ఇస్రో శాస్త్రవేత్త కావాలంటే ఏం చదవాలి, ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు?

ఇస్రో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురుగేశ్ మదకన్ను
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చంద్రయాన్ -3తో ఇంతవరకూ ఏ దేశమూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలుమోపింది భారత్. సాఫ్ట్ ల్యాండింగ్‌తో చంద్రయాత్ర విజయవంతంగా ప్రారంభమైంది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ శాస్త్రీయ పరిశోధనల్లో భాగమయ్యాయి.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్ - 3 ప్రయోగం దేశవ్యాప్తంగా చాలా పాఠశాలలు, కళాశాలల్లో ప్రసారమైంది. ఇందులో కీలకమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ - ఇస్రో) శాస్త్రవేత్తల కృషి చాలా మంది విద్యార్థుల్లో ఇస్రోపై, అంతరిక్ష పరిశోధనపై ఆసక్తిని రేకెత్తించింది.

ఇస్రో శాస్త్రవేత్తలు అయ్యేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు.

అసలు, ఇస్రోలో శాస్త్రవేత్త అయ్యేందుకు ఏం చదవాలి? ఏం చేయాలి?

ఇస్రో

ఫొటో సోర్స్, ISRO

ఏం చదవాలంటే..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో ప్రవేశం పొందేందుకు కచ్చితమైన ప్రణాళిక అవసరం.

అంతరిక్ష పరిశోధనలు చేయాలనుకునే విద్యార్థులు మ్యాథ్స్‌తో పాటు బేసిక్ సైన్స్‌ చదవాలని చంద్రయాన్ -1 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్ మయిల్‌స్వామి అన్నాదురై చెప్పారు.

''మ్యాథ్స్ ముఖ్యం. ఆల్జీబ్రా, జామెట్రీ ప్రధానం. సిలబస్‌లో లేని విషయాలపై కూడా అవగాహన తప్పనిసరి. ప్రశ్నలకు సమాధానాలు చదువుకునే పద్ధతిలో కాకుండా, విద్యార్థులే తమంతట తాము ప్రశ్నలు రూపొందించుకుని.. వాటికి సమాధానాలు కనుగొనేలా ఉండాలి. ఈ అలవాటును చిన్నతనం నుంచే అలవర్చుకోవాలి'' అని ఆయన అన్నారు.

ఏదైనా సృష్టించాలనే తపన శాస్త్రవేత్తకి ఉండాల్సిన కనీస ప్రమాణాల్లో ఒకటని ఆయన అన్నారు. ''ఓ కళాకారుడు కళాకృతిని సృష్టించినట్లు, కవి ఓ పద్యం రాసినట్లు, శాస్త్రవేత్త కావాలనుకునేవారు కూడా నూతన శాస్త్రీయ ఆవిష్కరణలపై ఆసక్తి చూపించాలి'' అన్నారు.

ఇస్రో

ఏ కోర్సు ఎంచుకోవాలి?

ఉన్నత చదువుల సమయంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు లేదా ఇంజినీరింగ్ కోర్సులను విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ''డిగ్రీలో సైన్స్, లేదా ఇంజినీరింగ్‌ తప్పనిసరి. ఈ రెండింటిలో తమ ఆసక్తిని బట్టి ఒకదానిని విద్యార్థులు ఎంచుకోవచ్చు'' అని డాక్టర్ మయిల్‌స్వామి చెప్పారు.

జేఈఈ పరీక్ష రాసి ప్రముఖ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో బీఈ, బీటెక్ కోర్సులు చేయొచ్చు. అలాగే, తిరువనంతపురం సమీపంలోని వలిమలలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐ‌ఎస్‌టీ)లో చేరొచ్చు. ఇది భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో నడుస్తున్న డీమ్డ్ యూనివర్సిటీ. ఇందులో బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. శాస్త్రవేత్తలు కావాలనుకుంటున్న విద్యార్థులు ఈ కోర్సులు చేయొచ్చు.

ఇతర సంస్థలలో ఈ కోర్సులు చదివినప్పటికీ శాస్త్రవేత్త కావాలనే కలను సాకారం చేసుకోవచ్చు. అయితే, చిన్న వయసు నుంచే ఆ దిశగా కృషి చేయడం వల్ల ఐఐటీ, లేదా ఐఐఎస్‌సీ వంటి విద్యా సంస్థల్లో అవకాశాలు పొందవచ్చు.

శాస్త్రవేత్త కావడానికి ప్రత్యేకమైన కోర్సు అంటూ ఏమీ లేదని మరో శాస్త్రవేత్త ఆర్.వెంకటేశన్ అన్నారు. ఆయన బ్రేక్‌థ్రూ సైన్స్ సొసైటీ (బీఎస్ఎస్) సభ్యుడిగానూ ఉన్నారు. విద్యార్థులకు సైన్స్ సంబంధిత విషయాలు ఆయన బోధిస్తుంటారు.

