చంద్రయాన్-3 విజయం వెనుక ఉన్న కీలక శాస్త్రవేత్తలు ఎవరంటే...

ఎస్ సోమనాథ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పారా పద్దయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చంద్రయాన్-2 విఫలమైన ఒత్తిడి, చంద్రయాన్-3ను సక్సెస్ చేయాలనే తపన... ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతగా శ్రమించారనేది విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగిన తర్వాత ప్రతీ ఒక్కరిలో కనిపించింది.

బెంగళూరులోని కంట్రోల్ రూమ్‌లో ప్రతీఒక్కరూ చిన్నపిల్లల్లా మారిపోయారు. చంద్రయాన్-3 ఇస్రో సాధించిన విజయం. ఇందులో తెరపైన కనిపించే వ్యక్తులతో పాటు తెర వెనుక అనేక మంది వ్యక్తులు, సంస్థలు ఉన్నాయి.

ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్‌లో శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు, నాన్ టెక్నికల్ సిబ్బంది, మరి కొన్ని ఇతర సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగం పంచుకున్నాయి.

ఈ ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన వారిని ప్రపంచానికి పరిచయం చేశారు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్. ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది చైర్మన్ గురించే.

ఎస్ సోమనాథ్

ఫొటో సోర్స్, Getty Images

ఎస్ సోమనాథ్, ఇస్రో చైర్మన్

చంద్రయాన్-3 వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ శ్రీధర పారికర్ సోమనాథ్. ఈ ప్రాజెక్టే కాదు, ఇస్రో ప్రతిష్టాత్మతంగా భావిస్తున్న మిగతా ప్రాజెక్టులు గగన్‌యాన్, ఆదిత్య ఎల్-1 ను ఈయనే నడిపిస్తున్నారు.

గతంలో ఆయన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా పని చేశారు. ఇస్రోలోకి రాక ముందు ఇస్రో ఉపయోగించే రాకెట్ల టెక్నాలజీని అభివృద్ధి చేసే లిక్విడ్ ప్రొఫల్షన్ సిస్టమ్స్ సెంటర్‌లోకి కూడా డైరెక్టర్‌గా పని చేశారు.

బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఆయన మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆయన సంస్కృతం మాట్లాడగలరు. సంస్కృతంలో నిర్మించిన యానం అనే సినిమాలో నటించారు కూడా. సోమనాథ్ అంటే సంస్కృతంలో చంద్రుడి దైవం అని.

వీరముత్తువేల్

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, వీరముత్తువేల్ (మాట్లాడుతున్న వ్యక్తి)

పి. వీరముత్తువేల్, చంద్రయాన్-3 ప్రాజెక్టు డైరెక్టర్

2019లోనే ఆయన ఈ మిషన్ బాధ్యతలు తీసుకున్నారు. మిషన్ ప్రారంభం కాక ముందు ఆయన అంతరిక్ష మౌలిక వసతుల కార్యక్రమం కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నారు. మద్రాస్ ఐఐటీలో మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ చదివారు. చంద్రయాన్-2, మంగళయాన్ మిషన్లలో పాల్గొన్నారు.

చంద్రయాన్-2లో విఫలమైన ల్యాండర్ విక్రమ్ రూపకల్పనలో ఆయన పాత్ర కీలకం. ఆ మిషన్ విఫలం కావడంతో.. అందులో నుంచి నేర్చుకున్న పాఠాలతో తాజా ల్యాండర్‌ను తయారు చేశారు.

ఈయన మాజీ రైల్వే ఉద్యోగి కుమారుడు, స్వస్థలం తమిళనాడులోని విల్లుపురం. చంద్రయాన్-3‌ను ప్రయోగించినప్పటి నుంచి అది చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ల్యాండయ్యే వరకూ మొత్తం 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరంలో మిషన్ ప్రయాణాన్ని వీరముత్తువేల్, ఆయన బృంద ఇస్రోలోని టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు.

ల్యాండర్ చంద్రుడి మీద దిగడానికి ముందు 17 నిమిషాల సమయంలో ప్రయాణం మొత్తాన్ని వీరముత్తువేల్ టీమ్ స్వయంగా పర్యవేక్షించింది.

