తెలంగాణ: పెరట్లో ఎద్దులు మేసాయని దళిత రైతును గుంజకు కట్టేశారు.. ‘‘ఆ పెరడు రెడ్లదని ఎద్దులకు తెలియదు కదా’’

దుర్గం బాపు

ఫొటో సోర్స్, UGC / BBC

ఫొటో క్యాప్షన్, దుర్గం బాపు
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

‘‘ఆ పెరడు రెడ్లదని మేత మేసిన ఎద్దులకు తెలియదు కదా. పశువులకు కులం ఏం తెలుసు? మా పెదనాయన(దుర్గం బాపు)ను ఇంటి దగ్గరి నుండి కొడుతూ తీసుకుపోయి, అతని ఇంటి ముందు పశువులు కట్టేసే గుంజకు పగ్గంతో కట్టేశాడు. ఎవరైనా విడిపిస్తే గొడ్డలితో నరుకుతానని బెదిరించాడు’’ అని శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

దుర్గం బాపుకు శ్రీనివాస్ వరుసకు కొడుకు అవుతారు.

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం శెట్‌పల్లిలో ఆగస్ట్‌ 10న నేతకాని (దళిత) కులానికి చెందిన రైతు దుర్గం బాపును అదే గ్రామానికి చెందిన సూరం రాంరెడ్డి తమ ఇంటి ముందు పశువులను కట్టేసే గుంజకు కట్టేశారు.

ఈ ఘటనపై దళిత సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.

దుర్గం బాపు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, తనను పశువులా గుంజకు కట్టేశారని వాపోయిన దుర్గం బాపు

శెట్‌పల్లిలో ఏం జరిగింది?

శెట్‌పల్లి గ్రామంలో దుర్గం బాపుకు ఎకరం పైచిలుకు వ్యవసాయ భూమి ఉంది. తనను రాంరెడ్డి గుంజకు కట్టేయడం గురించి ఆయన బీబీసీతో మాట్లాడారు.

‘‘మధ్యాహ్నం పొలం పనులు అయ్యాక ఎద్దులను కడిగి గ్రామంలోని హనుమాన్ ఆలయం వరకు తోలాను. మరో పొలంలో పనులకు ట్రాక్టర్ వచ్చిందంటే అక్కడికి వెళ్లాను. పనులు ముగించుకుని మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఇంటికి వస్తుంటే సూరం రాంరెడ్డి ఇంటి ముందు నా ఎద్దుల జత కట్టేసి ఉంది. ఎందుకు కట్టేశారో కనుక్కుందామంటే రాంరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఎద్దుల జతను విడిపించుకుని ఇంటికి వెళ్లాను.

కాసేపటికి మా ఇంటికి వచ్చిన రాంరెడ్డి నా మెడలో ఉన్న తువ్వాలను నా మెడకు బిగించి కాలనీవాసుల ముందే బూతులు తిడుతూ, కొడుతూ ఆయన ఇంటిదాకా ఈడ్చుకుపోయాడు. నా ఎద్దులు మేయడం వల్ల ఆయన పెరట్లో జరిగిన నష్టం చూపిస్తాడేమో అనుకున్నా. కానీ నన్ను అతని ఇంటి ముందు పశువులా గుంజకు కట్టేశాడు. కులం పేరుతో దూషిస్తూ కర్రతో కొట్టాడు. దండం పెట్టిన.. దయ చూపాలని అడిగిన.. దండుగ (పరిహారం) ఇస్తానన్నా, రాంరెడ్డి ఒప్పుకోలేదు’’ అని బాపు వివరించారు.

ఆగస్టు 10న రాంరెడ్డి ఇంటికి విద్యుత్ మీటర్ రీడింగ్ కోసం వచ్చిన సిబ్బంది, ఆయన ఇంటి పెరటి తలుపులు తీసి, వేయడం మరిచిపోయారని, అందుకే తన ఎద్దులు దారిన పోతూ పెరట్లోకి వెళ్లాయని బాపు చెప్పారు.

దుర్గం బాపు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, సంఘటనా స్థలంలో విచారణ జరుపుతున్న పోలీసులు

విడిపించిన గ్రామస్థులు

దుర్గం బాపును వదిలేయాలని, ఎద్దుల వల్ల జరిగిన నష్టానికి పరిహారం తీసుకోవాలని దళిత కాలనీ వాసులు రాంరెడ్డిని కోరారు.

