏమంత సులభం ఆయన అభిప్రాయపడ్డారు.
“ఐదారేళ్ల క్రితం మీరు షిప్పింగ్ పరిశ్రమలో ఎవరినైనా డీకార్బనైజేషన్ గురించి అడిగితే, అది చాలా కష్టమైన విషయం. సమీప భవిష్యత్తులో ఈ లక్ష్యాన్ని సాధించే అవకాశం లేదని చెప్పేవారు" అని జాన్ బీబీసీకి తెలిపారు.
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది, అందరూ సహకరించాలని నిశ్చయించుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని షిప్పింగ్ పరిశ్రమను కొత్త టెక్నాలజీ వైపు మళ్లించేందుకు తమ కంపెనీ ఈ పైలట్ ప్రాజెక్టు చొరవను చేపడుతున్నట్లు జాన్ చెప్పారు. ఈ ఓడ గమ్యానికి చేరుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుంది. అయితే ఈ టెక్నాలజీ దీనిని తొందరగా చేసి చూపుతుందని భావిస్తున్నారు.
ఈ సాంకేతికతను ఎవరు అభివృద్ది చేశారు?
పిక్సిస్ ఓషన్ కార్గో షిప్‌లో ఉపయోగించిన (గాలితో నడిచే) సాంకేతికతను బీఏఆర్ టెక్నాలజీస్ అనే యూకే కంపెనీ అభివృద్ధి చేసింది.
"ఫార్ములా వన్ ఆఫ్ ది సీస్" అని పిలిచే అమెరికా కప్ సెయిలింగ్ పోటీ కోసం 2017లో సర్ బెన్ ఎన్స్‌లీ బృందం ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది.
''ఇది మా అత్యంత నెమ్మదైన ప్రాజెక్ట్‌లలో ఒకటి, అయితే ఇది కచ్చితంగా ప్రపంచంపై ప్రభావాన్ని చూపుతుంది'' అని గతంలో మెక్‌లారెన్ ఫార్ములా వన్ టీం కోసం పనిచేసిన జాన్ కూపర్ బీబీసీకి తెలిపారు.
ఈ ప్రయోగం సముద్ర వ్యాపారంలో కీలక మలుపు కానుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంధనం ఆదా
"2025 నాటికి కొత్తగా తయారయ్యే నౌకలలో సగం వరకు గాలి ద్వారానే శక్తిని పొందుతాయి" అని కూపర్ చెప్పారు.
''ఈ సాంకేతికతో ఒక వింగ్ (రెక్క) ద్వారా కనీసం ఒకటిన్నర టన్ను ఇంధనం ఆదా అవుతుంది. అదే నాలుగింటితో రోజుకు ఆరు టన్నుల వరకు ఇంధనాన్ని ఆదా చేయనుంది. ఇది 20 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి సమానం. ఇంధన ఆదా, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపు అనేది ప్రాజెక్ట్‌పై గొప్ప నమ్మకాన్ని ఏర్పరుస్తోంది'' ఆయన చెప్పారు.
కార్గో షిప్‌ను గాలిలో నడిపించే సాంకేతికత యూకేలో ఉంది. అయితే వింగ్స్ చైనాలో తయారవుతాయి, వాటిని అక్కడి నుంచి దిగుమతి చేసుకోవల్సి ఉంటుంది.
అయితే, ఉక్కుతో తయారైన దిగుమతులపై బ్రిటీష్ ప్రభుత్వం ధరలు తగ్గించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూపర్ అంటున్నారు.
గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడానికి..
షిప్పింగ్ పరిశ్రమ ఏటా 837 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించే ప్రయత్నంలో ఉంది.
గాలిని శక్తిగా ఉపయోగించి ఓడను నడిపితే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని నిపుణులు అంటున్నారు.
2050 నాటికి అన్ని గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను సున్నాకి తగ్గించాలని షిప్పింగ్ కంపెనీలు గత నెలలో నిర్ణయించుకున్నాయి.
అయితే దీనిని నెరవేర్చడం అంత సులభం కాదన్న వాదన వ్యక్తమవుతోంది.
