నిగర్ షాజీ: సూర్యుడిపైకి రాకెట్ పంపిన 'ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని' కథ

ఫొటో సోర్స్, PTI
- రచయిత, ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో తొలిసారిగా సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను శ్రీహరికోట నుంచి ప్రయోగించారు.
రాకెట్ ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో చీఫ్ సోమనాథ్ సంతోషం వ్యక్తం చేసి, ప్రసంగించారు.
ఆయన తర్వాత ఆదిత్య-ఎల్1 ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ స్టేజి మీదకు వచ్చారు.
ఆదిత్య-ఎల్1 విజయవంతంగా ప్రయోగించడంతో ప్రాజెక్టు బృందం కల నెరవేరిందని నిగర్ అన్నారు. అంతరిక్ష నౌక విజయవంతంగా గమ్యస్థానానికి చేరుకుంటోందని ఆమె ప్రకటించారు.
“వ్యోమనౌక తన 125 రోజుల ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆదిత్య-ఎల్1 గమ్యస్థానానికి చేరుకుంటే అది భారత అంతరిక్ష రంగానికి గొప్ప ఆస్తి అవుతుంది” అని నిగర్ అనగానే శాస్త్రవేత్తల చప్పట్లతో మార్మోగింది ఇస్రో హాల్.

ప్రభుత్వ పాఠశాలలో చదివి.. ఇస్రోకు
తమిళనాడులోని తెన్కాసి జిల్లా సెంగోట్టైకి చెందిన నిగర్ షాజీ 1987 నుంచి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పనిచేస్తున్నారు.
1 నుంచి 12వ తరగతి వరకు సెంగోట్టైలోని తిరు రామమంత్రం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చదివారు నిగర్ షాజీ.
పన్నెండో తరగతి పూర్తి చేసిన అనంతరం నిగర్ షాజీకి మెడిసిన్ చదివే అవకాశం వచ్చినా, సైన్స్‌పై ఉన్న ఆసక్తితో ఇంజినీరింగ్‌ను ఎంచుకున్నట్లు ఆమె సోదరుడు షేక్ సలీం బీబీసీతో తెలిపారు.
“స్కూల్‌లో ఉన్నప్పటి నుంచే షాజీకి సైన్స్ అంటే ఆసక్తి. నేషనల్ సైన్స్ సెంటర్ స్కాలర్‌షిప్ ద్వారానే 8 నుంచి 12వ తరగతి వరకు చదివారు” అని సలీం చెప్పారు.
అప్పట్లో ప్రభుత్వ పాఠశాలలో తమిళ మీడియం విద్యాభ్యాసంతో పాటు ఇంగ్లిష్ మీడియం విద్య కూడా ఉండేదన్నారు సలీం. అయితే ఇంగ్లిష్ మీడియానికి రూ.15 ఫీజు చెల్లించాల్సి వచ్చేదని తెలిపారు.
“మా నాన్నగారు 1940లలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదివారు. అయితే ఉద్యోగంపై దృష్టి పెట్టకుండా ఆయన వ్యవసాయం వైపు మొగ్గుచూపారు’’ అని సలీం చెప్పారు.

మెడిసిన్ కాకుండా ఇంజినీరింగ్ వైపు..
12వ తరగతి తర్వాత తిరునల్వేలిలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివారు నిగర్ షాజీ.
1986లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత, అదే ఏడాది ఒక వార్తాపత్రికలో ఇస్రో ప్రకటన చూసి నిగర్ దానికి దరఖాస్తు చేసుకున్నారని సలీం చెప్పారు.
“అప్పట్లో ఇంజనీర్ల కోసం ఇస్రో తరచుగా వార్తాపత్రికలలో ప్రకటనలు ఇచ్చేది, నిగర్ షాజీ జూన్, జూలైలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆగస్టులో రిక్రూట్‌మెంట్ ప్రకటనను చూసి దరఖాస్తు చేసుకుంది. 83 మంది అప్లై చేయగా ఆరుగురు ఎంపికయ్యారు. వారిలో నిగర్ అగ్రస్థానంలో నిలిచారు ” అని సలీం గుర్తుచేసుకున్నారు.
తొలుత శ్రీహరికోటలో పనిచేసిన నిగర్ షాజీ, మూడు నెలల తర్వాత బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి బదిలీ అయ్యారు. మొదట్లో ఉపగ్రహాలను ట్రాక్ చేయడంలో పనిచేశారామె. ఆ తర్వాత శాటిలైట్ తయారీలో భాగమయ్యారు.

