బురఖాలో ఉన్నది మహిళ కాదు పురుషుడంటూ వీడియో.. కావాలని చిత్రీకరిస్తున్న వీడియోలతో పెరుగుతున్న మత విద్వేషాలు

ఫొటో సోర్స్, TWITTER
- రచయిత, అఖిల్ రంజన్
- హోదా, బీబీసీ గ్లోబల్ డిస్‌ఇన్‌ఫర్మేషన్ టీమ్
బురఖా ధరించి, చేతిలో బిడ్డను పట్టుకున్న ఓ వ్యక్తిపై మరో వ్యక్తి దాడి చేస్తున్న వీడియోను భారత్‌లో లక్షల మంది చూశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది.
బురఖా బలవంతంగా తొలగించి, బురఖా వేసుకుంది మహిళ కాదు, ఒక పురుషుడు అని చూపించారు ఆ వీడియోలో.
ఆ వీడియోలో హిందీలో ప్రజలకు వార్నింగ్ మెసేజ్ కూడా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మహిళలు వాడే బురఖాను నేరగాళ్లు పిల్లల్ని కిడ్నాప్ చేసేందుకు ముసుగుగా వాడుతున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలంటూ వీడియోలో చెప్పారు.
ఈ ఏడాది ప్రారంభంలో యూట్యూబ్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది.
దీన్ని యూట్యూబ్ నుంచి డిలీట్ చేయడాని కంటే ముందే 2.9 కోట్ల సార్లు వీక్షించారు.
కానీ, ఈ వీడియోలో చూపించిన సన్నివేశాలు ఏమీ కూడా వాస్తవమైనవి కావు. ఇది కావాలని చిత్రీకరించిన ఒక వీడియో.
స్క్రిప్ట్ రాసుకుని నటులతో ఈ వీడియో చిత్రీకరించారు. ఉద్దేశపూర్వకంగా చిత్రీకరించిన వీడియో(స్టేజ్డ్ వీడియో) ఇది.
వినోదం కోసం రూపొందించే స్క్రిప్టెడ్ వీడియోలు ఇటీవల భారత్‌లో ఎక్కువగా వాస్తవ సంఘటనలు మాదిరి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.
వీడియోల్లో చూపించే ఈ తప్పుడు సమాచారం, దేశంలో మతపరమైన ఘర్షణలు, మహిళలపై ద్వేషం విపరీతంగా పెరిగేందుకు కారణమవుతోంది.
బీజేపీ 2014 మేలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, భారత్‌లో మతపరమైన వర్గాల మధ్య ముఖ్యంగా హిందూ, ముస్లింల మధ్య ఘర్షణపూర్వక వాతావరణం పెరిగింది.
ఈ కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకుని వారిని తప్పుడుగా చూపించడం, మహిళలకు వ్యతిరేకంగా మోరల్ పోలిసింగ్ ప్రోత్సహించడం చేస్తున్నారు.
నాటకీయమైన ఈ వీడియోల ట్రెండ్ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ వంటి పలు భారతీయ భాషలకు వ్యాప్తి చెందింది.
కొన్నిసార్లు స్థానిక వార్తా సంస్థలు కూడా పొరపాటున వార్తలలో ఈ ఉద్దేశపూర్వకంగా చిత్రీకరించిన వీడియోలను(స్టేజ్డ్ వీడియోలు) వాడుతున్నాయి.
పిల్లల్ని కిడ్నాప్ చేసేందుకు నేరగాళ్లు బురఖాలు ధరిస్తున్నారంటూ చాలా స్టేజ్డ్ వీడియోలలో చూపిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా ఇవి నిజ జీవితాల్లో తీవ్ర పరిణామాలకు కారణమవుతున్నాయి.
కావాలని చిత్రీకరించిన ఈ వీడియోలు విడుదలైన తర్వాత, చాలా మందిని కిడ్నాపర్లుగా భావిస్తూ మూకలు దాడి చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఘటనలతో ప్రజలు తప్పుడు వార్తలపై అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఎందుకు ఈ వీడియోలు ప్రమాదకరం?
