ఆదిత్య-ఎల్1: భారత తొలి 'సన్ మిషన్' ప్రయోగించిన ఇస్రో... ఈ మిషన్ లక్ష్యం ఏంటంటే?

ఫొటో సోర్స్, ISRO
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువంలో విజయవంతంగా దించి చరిత్ర సృష్టించిన కొద్ది రోజుల్లోనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సూర్యుడిపై అధ్యయనం చేపట్టేందుకు తొలి అబ్జర్వేటరీ మిషన్ 'ఆదిత్య-ఎల్1'ను భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11.50 నిమిషాలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించిది.
ఈ అంతరిక్ష నౌక భూమి నుంచి 15 లక్షల కి.మీలు ఇది ప్రయాణించనుంది. ఇంత దూరం ప్రయాణించేందుకు ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకకు నాలుగు నెలల సమయం పడుతుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది.
సౌర వ్యవస్థలో అతిపెద్ద ఖగోళ పదార్థమైన సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్ చేపడుతున్న తొలి మిషన్ ఇది.
హిందూ పురాణాల్లో సూర్యుడిని ఆదిత్య అని కూడా పిలుస్తారు. ఈ పేరుతోనే భారత్ తన తొలి మిషన్ ప్రయోగించింది.
ఎల్1 అంటే లెగ్రాంజ్ పాయింట్ 1. భూమికి, సూర్యునికి మధ్యలో ఈ భారతీయ వ్యోమనౌక వెళ్లే ప్రాంతమిది.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం, లెగ్రాంజ్ పాయింట్ అనేది సూర్యుడు, భూమి వంటి రెండు ఖగోళ పదార్థాల మధ్య గురుత్వాకర్షణ స్థిరంగా ఉండే ప్రదేశం. అక్కడ రోదసి నౌక తిరిగేందుకు వీలుంటుంది.
ఇలా భూమికి, సూర్యుడికి మధ్య ఐదు లెగ్రాంజ్ పాయింట్లు ఉంటాయి.
రెండు గురుత్వాకర్షణలను బ్యాలెన్స్ చేస్తూ ఉండేలా లెగ్రాంజ్ పాయింట్లలో ఆదిత్య -ఎల్1 లాంటి ప్రోబ్‌లను ప్రవేశపెట్టి, సూర్యుడి మీద పరిశోధనలు చేస్తారు.
ఇక్కడ అతి తక్కువ ఇంధనంతో ఈ ఉపగ్రహం పనిచేస్తుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఈ అంతరిక్ష నౌక ఒకసారి టేకాఫ్ అయిన తర్వాత, భూమి చుట్టూనే పలుమార్లు పరిభ్రమించి, ఆ తర్వాత లెగ్రాంజ్ వన్ పాయింట్ దిశగా పయనిస్తోంది.
ఈ లెగ్రాంజ్ పాయింట్ నుంచి ఆదిత్య-ఎల్1 మిషన్ నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తూ ఉంటుంది.
గ్రహణాల సమయంలో సూర్యుడు కనిపించినప్పుడు కూడా, ఇది శాస్త్రీయ పరిశోధనలను చేపడుతోంది.
అయితే, ఈ మిషన్‌కు ఎంత ఖర్చు అయిందో ఇప్పటి వరకు ఇస్రో వెల్లడించినప్పటికీ, మీడియా కథనాల ప్రకారం దీని ఖర్చు 3.78 బిలియన్(378 కోట్ల) రూపాయలుగా తెలుస్తోంది.
సూర్యుడి ఉపరితంలో ఉన్న కరోనాను ఆదిత్య-ఎల్1 అనుక్షణం పరిశీలిస్తూ ఉంటుందని ఇస్రో తెలిపింది.
ఇందుకోసం ఆదిత్య- ఎల్1లో ఏడు రకాల పరికరాలు అమర్చారు. ఇందులో నాలుగు పరికరాలు నిత్యం సూర్యుడి వైపే ఉంటూ పరిశోధనలు చేస్తాయి.
