కూబర్ పెడీ: ఇక్కడ ప్రజలు భూగర్భంలో నివసిస్తారు - మండు వేసవిలో కూడా ఏసీ లేకుండా హాయిగా ఉంటారు

CooberPedy

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జరియా గార్వెట్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

అడిలైడ్ తీర మైదానాల నుంచి ఉత్తర దిశగా సెంట్రల్ ఆస్ట్రేలియా వైపు సాగిపోయే పొడవాటి రహదారిపై 848 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత అక్కడ చెదిరిపోయిన ఇసుక పిరమిడ్‌లు కనిపిస్తాయి. ఆ పరిసరాలన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎటుచూసినా లేత గులాబీ రంగు ధూళితో నిండిన నేల, అక్కడక్కడా చిన్నచిన్న పొదలు తప్ప ఏమీ లేవు.

అక్కడ నుంచి హైవేపై ఇంకా ముందుముందుకు వెళ్తుంటే ఇలాంటి మార్మిక ఇసుక నిర్మాణాలు మరిన్ని కనిపిస్తాయి.

కుప్పలుకుప్పలుగా పాలిపోయిన ఇసుక కనిపిస్తుంది. మధ్యలో అప్పుడప్పుడు తెల్లని పైపులు నేలలో పాతినట్లుగా పైకి కనిపిస్తుంటాయి.

ఇవన్నీ ‘కూబర్ పెడీ’ పట్టణానికి దగ్గర్లోకి వస్తున్నామనడానికి సూచనలు.. ఓపల్ మైనింగ్‌కు కూబర్ పెడీ పెట్టిందిపేరు. ఆ ఊళ్లో జనాభా సుమారు 2,500 ఉంటుంది. అక్కడ కనిపించే ఇసుక గుట్టల్లో చాలావరకు ఏళ్లుగా సాగుతున్న మైనింగ్ కారణంగా తవ్వి పోసిన మట్టి వల్ల ఏర్పడినవి.. మరికొన్ని మాత్రం అక్కడికే ప్రత్యేకమైన భూగర్భ జీవనానికి నిదర్శనాలు.

ఈ ప్రాంతంలో నివసించేవారిలో 60 శాతం మంది ఇనుప ధాతువుతో గట్టిపడిన ఇసుక రాళ్లు, సిల్ట్ స్టోన్‌లో ఇళ్లు నిర్మించుకుంటారు. నేలపైనుంచి పొడుచుకొచ్చినట్లుగా కనిపించే వెంటిలేషన్ షాఫ్ట్‌లను చూస్తేనే అక్కడ భూగర్భంలో ఇళ్లు ఉన్నాయని తెలుస్తుంది. లోపలికి వెళ్లడానికి ఉన్న ప్రవేశద్వారాల దగ్గర పేరుకున్న అదనపు మట్టి కూడా అక్కడ భూమిలో ఇళ్లున్నాయనడానికి ఆనవాలుగా ఉంటుంది.

చలికాలంలో ఈ భూగర్భ జీవనశైలి పూర్తిగా అసాధరణంగా అనిపించొచ్చు. కానీ వేసవి కాలంలో అక్కడి వాతావరణానికి అదే సరైనదనేలా ఉంటుంది. ‘కూబర్ పెడీ’ అనే పేరుకు స్థానిక ఆస్ట్రేలియన్ భాషల్లో కలుగులోని మనిషి అనే అర్థం ఉంది. వేసవిలో ఇక్కడి ఉష్ణోగ్రతలు 52 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి. వేడిని తట్టుకోలేక పక్షులు కూడా నేలరాలుతుంటాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాలైతే ఫ్రిజ్‌లో ఉంచాల్సినంత పరిస్థితులుంటాయి.

ఈ ఏడాది ఈ వ్యూహం మరింత ముందుగా కనిపిస్తోంది. చైనా వాయువ్య ప్రాంత నగరం చాంగ్‌క్వింగ్‌లో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ వైమానిక దాడుల నుంచి రక్షించుకోవడానికి నిర్మించిన భూగర్భ షెల్టర్‌ను జులైలో మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు అక్కడి భూగర్భ రెస్టారెంట్లకు వెళ్లడం ప్రారంభించారు.

అధికమైన ఉష్ణోగ్రతలతో ప్రపంచంలోని అనేక ప్రాంతాలు విలవిలలాడుతున్న వేళ.. దావానలాలు ప్రజలను నిలునివ్వని వేళ కూబర్ పెడీ ప్రజల నుంచి మిగతా ప్రపంచం ఏం నేర్చుకోవచ్చు?

