ముజఫర్‌నగర్: తోటి పిల్లలతో కొట్టించిన ఘటనపై బాధిత ముస్లిం విద్యార్ధి తల్లిదండ్రులు ఏమన్నారు, అధికారులు ఏం చెప్పారు?

టీచర్ తృప్తా త్యాగి

ఫొటో సోర్స్, AMIT SAINI

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా, అమిత్ సైని
    • హోదా, బీబీసీ హిందీ

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒక ప్రైవేట్ స్కూల్‌లో ముస్లిం విద్యార్థిని కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. శనివారం ఈ వీడియో వైరల్‌గా మారడంతో, పిల్లాడి తండ్రి ఫిర్యాదు మేరకు స్కూల్ టీచర్ తృప్తా త్యాగిపై ఐపీసీ సెక్షన్లు 323, 506 కింద కేసు దాఖలు చేశారు.

ఈ సెక్షన్లు ఉద్దేశపూర్వకంగా అవమానించడం, బాధించడానికి సంబంధించినవి.

‘‘బాలుడు తండ్రి ఇర్షాద్ ఫిర్యాదు మేరకు మాన్సూర్‌పుర్ పోలీస్ స్టేషన్‌లో నేహా పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ తృప్తా త్యాగిపై ఐపీసీ సెక్షన్లు 323, 506 కింద కేసు దాఖలు చేశాం’’ అని కటౌలి పోలీసు అధికారి డాక్టర్ రవి శంకర్ మిశ్రా తెలిపారు.

కానీ, ఈ కేసులో దాఖలు చేసిన లిఖితపూర్వక ఫిర్యాదులో, ఒక నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా కామెంట్ చేసేందుకు 123 ఏ సెక్షన్‌ను జిల్లా పోలీసు అధికారులు వాడలేదు.

ఈ విషయంపై పోలీసు అధికారిని వివరణ కోరినప్పుడు,‘‘విచారణ జరుగుతోంది. అందులో వెలుగులోకి వచ్చే నిజనిజాలకు అనుగుణంగా మేం చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు.

విద్యార్థి తల్లి రుబినా

ఫొటో సోర్స్, AMIT SAINI

ఫొటో క్యాప్షన్, విద్యార్థి తల్లి రుబినా

పిల్లాడి తల్లి ఏమన్నారు?

‘‘మేడమ్ తప్పు చేశారు. పిల్లల చేత అలా కొట్టించకుండా ఉండాలి. మేడమ్ ముస్లింలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నారు. వీడియో చూస్తే ఇదే అర్థమవుతుంది’’ అని బాలుడి తల్లి రుబినా అన్నారు.

అయితే, ఈ సంఘటనకు మతం రంగును పూస్తున్నారని నేహా పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ తృప్తా త్యాగి అంటున్నారు.

‘‘ఇది అసలు కేసే కాదు. ముస్లింగా నేను ఏ విద్యార్థిని చూడటం లేదు. నా స్కూల్‌లో చదువుకునే వారిలో చాలా మంది ముస్లింలే. నా వద్ద ముస్లిం పిల్లలు చదువుకుంటున్నారు.’’ అని తృప్తా త్యాగి అన్నారు.

పిల్లాడి తండ్రి ఇర్షాద్

ఫొటో సోర్స్, AMIT SAINI

తండ్రి ఏం చెప్పారు?

‘‘దీనిలో హిందూ-ముస్లిం విషయం లేదు. కేవలం పిల్లాడిని కొట్టడమే అసలు సంఘటన. వారు నా పిల్లాడిని కొడుతూ హింసించారు. వారిపై మేం ఎఫ్ఐఆర్ దాఖలు చేశాం. ఇప్పుడేం చేయాల్సి ఉన్నా ఆ బాధ్యత పోలీసు యంత్రాంగానిదే’’ అని ఆ విద్యార్థి తండ్రి ఇర్షాద్ అన్నారు.

ఈ విషయంపై జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ మైనార్టీల సంఘం, జాతీయ పిల్లల హక్కుల సంరక్షణ సంఘం వద్ద ఫిర్యాదు చేసినట్లు లఖ్‌నవూ మానవ హక్కుల న్యాయవాది ఎస్ఎం హైదర్ రిజ్వి తెలిపారు.