కావాలని చిత్రీకరించే ఈ వీడియోలు తప్పుడు వ్యూహాలతో సోషల్ మీడియా యూజర్లను గందరగోళంలో పడేసే విధంగా ఉంటున్నాయి.
కొన్నింటికి డిస్‌క్లైమర్స్ ఉంటున్నాయి. కానీ, అవి ఎక్కడో వీడియో మధ్యలో లేదా వీడియోల చివరిలో కనిపిస్తున్నాయి తప్ప, ప్రారంభంలో ఉండటం లేదు.
చాలా వరకు వీడియోల్లో టెక్ట్స్ ఇంగ్లిష్‌లో ఉంటుంది. వీటిని చాలా సార్లు యూజర్లు అర్థం చేసుకోలేరు.
బురఖా ధరించి పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారంటూ చూపించిన ఈ వీడియోలో డిస్‌క్లైమర్ ఉందని, కానీ అది ఒక సెకన్ పాటు మాత్రమే కనిపిస్తుందని ఆల్ట్ న్యూస్ చేపట్టిన ఫ్యాక్ట్ చెక్ తెలిపింది.
వీడియోలో చూపించిన డిస్‌క్లైమర్ కల్పనాత్మకంగా దీన్ని రూపొందించినట్లు ఉంది. ఈ వీడియోను క్రియేటర్ డిలీట్ చేశారు.
ఈ వీడియోలు మరింత వాస్తవికంగా కనిపించేలా చేసేందుకు కొంత మంది క్రియేటర్లు సీసీటీవీ టెంప్లేట్లను వాడుతున్నారు.
అలాంటి ఒక వీడియో డిసెంబర్ 2021లో కూడా వైరల్ అయింది.
హిందూ బాలికలను మత్తులోకి తీసుకెళ్లేందుకు వారి తినే ఆహారంలో ముస్లిం వ్యక్తులు మత్తు పదార్థం కలుపుతున్నట్లు పలు భాషల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా షేర్ అయింది.
ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో చాలా మంది యూజర్లు దీన్ని వాస్తవమైనదిగా భావించి, ఇస్లామోఫోబిక్ వ్యాఖ్యలు చేశారు.
‘‘లవ్ జిహాద్‌తో జాగ్రత్తగా ఉండండి’’ అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు.
‘‘లవ్ జిహాద్’’ అనేది కుట్రపూరితమైన సిద్ధాంతంగా భావిస్తారు. ముస్లిం వ్యక్తులు హిందూ మహిళలను ఇస్లాంలోకి మార్చేందుకు ప్రలోభ పెడతారని ఇది పేర్కొంటోంది.

ఫొటో సోర్స్, YOUTUBE
హైదరాబాద్‌కు చెందిన క్రియేటర్ వెంకట్ సీపాన రూపొందించిన వీడియోలలో సీసీటీవీ క్లిప్స్ మాదిరి టైమ్ స్లాంప్, రికార్డింగ్ గుర్తు కనిపిస్తుంటాయి.
ఈయన యూట్యూబ్ ఛానల్‌కి 12 లక్షల మందికి పైగా సబ్‌స్క్రయిబర్లున్నారు. 400కి పైగా వీడియోలను ఆయన అప్‌లోడ్ చేశారు.
సీపాన రూపొందించిన ఒక వీడియోలో మహిళతో టైలర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఉంది.
ట్విటర్, ఫేస్‌బుక్‌లో పలుసార్లు షేర్ అయిన ఈ వీడియోలో, ‘‘హిందూ మహిళలను ముస్లిం వ్యక్తుల దుకాణాలకు వెళ్లొద్దని అభ్యర్థిస్తున్నారు. ముస్లిం దుకాణాల వారు మంచి మనస్తత్వం ఉన్నవారు కాదు’’ అని ఆ వీడియోలలో చెబుతున్నారు.
ఈ వీడియోలో రికార్డింగ్ సమయం, టైమ్ స్టాంప్ రెండూ కనిపిస్తున్నాయి.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వాస్తవ జీవన పరిస్థితులను చూపించేందుకు ఈ వీడియోలను రూపొందిస్తున్నట్లు వెంకట్ సీపాన బీబీసీకి తెలిపారు.