ఆదిత్య కోసం నాసాలో శిక్షణ
నిగర్ షాజీ ఆదిత్య-ఎల్1 ప్రాజెక్ట్‌తో పాటు చంద్రయాన్ ప్రాజెక్టులలో కూడా పనిచేశారు.
మూడు దశాబ్దాల ఈ ప్రయాణంలో అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన శిక్షణ కోసం అమెరికా, స్కాట్లాండ్ వంటి దేశాలకు వెళ్లారు నిగర్.
"ఆదిత్య-ఎల్1 కోసం నాసాలో శిక్షణ తీసుకున్నారు నిగర్" అని సలీం చెప్పారు.
1987లో ఇస్రోలో చేరిన తర్వాత 2000లో ఐటీ రంగం వృద్ధి కారణంగా నిగర్ షాజీ సహచరులు కొందరు ఐటీకి మారారని, నిగర్ షాజీ కూడా ఆ రంగానికి మారాలనుకున్నారని సలీం తెలిపారు.
పే కమిషన్ రాకముందు ఇస్రోలో జీతాలు తక్కువగా ఉండేవని, ఆ కాలంలో ఇస్రోతో పోలిస్తే ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి జీతాలు ఎక్కువగా ఉండేవని ఆయన గుర్తుచేసుకున్నారు.
ప్రభుత్వ ఖర్చులతో చదివింది కాబట్టి, సమాజం కోసం ఇస్రోలోనే పని కొనసాగించాలని నిగర్ నిర్ణయించుకున్నారని సలీం తెలిపారు.
ప్రస్తుతం 85 ఏళ్ల తల్లితో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు నిగర్ షాజీ. ఆమె ఏడాది క్రితం పదోన్నతి కూడా పొందారు.
ఆదిత్య-ఎల్1 ప్రాజెక్టులో సుమారు ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నారు నిగర్. ఆమె భర్త గల్ఫ్ దేశంలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. నిగర్ కొడుకు నెదర్లాండ్స్‌లో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు.

ప్రాజెక్టు డైరెక్టర్లంతా ఒక రాష్ట్రం వాళ్లే..
చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ మైలస్వామి అన్నాదురై, చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ వనిత, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేల్ ముగ్గురూ తమిళనాడుకు చెందినవారే.
ఆదిత్య-ఎల్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ కూడా తమిళనాడుకు చెందినవారే.
ఈ సందర్భంగా నిగర్ షాజీని డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అభినందించారు.
దేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచే అన్వేషణ కార్యక్రమానికి నాయకత్వం వహించారని, ఆమె విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు కనిమొళి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, SKYROOT
ఇవి కూడా చదవండి
- చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు భూమి లోపల నీటి జాడను పసిగడతాయా... సైన్స్ ఏం చెబుతోంది?
- రిలయన్స్: ముకేశ్ అంబానీ తరువాత ఈ లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసులు ఎవరు?
- కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం మంచిదా, కాదా?
- 'ఓ మై గాడ్, అది భూమి'.. ఉచితంగా స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన తల్లీకూతుళ్ల అనుభవాలు
- ఐవీఎఫ్: పిల్లలను కనాలనుకొనే జంటలకు ఉచితంగా 5 లక్షల చికిత్స.. గోవా ఈ పథకం ఎందుకు తెచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