కూబర్ పెడీ ఏమీ ప్రపంచంలో మొట్టమొదటి భూగర్భ ఆవాసం కానీ, అతిపెద్ద భూగర్భ ఆవాసం కానీ కాదు. వేల ఏళ్ల కిందటే కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి ప్రజలు భూగర్భ నివాస పద్ధతులను ఎంచుకున్నారు. లక్షల ఏళ్ల కిందట మనిషి పూర్వీకులు ఉపయోగించిన పరికరాలు దక్షిణాఫ్రికా గుహల్లో దొరికాయి.

ఆగ్నేయ సెనెగల్‌లో విపరీతమైన పగటి ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి చింపాంజీలు కూడా గుహలలో చేరి చల్లబడినట్లు ఆధారాలున్నాయి.

కూబర్ పెడీ

ఫొటో సోర్స్, Getty Images

‘కోళ్ల కోసం వెతుకుంటే..’

మధ్య తుర్కియే ప్రాచీన జిల్లా కపడోసియానే తీసుకోండి. ఆ ప్రాంతం వర్షాభావ పీఠభూమిలో ఉంది. నిజమా, కలా అనిపించేలాంటి ఆకట్టుకునే భౌగోళిక అద్భుతాలకు నెలవు ఈ ప్రాంతం. చెక్కినట్లుండే శిఖరాలు, రాతి గుమ్మటాలతో దేవతల కథల్లో చెప్పే రాజ్యంలా అనిపిస్తుంది.

ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక పాపులర్ రూమర్ ఉంది. ఓ వ్యక్తి తప్పిపోయిన తన కోళ్ల కోసం వెతుకుతుంటే ఈ ప్రాంతం బయటపడిందని చెప్తారు. ఆ పాపులర్ రూమర్ ప్రకారం... 1963లో ఓ వ్యక్తి కోళ్లు వరుసగా కనిపించకుండా పోతుండడంతో అవి ఏమవుతున్నాయో కనిపెట్టేందుకు తన ఇంటి బేస్‌మెంట్‌లో వెతుకుతూ వెళ్లాడు. గోడలు అన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటే అనుకోకుండా తెరుచకున్న ఓ రంథ్రంలోకి ఆ కోళ్లన్నీ మాయమవుతున్నాయని గుర్తిస్తాడు. ఆయన ఆ రంథ్రలోకి వెళ్లి ముందుకు సాగుతుంటే అనేక కొత్త విషయాలు ఆయనకు తెలుస్తాయి. అందులోంచి ఆయన ఒక రహస్య మార్గాన్ని కనుగొంటాడు.. నిటారుగా భూగర్భంలోకి ఉన్న ఆ మార్గంలో వెళ్తుంటే అనేక జిగిబిగి దారులు, నడవాలు ఉంటాయి. ఇది శిథిలమైన ఒకప్పటి నగరం డెరింకుయూకు వెళ్లే ప్రధాన మార్గాలలో ఒకటి అనేది ఆ కథ సారాంశం.

డెరింకుయూ అనేది వందలాది గుహ నివాసాలున్న ఒక భూగర్భ నగరం. దీన్ని క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో నిర్మించినట్లు అంచనా. వెంటిలేషన్ షాఫ్ట్‌లు, బావులు, చర్చ్‌లు, గోదాములు అన్నీ ఉన్న భూగర్భ నగరం ఇది. శత్రువులు దండయాత్రలు చేసినప్పుడు ఇది 20 వేల మంది ప్రజలకు ఆశ్రయం ఇచ్చేటంతటి సామర్థ్యం ఉన్న నగరం.

కూబర్ పెడీ తరహాలోనే ఈ భూగర్భ నగరం కూడా వేసవి, శీతాకాలాలలోని తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకునేలా ఉంటుంది. వేసవిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, శీతాకాలంలో సున్నా కంటే తక్కువగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ, ఈ భూగర్భ నగరంలో మాత్రం ఎప్పుడూ 13 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు కాస్త అటుఇటుగా ఉష్ణోగ్రతలుంటాయి.

ఇప్పుడు కూడా కపడోసియా ప్రాంతంలోని మానవ నిర్మిత గుహలు వాటి శీతలీకరణ సామర్థ్యానికి పేరు పొందాయి. వేడి పెంచడం, తగ్గించడం కోసం విద్యుచ్ఛక్తిలాంటివేవీ వాడకుండానే కేవలం ప్రత్యేకమైన డిజైన్‌తో నిర్మించిన ఇక్కడి గుహలు అక్కడి లోపలి వాతావరణాన్ని నిత్యం చల్లగా ఉంచుతాయి.