నాటకీయంగా కావాలని చిత్రీకరించిన వీడియోలు శారీరక హింసకు కారణం కాకపోవచ్చని, కానీ, ఇప్పటికే ఉన్న మతపరమైన విభజనను మరింత పెంచుతాయని జర్నలిస్ట్, డిస్‌ఇన్‌ఫర్మేషన్ రీసెర్చర్ అలిషాన్ జఫ్రి అన్నారు.
‘‘ఇప్పటికే భిన్న వర్గాలుగా విడిపోయిన, పోలరైజ్ అయిన సమాజానికి మరింత ఆజ్యం పోసేందుకు ఈ వీడియోలు కారణమవుతున్నాయి.
ఒక నిర్దిష్ట సమాజంపై ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ వీడియోలను రూపొందిస్తున్నారు.
ఈ వీడియోలు వైరల్ అయి, మైనార్టీ కమ్యూనిటీపై హింసకు దారితీస్తున్నాయి’’ అని ఆయన చెప్పారు.
సోషల్ మీడియా యూజర్లను గందరగోళంలో పడేసే విధంగా ఉన్న ఈ వీడియోలను, కొన్నిసార్లు ఆన్‌లైన్‌లో మరింత తప్పుడు సమాచార వ్యాప్తికి కూడా ఉపయోగిస్తున్నారు.
హిందూ సమాజంపై దాడులు చేస్తున్నట్లు తప్పుడు సమాచారంతో ఉన్న రెండు స్టేజ్డ్ వీడియోలు మే నెలలో సోషల్ మీడియాలో బాగా షేర్ అయ్యాయి.
ఒక వీడియోలో కాషాయం రంగు దుస్తులు ధరించి, హిందూ మతానికి చెందిన వ్యక్తిలాగా కనిపిస్తున్నారు. దీనిలో ఆయన తన చెల్లినే పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు.
ఇక రెండో వీడియోలో, అదే అమ్మాయి బుర్ఖాలో ఆయన పక్కనే ఉన్నట్లు చూపించారు. తనని హిందూలోకి మార్చేందుకు ఆమెను పెళ్లి చేసుకున్నట్లు ఆ వీడియోలో చెప్పారు.
ఈ రెండు వీడియోల్లో కనిపించే అమ్మాయి, అబ్బాయి వివిధ పాత్రలలో ఇతర పలు వీడియోల్లో కూడా కనిపించారు.

ఫొటో సోర్స్, TWITTER
యూట్యూబ్ ఛానల్‌పై గుర్తించిన ఈ ఒరిజినల్ క్లిప్స్‌కి 4 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నాయి.
వీరు ఎక్కువగా స్క్రిప్టెడ్ వీడియోలనే పోస్ట్ చేస్తున్నారు.
ఈ వీడియోలను వాస్తవంగా భావిస్తున్నట్లు మీకు తెలుసా? అని ఈ ఛానల్ ఓనర్ విక్రమ్ మిశ్రాను బీబీసీ అడగగా.. ‘‘మేం హిట్ అవ్వాలనుకుంటున్నాం. సమాజంలోని ట్రెండ్స్‌కి అనుగుణంగా నేను వీడియోలను చేస్తుంటాను’’ అని చెప్పారు.
వినోదం కోసం, వ్యూస్ కోసం మాత్రమే వీడియోను క్రియేట్ చేస్తున్నానని, తన యూట్యూబ్ ఛానల్‌పై ఆధారపడి 12 మంది టీమ్ పనిచేస్తుందని తెలిపారు.
కావాలని చిత్రీకరించే వీడియోల విషయంలో విధానాలు ఏం చెబుతున్నాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కూడా బీబీసీ సంప్రదించింది.
‘‘హింసను ప్రేరేపించే విధంగా ఉండే కంటెంట్‌ను ఫేస్‌బుక్‌పై కట్టడి చేసేందుకు స్పష్టమైన నిబంధనలున్నాయి. నిబంధనలను అతిక్రమిస్తే, వాటిని తొలగిస్తాం’’ అని మెటా అధికార ప్రతినిధి చెప్పారు.