కల్పన

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, కల్పన

కల్పన కె, డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్

కోవిడ్ సమయంలో అనేక సమస్యలు ఎదురైనప్పటికీ ఆమె చంద్రయాన్ త్రీ ప్రాజెక్టు కోసం పని చేస్తూనే ఉన్నారు. శాటిలైట్ల నిర్మాణంలో ఆమె నైపుణ్యం ఇస్రోకు అదనపు బలం. చంద్రయాన్ టూ, మంగళ్‌యాన్ మిషన్లలోనూ ఆమె పని చేశారు.

బి. ఎన్ . రామకృష్ణ, డైరెక్టర్ ఐఎస్టీఆర్ఏసీ

ఇస్రో ప్రయోగాల పర్యవేక్షణ కోసం బెంగళూరులో ఏర్పాడు చేసిన కేంద్రం ఐఎస్టీఆర్ఎసీ. దీనికి ఏడో డైరెక్టర్ బీఎన్ రామకృష్ణ. ఈ సెంటర్ డీప్ స్పేస్ మిషన్ల పని తీరు, అవి పంపించే డేటాను విశ్లేషిస్తుంది.

చంద్రయాన్-3 మిషన్ కోసం ఐఎస్టీఆర్ఎసీ బెంగళూరు బయట బైలాలూలో ఎర్త్ స్టేషన్ ఏర్పాటు చేసింది. ఉపగ్రహాల ప్రయాణం, వ్యోమనౌకలను కక్ష్యలోకి తీసుకు వెళ్లడంలో రామకృష్ణ నిపుణులు. ఆయన బెంగళూరులో సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసారు.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, EPA

ఎం. శంకరన్, డైరెక్టర్ యూ ఆర్ రావు స్పేస్ సెంటర్

గతంలో ఇస్రో శాటిలైట్ సెంటర్‌గా గుర్తింపు పొందిన సంస్థకు శంకరన్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇస్రో చేపట్టే అంతరిక్ష పరిశోధనల కోసం ఈ సంస్థ వ్యోమనౌకలను తయారు చేస్తుంది.

చంద్రయాన్-3కి ఉపయోగించిన స్పేస్ క్రాఫ్ట్‌ను యుఆర్ రావ్ స్పేస్ సెంటర్ తయారు చేసింది. 2021 జూన్‌లో శంకరన్ ఈ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన ఇదే సంస్థలో కమ్యూనికేషన్స్ అండ్ పవర్ సిస్టమ్స్‌కు డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేశారు.

ఇస్రో చేపట్టిన చంద్రయాన్ వన్ , టూ, మార్స్ ఆర్బిటర్ మిషన్లలో సోలార్ పవర్ సిస్టమ్స్, సమాచార వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర ఉంది.

ఎస్. మోహన కుమార్, మిషన్ డైరెక్టర్

జులై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 ఎల్వీఎం 3 రాకెట్ మిషన్‌కు మోహన కుమార్ ఇస్రో డైరెక్టర్. ఈ ప్రయోగం విజయవంతంగా లాంచ్ చేసినట్లు జులై14న శ్రీహరికోటలో ప్రకటించింది ఆయనే.

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో సీనియర్ సైంటిస్ట్‌గా పని చేస్తున్న మోహన కుమార్ చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఎల్వీఎం3 ఎం3 మిషన్‌లో భాగంగా రెండు శాటిలైట్ల వాణిజ్య ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. తిరువనంత పురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లోఆయన సీనియర్ సైంటిస్ట్. ఇస్రోలో 30 ఏళ్ల నుంచి పని చేస్తున్నారు.

మోహన కుమార్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మోహన కుమార్

వి. నారాయణన్, డైరెక్టర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్

ప్రొపల్షన్ సిస్టమ్స్ అనాలసిస్‌లో నిపుణుడు. క్రయోజినిక్ ఇంజన్ల రూపకల్పన, చంద్రయాన్-3 లాంటి భారీ ప్రాజెక్టుల కోసం ప్రొపల్షన్ సిస్టమ్స్ అమర్చడంలో నారాయణన్ కీలక పాత్ర ధారి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదవుకున్నారు.