మరో మూడు పరికరాలు లెగ్రాంజ్ పాయింట్ వన్ దగ్గర పరిస్థితులను విశ్లేషించి ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపుతాయి.
ఈ ఏడు పరికరాలు ప్రధానంగా కరోనా ఉష్ణోగ్రతలో మార్పులు, కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రీ ఫ్లేర్స్, ఫ్లేర్ యాక్టివిటీస్, వాటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణంలో మార్పులు, అక్కడ ఉండే అణువులు, పరిస్థితులను విశ్లేషించడం చేస్తాయి.
సూర్యుడిపై ఉన్న క్రోమోస్పియర్ , కరోనాలలో మార్పులను విశ్లేషిస్తాయి. వీటిలోని వేడిని, అక్కడ ఉండే ప్లాస్మాను, సూర్యుడి ఉపరితలం నుంచి పెల్లుబికే సోలార్ మాస్ ఎజెక్షన్లను, వాటి జ్వాలలను విశ్లేషిస్తాయి.
సూర్యుడి కరోనా స్థితిగతుల్ని, దాని హీటింగ్ మెకానిజం పరిశీలించడం, కరోనాలో ఉండే ప్లాస్మా ఉష్ణోగ్రత, వేగం, సాంద్రతలను పరిశీలించడం, కరోనల్ మాస్ ఎజెక్షన్ల డైనిమిక్స్, వాటి ప్రభావాలను, అవి ఉత్పత్తయ్యే అంశాలను పరిశీలించడం, సూర్యుని చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని పరిశీలించడం, సౌర పవనాలు పుట్టుక, వాటి గమనం వంటి వాటి స్థితిగతుల్ని పరిశీలిస్తాయి.
ఇందుకోసం విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలీస్కోప్, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్, హై ఎనర్జీ ఎల్1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ అనే నాలుగు రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ ఏర్పాటు చేసింది. ఇవి సూర్యుడి ఉపరితలాన్ని పరిశోధిస్తాయి.
వీటితో పాటు ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, అడ్వాన్డ్స్ ట్రైయాక్సిల్ హై రిజల్యూషన్ డిజిటల్ మాగ్నటోమీటర్ పరికరాలు ఆదిత్య ఎల్1 ఉన్న స్థానిక పరిస్థితులను విశ్లేషించి ఆ డేటాను ఇస్రోకు పంపిస్తాయి.
సౌర తుపానులు, సౌర మంటలను అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకు ఈ డేటా సహకరిస్తోంది. ఇవి భూమిని, సమీపంలోని అంతరిక్ష వాతావరణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి.

ఫొటో సోర్స్, ISRO
రేడియేషన్, ఉష్ణం, మాగ్నెటిక్ ఫీల్డ్స్, పార్టికల్స్ ఫ్లో వంటి వాటి ద్వారా భూ వాతావరణాన్ని సూర్యుడు నిత్యం ప్రభావితం చేస్తూ ఉంటాడని ఇస్రో మాజీ శాస్త్రవేత్త మైలస్వామి అన్నాదురై అన్నారు.
అదే విధంగా, అంతరిక్ష వాతావరణాన్ని కూడా ప్రభావితపరుస్తుందని తెలిపారు.
‘‘ఉపగ్రహాలు సమర్థంగా పనిచేసేందుకు అంతరిక్ష వాతావరణం ఎంతో కీలకం. సౌర గాలులు లేదా సౌర తుపానులు ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్స్‌పై ప్రభావం చూపుతాయి. పవర్ గ్రిడ్స్ విఫలమయ్యేలా చేస్తాయి. అంతరిక్ష వాతావరణంపై మన పరిజ్ఞానం చాలా పరిమితంగా ఉంది‘‘ అని అన్నాదురై బీబీసీతో చెప్పారు.
అంతరిక్షంలో భారత్‌కు 50కి పైగా ఉపగ్రహాలున్నాయి. దేశానికి ఎంతో అత్యంత కీలకమైన సర్వీసులను ఇవి అందజేస్తున్నాయి.
