తెలంగాణలో టేకు చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి?

అడవిలో టేకు చెట్లు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కీటకాల ఆకులను తినేయడంతో రంగు మారిన టేకు ఆకులు
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

శ్రావణమాసంలో నిండు పచ్చదనంతో కనిపించే టేకు చెట్లు నిర్జీవంగా మారుతున్నాయి. తెలుపు, ఎరుపు రంగులోకి మారిన ఆకులను దూరం నుంచి చూస్తే మంటల్లో కాలిపోతున్న మాదిరి కనిపిస్తున్నాయి. పత్రహరితం పూర్తిగా కోల్పోయి ఆకులు గుల్లబారుతున్నాయి.

ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల అటవీ ప్రాంతంలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి.

టేకు చెట్లు

ఫొటో సోర్స్, UGC

‘గతంలో టేకు చెట్లు ఇలా మారలేదు’

ఒరిస్సా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ ఫారెస్ట్రీ 2018లో ప్రచురించిన ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కరెంట్ మైక్రోబయాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్’ పరిశోధనా పత్రం ప్రకారం.. భూగోళంలోని ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే చెట్లలో టేకు మొదటి 5 స్థానాల్లో ఉంది.

భారత దేశంలో 9 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ఈ చెట్లు ఉన్నాయి. తెలంగాణలోని కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో బీబీసీ తెలుగు టీం పర్యటిస్తున్న సందర్భంలో కిలోమీటర్ల పొడవునా టేకు చెట్లు వ్యాధి లక్షణాలతో కనిపించాయి.

‘గతంలో టేకు చెట్లు ఇలా మారలేదు. చెట్టు అంతా పురుగు తింటోంది. ఆకులను మొత్తం ఖరాబ్ చేస్తోంది. చెట్లను చూస్తే అంతా ఎండిపోయినట్టుగా కనిపిస్తున్నాయి’ అని పైడిపల్లి ఆదివాసీ గూడెంకు చెందిన సక్కుబాయి బీబీసీతో అన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని అడవుల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

‘'ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో వ్యాప్తి చెందింది. గతంలో ఇంత పెద్ద విస్తీర్ణంలో ప్రభావం లేదు. వివిధ ప్రాంతాల్లో వివిధ స్థాయిల్లో ఉంది. ఈ ఏడాది వ్యాధి ప్రభావం ఎక్కువగా కనిపించింది'’ అని జన్నారం ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ మాధవ రావ్ చెప్పారు.

టేకు ఆకుపై పురుగు

ఫొటో సోర్స్, shubhamPravenn

ఫొటో క్యాప్షన్, టేకు ఆకు (వృత్తంలో పురుగు)

అసలేంటి ఈ వ్యాధి?

టేకు చెట్లలో కనిపిస్తున్న ఈ లక్షణాలను ‘టీక్ స్కెలిటనైజర్‌’గా పిలుస్తారని అటవీ, వృక్షశాస్త్ర నిపుణులు వెల్లడించారు.

వెడల్పాటి ఆకుల్లో పత్రహరితం పూర్తిగా కోల్పోయి ఈనెలు మాత్రమే మిగిలి, చూడటానికి అస్థిపంజరంలా తలపిస్తుందని, అందుకే ఆ పేరుతో పిలుస్తారని నిపుణులు వివరించారు.

‘టీక్ స్కెలిటనైజర్’ ఒక ఎపిడమిక్ వ్యాధి (చీడ). ఇది టేకు చెట్లకు వచ్చే ఒక రకమైన చీడ పీడ వంటిది. నిర్ధిష్ట ప్రాంతంలో పెద్ద సంఖ్యలో టేకు చెట్లను ఇది ప్రభావితం చేస్తుంది.

సాధారణ చీడలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో చెట్లు ఈ వ్యాధి ప్రభావానికి గురవుతాయని నిపుణులు చెబుతున్నారు.

‘'ఈ మధ్య కాలంలో టేకు చెట్లపై ఎక్కువగా కనిపిస్తున్న ఎరుపు, గోధుమ రంగుల మచ్చలకు కారణం ‘యూటెక్టోనా మాచిరాలిస్’ (Eutectona machaeralis) అని పిలిచే ఒక రకమైన ‘మాత్’ (సీతాకోక చిలుక జాతి) కీటకం. టేకు చెట్ల ఆకులమీద ఇది గుడ్ల దశ నుంచి కీటకంగా మారుతుంది. అంటే గొంగళి పురుగు దశలో ఆకుల్లోని పత్రహరితాన్ని ఆహారంగా తీసుకుని కీటకంగా మారి ఎగిరిపోతుంది'’ అని కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం ప్రొఫెసర్ ఈ ఎన్. మూర్తి బీబీసీతో వివరించారు.