ఈ విమర్శలకు జవాబిచ్చే శక్తి గాలికి ఉందని మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలోని టిండాల్ సెంటర్‌లో పరిశోధకుడు సైమన్ బుల్లక్ అంటున్నారు. ఆయన కార్గో షిప్పింగ్‌లో నిపుణులు
"ఈ పవన శక్తి పెద్ద మార్పును కలిగిస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నౌకలను ఆపరేట్ చేయడానికి మరింత సమయం పట్టవచ్చు'' అని సైమన్ బుల్లక్ తెలిపారు.
''భవిష్యత్తులో అన్ని నౌకలకు కార్బన్ రహిత ఇంధనం అవసరం. అయితే ఈ లక్ష్యాన్ని సాధించే వరకు ప్రతి ప్రయాణాన్ని విజయవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.
ఓడల వేగాన్ని తగ్గించడమూ ముఖ్యమే'' అని సైమన్ బులక్ బీబీసీతో తెలిపారు.
'ఇంజినీర్లు ఈ సాంకేతికతను కోరుకోవడం లేదు'
"గాలితో నౌకలను నడిపించే సాంకేతికతపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది" అని సముద్ర డేటా సంస్థ క్లార్క్సన్స్ రీసెర్చ్ మేనేజింగ్ డైరెక్టర్ స్టీఫెన్ గోర్డాన్ తెలిపారు.
“గత 12 నెలల్లో ఈ సాంకేతికతను ఉపయోగించే నౌకల సంఖ్య పెరిగింది. కానీ ఈ సంఖ్య సంతృప్తికరంగా లేదు ”అని ఆయన చెప్పారు.
అంతర్జాతీయంగా ఓడల నిర్మాణం కోసం మొత్తం 1,10,000 అభ్యర్థనలు అందాయి. అయితే వీటిలో 100 కంటే తక్కువ గాలితో నడిచే సాంకేతికత కోసం అభ్యర్థనలు ఉన్నాయని స్టీఫెన్ గోర్డాన్ చెప్పారు.
ఈ సంఖ్య నాటకీయంగా పెరిగినప్పటికీ, గాలి సాంకేతికత అన్ని నౌకలకు అనుకూలంగా ఉండకపోవచ్చు.
షిప్పింగ్ రంగంలో డీకార్బనైజేషన్‌కు సంబంధించి స్పష్టమైన విధానాలు ఇంకా రూపొందించాల్సి ఉంది.
నౌకానిర్మాణ పరిశ్రమ ప్రపంచ స్థాయి వైవిధ్యం, సవాళ్ల దృష్ట్యా డీ కార్బనైజేషన్ వంటి సమస్యలను తక్కువ వ్యవధిలో పరిష్కరించే అవకాశం లేదని గోర్డాన్ అభిప్రాయపడ్డారు.
షిప్పింగ్ పరిశ్రమలో పవన శక్తి వినియోగంపై బీఏఆర్ టెక్నాలజీ సీఈవో జాన్ కూపర్ ఆశాజనకంగా ఉన్నారు.
ఈ రంగంలో పవన శక్తి భవిష్యత్తు చాలా బాగుంటుందని, ప్రస్తుతం ఇది సంతృప్తికంగానే ఉందని జాన్ కూపర్ అంటున్నారు.
“షిప్పింగ్ పరిశ్రమ పవన శక్తి సాంకేతికత వైపు మళ్లాలని ఇంజనీర్లు కోరుకోవడం లేదు. అయితే భవిష్యత్తులో షిప్పింగ్ రంగం ఈ సాంకేతికత వైపు మళ్లుతుందనే ఆశ ఉంది.
ఎందుకంటే ఓడలను నడపడానికి పెద్ద ఇంజిన్లను ఉపయోగించడం వల్ల సముద్ర మార్గాలు చాలావరకు నాశనం చేశారు. దీనిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి
- చంద్రయాన్ 3 దిగిన ప్రదేశం పేరు శివశక్తి పాయింట్
- హలాల్ హాలిడేస్ అంటే ఏంటి... ముస్లింలలో వాటికి డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?
- మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...
- దగ్గు మందు మరణాలు: ‘ఇండియా ఔషధం అంటే ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’
- పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్కును ఎలా అంచనా వేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














