రష్యాకు అణుబాంబు ఫార్ములాను చేరవేసిన అమెరికన్ శాస్త్రవేత్త....తెలిసినా ఆ దేశం ఎందుకు శిక్షించలేకపోయింది?

అమెరికా శాస్త్రవేత్త థియోడర్

ఫొటో సోర్స్, LOS ALAMOS NATIONAL LABORATORY HANDOUT

ఫొటో క్యాప్షన్, మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌లో పనిచేసిన అతి పిన్న వయస్కుడైన శాస్త్రవేత్త థియోడర్ హాల్ .

1949 ఆగష్టు 29న ప్లూటోనియం అణుబాంబు (RDS-1)ను అభివృద్ధి చేసింది సోవియట్ యూనియన్. దీంతో అణ్వాయుధాన్ని పొందిన రెండో దేశంగా అవతరించింది.

1953 వరకు సోవియట్ యూనియన్ అణ్వాయుధాలను పొందడం సాధ్యం కాదనీ సీఐఏ అంచనా. అయితే రష్యా 1949లోనే విజయవంతంగా అణు పరీక్షలను నిర్వహించి పాశ్చాత్య శక్తులను ఆశ్చర్యపరిచింది.

థియోడర్ హాల్ అనే అమెరికన్ శాస్త్రవేత్త రష్యా అణుశక్తి సాధించడంలో సాయపడ్డారు. సోవియట్ యూనియన్‌కు అణ్వాయుధాల సమాచారాన్ని ఆయన రహస్యంగా అందించారు.

థియోడర్ హాల్ కాకుండా మరికొందరు అమెరికన్ శాస్త్రవేత్తలు కూడా సోవియట్ యూనియన్‌కు అణు రహస్యాలను అందించిన వారిలో ఉన్నారు.

అయితే, న్యూయార్క్‌లో పుట్టి, హార్వర్డ్‌లో చదువుకున్న థియోడర్ హాల్, సోవియట్ యూనియన్‌కు గూఢచారి ఎలా అయ్యాడన్నది అసలు ప్రశ్న

అణుబాంబు ప్రయోగం

ఫొటో సోర్స్, Getty Images

అణుబాంబు ప్రాజెక్టులోకి ఎలా వెళ్లాడు?

కజకిస్తాన్‌లో మొదటి అణు విస్ఫోటనం జరిపింది సోవియట్ యూనియన్.

1945 ఆగష్టు 9న జపాన్ నగరం నాగసాకిపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు మాదిరే సోవియట్ యూనియన్ మొదటి అణుబాంబు ఉండటం యాదృచ్చికమైతే కాదు.

బ్రిటన్ , కెనడా సహకారంతో అమెరికా నిర్వహించిన అణ్వాయుధ రహస్య ప్రాజెక్టు పేరు 'మాన్‌హట్టన్'. ఈ ప్రాజెక్ట్' నుంచి అణుబాంబు సమాచారం సోవియట్ యూనియన్‌కు చేరింది.

అణ్వాయుధాల ప్రాజెక్టు గోప్యత కీలకం. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని డజన్ల మందికి తప్ప, మాన్‌హాటన్ ప్రాజెక్ట్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆ డజన్ల మందిలో థియోడర్ హాల్ కూడా ఒకరు.

థియోడర్ హాల్ 1925 అక్టోబర్ 20న న్యూయార్క్‌లో పుట్టారు. వాళ్ల నాన్న ఒక వ్యాపారవేత్త. అమ్మ గృహిణి.

థియోడర్ హాల్ పదహారేళ్ల వయసులో హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందారు. 1944లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గణితం, భౌతిక శాస్త్రాలలో ఉన్నత విద్య చదువుకున్నారు.

హార్వర్డ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు థియోడర్. దీంతో అమెరికా అణు కార్యక్రమం కోసం థియోడర్‌కు అధికారుల నుంచి పిలుపు వచ్చింది.

థియోడర్ హాల్‌ను మొదటిసారిగా లాస్ అలమోస్ లాబోరేటరీలో అమెరికన్ అధికారులు ఇంటర్వ్యూ చేశారు.

అయితే, థియోడర్ హాల్‌ మరొకరికి ఆల్రెడీ రిక్రూట్‌ అయ్యాడని ఇంటర్వ్యూ చేసిన అమెరికా అధికారికి అప్పుడు తెలియదు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

సోవియట్ యూనియన్‌‌తో థియోడర్‌కు కనెక్షన్ ఎలా?

థియోడర్ హాల్ మార్క్సిస్ట్ విద్యార్థి సంఘంలో సభ్యుడు. హాస్టల్‌లో ఆయన రూమ్‌మేట్ సవిలే సాచ్స్. అతనొక రష్యన్ వలసదారుడి కుమారుడు.

సవిలే సాచ్స్ న్యూయార్క్‌లో పుట్టాడు. కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తి. సోవియట్ యూనియన్ కోసం పని చేయడానికి థియోడర్ హాల్‌ను సవిలే ఒప్పించాడు.

లాస్ అలమోస్ లాబొరేటరీ నుంచి ప్లూటోనియం అణుబాంబు రహస్య సమాచారం థియోడర్ హాల్ బయటకు తీసుకువచ్చాడు. సవిల్ సాచ్స్ దానిని సోవియట్ యూనియన్‌కు అందించారు.

1997లో న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురితమైన రాతపూర్వక ప్రకటనలో థియోడర్ హాల్ (అతని మరణానికి రెండేళ్ల ముందు) అణ్వాయుధాలపై ఒకరి గుత్తాధిపత్యం ఉండటం సమంజసం కాదని, దానికి భయపడుతున్నానని తెలిపారు.

