అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి చనిపోతే, శరీరాన్ని ఏం చేస్తారు?

వ్యోమగామి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్మాన్యుయేల్ ఉర్కియెటా
    • హోదా, బీబీసీ కన్వర్జేషన్

2025లో చంద్రుడిపైకి, మరో పదేళ్లలో అంగారకుడిపైకి వ్యోమగాములను పంపాలని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ప్రయత్నాలు చేస్తోంది.

అంతరిక్షంలోకి మనుషులను పంపడం కష్టమైన పని, ప్రమాదకరమైనది కూడా.

గత 60 ఏళ్లలో ఇలాంటి ఘటనల్లో దాదాపు 20 మంది మరణించారు.

1986 నుంచి 2003 మధ్యలో చోటుచేసుకున్న నాసా స్పేస్ షటిల్ ప్రమాదాల్లో 14 మంది మరణించారు.

1967లో జరిగిన అపోలో 1 లాంచ్ ప్యాండ్ ఘటనలో ముగ్గురు, 1971 సూయజ్ 11 మిషన్‌లో మరో ముగ్గురు చనిపోయారు.

అంతరిక్ష యానం క్లిష్టమైనది, ఖర్చుతో కూడుకున్నది కూడా.

ఇపుడు డబ్బులు చెల్లించి వెళ్లే వాణిజ్య అంతరిక్ష ప్రయాణాలూ మొదలయ్యాయి. దీంతో అంతరిక్ష యానం అనేది సాధారణమైపోతోంది.

చాలా మందిలో మెదిలే ప్రశ్నలు ఏంటంటే- అంతరిక్షంలోకి వెళ్లాక వ్యోమగాములు చనిపోతే వారి మృతదేహాలను ఏం చేస్తారు? అక్కడే అంత్యక్రియలు చేస్తారా? తిరిగి తీసుకొస్తారా? భారీ వ్యయంతో, సుదీర్ఘ ప్రణాళికతో చేపట్టిన యాత్రను మధ్యలో ముగిస్తారా?

భవిష్యత్తులో లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపైనో, అంగారకుడిపైనో అమెరికా వ్యోమగాములు చనిపోతే ఎలా? నాసా ఏం చేస్తుంది?

ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

రాకెట్

ఫొటో సోర్స్, Getty Images

నాసా ప్రోటోకాల్స్ ఏం చెబుతున్నాయి?

అంతరిక్ష యాత్రకు వెళ్లే వ్యోమగాములు వీలైనంత ఆరోగ్యంగా ఉండేలా నాసాకు చెందిన ‘ద ట్రాన్స్‌లేషనల్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ హెల్త్‌’ చూసుకుంటుంది.

అంతరిక్షయానం చేసే వ్యోమగామి మధ్యలో లేదా 'లో ఎర్త్ ఆర్బిట్‌'లో చనిపోతే, శరీరాన్ని క్యాప్సూల్‌లో భూమికి గంటల వ్యవధిలోనే తీసుకొస్తారని ఆ సంస్థలో పనిచేసే ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ ఉర్కియెటా అంటున్నారు.

అదే చంద్రునిపై చనిపోతే మృతదేహం భూమ్మీదకు అప్పటికప్పుడు రావడం కష్టం. కొద్ది రోజులు పడుతుంది. ఇలాంటి వాటి కోసం నాసా సవివర ప్రోటోకాల్‌ రూపొందించింది కూడా.

మిషన్‌లో ఎవరైనా చనిపోతే వ్యోమగాములు భూమ్మీదకు తిరిగి వస్తున్నారంటే, మృతదేహాన్ని వేగంగా తీసుకురావాలనేది నాసా ఉద్దేశం కాదు. మిగిలిన వారు సురక్షితంగా తిరిగి రావడం ఆ సంస్థ మొదటి ప్రాధాన్యం.

అయితే, అంగారక గ్రహానికి వెళ్లే (300 మిలియన్ మైళ్ల ప్రయాణంలో) వ్యోమగామి మరణిస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.

మార్స్

ఫొటో సోర్స్, Getty Images

మార్స్ మీద చనిపోతే అక్కడే అంత్యక్రియలు చేస్తారా?

వ్యోమగాములు ఎక్కువ దూరం వెళుతున్న సందర్భంలో ఎవరైనా చనిపోతే సిబ్బంది తిరిగి వెనక్కి రావడం కష్టం. మిషన్ ముగిశాక మృతదేహాన్ని భూమి మీదకు తీసుకురావడానికి కొన్నేళ్లు కూడా పట్టొచ్చు.

అప్పటివరకు శరీరాన్ని ప్రత్యేక ఛాంబర్‌లో లేదా ప్రత్యేకమైన బాడీ బ్యాగ్‌లో భద్రపరచాల్సిన బాధ్యత వ్యోమగాములది.

అంతరిక్ష నౌక లోపలైతే స్థిరమైన ఉష్ణోగ్రత, తేమ మృతదేహాన్ని సంరక్షించడంలో సహాయపడతాయి.

స్టేషన్ లేదా స్పేస్‌క్రాఫ్ట్ వంటి ప్రదేశాల్లో ఇది సాధ్యపడుతుంది. మరి మార్స్ లాంటి గ్రహం మీద ఎలా? అక్కడ వాతావరణం భిన్నంగా ఉంటుంది.

వీడియో క్యాప్షన్, అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామి చనిపోతే, శరీరాన్ని ఏం చేస్తారు?

మార్స్ మీద అంత్యక్రియలు ఎందుకు చేయలేరు?

అంగారకుడిపైకి వ్యోమగాములు చేరాక, ఎవరైనా మరణించారని అనుకుందాం. అక్కడ దహన సంస్కారాలకు ఆస్కారం లేదు. తోటి సిబ్బందికి ఆ పని కష్టసాధ్యమైంది.

ఎందుకంటే దానికోసం వారు చాలా శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో మిషన్ పనులు చేయడానికి వారికి శక్తి చాలా అవసరం. మరోవైపు ఖననం కూడా మంచి ఆలోచన కాదు.

శరీరంలోని బాక్టీరియా, ఇతర జీవులు మార్స్ ఉపరితలాన్ని కలుషితం చేయవచ్చు. దీంతో భూమి మీదకు వచ్చే వరకు ప్రత్యేకమైన బాడీ బ్యాగులో శరీరాన్ని భద్రపరుస్తారు.

(ఇమ్మాన్యుయేల్ ఉర్కియెటా, హ్యూస్టన్‌లో ఉన్న టెక్సాస్ మెడికల్ సెంటర్‌లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో స్పేస్ మెడిసిన్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్.

‘ద కన్వర్జేషన్‌’లో పబ్లిష్ అయిన ఈ కథనాన్ని క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద ఇక్కడ అందించాం. అసలు వర్షన్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)