ఎస్. ఉన్నికృష్ణన్ నాయర్, డైరెక్టర్ విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్

తిరువనంతపురంలోని ప్రధాన రాకెట్ నిర్మాణ కేంద్రానికి నాయర్ డైరెక్టర్. పౌర రవాణా విమానాల తయారీలోనూ ఆయనకు నైపుణ్యం ఉంది. 1985లో ఆయన ఇస్రోలో చేరారు. పీఎస్‌ఎల్వీ, జీఎస్‌ఎల్వీ, ఎల్వీఎంత్రీ రాకెట్ల తయారీతోపాటు అనేక ఏరోస్పేస్ సిస్టమ్స్, మెకానిజం అభివృద్ధి చెయ్యడంలో ఆయన పాత్ర ఉంది.

2004లో ఇస్రో ప్రారంభించిన ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్‌తో ఆయన భాగస్వామిగా ఉన్నారు. అంతే కాదు ఆ కార్యక్రమానికి కూడా ఆయనే డైరెక్టర్.

కేరళ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేసారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశారు. ఐఐటీ మద్రాస్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేసారు.

చంద్రయాన్-3

ఫొటో సోర్స్, AFP

ఇక సంస్థల విషయానికొస్తే....

ఎల్‌అండ్‌టీ

చంద్రయాన్-3 లాంచ్ వెహికల్‌కు అవసరమైన కీలక పరికరాలను ఎల్‌అండ్‌టీ ఏరోస్పేస్ వింగ్ సమకూర్చింది. బూస్టర్ సెగ్మెంట్‌లో పరికరం పైభాగం, మధ్య భాగం, నాజిల్ బకెట్ లాంటి వాటితో మరి కొన్నింటని ఈ సంస్థ సమకూర్చింది.

మిశ్ర దాతు నిగమ్

ప్రభుత్వ రంగ లోహ సంస్థ కూడా ఇందులో పాలుపంచుకుంది. కోబాల్ట్ బేస్ అల్లాయ్స్, నికెల్ బేస్ అల్లాయ్స్, టైటానియం అల్లాయ్స్, ఇతర పరికరాల తయారీకి అవసరమైన స్టీలును కూడా మిశ్రదాతు నిగమ్ సరఫరా చేసింది.

బీహెచ్ఈఎల్

చంద్రయాన్-3 ప్రయోగానికి అవసరమైన బ్యాటరీలను భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సరఫరా చేసింది. సంస్థకు చెందిన వెల్డింగ్ రీసర్చ్ ఇన్‌స్టిట్‌ట్యూట్ విభాగం బై మెటాలిక్ అడాప్టర్లను అందించింది.

ఎంటీఏఆర్ టెక్నాలజీస్

చంద్రయాన్-3 మిషన్లో ఇంజన్లు, బూస్టర్ పంపులు సహా అనేక ఇతర కీలక పరికరాలను ఈ సంస్థ తయారు చేసింది.

వీడియో క్యాప్షన్, సూర్యుడి అసలు రంగు ఏమిటి?

గోద్రెజ్ ఏరోస్పేస్

ఇంజిన్లు, త్రస్టర్స్ , కోర్‌స్టేజ్‌లో ముఖ్యమైన ఎల్110 సీఈ20 ఇంజన్లు, ప్రయోగం తర్వాతి దశలో ముఖ్యమైన ధ్రస్ట్ చాంబర్‌ను ఈ కంపెనీ తయారు చేసింది.

అంకిత్ ఏరో స్పేస్

మిషన్‌లో ఉపయోగించిన రాకెట్, ఇతర పరికరాల నాణ్యత, పనితీరు, దీర్ఘకాల మన్నికకు అవసరమైన టైటానియం బోల్టులు, అల్లాయ్ స్టీల్, స్టెయిన్ లెస్ స్టీల్‌‌ను అంకిత్ ఏరో స్పేస్ అందించింది.

వాల్చం‌ద్‌నగర్ ఇండస్ట్రీస్

చంద్రయాన్-3లో భాగంగా... లాంచ్ వెహికల్‌లో ఉపయోగించిన ఎస్ 200 బూస్టర్లు, ఫ్లెక్స్ నాజిల్ కంట్రోల్ టాంకేజెస్, ఎస్200 నాజిల్ హార్డ్‌వేర్‌ను తామే సరఫరా చేసినట్లు ఈ సంస్థ ప్రకటించింది.

వీడియో క్యాప్షన్, చంద్రయాన్-3 చంద్రుడి మీద దిగిన మరపురాని క్షణాలు...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)