వసీలీ అర్ఖిపోవ్: అణుయుద్ధం జరగకుండా ప్రపంచాన్ని రక్షించిన రష్యన్ కమాండర్

ఫొటో సోర్స్, WIKICOMMONS
అది 1962, అక్టోబర్ 27వ తేదీ. ప్రపంచం ఆ రోజు ప్రమాదం అంచుల్లో ఉంది. అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య తలెత్తిన క్షిపణి (మిస్సైల్) సంక్షోభం ఏ క్షణంలోనైనా అణుయుద్ధంగా మారే అవకాశం ఉంది.
ఈ సంక్షోభం మధ్యలో క్యూబాలో సిద్ధం చేసిన మిస్సైల్స్‌ను వెనక్కి తీసుకోవాలని రష్యాని అమెరికా డిమాండ్ చేసింది. క్యూబా నుంచి కేవలం 200 కిలోమీటర్ల దూరంలోనే అమెరికా తీరప్రాంతాలు ఉండడమే అందుకు కారణం. అప్పటికే ఉద్రిక్తతలు తీవ్రంగా ఉండడంతో తమ భూభాగాలను రక్షించుకునేందుకు ఇరుదేశాలు యుద్ధ నౌకలను సైతం మోహరించాయి.
అందులో భాగంగా క్యూబా పరిధిలోని జలాల్లో నిఘా పెట్టడంతో పాటు పెట్రోలింగ్ నిర్వహించాలని సోవియట్ జలాంతర్గామి (సబ్‌మెరైన్) దళానికి మిషన్ అప్పగించారు.
వాటిలో కొన్ని సబ్‌మెరైన్లు న్యూక్లియర్ వార్‌హెడ్స్(అణుబాంబులు)తో కూడిన టార్పెడోలతో సిద్ధంగా ఉన్నాయి.
అందులో ఒక సబ్‌మెరైన్ లోపల అణు దాడి గురించి చర్చ కూడా జరిగింది. ఒకవేళ అమెరికా తమపై దాడి చేస్తే న్యూక్లియర్ టార్పెడో(అణు టార్పెడో)తో దీటుగా ప్రతిస్పందించాలనే విషయమై ముగ్గురు కమాండర్ల మధ్య చర్చ నడిచింది.
అయితే, అలా చేసేందుకు ఇద్దరు ఒప్పుకున్నారు. కానీ, ఆ నిర్ణయాన్ని మూడో వ్యక్తి వ్యతిరేకించారు.
ఆయనే వసీలీ అలెగ్జాండ్రోవిచ్ అర్ఖిపోవ్.
''ఆయన నిజంగా అణు విధ్వంసం నుంచి ప్రపంచాన్ని రక్షించారు. మిగిలిన వారి ప్రభావం తనపై ఉన్నా ఆయన అందుకు ఒప్పుకోలేదు. మాస్కో ఆదేశాలను కచ్చితంగా పాటించడం ద్వారా ఆయన ప్రపంచాన్ని కాపాడారు'' అని అర్ఖిపోవ్ జీవితం గురించి రాసిన 'ది మిడ్‌నైట్ స్విమ్మర్' పుస్తక రచయిత ఎడ్వర్డ్ విల్సన్ బీబీసీ ముండోతో చెప్పారు.
సోవియట్ నేవీ ప్రొటోకాల్ ప్రకారం, ముగ్గురు కమాండర్లు ఏకాభిప్రాయానికి వస్తే న్యూక్లియర్ టార్పెడోను ప్రయోగించవచ్చు.
''అయితే, దాడి జరగకుండా నివారించేందుకు చాలా అంశాలు ఉన్నాయి. అర్ఖిపోవ్‌కు తగినంత గుర్తింపు రాకపోవడం కూడా నన్ను ఆశ్చర్యపరిచింది'' అని విల్సన్ చెప్పారు.
1998లో ఆయన మరణానంతరం ఆయనకు నివాళులు అర్పించడం మొదలైంది.
2018లో కూడా ఒక అమెరికన్ సంస్థ అర్ఖిపోవ్‌కి ''ఫ్యూచర్ ఆఫ్ లైఫ్'' అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. అణు సంక్షోభం తలెత్తకుండా నివారించినందుకు గానూ ఆయనకు ఈ అవార్డు అందజేయాలనుకుంది.

ఫొటో సోర్స్, GETTY
1962 అక్టోబర్ 27న ఏం జరిగింది?
1962 అక్టోబర్ 22న పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. క్యూబాలో సోవియట్ యూనియన్ న్యూక్లియర్ మిస్సైల్ బేస్ (అణు క్షిపణుల స్థావరం) ఉందని గుర్తించినట్లు అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నెడీకి తెలిసింది.
ప్రస్తుతం అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగకపోయినా, ఏ క్షణమైనా ఆ స్థావరం నుంచి దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది రష్యా.
అమెరికాకు కేవలం 200 కిలోమీటర్ల దూరంలోనే ఆ స్థావరం ఉంది. అక్కడి నుంచి మిస్సైల్ దాడి చేస్తే అమెరికాలోని ప్రధాన నగరాలన్నీ నిమిషాల్లోనే నేలమట్టమవుతాయి.