కపడోసియాలోని ప్రాచీన గ్యాలరీలు, భూగర్భ మార్గాలు ఇప్పుడు వేల టన్నుల బంగాళాదుంపలు, నిమ్మకాయలు, క్యాబేజీలతో నిండి ఉంటున్నాయి. భూగర్భంలో వీటిని ఉంచి శీతలీకరణ చేయడం వల్ల కోల్డ్ స్టోరేజీలలో ఉంచాల్సిన అవసరం తప్పి ఎంతో విద్యుత్ ఆదా అవుతోంది. ఈ తరహా గుహలకు ఆదరణ ఉండడంతో డిమాండ్ మరింత పెరిగి కొత్తవి నిర్మిస్తున్నారు.

Derinkuyu

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుర్కియేలోని డెరింకుయు

కరెంటు ఆదా

కూబర్‌పెడీలో భూగర్భంలోని భవనాలు కనీసం నాలుగు మీటర్లు(13 అడుగులు) లోతున ఉంటాయి.

పైకప్పులు కూలిపోయే ప్రమాదం లేకుండా ఉండేందుకు కనీసం ఆ లోతున నిర్మాణాలుంటాయి.

అంతేకాదు.. రాతి నేలలో ఆ లోతున ఏడాదంతా రాత్రీపగలు కూడా 23 డిగ్రీల ఉష్ణోగ్రత మెంటైన్ అవుతుంది.

భూగర్భ నివాసం వల్ల సౌకర్యం ఒక్కటే కాకుండా డబ్బు కూడా సమకూరుతుంది కూబర్ పెడీ ప్రజలకు.

ఈ నగరం గాలి, సౌర శక్తితో విద్యుత్ తయారుచేసుకుంటుంది. ‘ఇలాంటి వాతావరణంలో భూమిపై నివసిస్తే నిత్యం ఏసీలు నడవడానికి కరెంట్ కావాలి, అందుకు భారీగా ఖర్చవుతుంది. కానీ, భూగర్భ నివాసంలో ఆ అవసరం లేదు’ అన్నారు అక్కడ నివసించే జేసన్ రైట్.

మరోవైపు కూబర్ పెడీ భూగర్భ గృహాల ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇటీవల వేలం సమయంలో మూడు పడగ్గదుల ఇల్లు సగటున 40 వేల ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు రూ. 21 లక్షలు) ధర పలికింది. అయితే, ఇక్కడి ఇళ్లలో చాలావరకు మామూలుగానే ఉంటాయి. వీటిని ఆధునికీకరించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఇక్కడికి సమీపంలోని అడిలైడ్‌లో ఇలాంటి ఇంటి ధర 70 వేల ఆస్ట్రేలియా డాలర్లు(సుమారు రూ. 37 లక్షలు) ఉంటుంది.

ఈ భూగర్భ గృహాలలో మరిన్ని సదుపాయాలుంటాయంటారు జేసన్ రైట్. ఇక్కడ శబ్ద కాలుష్యం కానీ కాంతి కాలుష్యం కానీ ఉండదని.. పురుగులు, కీటకాల బెడద కూడా తక్కువే ఉంటుందని చెప్పారు జేసన్.

భూగర్భ జీవన శైలిలో భూంకపాల నుంచి కొంత రక్షణ ఉండొచ్చనవాదనా ఉంది. అయితే, భూగర్భ గృహం పరిమాణం, ఎలా నిర్మించారనే అంశాలు కూడా కీలకమే.

కూబర్ పెడీలోని భూగర్భ గృహాలలోని గదులు

ఫొటో సోర్స్, alamy

ఫొటో క్యాప్షన్, కూబర్ పెడీలోని భూగర్భ గృహాలలోని గదులు

రాయే కానీ గోళ్లతో కూడా గీకొచ్చు

అయితే, ఈ తరహా భూగర్భ గృహాలు వాతావరణ మార్పులను తట్టుకోవడానికి మనుషులకు ఉపయోగపడతాయా అనేది ప్రశ్న.

ఒకవేళ నిజంగానే ఉపయోగపడితే మరెందుకు ప్రపంచమంతటా ఇలాంటి విధానాన్ని స్వీకరించడం లేదన్నది మరో ప్రశ్న.

కూబర్ పెడీలో ఇలాంటి కలుగుల్లాంటి నివాసాలు విజయవంతం కావడానికి అనేక కారణాలున్నాయి.

అందులో మొదటిది ఇక్కడుండే రాతి రకం.

‘ఇక్కడ రాయి మెత్తగా ఉంటుంది. జేబులో ఉంచుకునే చిన్న చాకుతో కానీ చేతి వేళ్లకుండే గోళ్లతో కానీ ఈ రాతిని గీకొచ్చు’ అని అక్కడి టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో పనిచేసే బారీ లూయిస్ చెప్పారు.

