చంద్రయాన్-3 విజయవంతం.. చంద్రుడిపై ‘ల్యాండర్ విక్రమ్’ను సురక్షితంగా దించిన ఇస్రో.. దక్షిణ ధ్రువంలో అడుగు పెట్టిన తొలి దేశం ఇండియా

ఫొటో సోర్స్, ANI
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ఈ రోజు సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
బ్రిక్స్ కూటమి సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ల్యాండింగ్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.
చంద్రయాన్-3 విజయవంతం కావడంపై దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇస్రో సైంటిస్టులపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, ISRO
‘‘చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపేందుకు సర్వం సిద్ధమైంది. నిర్దేశిత లొకేషన్‌కు 5.44కు ల్యాండర్ చేరుకుంటుంది. అక్కడి నుంచి కిందకు దిగుతుంది. అన్ని కమాండ్లు సరైన సమాయానికి విక్రమ్ ల్యాండర్‌కు అందేలా అన్ని చర్యలూ తీసుకున్నాం’’ అని ల్యాండింగ్‌కు ముందు ఇస్రో ఒక ట్వీట్ చేసింది.
‘‘ఈ ప్రయోగంతో ఇస్రో చరిత్ర సృష్టించబోతోంది’’ అని ఇస్రో శాస్త్రవేత్త మైలస్వామి అన్నాదురై ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.
ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్ కుమారుడు కార్తికేయ సారాభాయ్ కూడా ఈ ప్రయోగంపై ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘‘ఇది చాలా ముఖ్యమైన రోజు. అత్యంత కచ్చితత్వంతో చంద్రయాన్-3ను ల్యాండ్ చేయడం భారత్‌కు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు చాలా ముఖ్యం. సైన్స్, ఇంజినీరింగ్‌లలో మనం తప్పుల నుంచే నేర్చుకుంటాం. ఇప్పుడు కూడా అంతే. ఇప్పటివరకూ ఎవరూ చంద్రుడి దక్షిణ ధ్రువం పరిసరాల్లో ల్యాండ్ కాలేదు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ప్రయోగం’’ అని ఆయన అన్నారు.
సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఈ ప్రయోగాన్ని పురస్కరించుకొని ఇసుకతో చంద్రయాన్-3 శిల్పాన్ని రూపొందించారు.

ఫొటో సోర్స్, ISRO
చంద్రయాన్-3తో చరిత్రలో తనకంటూ భారత్ ఒక అధ్యయనం లిఖించబోతోందని బ్రిటన్ వ్యోమగామి హెలెన్ షర్మన్, విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌కు ముందు బీబీసీతో చెప్పారు.
‘‘మనుషులను చంద్రుడిపైకి పంపించడానికి ఈ ప్రయోగం ముఖ్యమైనది. చంద్రుడిపై మంచుతో చాలా ఉపయోగాలు ఉండొచ్చు. వాటి నుంచి మంచినీరును తీసుకోవచ్చు. అంతేకాదు దాన్ని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టడంతో మనుషులకు అవసరమైన ఆక్సిజన్ దొరకొచ్చు. అదే సమయంలో రాకెట్ ఇంధనం కూడా దానితో తయారుచేసుకోవచ్చు’’ అని హెలెన్ వివరించారు.
చంద్రుడిపై మనుషులను ల్యాండ్ చేయడం కంటే ఇలాంటి ల్యాండర్‌లను లాంచ్ చేయడమే కష్టమని హెలెన్ చెప్పారు.
‘‘ఎందుకంటే సిబ్బంది లేకుండా ఈ పరికరాలు వాటికవే పనిచేయాల్సి ఉంటుంది. మరోవైపు రెండో ప్రయత్నానికి అవసరమయ్యే ఇంధనం కూడా చాలా తక్కువ ఉంటుంది. దక్షిణ ధ్రువంలో పర్వతాలు, బిలాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా సవాళ్లు ఎదురుకావచ్చు’’ అని హెలెన్ అన్నారు.
అక్కడి దుమ్మూధూళీ కూడా అవాంతరాలు సృష్టించొచ్చని హెలెన్ చెప్పారు. చంద్రయాన్-3లో ఇప్పటివరకూ ఏం జరిగిందో చూద్దాం.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది

ఫొటో సోర్స్, ANI
ఇప్పటివరకు ఏం జరిగింది?
చంద్రుడిపైకి భారత్ పంపిన తొలి మిషన్ చంద్రయాన్-1 2008లో పూర్తయింది. దీని కోసం రూ.386 కోట్లు ఖర్చు చేశారు. చంద్రయాన్-2 ప్రయోగం కోసం రూ.978 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మూడో ప్రయోగ వ్యయం రూ.615 కోట్లు.
జులై 6: చంద్రయాన్-3ను జులై 14న శ్రీహరికోటలో లాంచ్ ప్యాడ్-2 నుంచి ప్రయోగించబోతున్నట్లు ఇస్రో ప్రకటించింది.
జులై 11: 24 గంటల సస్నాహక ప్రయోగం పూర్తైంది.
జులై 13: శ్రీహరికోటలో మధ్యాహ్నం 1.05కు కౌంట్‌డౌన్ మొదలైంది.
జులై 14: మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3తో ఎల్‌వీఎం3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

ఫొటో సోర్స్, ISRO
ఎన్నిసార్లు కక్ష్యను పెంచారు?
భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఐదుసార్లు చంద్రయాన్-3 వ్యోమనౌక కక్ష్యను శాస్త్రవేత్తలు పెంచారు.
జులై 15: తొలిసారి కక్ష్యను పెంచారు.
జులై 17: రెండోసారి చంద్రయాన్-3 ఎత్తును పెంచుతూ కక్ష్యను మార్చారు.
జులై 18: మూడోసారి ఎత్తును పెంచుతూ కక్ష్యను మార్చారు.
జులై 20: నాలుగోసారి చంద్రయాన్-3 కక్ష్యను మార్చారు.
జులై 25: చివరిసారిగా ఐదోసారి కక్ష్యను పెంచారు.

ఫొటో సోర్స్, AFP
చంద్రుడి వైపు పయనం ఎప్పుడు మొదలైంది?
ఆగస్టు 1: భూమి చుట్టు తిరిగే చంద్రయాన్-3 రాత్రి 1 గంట సమయంలో చంద్రుడి వైపుగా పయనం మొదలుపెట్టింది.
ఆగస్టు 5: విజయవంతంగా దీన్ని చంద్రుడి కక్ష్యలోకి పంపించారు. 164 కి.మీ. x 18074 కీ.మీ. దగ్గర దీన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఆగస్టు 6: చంద్రుడికి దగ్గరగా వెళ్లేందుకు మరోసారి కక్ష్యను తగ్గించారు. దీర్ఘవృత్తాకార కక్ష్యలో 170 కి.మీ x 4313 కి.మీ. దగ్గర ప్రవేశపెట్టారు.
ఆగస్టు 9: చంద్రయాన్-3ను 174 కి.మీ. x 1437 కి.మీ. దగ్గర కక్ష్య మార్చారు.
ఆగస్టు 14: చంద్రయాన్-3ను 151 కి.మీ. x 179 కి.మీ. దగ్గర కక్ష్య మార్చారు.
ఆగస్టు 16: చంద్రయాన్-3ను 153 కి.మీ. x 163 కి.మీ. దగ్గర కక్ష్య మార్చారు.

ఫొటో సోర్స్, ISRO/TWITTER
ల్యాండర్ ఎప్పుడు వేరు పడింది?
ఆగస్టు 17: చంద్రయాన్-3 బూస్టర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజవంతంగా వేరుపడింది.
ఆగస్టు 19: విక్రమ ల్యాండర్ దీర్ఘవృత్తాకార కక్ష్యలో చంద్రుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది.
ఆగస్టు 20: విక్రమ్ ల్యాండర్ కక్ష్యను తగ్గించి 25 కి.మీ. x 134 కి.మీ. వద్ద కక్ష్య మార్చారు.
ఆగస్టు 23: చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ సాఫ్ట్ ల్యాండ్ అయింది.

ఫొటో సోర్స్, EMPICS
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ఏం చేస్తుంది?
చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గర 70 డిగ్రీల అక్షాంశం వద్ద విక్రమ్ ల్యాండ్ అయ్యింది. అక్కడ కొన్ని పరిశోధనలను విక్రమ్ చేపడుతుంది.
చంద్రుడి ఉపరితలంపై ఎలాంటి మార్పులు చేసుకుంటున్నాయి? ఇక్కడ ఎలాంటి ఖనిజాలు లభ్యమవుతాయి లాంటి వివరాలను విక్రమ్ సేకరిస్తుంది.
భూమి తరహాలో చంద్రుడిపైనా ప్రకంపనలు వస్తున్నాయో లేదో కూడా డేటా సేకరిస్తుంది.
ఇక విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. ఇది చంద్రుడిపై మట్టి నమూనాలను పరీక్షిస్తుంది. సంబంధిత వివరాలను శాస్త్రవేత్తలకు పంపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- రూఢకోట: ఈ ఊరి మహిళలు గర్భం దాల్చాలంటేనే భయపడుతున్నారు
- చంద్రయాన్ 3: స్పేస్ క్రాఫ్ట్స్, శాటిలైట్లపై కనిపించే బంగారు రంగు కవరింగ్ ఏమిటి?
- మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్: ఫైనల్స్ గెలిచాక స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కర్మోనాకు ఆమె తండ్రి మరణించిన సంగతి చెప్పారు...
- దగ్గు మందు మరణాలు: ‘ఇండియా ఔషధం అంటే ముట్టుకోవాలన్నా భయమేస్తోంది’
- పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్కును ఎలా అంచనా వేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














