అదానీ గ్రూపును చుట్టుముట్టిన మరో వివాదం.. ‘స్టాక్‌ మాన్యుపులేషన్‌’పై ఓసీసీఆర్‌పీ ఆరోపణలు

అదానీ గ్రూపు

ఫొటో సోర్స్, REUTERS

షేర్ల ధర మాన్యుపులేషన్‌ను అడ్డుకునే నిబంధనల నుంచి తప్పించుకునేందుకు పారదర్శకత లోపించిన కొన్ని నిధులను (ఓపేక్) ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలతో అదానీ గ్రూపును కొత్త వివాదం చుట్టుముట్టింది.

విదేశీ సంస్థల ద్వారా సొంత సంస్థల స్టాక్‌లలో బిలియన్ డాలర్లను అదానీ గ్రూపు పెట్టుబడులు పెట్టిందని తాజాాగా ఓ నివేదిక ఆరోపించింది.

అంతేకాదు, అదానీ గ్రూపు తరఫున ఇలా స్టాక్‌లను క్రయవిక్రయాలు జరిపిన ఇద్దరు ఇన్వెస్టర్ల పేర్లను ఈ నివేదికలో ప్రస్తావించారు.

అయితే, ఆ ఆరోపణల్లో నిజం లేదని అదానీ గ్రూపు ఖండించింది.

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల బృందం ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్‌పీ)’ ఈ నివేదికను గురువారం విడుదల చేసింది. ఈ డాక్యుమెంటును ఆధారంగా చేసుకొని గార్డియన్, ఫైనాన్షియల్ టైమ్స్ కూడా కథనాలు పబ్లిష్ చేశాయి.

వీడియో క్యాప్షన్, ఆరేళ్లలో ప్రపంచ సంపన్నుడిగా ఎదిగిన అదానీ

ట్రేడింగ్, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రెన్యూవబుల్ ఎనర్జీ సహా భిన్న రంగాల్లో అదానీ గ్రూపు వ్యాపారాలను కొనసాగిస్తోంది.

ఈ గ్రూపుకు గౌతమ్ అదానీ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ప్రపంచ ధనవంతుల ‘ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్’ జాబితాలో 24వ స్థానంలో ఉన్నారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో అదానీకి దగ్గర సంబంధాలున్నాయని చెబుతారు. ఈ రాజకీయ సంబంధాల ద్వారా అదానీ చాలా లబ్ధిపొందారని విపక్ష రాజకీయ నాయకులు ఆరోపిస్తుంటారు. అయితే, ఆ ఆరోపణలను అదానీ ఖండిస్తూ వస్తున్నారు.

అమెరికాకు చెందిన ‘హిండెన్‌బర్గ్ రీసర్చ్’ సంస్థ కూడా ఈ ఏడాది మొదట్లో ఇలాంటి ఆరోపణలే చేసింది. అదానీ గ్రూపు స్టాక్ మాన్యుపులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్‌లకు పాల్పడిందని సంస్థ ఆరోపించింది. అంతేకాదు, సొంత స్టాక్స్‌లోనే తమకు చెందిన కొన్ని విదేశీ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టారని, ఫలితంగా షేర్ల విలువ పెరిగేటట్లు చేశారని సంస్థ ఆరోపణలు చేసింది.

అయితే, తమపై తప్పుడు ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు చేశారని అప్పట్లో అదానీ గ్రూపు ఖండించింది. అయితే, ఆ తర్వాత అదానీ గ్రూపు షేర్ల విలువ భారీగా పతనమైంది. ఈ ఆరోపణలపై భారత సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కూడా సాగుతోంది.

వీడియో క్యాప్షన్, నెలకు 5000తో 12 లక్షలు సంపాదించొచ్చా

‘వందల మిలియన్ల డాలర్ల షేర్ల క్రయవిక్రయాలు’

ఆ ఇద్దరు ఇన్వెస్టర్లు కొన్ని వందల మిలియన్ల డాలర్ల విలువైన అదానీ గ్రూపు షేర్ల క్రయవిక్రయాలు జరిపినట్లు ఓసీసీఆర్‌పీ నివేదికలో ఆరోపించారు.

‘‘ఆ ఇద్దరికీ అదానీ కుటుంబంతో దగ్గర సంబంధాలున్నాయి. అదానీ గ్రూపు సంస్థలకు వీరు డైరెక్టర్లుగా, షేర్‌హోల్డర్లుగా కూడా పనిచేశారు’’ అని ఓసీసీఆర్‌పీ ఆరోపించింది.

అయితే, ఆ ఆరోపణలను బీబీసీ వెరిఫై చేయడం వీలు కాలేదు.

ఆ ఇన్వెస్టర్లు క్రయవిక్రయాలకు ఉపయోగించిన నిధులు నేరుగా అదానీ కుటుంబం నుంచి తీసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించలేదని ఓసీసీఆర్‌పీ పేర్కొంది.

అయితే, అదానీ గ్రూపు షేర్ల క్రయవిక్రయాలకు సంబంధించిన పత్రాలను తమ జర్నలిస్టులు విశ్లేషించినప్పుడు అదానీ కుటుంబ పర్యవేక్షణలోనే ఆ క్రయవిక్రయాలు జరిగాయనే ఆధారాలు బయటపడినట్లు తెలిపింది.

ఆ ఇద్దరు ఇన్వెస్టర్లకు అదానీ గ్రూపుతో ఉన్న ‘సంబంధం’ చట్టాలను ఉల్లంఘిస్తోందా అనే ప్రశ్న అసలు వారు అదానీ ప్రమోటర్ల తరఫున పనిచేశారా అనే అంశంపై ఆధారపడి ఉంటుందని ఓసీసీఆర్‌పీ పేర్కొంది.

తాజా నివేదిక విడుదలైన తర్వాత ఆ ఇద్దరు ఇన్వెస్టర్లు స్పందించలేదు. నివేదికను దురుద్దేశాలతోనే విడుదల చేశారని అదానీ గ్రూపు విమర్శించింది.

‘‘ఇక్కడి చట్టాలపై మాకు పూర్తి నమ్మకముంది. ప్రభుత్వానికి మేం సమర్పిస్తున్న వివరాలు, అనుసరిస్తున్న ప్రమాణాలపై మేం విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం’’ అని అదానీ గ్రూపు పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)