1960, 70ల ప్రాంతాలలో కూబర్ పెడీ ప్రజలు ఓపాల్ మైన్లు తవ్వకుంటూ పోయినట్లే పేలుడు పదార్థాలు, గునపాలు వంటివి ఉపయోగించి తమ ఇళ్లనూ విస్తరించుకున్నారు.

మైనింగ్‌లో భాగంగా తవ్విన సొరంగాలను చాలామంది ఇళ్ల నిర్మాణానికి వాడుకున్నారు. చాలామంది ఇళ్లు నిర్మించుకునేటప్పుడు వారికి ఓపాల్స్‌ కూడా దొరుకుతుంటాయి.

Cappadocia

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కపడోసియా

అదే స్పెషాలిటీ

ఈ రాయి తవ్వడానికి సులభంగా ఉన్నా కూడా నిర్మాణపరంగా చూస్తే దృఢంగానే ఉంటుంది.

అందుకే ఎలాంటి ఆకారంలో కావాలంటే అలాంటి ఆకారంలో గదులు తవ్వుకోవచ్చు. ఇనుము వంటి అదనపు మెటీరియల్స్ వాడాల్సిన పనిలేదు.

ఈ భూగర్భ గృహాలను చాలామంది విలాసవంతంగా మార్చుకుంటారు.

స్విమింగ్ పూల్స్, గేమ్స్ రూమ్స్, విశాలమైన స్నానాల గదులు వంటివన్నీ ఉంటాయి.

భూగర్భ ఆవాసాలలో నివసించేవారి జీవితం కూడా చాలా ప్రైవేటుగా ఉంటుంది. పొరుగింటివారిని డిన్నర్‌కు పిలిస్తేనే వారు కనిపిస్తారు. లేదంటే వారు బయట కనిపించే అవకాశమే ఉండదు.

కూబర్‌పెడీలో సాధ్యమైనట్లుగా అన్ని ప్రాంతాలలో ఇలాంటి భూగర్భ గృహాలు సాధ్యం కాకపోవచ్చు, సాధ్యమైనా కూడా ఇంత సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. ఈ ప్రాంతంలో 13 అడుగుల లోతున ఇళ్లు నిర్మిస్తారు కానీ కొంచెం కూడా చెమ్మ రాదు.

కానీ, ఇతర ప్రాంతాలలో చెమ్మ వంటి సమస్యలు ఉండొచ్చు.

కూబర్ పెడీలో ఇళ్లే కాదు భూగర్భంలో రెస్టారెంట్లు కూడా ఉంటాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కూబర్ పెడీలో ఇళ్లే కాదు భూగర్భంలో రెస్టారెంట్లు కూడా ఉంటాయి

మిగతా చోట్ల సమస్యలు

రాతిని తొలిచి మనుషులు ఆవాసాలు ఏర్పాటుచేసుకున్న ప్రాంతాలలో చాలావరకు వర్షాభావ ప్రాంతాలే అయ్యుంటాయి.

కొలరాడోలోని మెసావెర్డె, జోర్డాన్‌లోని పెత్రా, ఇరాన్‌లోని కందోవాన్ వంటివన్నీ వర్షాభావ ప్రాంతాలే.

కందోవాన్‌లో వేసవిలో నెలకు సగటున 11 మిల్లీమీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ ఉండదు.

తేమ ఉండే ప్రాంతాలలో భూగర్భ నిర్మాణాలు చేపట్టడం క్లిష్టతరం. లండన్‌లో 19వ శతాబ్దంలో నిర్మించిన అండర్‌గ్రౌండ్ టన్నెల్స్‌ను వాటర్ ప్రూఫ్ చేయడానికి ఇటుకలు, తారు వంటి పదార్థాలను అనేక పొరలుగా ఉపయోగించారు.

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పటికీ నాచు వంటి సమస్యలపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.

వెంటిలేషన్ పూర్తిగా లేకపోవడం అనేది సమస్య. వంట చేసినప్పుడు వెలువడే తేమ, స్నానాలు, శ్వాసప్రక్రియ వల్ల గోడలపై తేమ పేరుకుంటుంది.

ఇజ్రాయెల్‌లోని హజాన్ గుహలను కనుక తీసుకుంటే బయటతో పోల్చితే వీటిలో ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉంటంది. కానీ, హ్యుమిడిటీ మాత్రం దాదాపు రెట్టింపవుతుంది. కారణం ఇది లోతట్టు ప్రాంతంలోని రాళ్ల కింద నిర్మించిన ఇళ్లు కావడమే.

కానీ, దీనికి భిన్నంగా కూబర్‌పెడీలో 50 మీటర్ల ఎత్తయిన రాళ్లలో నిర్మాణాలుంటాయి. పూర్తిగా డ్రై ఏరియా కావడంతో ఇక్కడ తేమ సమస్య ఉండదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)