టీచర్ మతపరమైన విద్వేషాలను, దూషణలను ప్రోత్సహిస్తున్నందుకు ఆమెపై సెక్షన్లు 153ఏ, 295ఏ, 298 కింద కేసులు దాఖలు చేయాలని తన ఫిర్యాదులో ఆయన డిమాండ్ చేశారు.

‘‘నేను మూడు వీడియోలు చూశాను. ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా టీచర్ మాట్లాడటం నేను చూశా. ముస్లిం బాలుడిని చంపేసేలా చిన్న పిల్లలను ప్రేరేపిస్తున్నారు. అందుకే నేను సంబంధిత ఈ సంఘాల వద్ద ఫిర్యాదు చేశాను. లిఖితపూర్వక ఫిర్యాదు పత్రాన్ని వారికి అందజేశాను’’ అని ఎస్ఎం హైదర్ రిజ్వి తెలిపారు.

అయితే, ఈ విషయంలో మతపరమైన విద్వేషాలున్నాయనే దాన్ని పిల్లాడి తండ్రి కొట్టిపారేస్తున్నారు.

‘‘పిల్లాడి తండ్రి ముందు చెప్పిన దాని ప్రకారం ఆయన అసలు ఏ ఫిర్యాదు దాఖలు చేయాలనుకోలేదు. కానీ, ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, అధికార యంత్రాంగం ఆయన నుంచి లిఖితపూర్వక పత్రాన్ని తీసుకుంది. కానీ, సంబంధిత సెక్షన్ల కింద ఈ కేసు దాఖలు చేయలేదు. విద్వేష ప్రసంగాల చట్టం కింద సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఇది ఉల్లంఘిస్తోంది. జిల్లా పోలీసు కార్యాలయం దీన్ని సుమోటోగా తీసుకోవాలి’’ అని రిజ్వి అన్నారు.

‘‘వైరల్ వీడియోపై విచారణ జరిపాం. పిల్లాడి కజిన్ ఒకరు ఈ వీడియోను తీశారు. విచారణలో తేలే అంశాలకు అనుగుణంగా న్యాయపరమైన చర్యలను తీసుకుంటాం’’ అని ముజఫర్‌నగర్ జిల్లా కలెక్టర్ అర్వింద్ మలప్ప బంగారి అన్నారు.

నేహా స్కూల్

ఫొటో సోర్స్, AMIT SAINI

స్కూల్ నుంచి విద్యార్థి తొలగించారా?

నేహా పబ్లిక్ స్కూల్ నుంచి విద్యార్థిని తొలగించారని కొన్ని రిపోర్టులు వచ్చాయి. దీనిపై బాలుడి తల్లి స్పందించారు.

‘‘మాకు మేముగా పిల్లాడిని స్కూల్ నుంచి బయటికి తీసుకురాలేదు. పిల్లాడిని కొట్టిన విషయంలో మేం ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు, మరెక్కడైనా మీ పిల్లాడిని చదివించుకోవాలని వారు చెప్పారు’’ అని విద్యార్థి తల్లి రుబినా చెప్పారు.

పిల్లాడి పేరును తీసేశారన్న ఆరోపణలపై కూడా టీచర్ తృప్తా త్యాగి స్పందించారు.

‘‘మేం అతని పేరును తీసేయలేదు. ఇది తప్పుడు ఆరోపణ. ఆరు నెలల ఫీజులను వెనక్కి ఇచ్చేయాలనే షరతుపై ఈ పిల్లాడి కుటుంబమే అగ్రిమెంట్‌కు వచ్చింది. మేం వారి షరతును ఒప్పుకుని, వారి ఫీజులను రీఫండ్ చేశాం’’ అని టీచర్ తెలిపారు.

పోలీసు కార్యాలయమే ఈ అగ్రిమెంట్ కుదిర్చిందని టీచర్ చెప్పారు. అయితే, పోలీసు యంత్రాంగం తమ తరఫున ఇలాంటి ఒప్పందం జరిగిందనే విషయంపై స్పందించలేదు.