యూట్యూబ్ కూడా తన ప్లాట్‌ఫామ్‌పై గ్రాఫిక్ కంటెంట్‌ను లేదా హింసను ప్రేరేపించే కంటెంట్‌ను నిరోధించేందుకు కఠినమైన విధానాలను అనుసరిస్తున్నట్లు తెలిపింది.
త్వరలోనే మిమ్మల్ని చేరుకుంటామంటూ ట్విటర్(ఎక్స్) ఆటో రిప్లై పంపింది.
స్క్రిప్టెడ్ వీడియోలను ఎలా గుర్తిస్తారు?
వీడియోల్లో చాలా వరకు స్టేజ్డ్ వీడియోల మాదిరి కనిపిస్తుంటాయి. ఈ వీడియోలను ఇతర దేశాల్లో కూడా రూపొందించి, షేర్ చేస్తున్నారు.
కానీ, వీటిని భారతీయులు ఎక్కువగా విశ్వసిస్తున్నారు. దేశంలో ఇవి వైరల్‌గా మారుతున్నాయి.
ఎందుకంటే ఒక వర్గపు ప్రేక్షకులకు ఎక్కువగా వారు ఈ వీడియోలను అందిస్తున్నారని ఫ్యాక్ట్ క్రెసెండో మేనేజింగ్ ఎడిటర్ హరీష్ నాయర్ చెప్పారు.
ఫ్యాక్ట్ క్రెసెండో భారత్‌లో, ఇతర ఆసియా దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
స్టేజ్డ్ వీడియోలు కేవలం భారత్‌లో తప్పుడు సమాచార ట్రెండ్‌ను వ్యాప్తి చేయడమే కాకుండా, ప్రజల్లో అంతకుముందు నుంచే ఉన్న నమ్మకాలు, విశ్వాసాలపై, సమాజంపై పెద్దెత్తున ప్రభావం చూపుతున్నాయి.
‘‘మీడియా అక్షరాస్యత తక్కువగా ఉండటం కూడా సమస్యకు ఒక కారణం. కానీ, ఇప్పటికే సామాజికపు అడ్డుగోడలున్న సమాజంలో ఇది జరుగుతోంది’’ అని దిల్లీకి చెందిన డిజిటల్ రైట్స్ అడ్వకసీ గ్రూప్ ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ పాలసీ డైరెక్టర్ ప్రతీక్ వాఘ్రే చెప్పారు.
కానీ, వీడియో చిత్రీకరించిందా లేదా అని తెలుసుకోవడం కూడా పలు మార్గాలున్నాయి.
‘‘వీడియోలో ఉపయోగించిన భాషను, రియాక్షన్లను, ప్రాంతాలను, కెమెరా యాంగిల్స్‌ను యూజర్లు చూడాలి. ప్రజలు యాక్షన్ చేస్తున్నారా? లేదా సహజంగానే అలా మాట్లాడుతున్నారా? గట్టిగా అరుస్తూ, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారా? వంటి పలు విషయాలను వీటి ద్వారా తెలుసుకోవచ్చు’’ అని భారత్‌కు చెందిన మల్టిలింగ్యువల్ ఫ్యాక్ట్ చెక్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ రుబీ ధింగ్రా చెప్పారు.
స్క్రిప్ట్ చేసిన వీడియో మాదిరి, ఎలాంటి అంతరాయం లేకుండా సంఘటన మొత్తం వీడియోను పలు కెమెరాల్లో చిత్రీకరించడం అసంభవం అని ధింగ్రా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- మణిపుర్: తెగల మధ్య ఘర్షణలు మతాల మధ్య చిచ్చుగా మారిన వైనం, ఎందుకిలా జరుగుతోంది?
- మెస్సాలినా: శృంగారంలో వేశ్యలతో పోటీపడి అపఖ్యాతి పాలైన రోమ్ సామ్రాజ్ఞి
- మంత్రగాళ్లంటూ 11మందికి ఉరిశిక్ష - 370 ఏళ్ల తర్వాత నిర్దోషులుగా తీర్మానించిన చట్టసభ
- బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