‘'ఇది స్కెలిటనైజర్ అనే ఒక ఎపిడమిక్ డిసీజ్. ఈ కీటకాలు రాత్రికి రాత్రే లక్షల సంఖ్యలో వాటి సంతతిని ఉత్పత్తి చేస్తాయి. టేకు చెట్ల ఆకుల్లో ఉండే క్లోరోఫిల్ (పత్రహరితం) మొత్తాన్ని ఇవి తినేస్తాయి. దీంతో ఆకు అస్థిపంజరంలా మారి, రాలిపోతుంది’' అని కవ్వాల్ జన్నారం డివిజన్ అటవీశాఖ అధికారి మాధవ రావ్ అన్నారు.

పురుగు

ఫొటో సోర్స్, UGC

టేకు ఆకు

ఫొటో సోర్స్, ShubhamPraveen

ఏ కాలంలో ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది?

చెదలు పట్టినట్టుగా ఆకులు గుల్లబారిపోయే ఈ స్థితి గురించి వృక్షశాస్త్ర నిపుణులు వివరించారు.

‘'టేకు చెట్లు ఈ కీటకాలకు (‘యూటెక్టోనా మాచిరాలిస్’) హోస్ట్‌గా పనిచేస్తాయి. విశాలంగా ఉండే ఈ చెట్ల ఆకులపై అవి గుడ్లు పెడతాయి. వర్షాకాలం సీజన్‌లో ఎక్కువగా టేకు చెట్లకు ఈ చీడ సోకే అవకాశం ఉంది. వేసవిలో టేకు చెట్టు ఆకులను రాలుస్తుంది కాబట్టి వీటికి అవకాశం ఉండదు. అలాంటి సందర్భంలో ‘వావిలి’ లాంటి ఇతర చెట్లను ఇవి ఆశ్రయిస్తాయి'' అని ప్రొఫెసర్ ఈఎన్.మూర్తి అన్నారు.

''గొంగళి పురుగులు ఎక్కువగా చేరినపుడు టేకు చెట్లలో డీఫోలేషన్ (Defoliation) ప్రభావంతో ఆకులు రాలిపోతాయి. ఆకుల్లోని పత్రహరితాన్ని మొత్తం తినడంతో అవి ఎముకల గూడులా కనిపిస్తాయి. ఆకులు కోల్పోవడంతో కిరణజన్య సంయోగక్రియ కుంటుపడుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రౌడ(బాగా ఎదిగిన) మొక్కలు బతుకుతాయి, అయితే ఒకటి, రెండేళ్ల వయసుగల చిన్న మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది’' అని ఆయన అన్నారు.

టేకు చెట్లకు వచ్చే ఈ చీడపై భారత తూర్పు కనుమల్లా ఝార్ఖండ్‌లోని ‘బీర్సా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలను 2022 లో ‘రీసెర్చ్ గేట్ ‘లో ప్రచురించారు.

ఈ పరిశోధన పత్రం ప్రకారం ‘యూటెక్టోనా మాచిరాలిస్’ జీవిత చక్రం 23 రోజుల్లో పూర్తవుతుంది. మార్చి-ఆగస్టు మధ్య ఎక్కువగా వీటి ప్రభావం కనిపిస్తుంది. ఆగస్టు-డిసెంబర్‌ల మధ్య తగ్గిపోతుంది.

టేకు ఆకు

ఫొటో సోర్స్, ShubhamPraveen

కలిగే నష్టం ఎంత, నివారణ చర్యలు ఏంటి?

వేల ఎకరాల్లో విస్తరించి ఉండే అటవీ ప్రాంతంలో చీడల నివారణ చర్యలు చేపట్టడం అటవీశాఖ అధికారులకు పెద్ద సవాలు.

‘'దీన్ని అరికట్టాలంటే చాలా పెద్ద యంత్రాంగం అవసరం. పెద్ద మొత్తంలో హెలికాప్టర్‌ల ద్వారా స్ప్రే చేస్తే కంట్రోల్ చేసే అవకాశం ఉంది. కానీ అంత పెద్ద యంత్రాంగం లేదు. అయితే, ఈ చీడతో కలిగే నష్టం తక్కువే'’ అని అటవీశాఖ అధికారి మాధవ రావ్ అన్నారు.

మరోవైపు రసాయనిక మందుల పిచికారిని పర్యావరణ వేత్తలు వ్యతిరేకిస్తున్నారు.