‘‘మేడమ్ స్వయంగా ఫీజులను తిరిగి ఇచ్చేశారు’’ అని రుబినా చెప్పారు.

‘‘మేడమ్ మా ఫీజులు తిరిగి ఇచ్చేశారు. నా కొడుకుకు చదువులేకపోయినా పర్వాలేదు. ఆ స్కూల్‌లో పిల్లాడిని చదివించుకోవాలనుకోవడం లేదు.’’ అని బాధిత విద్యార్థి తండ్రి చెప్పారు.

ఖుబ్బాపూర్

ఫొటో సోర్స్, AMIT SAINI

అసలేం జరిగింది?

ఈ సంఘటన జరిగిన నేహా పబ్లిక్ స్కూల్ ఆ గ్రామంలోనే ఉంది. వీడియోలో కనిపించిన మహిళా టీచర్ తృప్తా త్యాగి, ఆ స్కూల్‌కి డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఆమె ఇంట్లోనే ఈ స్కూల్‌ని నడుపుతున్నారు.

అదే గ్రామానికి చెందిన ఇర్షాద్ చిన్న కొడుకు ఆ స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు.

వైరల్ అయిన ఈ వీడియో స్కూల్‌లో ఆగస్ట్ 24న రికార్డయింది.

క్లాస్‌లో ఉన్న ఇతర విద్యార్థులు ద్వారా ఇర్షాద్ కొడుకును తృప్తా త్యాగి కొట్టించినట్లు ఈ వీడియోలో రికార్డయింది. మహమ్మదన్ పిల్లలు అంటూ కామెంట్లు చేశారు.

‘‘నా కొడుకును ఇతర పిల్లల చేత మేడమ్ కొట్టించారు. ఏదో పని మీద నా మేనల్లుడు అటువైపు వెళ్లాడు. ఆ సమయంలో నా కొడుకును కొట్టడం చూశాడు. దీన్ని వీడియోగా తీసి, మాకు చూపించాడు’’ అని ఇర్షాద్ తెలిపారు.

‘‘నేను 3 గంటల ప్రాంతంలో స్కూల్‌కి వెళ్లినప్పుడు, మేడమ్ ఆమె చేసిన తప్పును ఒప్పుకోలేదు. అంతేకాక, ఇక్కడ ఇదే రూల్ అంటూ మాట్లాడారు. మేం రెండుసార్లు వెళ్లాం. కానీ, రెండుసార్లు ఒప్పుకోలేదు. ఆ తర్వాతనే మేం వీడియో వైరల్ చేశాం.’’ అని తెలిపారు.

ఇర్షాద్ ఇంటికి వస్తోన్న జనాలు

ఫొటో సోర్స్, AMIT SAINI

రాజకీయ దుమారం

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి దీనిపై స్పందించారు.

బీజేపీ పాలనలో మైనార్టీల పరిస్థితిపై ఈ నేతలు కామెంట్ చేశారు.

‘‘టీచర్‌కి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. విచారణలో తప్పుందని తేలితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు.

ముజఫర్‌నగర్‌లోని మాన్సూర్‌పూర్ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఖుబ్బాపూర్ గ్రామంలో ఇర్షాద్, తృప్తా త్యాగి ఇళ్లున్నాయి. స్థానిక రాష్ట్రీయ లోక్ దళ్ ఎంఎల్ఏ చందన్ సింగ్ చౌహాన్, ఇర్షాద్ ఇంటికెళ్లి సంఘటన వివరాలను తెలుసుకున్నారు.

ఇదే సమయంలో కేంద్ర మంత్రి సంజీవ్ బల్యాన్, రైతు నేత నరేశ్ తికాయిత్ తృప్తా త్యాగిని కలిశారు.

ఈ గ్రామంలోని 70 శాతం హిందూ కుటుంబాలు త్యాగి కమ్యూనిటీకి చెందినవే. హిందూ త్యాగి కమ్యూనిటీతో పాటు ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా కూడా అధికంగానే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)