సోవియట్ యూనియన్ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం సమతుల్యంగా ఉంటుందని నమ్మేవారు థియోడర్.

మాన్ హాట్టన్ ప్రాజెక్టు అణుబాంబు

ఫొటో సోర్స్, Getty Images

ఫార్ములా ఎందుకు ఇచ్చారు?

అమెరికాకు సోవియట్ యూనియన్ మిత్రదేశంగా ఉన్న రోజులవి.

"హిట్లర్‌తో సోవియట్ యూనియన్ ధైర్యంగా పోరాడింది. భారీ నష్టాలనూ చవిచూసింది. పశ్చిమ మిత్రదేశాలను నాజీ జర్మనీ నుంచి రక్షించింది బహుశా సోవియట్ యూనియనే" అని థియోడర్ తెలిపారు.

థియోడర్ హాల్‌ను సోవియట్ యూనియన్‌ ప్రజలు 'ది యంగ్‌స్టర్' అని పిలుస్తుంటారు. జపాన్‌లోని నాగసాకిపై అమెరికా వేసిన అణుబాంబు ప్లూటోనియం, హిరోషిమాపై వేసింది యురేనియం.

రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా, సోవియట్ యూనియన్‌లకు ఉమ్మడి శత్రువు ఉండేవాడు. దీనర్థం రెండు దేశాలు ఒకదానిపై మరొకటి గూఢచర్యం చేసుకోలేదని కాదు.

వాస్తవానికి 1943లో సోవియట్ యూనియన్‌పై గూఢచర్యం కోసం అమెరికా వెనోనా అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.

1946 డిసెంబరులో అమెరికన్ కోడ్ బ్రేకర్లు సోవియట్ యూనియన్ అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి రహస్య సమాచారాలను డీకోడ్ చేశారు.

మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌లో సోవియట్ గూఢచారులు ఉన్నారని అమెరికాకు తెలిసింది. థియోడర్ హాల్ గురించి ఎఫ్‌బీఐ వివరాలు సంపాదించింది.

ఎన్ఎస్ఏ

ఫొటో సోర్స్, NSA

థియోడర్‌ను ఎందుకు దోషిగా నిరూపించలేకపోయారు?

1950లో చికాగో విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో థియోడర్‌ను ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది.

అంతకు ఏడాదిముందే మాన్‌హట్టన్ ప్రాజెక్ట్‌లో పనిచేసిన జర్మన్ శాస్త్రవేత్త క్లాస్ ఫుచ్స్‌ను అరెస్టు చేసింది అమెరికా.

అమెరికా అణు రహస్యాలను క్లాస్ శత్రువుకు చేరవేసినట్లు విచారణలో తేలింది, ఆయన దాన్ని అంగీకరించారు కూడా.

అయితే థియోడర్ హాల్, ఆయన స్నేహితుడైన సవిలే సాచ్స్‌లు సమాచారం చేరవేత ఆరోపణలను కొట్టిపారేశారు.

అమెరికన్ అధికారులు మాస్కోను సంప్రదించి ఈ వ్యవహారాన్ని నిజమని నిరూపించే అవకాశం ఉంది. కానీ, సోవియట్ రహస్య సందేశాలను చదవడంలో ప్రావీణ్యం సంపాదించారని కోర్టులో వెల్లడించడానికి అమెరికన్ అధికారులు ఇష్టపడలేదు. థియోడర్ హాల్ బయటపడటానికి ఇదే కారణం.

ఇదే సమయంలో థియోడర్ హాల్, ఆయన భార్య వారి భద్రత గురించి భయాందోళన చెందారు.

అప్పట్లో థియోడర్ హాల్ న్యూయార్క్ ఆసుపత్రిలో పరిశోధకుడిగా పనిచేసేవారు. కేసు కారణంగా కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయారు. అనంతరం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగంలో చేరారు.

1984లో పదవీ విరమణ చేశారు. 1996లో బహిర్గతమైన కొన్ని పత్రాలు సోవియట్ యూనియన్‌తో ఆయన పరిచయాలను వెల్లడించాయి. అయితే అప్పటికి సవిలేతో సహా సాక్షులందరూ మరణించారు. థియోడర్ హాల్ 1999లో క్యాన్సర్‌తో చనిపోయారు.

థియోడర్ హాల్
ఫొటో క్యాప్షన్, థియోడర్ హాల్ 1999లో చనిపోయారు.

'చైనాపై అణుబాంబు వేసేవారు'

'నా మీద ఆరోపణలు వచ్చాయి. చరిత్ర గమనం మారకపోతే, బహుశా గత యాభై ఏళ్లలో అణుయుద్ధం జరిగి ఉండేది. ఉదాహరణకు 1949 సంవత్సరంలో లేదా 1950 ప్రారంభంలో చైనాపై అణుబాంబు వేసేవారు. ఇవన్నీ జరగకుండా నిరోధించడానికి నేను ఏ విధంగానైనా సాయపడి ఉంటే, నేను దాన్ని అంగీకరిస్తున్నా' అని థియోడర్ హాల్ న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్‌తో చెప్పారు.

కాగా, నాగసాకి, హిరోషిమాలపై అణుదాడులు జరిగినప్పటి నుంచి అణ్వాయుధాలు వాడలేదు.

అమెరికా మళ్లీ అణ్వాయుధాలు వాడకపోవడానికి కారణం తానేనన్న విశ్వాసంతో థియోడర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)