'‘పెస్ట్ మేనేజ్మెంట్ చేయవచ్చు. అడవుల్లో అలాచేస్తే వన్యప్రాణులకు నష్టం కలగొచ్చు. దీనికి వేరే మార్గాలూ ఉన్నాయి’' అని ప్రొఫెసర్ ఈఎన్.మూర్తి తెలిపారు.

గతంతో పోలిస్తే టేకు చెట్ల విషయంలో అటవీశాఖ ప్రాధాన్యతలు మారాయి.

'‘ప్రస్తుతం టేకు చెట్లను అటవీశాఖ ఓ ఆదాయ వనరుగా మాత్రమే చూడటం లేదు. కన్జర్వేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత అటవీ సంరక్షణ చర్యగా చూస్తున్నాం కాబట్టి, పెద్ద నష్టం ఉండకపోవచ్చు’' అని అటవీ అధికారి మాధవ రావ్ వివరించారు.

అడవుల్లో కాకుండా దీర్ఘకాలిక పంటగా వ్యక్తిగతంగా పెంచే టేకు చెట్లపై ఈ చీడ ప్రభావం నామమాత్రమే అని ఆయన అంటున్నారు.

'‘జీవావరణ పరంగా చూస్తే ఇదేమి పెద్ద నష్టం కలిగించదు. అయితే కమర్షియల్ గా చూస్తే, అంటే ప్రైవేట్ ఫామ్స్ లో పెంచుతున్న టేకు చెట్లలో.. పత్రహరితం మొత్తం తినేసిన తర్వాత ఆ ఏడాది రావాల్సిన పెరుగుదలలో ప్రభావం ఉంటుంది. అయితే అది దీర్ఘకాలికంగా చూస్తే ఆందోళన పడాల్సినంత పెద్ద నష్టం కాదు’' అని మాధవ్ రావ్ తెలిపారు.

‘'వరుసగా వర్షాలు కురిసినా, బలమైన గాలులు వీచినా ఈ కీటకాలు చనిపోతాయి. రెండేళ్ల క్రితం మా దగ్గర (జన్నారం అటవీ ప్రాంతం) ఇలాగే వచ్చింది. దానంతట అదే కంట్రోల్ అయింది. ఇది అప్పుడప్పుడూ రావడం, సహజసిద్దంగా దానికదే పోవడం జరుగుతుంది. ఆందోళన పడాల్సిన అవసరం లేదు’' అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ఉత్తర తెలంగాణలో టేకు చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి?

కీటకాలు పెరగడానికి కారణమదేనా?

గతంలో అటవీ సంరక్షణ చర్యల్లో కేవలం టేకు చెట్లకు ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాటిని పట్టించుకోకపోవడం ఈ పరిస్థితికి ఒక కారణంగా వృక్షశాస్త్ర నిపుణులు భావిస్తున్నారు.

‘మనం నాణానికి మరోవైపు పరిశీలిస్తే అసలు విషయం అర్థం అవుతుంది. అడవుల్లో టేకు చెట్ల రక్షణకే అధిక ప్రాధాన్యత ఇచ్చి నల్లమద్ది, తెల్లమద్ది లాంటి ఇతర చెట్లు వివిధ అవసరాలకు నరికేసినా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ‘యూటెక్టోనా మాచిరాలిస్’ లాంటి కీటకాల సహజ భక్షకాలైన పక్షులకు ఆవాసాలు తక్కువ అయ్యాయి. టేకు చెట్టు పక్షుల ఆవాసానికి అంతగా అనుకూలంగా ఉండదు. స్థానిక జాతుల వృక్షాలను మళ్లీ పెంచితే పక్షులు తిరిగి వచ్చి గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. దీంతో కీటకాల సంఖ్య నియంత్రణలో ఉంటుంది. ఇది ప్రకృతి ఏర్పాటు చేసిన సహజ సిద్ధమైన జీవ నియంత్రణ పద్ధతి’ అని వృక్షశాస్త్ర ప్రొఫెసర్ ఈఎన్.మూర్తి అన్నారు.

టేకును మాత్రమే ప్రమోట్ చేయడం వల్ల ఆ చెట్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో చీడలను కలిగించే కీటకాలకు సులభంగా ఆశ్రయం దొరుకుతోంది. దీంతో కీటకాలు వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుని సంఖ్యను పెంచుకుంటున్నాయి.

ఇది ఒక రకంగా వాటిని మనం ఆహ్వానించినట్టే అని ప్రొఫెసర్ ఈఎన్.మూర్తి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)