''ఇస్రో శాస్త్రవేత్తలు కూడా అందులో చేరడానికి ప్రత్యేక కోర్సులు ఏమీ చేయలేదు. బీటెక్, ఎంటెక్ వంటి అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసిన వారే అక్కడ పని చేస్తారు. ఏదైనా ప్రాజెక్టుకి వాళ్లను కేటాయించినప్పుడు ఇస్రో వారికి శిక్షణ ఇస్తుంది. కాబట్టి, విద్యార్థులు తాము ఎంచుకున్న కోర్సులో నైపుణ్యం పెంపొందించుకోవాలి. మ్యాథ్స్‌లో బలంగా ఉండాలి'' అని ఆయన చెప్పారు.

ఇస్రోతో పాటు మరికొన్ని సంస్థలు కూడా అంతరిక్ష పరిశోధనలో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్ వంటి సంస్థల్లో చదువుకున్న వారిలో ఎక్కువ మంది అంతరిక్ష పరిశోధన, అంతరిక్ష అన్వేషణలో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నారు.

''సైంటిస్టులు కావాలనుకునే విద్యార్థులు ఇలాంటి విద్యాసంస్థల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు'' అని వెంకటేశన్ చెప్పారు.

ఇస్రో

ఫొటో సోర్స్, Getty Images

ఇస్రోలో ఎంపిక ఎలా..

విద్యార్థులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ)ని ఎంపిక చేసుకోవడం మేలని డాక్టర్ మయిల్‌స్వామి సూచించారు. అందుకు జేఈఈలో మంచి మార్కులు సంపాదించి ఉండాలన్నారు. అలాగే, కోర్సులకు ఎంపిక కూడా జేఈఈలో మార్కులను బట్టే ఉంటుందని చెప్పారు.

''ఇక్కడ చదవడం వల్ల ఇస్రో కార్యకలాపాలపై అవగాహన కలుగుతుంది. ఇస్రో ఎలా పనిచేస్తుంది, అక్కడ పనివిధానం ఎలా ఉంటుందనే విషయాలు తెలుస్తాయి. తాము చదువుతున్న కోర్సులో మంచి ప్రతిభ కనబరిస్తే ఇస్రో శాస్త్రవేత్తగా ఉద్యోగావకాశం కూడా రావొచ్చు'' అని మయిల్‌స్వామి తెలిపారు.

''ఇస్రోలో చేరేందుకు ఇదొక ఉత్తమ మార్గం. సైంటిస్ట్‌గా ఉద్యోగం పొందాలంటే స్పేస్ ఆర్గనైజేషన్ నిర్వహించే పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది'' అని ఆయన చెప్పారు.

ఇస్రో

ఫొటో సోర్స్, Getty Images

అంకితభావం, పట్టుదల

సైంటిస్ట్‌గా ఉద్యోగంలో చేరిన తర్వాత, తమకు కేటాయించిన విభాగంలో వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. నిరంతరం నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని, తమకు కేటాయించిన పని కంటే ఎక్కువ చేసేందుకు సంసిద్ధంగా ఉండాలని డాక్టర్ మయిల్‌స్వామి చెప్పారు.

''ఇచ్చిన పనిని బాగా చేయాలి. మీకు కేటాయించిన పనితో పాటు ఎక్కువ పని చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తే ఉన్నతాధికారుల దృష్టిలో పడడంతో పాటు వారి నమ్మకాన్ని పొందగలుగుతారు. అలా కెరీర్‌లో పైకి ఎదిగే అవకాశాలు ఉంటాయి. కొందరు తాము కోరుకున్న విభాగంలో తమకు విధులు కేటాయించలేదని సతమతమవుతుంటారు. మీ విభాగం, ఆసక్తి ఏదైనా అంకితభావంతో పనిచేస్తే ఇస్రో కెరీర్ అభివృద్ధికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది'' అని, ఇది తన అనుభవం నుంచి చెబుతున్నానని ఆయన అన్నారు.

ఇస్రో

ఫొటో సోర్స్, Getty Images

భవిష్యత్తులో శాస్త్రవేత్తల అవసరముందా?

డాక్టర్ మయిల్‌స్వామి చెప్పినదాని ప్రకారం, భవిష్యత్తులో స్పేస్ సైంటిస్టుల అవసరం చాలా ఉంది.

''ఒక్క ఇస్రోనే కాకుండా అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలు కూడా వస్తున్నాయి. తమిళనాడులోని కులశేఖర‌పట్టణం నుంచి ప్రయోగాలు చేసుకునేందుకు వారికి అనుమతులు ఇవ్వొచ్చు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సైంటిస్టులు కేవలం ఉద్యోగాలకే పరిమితం కానక్కర్లేదు. ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలను కూడా ప్రారంభించొచ్చు. ఇక్కడ అవకాశాలకు కొదువ లేదు'' అని మయిల్‌స్వామి అభిప్రాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, ఇస్రోలో శాస్త్రవేత్త కావడం ఎలా?

ఇవి కూడా చదవండి: