చంద్రయాన్-ఇస్రో: ఇలాంటి ప్రయోగాల నుంచి ఆదాయం ఎంత సంపాదించవచ్చు?

చంద్రయాన్ ప్రయోగం

ఫొటో సోర్స్, ISRO

    • రచయిత, శ్రీకాంత్ బక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3లో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞ్యాన్‌లు దిగాయంటే ...చంద్రుడిపై ల్యాండర్‌ని దించిన నాలుగో దేశంగా నిలుస్తుంది.

వాస్తవానికి చంద్రయాన్-1 ప్రయోగంలోనే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై క్రాష్ ల్యాండ్ చేసి, భారతీయ జెండాను 14 ఏళ్ల కిందటే చంద్రుడిపైకి పంపింది.

ఆ ప్రయోగంలోనే చంద్రుడిపై నీటి జాడల్ని మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ గుర్తించింది.

చంద్రుడిపై కాలనీ(ఊహాచిత్రం)

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, చంద్రుడిపై కాలనీ(ఊహాచిత్రం)

రాకెట్ ప్రయోగాలు ఎందుకు అవసరం

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, రష్యాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది.

ఇందులో భాగంగా అంతరిక్ష రంగంలో ఇరు దేశాలూ పోటాపోటీగా ప్రయోగాలు చేశాయి.

1957 అక్టోబర్ 4న రష్యా ప్రయోగించిన స్పుత్నిక్ అనే కృత్రిమ శాటిలైట్ అంతరిక్షంలోకి వెళ్లడంతో మానవ చరిత్రలో అంతరిక్ష ప్రయోగాలు ఊపందుకున్నాయి.

1947లో స్వాతంత్య్రం పొందిన భారతదేశం తొలినాళ్లలో వ్యవసాయం, పరిశ్రమలు, ప్రాజెక్టుల నిర్మాణంపైనే ఎక్కువ దృష్టి సారించింది.

ఆ తర్వాత 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్‌ని ఏర్పాటు చేసింది.

విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం వంటి వారు ఈ తొలినాటి టీంలో ఉన్నారు.

ఆ తర్వాత 1969లో ఈ సంస్థ స్థానంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌(ఇస్రో)గా ఏర్పాటు చేశారు.

అలా 54 ఏళ్ల కిందట మొదలైన ఇస్రో 1975లో ఆనాటి సోవియెట్ యూనియన్ సహకారంతో తన తొలి శాటిలైట్ ఆర్యభట్టను రూపొందించింది.

1980లో స్వయంగా శాటిలైట్‌ను లాంచ్ చేసి, ఆ ఘనత సాధించిన ఏడో దేశంగా నిలిచింది.

ఇప్పుడు చంద్రయాన్, మంగళయాన్ వంటి ప్రయోగాలతో గ్రహాంతర ప్రయోగాలు కూడా చేస్తూ అంతరిక్ష రంగంలో దూసుకెళ్తోంది.

ఇస్రో చంద్రయాన్

ఫొటో సోర్స్, SCIENCE PHOTO LIBRARY

ఎందుకీ అంతరిక్ష ప్రయోగాలు

రాకెట్ ప్రయోగాలు, శాటిలైట్ల సేవలు ఈ రోజుల్లో దాదాపు అన్ని రంగాల్లోనూ అత్యవసరం.

రక్షణ రంగం, పౌర సేవలు, కమ్యూనికేషన్, విద్య, వాతావరణ మార్పులు, తుపాను వంటి విపత్తుల్ని ముందే గుర్తించడం, టెలీమెట్రీ సేవలు, టెలీ మెడిసిన్, నావిగేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఓషనోగ్రఫీ, భూమిలో ఖనిజాల అన్వేషణ, అడవుల పరిరక్షణ, బ్యాంకింగ్, టీవీ సేవలు, ఇంటర్నెట్, మారీటైం అఫైర్స్, విమానయాన రంగం సేవలు ఇలా దాదాపు అన్ని రంగాల్లోనూ శాటిలైట్ కమ్యూనికేషన్ అత్యవసరం.

ఆధునిక ప్రపంచంలో ఈ రంగాల్లో పెనవేసుకున్న అన్ని దేశాలకూ శాటిలైట్ సేవలు కావాలి. కానీ ప్రపంచంలో అన్ని దేశాలూ స్వయంగా అంతరిక్ష ప్రయోగాలు చేయలేవు.

నాసా ప్రయోగం

ఫొటో సోర్స్, NASA

అన్ని దేశాలూ ఎందుకు చేయలేవు

అంతరిక్ష ప్రయోగాలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలాగని కేవలం డబ్బులు పెట్టినంత మాత్రాన ఈ రంగంలో విజయం సాధించడం అంత సులువేం కాదు.

అంతరిక్ష రంగంలో విజయం సాధించడానికి భారీ నిధులతో పాటు నిపుణులైన మానవ వనరులు కూడా ఉండాలి. అన్నీ ఉన్నా విజయం సాధించగలమని చెప్పలేం.

ఎందుకంటే అంతరిక్ష ప్రయోగాల్లో ప్రారంభ దశలో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. తొలినాళ్లలో స్వయంగా సక్సెస్ సాధించడం చాలా కష్టం. ఒకవేళ ప్రయోగాలు ఫెయిలైతే పెట్టిన డబ్బంతా వృధా అయిపోతుంది.

అందుకే పేద, వర్థమాన దేశాలు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి రాకెట్ ప్రయోగాలు చేయలేవు.

ఒకవేళ భారమైనా ముందడుగు వేసి, అంతరిక్ష ప్రయోగాలు చేసినా, వాటి నుంచి లాభాలు రావడానికి చాలా కాలం పడుతుంది. అందుకే చాలా దేశాలు రాకెట్ ప్రయోగాలు చేసేందుకు అంత ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా లేవు.

వీటితో పాటు అంతరిక్ష ప్రయోగాల్లో జియో పాలిటిక్స్ కూడా కీలక భూమిక పోషిస్తాయి.

అంతర్యుద్ధం, రాజకీయంగా అశాంతి నెలకొన్న దేశాల్లో అంతరిక్ష ప్రయోగాలకు నిధులు కేటాయించే వీలుండదు.

అందుకే కొన్ని దేశాల్లో అంతరిక్ష ప్రయోగాలు అన్న మాటే వినిపించదు. ఒకవేళ ఇలాంటి దేశాలు శాటిలైట్ సేవల్ని అందిపుచ్చుకోవాలంటే... ఇతర దేశాలపై ఆధారపడాల్సిందే.

శాటిలైట్లు తయారు చేసుకుని వాటిని దాచుకుంటే ఉపయోగం ఉండదు. వాటిని అంతరిక్షంలోకి పంపిస్తేనే ఉపయోగం.

స్వయంగా శాటిలైట్లు తయారు చేసుకునే శక్తి అన్ని దేశాలకు ఉండదు. కాబట్టి అవి అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి.

ఒకవేళ నిధులు, నిపుణులు, సాంకేతికత అన్నీ ఉన్నా కొన్ని దేశాలు రాకెట్ లాంఛ్ చేయడం సాధ్యం కాదు.

రాకెట్ ప్రయోగించాలంటే సముద్ర తీరం ఒక్కటే కాదు. రాకెట్‌లో ఇంధనం అయ్యేంత వరకూ ప్రయాణించగలిగే సుదీర్థమైన సముద్ర ప్రాంతం కావాలి.

ల్యాండ్ లాక్డ్ స్టేట్స్... అంటే సముద్ర తీరం లేకుండా, చుట్టూ ఇతర దేశాలతో సరిహద్దులు కలిగి ఉండే దేశాలు రాకెట్ లాంఛ్ చేయలేవు.

కాబట్టి సముద్ర తీరంతో పాటు, సుదీర్ఘ సముద్ర ప్రాంతం ఉన్న దేశాల నుంచి మాత్రమే రాకెట్ లాంఛింగ్ సాధ్యమవుతుంది.

అమెరికా, రష్యా, చైనా, జపాన్‌లు అంతరిక్ష ప్రయోగాలకు చేసే ఖర్చు చాలా ఎక్కువ. కాబట్టి వాటి సాయంతో శాటిలైట్లను పంపాలన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది.

కానీ ఇలాంటి దేశాలకు ఇస్రో ఇప్పుడు ఆశావహంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇస్రో ఎన్నో విదేశీ శాటిలైట్లను అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ప్రవేశ పెట్టింది.

ఇస్రో చంద్రయాన్

ఫొటో సోర్స్, AFP

అయితే ఇలా కేవలం తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేయడం ఒక్కటే కాదు... సక్సెస్ రేట్ కూడా ఇందులో కీలక భూమిక పోషిస్తుంది.

ఏ దేశమైనా చేస్తున్న అంతరిక్ష ప్రయోగాల్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటేనే, మిగిలిన దేశాలు తమ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపేందుకు ఆ సంస్థలు లేదా దేశాల దగ్గరకు వస్తాయి.

అయితే ప్రస్తుతం మిగిలిన దేశాల అంతరిక్ష సంస్థలతో పోలిస్తే... అతి తక్కువ ఖర్చుతో, ఎక్కువ సక్సెస్ రేట్‌తో ఇస్రో ముందుంది.

ఇస్రో వెబ్‌సైట్ ప్రకారం ఇప్పటి వరకూ ఇస్రో 124 స్పేస్ క్రాఫ్ట్ మిషన్లలో 34 దేశాలకు చెందిన 431 విదేశీ శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశ పెట్టింది.

ఇందులో అల్జీరియా, స్లోవేకియా, లిధువేనియా వంటి చిన్న దేశాలతో పాటు, అమెరికా, జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, జపాన్, యునైటెడ్ కింగ్‌డం వంటి పెద్ద దేశాలు కూడా ఉన్నాయి.

ఇలా కమర్షియల్ శాటిలైట్ సేవలతో పాటు, ఇస్రో ఉచితంగా కూడా కొన్నిసార్లు పేద దేశాలకు సేవలందిస్తోంది.

ఇప్పటికే నేపాల్, భూటాన్ వంటి దేశాలకు ఉచితంగా సేవలందించామని ఇటీవల బెంగళూరులో జరిగిన స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ లో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.

LVM లాంటి భారీ రాకెట్ల తయారీ ప్రస్తుతానికి ఇస్రో చాలా తక్కువ స్థాయిలో చేస్తోందని, దానిని ఇండస్ట్రియల్ స్థాయికి తీసుకెళ్లాలంటే వాటి ఉత్పత్తిని భారీగా పెంచాల్సిన అవసరం ఉందని, రాబోయే రెండేళ్లలో ఆ దిశగా మరింత ముందుకు సాగుతామని సోమనాథ్ అన్నారు.

ప్రస్తుతానికి చైనా మాదిరిగా ఏడాదిలో పదుల కొద్దీ రాకెట్ ప్రయోగాలు చేయడానికి సరిపడినంత సామర్థ్యం ఇస్రో దగ్గర లేదని సోమనాథ్ అన్నారు.

ఇస్రో అంతరిక్ష ప్రయోగం

ఫొటో సోర్స్, TWITTER/ISRO

అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు..

వర్థమాన ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న దేశంగా భారత్ పేరు తెచ్చుకుంది.

2008లో ఇస్రో చంద్రయాన్-1 ప్రయోగాన్ని 386 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేసింది.

ఆపై 2014లో మార్స్ మీదకు ప్రయోగించిన మంగళ్‌యాన్ ప్రాజెక్టు కూడా... 450 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేశారు.

ఇదే మార్స్ మీదకు నాసా ప్రయోగించిన అమెరికా మావెన్ ఆర్బిటర్ ప్రయోగానికి ఇంత కన్నా పది రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టినట్లు బీబీసీ సైన్స్ వెల్లడించింది.

అప్పట్లో భారత్ చేపట్టిన మంగళ్‌యాన్ ప్రయోగాన్ని ప్రపంచమంతా కొనియాడింది.

హాలీవుడ్‌లో భారీ వ్యయంతో స్పేస్ సినిమాలు తీస్తుంటే...అంత కన్నా తక్కువ ఖర్చుతో ఇస్రో మంగళ్‌యాన్ ప్రాజెక్ట్ పూర్తి చేసిందని ప్రధాని మోదీ కూడా కొనియాడారు.

అప్పట్లో గ్రావిటీ అనే సినిమాకు ఇంత కన్నా ఎక్కువ బడ్జెట్ అయ్యింది. కానీ ఆ సినిమా కన్నా తక్కువ ఖర్చుతో ఇస్రో మొదటి ప్రయత్నంలోనే మంగళ్ యాన్ ప్రయోగంలో విజయం సాధించింది.

2019లో కేవలం రూ. 978 కోట్లతో ఇస్రో చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ పూర్తి చేసిందని, ఇదే తరహాలో త్వరలో గగనయాన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయబోతోందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్.శ్రీరఘునందన్ బీబీసీతో తెలియచేశారు.

ఇప్పుడు చంద్రయాన్-3 ప్రాజెక్టు ఖర్చు కేవలం రూ.615 కోట్లు మాత్రమే.

ఇస్రో చంద్రయాన్

ఫొటో సోర్స్, ISRO

చంద్రయాన్-3 సక్సెస్‌తో మరిన్ని ప్రయోగాలు

ఇస్రో చేపట్టిన అత్యంత సంక్లిష్ట ప్రయోగంగా చంద్రయాన్-3 ని చెప్పుకోవచ్చు. చంద్రుడిపై అత్యంత క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై ల్యాండర్, రోవర్లను ల్యాండ్ చెయ్యబోతోంది.

చంద్రయాన్-3 తర్వాత ప్రయాణం మొదలు పెట్టిన రష్యా లూనా-25 కూడా చంద్రుడి దక్షిణ ధ్రువం మీదనే ల్యాండవ్వాలని ప్రయత్నించింది.

కానీ చంద్రుడి ప్రీ ల్యాండింగ్ ఆర్బిట్‌లోకి ప్రవేశించేటప్పుడు అనూహ్య పరిణామాలు ఏర్పడ్డాయని, చివరి నిమిషంలో సేఫ్ ల్యాండింగ్ కాకుండా చంద్రుడి మీద కూలిపోయిందని ఆ దేశ అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ వెల్లడించింది.

47 ఏళ్ల తర్వాత రష్యా చేపట్టిన ఈ మూన్ మిషన్ వైఫల్యంతో.. అందరి దృష్టీ చంద్రయాన్-3 మీదకు మళ్లింది.

భారత్ అతి తక్కువ ఖర్చుతో, అత్యంత క్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ల్యాండర్, రోవర్లను ల్యాండ్ చేయడంతో ఇస్రో సామర్థ్యం మీద ప్రపంచ దేశాలకు మరింత నమ్మకం పెరిగింది.

చంద్రుడి ఫోటోలు

ఫొటో సోర్స్, ISRO

భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలతో భారీ ఆదాయం

చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయితే, అంతరిక్ష రంగంలో టాప్ ప్లేస్‌లో ఉన్న అమెరికా, రష్యా, చైనాలతో భారత్ కూడా పోటీ పడే స్థాయికి చేరుకుంటుంది.

కమర్షియల్ అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ మరింత రాణించేందుకు ఈ విజయం దోహదం చేస్తుంది.

2020 నాటికి 9.6 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత్‌లో స్పేక్ ఎకానమీ 2025 నాటికి ఏటా 6 శాతం వృద్ధి రేటుతో 13 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక అంచనా వేసింది.

ఈ స్పేస్ ఎకానమీలో శాటిలైట్ సర్వీసులు, అప్లికేషన్ సేవలు కీలక భూమిక పోషిస్తాయని నివేదిక తెలిపింది.

ప్రస్తుతం శాటిలైట్ కమ్యూనికేషన్ వినియోగించుకుంటున్న రంగాలతో పాటు, భవిష్యత్తులో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అటానమస్ వెహికిల్స్, అడ్వాన్స్ డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ వంటి న్యూ ఏజ్ టెక్నాలజీల్లో కూడా శాటిలైట్ సేవలు మరింత ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.

శాటిలైట్ తయారీ, శాటిలైట్ లాంచింగ్ సర్వీసులు, గ్రౌండ్ సెగ్మెంట్‌లు, శాటిలైట్ సర్వీసులు ఇలా నాలుగు రంగాల్లోనూ భారత్ గణనీయమైన వృద్ధి సాధించబోతోంది.

అన్నింటినీ మించి మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా శాటిలైట్ తయారీ రంగం కూడా భారత్‌లో వృద్ధి చెందనుంది.

ఇండియన్ స్పేస్ ఎకానమీలో 2025 నాటికి శాటిలైట్ రంగం భారీగా పుంజుకోనుంది.

ఎర్నెస్ట్ అండ్ ఎంగ్ నివేదిక ప్రకారం... 2020 నాటికి గ్లోబల్ స్పేస్ ఎకానమి 447 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ఏటా 6 శాతం వృద్ధి రేటుతో 2025 నాటికి 600 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది.

2014 నుంచి 2019 మధ్య కాలంలో ఇస్రో 26 దేశాలకు చెందిన శాటిలైట్లను అంతరిక్షంలో ప్రవేశ పెట్టడం ద్వారా 167.5 మిలియన్ డాలర్ల ( సుమారు రూ.1391.34 కోట్లు ) ఆదాయాన్ని ఆర్జించింది.

చంద్రయాన్-3 విజయంతో ఇది మరింత వృద్ధి చెందబోతోంది.

2020 నాటికి దేశ జీడీపీలో 0.4 శాతంగా ఉన్న స్పేస్ ఎకానమీ రంగం మరింత వృద్ధి చెంది ఆదాయంతో పాటు, మరిన్ని ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.

ఇస్రో చంద్రయాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలో స్పేస్‌ఎక్స్‌లాంటి ప్రైవేట్ సంస్థలు కూడా రాకెట్ ప్రయోగాలు చేస్తున్నాయి.

భారత్‌ అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం

ప్రైవేట్ అంతరిక్ష సేవల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజన్, వర్జిన్ గాలాక్టిక్ వంటి వేలాది సంస్థలు అమెరికాలో ఉన్నాయి.

కానీ, భారత్‌లో ఇప్పుడిప్పుడే స్పేస్ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం గణనీయంగా వృద్ధి చెందుతోంది.

ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం 2021 నాటికి అమెరికా 5582 స్పేస్ టెక్ కంపెనీలతో టాప్ వన్ స్థానంలో ఉండగా, భారత్ ఐదో స్థానంలో నిలిచింది.

2019 తర్వాత భారత్‌లో కూడా స్పేస్ స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2021 నాటికి దేశంలో వందకు పైగా స్పేస్ టెక్ సార్టప్‌లు వృద్ధి చెందాయి.

2022 నవంబర్ 18 స్కైరూట్ ఏరో స్పేస్ తయారు చేసిన విక్రమ్ ఎస్ అనే రాకెట్‌ను శ్రీహరి కోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు.

ఇలా ప్రైవేటు రంగంలో అంతరిక్ష ప్రయోగాలు మరింత విజయవంతం అవుతూ ఉంటే... అమెరికా మాదిరిగానే ఇక్కడ కూడా ప్రైవేట్ కమర్షియల్ శాటిలైట్లు, రాకెట్ ప్రయోగాలు, స్పేస్ టూరిజం వంటివి వృద్ధి చెందే అవకాశం ఉంది.

ఇది భారత దేశ జీడీపీకి ఒక కొత్త ఆర్థిక పురోగతిని అందించడంతో పాటు, ఈ రంగంలో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది.

ఇస్రో

ఫొటో సోర్స్, ISRO

చంద్రయాన్-3 సక్సెస్‌తో భారత్‌కు మరిన్ని పెట్టుబడులు

చంద్రయాన్-3 సక్సెస్‌తో భారత్ స్పేస్ టెక్నాలజీ మీద మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లను ప్రోత్సహిస్తుంది.

2021 నాటికి దేశంలో ఉన్న స్పేస్ టెక్ స్టార్టప్‌లపై ఇన్వెస్ట్ మెంట్ 68 మిలియన్ డాలర్లుగా ఉంది. ఆ ఏడాది అనూహ్యంగా దేశంలో 47 కొత్త స్పేస్ స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి.

ఇవి ఏటా 196 శాతం వృద్ధి రేటుతో ముందుకెళ్తున్నాయి. మిగిలిన దేశాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో స్పేస్ ప్రోగ్రామ్‌లు నిర్వహించగల సత్తా మన స్పేస్ స్టార్టప్‌లకు ఉందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక పేర్కొంది.

2018లో ప్రారంభమైన స్కైరూట్ ఏరో టెక్నాలజీస్... ఇటీవల వందశాతం త్రీడీ ప్రింటింగ్‌తో క్రయోజనిక్ రాకెట్ ఇంజిన్‌ను తయారు చేసింది.

దీని వల్ల రాకెట్లో విడిభాగాల సంఖ్య, ఖర్చు తగ్గడంతో పాటుగా, ప్రాజెక్ట్ లీడ్ సమయాన్ని కూడా 80 శాతం తగ్గించవచ్చు.

ఇదే విధంగా బెల్లాట్రిక్స్ ఏరో స్పేస్, అగ్నికుల్ వంటి ఎన్నో స్టార్టప్‌లో భారత్‌ ప్రైవేట్ స్పేస్ రంగంలో అద్భుతాలు సృష్టించబోతున్నాయి.

ఇవన్నీ సాధించబోయే విజయాలు భారత అంతరిక్ష రంగానికి భారీ పెట్టుబడులు, భారీ ఆదాయంతో పాటు, అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యా, చైనా, జపాన్లకు దీటుగా భారత్‌ను నిలబెట్టనున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)