సూలూరు సుబ్బారావు మర్డర్ కేసు: మహిళల వెంటపడే ఆయన ఎలా చనిపోయారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సూలూర్ జమీందార్ సుబ్బారావు ఓ హత్య చేసి కోర్టు కేసు నుంచి తప్పించుకున్నారు. కానీ, ఆ హత్య తదనంతర ప్రతీకారాలు మాత్రం ఆయనను వదిలిపెట్టలేదు.
తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో దశాబ్దాల కిందట సంచలనం రేపిన క్రైం కథ ఇది.
ఐదేళ్లలోనే ఇక్కడ రెండు హత్యలు జరిగాయి. మొదటి ఘటనలో కోయంబత్తూరుకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్ హత్యకు గురయ్యారు. ఆయనను హత్య చేశారని ఒక జమీందారుపై ఆరోపణలు వచ్చాయి. దీన్ని ‘కోయంబత్తూరు ఫొటోగ్రాఫర్ మర్డర్ కేస్’గా అప్పట్లో పిలిచేవారు.
కోర్టు నుంచి విడుదలైన కొన్నాళ్లకే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ జమీందారును హత్య చేశారు. ఆ జమీందారు పేరు సుబ్బారావు. ఈ హత్య కేసును సూలూరు సుబ్బారావు హత్య కేసుగా పిలిచేవారు.
1920 జనవరి 16న మేకలను మేపుకొనే ఓ బాలుడు బాగా కుళ్లిపోయిన ఒక మృతదేహాన్ని చూశాడు. ఆ మృతదేహానికి తల లేదు. పోలీసులు అక్కడికి వచ్చి చూసినప్పుడు మొండెం మాత్రమే కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ మృతదేహం ఎవరిది?
దీనికి కొన్ని రోజుల ముందు సెబాస్టియన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి, ఫొటోగ్రాఫర్ కురుస్వామి పిళ్లై కనిపించడంలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తలలేని మృతదేహం కనిపించడంతో పోలీసులు సెబాస్టియన్‌ను పిలిచారు. ఆ మృతదేహం బట్టలను చూపించారు. అవి తన తండ్రివేనని ఆయన ధ్రువీకరించారు.
అప్పట్లో కోయంబత్తూరుకు సమీపంలోని సూలూర్‌లో సుబ్బారావు పెద్ద జమీందారు. ఆయన పేరిట చాలా భూములు ఉండేవి. అంతేకాదు ఈ కుటుంబానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పేరుంది. కానీ, సుబ్బారావు ఆ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేసేవారని చెప్తారు.
మహిళలతో ఆయన చాలా దారుణంగా ప్రవర్తించేవారు. అలానే కురుస్వామి పిళ్లై కుమార్తెపై సుబ్బారావు కళ్లు పడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఆ అమ్మాయిని తన దారికి తెచ్చుకునేందుకు సుబ్బారావు చాలా ప్రయత్నించారు.
కానీ, వీటికి కురుస్వామి పిళ్లై అడ్డుపడేవారు.
జనవరి 13న కురుస్వామి పిళ్లై ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఓ గ్రామంలో ఫొటోలు తీయాలని వీరిద్దరూ కురుస్వామికి చెప్పి, తీసుకెళ్లారు. అయితే, అలా వెళ్లిన కురుస్వామి పిళ్లై తలలేని మృతదేహంగా కనిపించారు.
కురుస్వామిని ఇంటికి నుంచి తీసుకెళ్లిన మొహమ్మద్ గౌస్, పొన్నుస్వామిలను పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేశారు. వీరిద్దరూ సుబ్బారావు దగ్గర పనిచేసేవారు.
విచారణలో వీరిచ్చిన సమాచారం ఆధారంగా నాంజపన్‌ను అరెస్టు చేశారు. ఆయన సుబ్బారావుకు స్నేహితుడు. ఆ తర్వాత మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. చివరగా సుబ్బారావు కూడా అరెస్టు అయ్యారు. మొత్తంగా ఈ కేసులో ఐదుగురు అరెస్టు అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
నలుగురికి ఉరిశిక్ష
పోలీసుల సమాచారం ప్రకారం, కురుస్వామి పిళ్లైను మోసపూరిత మాటలతో మహమ్మద్ గౌస్, పొన్నుస్వామి కారులోకి ఎక్కించుకొని వెళ్లారు. ఆ కారును నడిపింది సుబ్బారావు. ఆ తర్వాత పిళ్లైను మొండెం నుంచి తలను వేరుచేసి, హత్య చేశారు.
కిడ్నాప్ కోసం ఉపయోగించిన కారును అద్దెకు తీసుకున్నారు.