అయితే దానికి అంగీకరించకపోగా, విడిపించిన వారిని చంపుతాననిఆయన బెదిరించినట్లు మాదరి రాజబాపు అనే దళిత కాలనీ వాసి బీబీసీతో చెప్పారు.

‘‘గంటపాటు కట్టె పట్టుకుని చుట్టూ తిరిగాడు. బాపును ముల్లుకర్రతో కొట్టాడు. విడిపించాలని చూస్తే బూతులు తిట్టాడు. చివరకు ధైర్యం చేసి తాళ్లు విప్పదీసాను. ఆ తర్వాత కోటపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లాము. కేసు పెట్టాము. ఎద్దుల వల్ల పెరట్లో జరిగిన నష్టం చూపించడానికి బాపును కాలనీ నుండి తీసుకెళ్తున్నాడని అడ్డుచెప్పలేదు. దాడి చేస్తాడని తెలిస్తే వెళ్లనిచ్చేవాళ్లం కాదు’’ అని ఆయన చెప్పారు.

‘‘గతంలో గ్రామంలో చిన్నచిన్న వివాదాలు జరిగాయి. కానీ అవి గ్రామం దాటి పోలేదు. ఇలా పశువులా కట్టేసి కొట్టడం మొదటిసారి జరిగింది. ఈ రోజు పోలీసులు వచ్చి ఘటనకు ప్రత్యక్షసాక్షిగా నా నుండి వివరాలు సేకరించారు. స్థానిక నాయకులు కొందరు కాంప్రమైజ్ కావాలని అడుగుతున్నారు. కానీ నిందితుణ్ని జైలుకు పంపాలి’’ అని రాజబాపు డిమాండ్ చేశారు.

దుర్గం బాపును తామే విడిపించామని గ్రామస్థులు చెప్పారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, దుర్గం బాపును తామే విడిపించామని గ్రామస్థులు చెప్పారు.

రాంరెడ్డి కుల దూషణకు దిగారు: పోలీసులు

రాంరెడ్డిపై కోటపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీస్ (నిరోధక) చట్టం కింద కేసు నమోదు అయింది. జైపూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ) బాలసాని మోహన్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.

“దుర్గం బాపు ఎద్దుల జత రాంరెడ్డి పెరట్లో బీర, చిక్కుడు తీగలు తిన్నాయి. రాంరెడ్డి తన ఇంటి ముందు దుర్గం బాపును తాళ్లతో నిర్బంధించడంతో గ్రామస్థులు ఆయన్ను విడిపించారు. ఐపీసీ సెక్షన్లు 342, 324, 290తోపాటు అట్రాసిటి కేసు నమోదైంది. ఈ వ్యవహారాన్ని (పశువులు మేసినందుకు పరిహారం) పరిష్కరించుకునేందుకు వేరే మార్గాలున్నాయి. రాంరెడ్డి తనకు జరిగిన నష్టానికి పరిహారమే కోరుకుంటే గ్రామ పెద్దల మధ్య చర్చించి తేల్చుకోవచ్చు. కానీ, ఆయన కుల దూషణకు దిగారు. చట్టాలు కఠినంగా ఉన్నాయి. ప్రజలు చట్టాల పట్ల అవగాహనతో మెలగాలి’’ అని కోటపల్లి ఇన్‌స్పెక్టర్ సీహెచ్ విద్యాసాగర్ బీబీసీతో అన్నారు.

నిందితుడు రాంరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారని విద్యాసాగర్ తెలిపారు.

దుర్గం బాపు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, గ్రామంలో విచారణకు వచ్చిన ఏసీపీ బాలసాని మోహన్

ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని ఏసీపీ బాలసాని మోహన్ తెలిపారు.

అసలేం జరిగిందనేదానిపై నిందితుడు రాంరెడ్డి తరపు వాదన తెలుసుకొనేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఆయనకు పలుమార్లు ఫోన్ చేసినా, ఆయన స్పందించ లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

వీడియో క్యాప్షన్, ఆధారాలతో సహా బయట పెట్టిన బీబీసీ ఇన్వెస్టిగేషన్