వెంటనే క్యూబా చుట్టూ నౌకా దళాన్ని అప్రమత్తం చేయడంతో పాటు, యుద్ధ నౌకలను మోహరించాలని, అటు వైపు నుంచి ఎలాంటి దాడి జరిగే అవకాశం లేకుండా మొత్తం దిగ్బంధం చేయాలని అదే సందేశంలో జాన్ ఎఫ్ కెన్నెడీ ఆదేశించారు.
ఆ స్థావరం నిర్మాణం పూర్తి కాకుండా అడ్డుకోవడం, అందుకు అవసరమైన సామగ్రి అందుబాటులో లేకుండా చేయడమే దాని లక్ష్యం.
అయినా మాస్కో భయపడలేదు. అప్పటికే తన సైన్యాన్ని, యుద్ధ నౌకలను అప్రమత్తం చేసింది.
యూఎస్ నేషనల్ ఆర్కైవ్స్, అక్టోబర్ 27న సబ్‌మెరైన్‌లో ఉన్న రష్యన్ కెప్టెన్ వాదిమ్ ఒర్లోవ్ ప్రకారం, సబ్‌మెరైన్‌లో ఆరోజు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. ఆ సబ్‌మెరైన్‌ను న్యూక్లియర్ టార్పెడోలను ప్రయోగించేందుకు అనువుగా ప్రత్యేకంగా తయారుచేశారు.
సబ్‌మెరైన్‌ను ఉత్తరంగా ఉన్న శీతల జలాల్లో తిరిగేందుకు అనువుగా రూపొందించారు. అయితే, కరేబియన్ వైపు చాలా వేడిగా ఉండడంతో అందులోని ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పూర్తిగా పాడైంది. దీంతో సబ్‌మెరైన్‌లో ఉష్ణోగ్రతలు పెరిగాయి.
దానికి కొద్ది గంటల ముందే కెప్టెన్ వాలెంటిన్ శావిట్‌స్కీ ఆదేశాలతో, సబ్‌మెరైన్లు ప్రయాణించాల్సిన లోతు కంటే పైన వెళ్తూ అమెరికా యుద్ధ నౌక కంటపడింది.
''వెంటనే అమెరికా యుద్ధ నౌక సబ్‌మెరైన్ లక్ష్యంగా కాల్పులు ప్రారంభించినట్లు పెంటగాన్ నివేదిక చెబుతోంది. కానీ, బీ-59 సబ్‌మెరైన్ లోపల ఉద్రిక్తత నెలకొంది. కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. ఇక యుద్ధం ప్రారంభమైందని వాళ్లు భావించారు'' అని విల్సన్ వివరించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆ ముగ్గురి నిర్ణయం
దాడి ప్రారంభం కావడంతో అత్యవసర సమావేశానికి రావాలని శావిట్‌స్కీ పిలిచారు. సబ్‌మెరైన్‌లో ముగ్గురు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
వారిలో ఒకరు అర్ఖిపోవ్. ఆయన ఆ సబ్‌మెరైన్ డిప్యూటీ కమాండర్‌గా ఉన్నారు. పైనుంచి బుల్లెట్ల వర్షం కురుస్తుండడంతో తీవ్ర అసహనంతో ఉన్న కెప్టెన్, వారి దాడిని దీటుగా తిప్పికొట్టేందుకు న్యూక్లియర్ టార్పెడో ప్రయోగించడమే సరైనదని భావించారు.
''ఇప్పుడే వాళ్లను నాశనం చేసేద్దాం. మనం ఎలాగూ చనిపోతాం. వాళ్లను కూడా ముంచేద్దాం. నౌకాదళానికి అవమానం అంటకూడదు'' అని శావిట్‌స్కీ అరిచారని ఒర్లోవ్ చెప్పారు.
''సబ్‌మెరైన్‌ల నుంచి అణు దాడి చేయడానికి వారికి మాస్కో నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. అందులోని ముగ్గురు కెప్టెన్లు అంగీకరిస్తే చాలు. అంతకు మించి ఇంకేమీ లేదు'' అని విల్సన్ చెప్పారు.
మిగిలిన ఇద్దరు కమాండర్ల మాటలు వింటున్న అర్ఖిపోవ్, అణుదాడి చేద్దామన్న కెప్టెన్ నిర్ణయాన్ని తిరస్కరించారు.
''అర్ఖిపోవ్ ఒక్కరే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కంట్రోల్ రూంలో జరిగిన సంభాషణలో అర్ఖిపోవ్ అణుదాడిని తిరస్కరించిన మాట నిజం.
అప్పటికి సంవత్సరం ముందే రియాక్టర్ బాగా వేడెక్కిపోవడంతో సబ్‌మెరైన్‌ను రక్షించే క్రమంలో ఆయన భారీగా రేడియేషన్‌కు గురయ్యాడు'' అని విల్సన్ చెప్పారు.