ఈ కేసుపై కోయంబత్తూరు సెషన్సు కోర్టులో విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్ తరఫున ఈఆర్ ఆస్బర్న్ మొదట వాదనలు వినిపించారు. ఆ తర్వాత ప్రముఖ లాయర్ ఈఎల్ ఎథిరాజ్ కూడా ప్రాసిక్యూషన్ తరఫున పనిచేశారు.
అప్పట్లో ఈ కేసులో జరిగే పరిణామాలపై ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా చర్చ జరిగేది.
మొత్తంగా ఈ కేసులో సుబ్బారావును నిర్దోషిగా జ్యూరీ ప్రకటించింది. అయితే, ఈ కేసును విచారించిన జేజే కాటన్ మాత్రం మిగతా నలుగురిని దోషులుగా గుర్తించారు. వీరికి మరణ శిక్ష విధించారు.
ఇక్కడ మరణ శిక్షను హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంటుంది. దీంతో ఈ కేసు హైకోర్టుకు వచ్చింది. మరోవైపు దోషులుగా నిరూపితమైన వ్యక్తులు కూడా అప్పీలు చేసుకున్నారు.
ఈ రెండు కేసులనూ కలిపే విచారణ చేపట్టారు. నిందితుల తరఫున ఆర్.శఠగోపాచార్య వాదనలు వినిపించారు. ఎర్డ్‌లీ నోర్టన్ ఆయనకు సాయం చేశారు. నాంజపన్ తరఫున మరో వ్యక్తి వాదనలు వినిపించారు.

ఫొటో సోర్స్, Getty Images
సుబ్బారావును ఎవరు హత్య చేశారు?
దిగువ కోర్టులో కంటే హైకోర్టులో ఈ కేసు ప్రజల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. అసలు దేని ఆధారంగా ఈ కేసులో ఆరోపణలు చేస్తున్నారని ఎర్డ్‌లీ ప్రశ్నించారు.
‘‘నిజంగా పిళ్లై కూతురిపై సుబ్బారావు కన్నువేస్తే ఆమెను ఎత్తుకుని వెళ్లేవారు. అసలు కురుస్వామిని పిళ్లైని ఎందుకు ఎత్తుకొస్తారు?’’ అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు ఆ మృతదేహానికి తల లేకపోవడంతో అసలు ఆ మృతదేహం కురుస్వామి పిళ్లైదేనని ఎలా చెబుతారు? అని ఆయన ప్రశ్నించారు.
ఆ మృతదేహానికి కురుస్వామి పిళ్లై బట్టలువేసి, కట్టుకథలు అల్లేస్తున్నారని ఆయన అన్నారు.
ఎర్డ్‌లీ వాదనతో జడ్జిలు ఐలింగ్, జేజే హ్యూగ్స్‌లు ఏకీభవించారు. అంతేకాదు, దిగువ కోర్టు ఇచ్చిన శిక్షను కొట్టివేశారు. పోలీసులను గట్టిగా మందలించారు.
ఆ వెంటనే, సుబ్బారావు, ఆయనతోపాటు ఉండేవారు జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత కూడా సుబ్బారావు ధోరణి ఏమీ మారలేదు. అలానే కొన్ని సంవత్సరాలు గడిచాయి.
అయితే, 1925 ఏప్రిల్ 9న సేలంకు రెండు మైళ్ల దూరంలోని కన్నంపాలయంలో తన సేవకులతోపాటు సుబ్బారావు హత్యకు గురయ్యారు.
ఈ హత్య ప్రజలకు షాక్‌గా అనిపించలేదు. ఎందుకంటే కురుస్వామి పిళ్లైను హత్య చేసింది సుబ్బారావు మనుషులేనని, ఈ హత్యలతో పిళ్లై కుటుంబానికి న్యాయం జరిగిందని ప్రజలు భావించేవారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలో టేకు చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి?
- ఫుకుషిమా రియాక్టర్: అణు వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలిన జపాన్, ఈ నీటి వల్ల చేపలు చచ్చిపోతాయా, మనుషులకు ప్రమాదమెంత?
- కుక్కలు మనుషులకు ఎలా దగ్గరయ్యాయి? ఒకప్పటి పెంపుడు జంతువులైన తోడేళ్లు ఎందుకు దూరమయ్యాయి?
- తిరుపతి జిల్లా: దళితులను గొల్లపల్లి గుడిలోకి రానివ్వలేదా? ఇది తెలుగు దళితులతో తమిళ దళితుల పోరాటమా?
- విశాఖపట్నం - అమెరికన్ కార్నర్: యూఎస్ వెళ్లాలనుకునే వారికి ఉచితంగా సేవలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