కమ్యూనికేషన్ లింక్స్, వాతావరణ డేటా, కరువులు, సంక్షోభాలను ఇవి ముందుస్తుగా తెలియజేస్తూ ఉన్నాయి.
భూ కక్ష్యలో సుమారు 10,290 ఉపగ్రహాలున్నాయని, వాటిలో ప్రస్తుతం 7,800 ఉపగ్రహాలు నిర్వహణలో ఉన్నట్లు యూఎన్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ (యూఎన్ఓఓఎస్ఏ) తెలిపింది.
ఆదిత్య మనకు సౌర వ్యవస్థను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సాయపడుతుంది. ముందస్తు హెచ్చరికలు కూడా చేస్తోంది.
‘‘సూర్యుడి నుంచి వెలువడే సౌర గాలులు లేదా తుపానులు వంటి వాటిని మనం ముందుగా తెలుసుకోవడం వల్ల, మన ఉపగ్రహాలను వీటి బారిన పడకుండా వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించవచ్చు. అంతరిక్షంలో మన ఉపగ్రహాల కాలాన్ని పెంచుకునేందుకు ఇది సాయపడుతుంది’’ అని అన్నాదురై చెప్పారు.
సూర్యుడిపై మన శాస్త్రీయ అవగాహనను మెరుగుపరుచుకునేందుకు ఈ మిషన్ సాయపడుతుంది. సౌర వ్యవస్థలో మధ్యలో ఉండే సూర్యుడి వయస్సు దాదాపుగా 4.5 బిలియన్ సంవత్సరాలు.
చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువంలో విజయవంతంగా దించి చరిత్ర సృష్టించిన కొద్ది రోజుల్లోనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సూర్యుడిపై ఈ అధ్యయనం చేపడుతోంది.
అమెరికా, మాజీ సోవియట్ యూనియన్, చైనా తర్వాత చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో నాలుగో దేశంగా భారత్ నిలిచింది.
ఒకవేళ ఆదిత్య-ఎల్1 విజయవంతమైతే, సూర్యుడిపై ఇప్పటికే అధ్యయనం చేపడుతోన్న దేశాల జాబితాల్లోకి మన భారత్ కూడా చేరుతుంది.
సౌర మంటలపై అధ్యయనం చేపట్టేందుకు 1981లో తొలిసారి జపాన్ తన మిషన్‌ను లాంచ్ చేసింది. తర్వాత, 1990ల నుంచి నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ)లు సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తున్నాయి.
2020 ఫిబ్రవరిలో నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా సోలార్ ఆర్బిటర్ లాంచ్ చేశాయి. ఇది సూర్యుడిని సమీపం నుంచి అధ్యయనం చేస్తూ, డేటాను సేకరిస్తోంది.
2021లో నాసా కొత్త అంతరిక్ష నౌక పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా గుండా ప్రయాణించి చరిత్ర సృష్టించింది.
ఈ పార్కర్ ప్రోబ్ ఇప్పటి వరకూ సూర్యుడి కరోనా గురించిన విలువైన డేటాను నాసాకు అంద చేసింది.
ఇస్రో ప్రయోగిస్తున్న ఆదిత్య L1 కూడా ఇదే విధంగా సూర్యుడికి సంబంధించిన సమాచారం అందించడంతో పాటు, సౌరతుపానులను అనునిత్యం కనిపెడుతూ ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి చనిపోతే శరీరాన్ని ఏం చేస్తారు?
- కొందరు ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే మానేస్తారెందుకు?
- కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం మంచిదా, కాదా?
- 'ఓ మై గాడ్, అది భూమి'.. ఉచితంగా స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన తల్లీకూతుళ్ల అనుభవాలు
- ఐవీఎఫ్: పిల్లలను కనాలనుకొనే జంటలకు ఉచితంగా 5 లక్షల చికిత్స.. గోవా ఈ పథకం ఎందుకు తెచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