ఆ ఘటన జరిగిన కొద్దికాలం తర్వాత అర్ఖిపోవ్ అందించిన నివేదికలో దాడికి స్పందించపోవడానికి గల కారణాలను ఆయన ప్రస్తావించారు. వాళ్లు బేస్ నుంచి ప్రారంభమైనప్పుడు పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, ఎక్కడా సైనిక ఘర్షణ(సైనికులు నేరుగా పోరాడడం) జరగలేదని ఆయన పేర్కొన్నారు.
''ఆయన కెప్టెన్‌ను శాంతింపజేసినందుకు ధన్యవాదాలు. అమెరికా నౌకా దళం దాడి కొనసాగుతున్నప్పటికీ, తదనంతర పరిణామాలు జరిగినా మూడో ప్రపంచ యుద్ధం రాలేదు'' అని విల్సన్ రాశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
తెల్లవారగానే ఇరుదేశాల ఒప్పందం
ఆ మరుసటి రోజే అక్టోబర్ 28 తెల్లవారుజామునే అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ఒప్పందం కుదిరింది. క్యూబాలో స్థావరాన్ని రష్యా తొలగించేలా, తుర్కియేలోని అణు స్థావరాన్ని అమెరికా తొలగించేలా ఇరుదేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి.
దీంతో దాదాపు అన్ని సబ్‌మెరైన్లు వాటి పోర్టులకు వచ్చేశాయి. అందరినీ హీరోల్లా చూస్తారనుకుంటే అక్కడి పరిస్థితి అందుకు విరుద్ధంగా మారింది.
ఆ తర్వాత, అమెరికన్ పబ్లిక్ బ్రాడ్‌క్యాస్టర్(పీబీఎస్) రూపొందించిన డాక్యుమెంటరీలో అర్ఖిపోవ్ భార్య ఈ విషయంపై మాట్లాడారు. ''ఉన్నతాధికారులు అలాంటి నిర్ణయం తీసుకోవడంపై నా భర్త చాలా నిరాశ చెందారు'' అని ఆమె చెప్పారు.
మాస్కోలోని సీనియర్ అధికారులు సబ్‌మెరైన్ బ్రిగేడ్ కమాండర్లతో మాట్లాడుతూ ''విజయం సాధించకుండా అక్కడి నుంచి తిరిగిరావడం కంటే వాళ్లు అక్కడే చచ్చిపోయి ఉంటే బాగుండేది'' అని అన్నట్లు కొన్ని సాక్ష్యాలు చెబుతున్నాయి.
సైన్యంలో తన కెరీర్‌ను ముగించేసిన అర్ఖిపోవ్ 1998లో 72 ఏళ్ల వయసులో ఎలాంటి గుర్తింపు లేకుండానే చనిపోయారు.
2000 సంవత్సరంలో వాదిమ్ ఒర్లోవ్ చెప్పిన తర్వాత మాత్రమే సబ్‌మెరైన్ లోపల ఆ రోజు ఏం జరిగిందో ప్రపంచానికి తెలిసింది. అర్ఖిపోవ్ వల్లే న్యూక్లియర్ టార్పెడోలను ప్రయోగించలేదని చెప్పారు. ఆ తర్వాతే అర్ఖిపోవ్ సేవలకు గుర్తింపు దక్కింది.
2007లో ఇదే విషయంపై ప్రెజెంటేషన్ ఇచ్చిన యూఎస్ నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ డైరెక్టర్ టామ్ బ్లాంటన్ ఒక్క మాటతో ముగించారు.
''ఈ ప్రపంచాన్ని అతను నిజంగా కాపాడాడు''
''ఒకవేళ అణుయుద్ధం జరిగి ఉండి ఉంటే ఏం జరిగేదో తెలియడం లేదు. ఎందుకంటే, అమెరికాలోని టార్గెట్స్ ఛేదించగలిగే మిస్సైల్స్ సోవియట్ యూనియన్ దగ్గర లేవు. దీని వల్ల యూరప్‌పై బాగా ప్రభావం పడేది'' అని విల్సన్ పేర్కొన్నారు.
''ఇందులో అర్ఖిపోవ్ పాత్ర కీలకమని నేను భావిస్తున్నా. అణుయుద్ధాన్ని ఆపినందుకు మీరు ఆయనకు కచ్చితంగా కృతజ్ఞతలు చెప్పాల్సిందే'' అని రాశారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా-సీఐఏ: అణు శాస్త్రవేత్త హోమీ భాభా, ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిల హత్యకు కుట్ర పన్నిందా?
- లావోస్: ‘ప్రపంచంలో అత్యధికంగా బాంబులు పడిన దేశం ఇదే’
- సూడాన్: 'గుర్రాలపై వచ్చే దెయ్యాల'ను ఎదుర్కోవడానికి ఏకే-47 పట్టుకున్న అకౌంటెంట్
- పోఖ్రాన్ II: అమెరికా కళ్లుగప్పి వాజ్‌పేయి అణు పరీక్షలు ఎలా నిర్వహించారు?
- రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ఫెయిలయ్యారా... అసలు ఆయన టార్గెట్ ఏంటి?














