మెరుగైన జీవనానికి ప్రపంచంలోని 5 ఉత్తమ నగరాలివే, ఎందుకంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, లిండ్సే గలోవే
- హోదా, బీబీసీ ట్రావెల్
కరోనావైరస్ మహమ్మారి తర్వాత నగర జీవనం క్రమేణ మెరుగవుతోంది.
ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన గ్లోబల్ లివబుల్ ఇండెక్స్ ప్రకారం, సగటు జీవన ప్రమాణం 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
నగర జీవనంలో స్థిరత్వం, ఆరోగ్యం, సంస్కృతి, పర్యావరణంతో పాటు విద్య, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయనే అంశాల ప్రాతిపదికన ఈ నివేదికను రూపొందించారు. ప్రపంచంలోని 173 నగరాల్లో జీవన ప్రమాణాలను పరిశీలించారు.
జీవన ప్రమాణాల్లో మెరుగుదల ఘనత ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు చెందుతుంది. ఆయా దేశాల్లో విద్య, వైద్య ప్రమాణాలు మెరుగవడం వల్లే ఇది సాధ్యమైంది.
అయితే, యుక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ సంక్షోభం తలెత్తి స్థిరత్వం స్థాయి కొద్దిగా తగ్గింది.
కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. మొత్తంగా చూస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి.
మెరుగైన జీవనం సాగించేందుకు ఏ నగరం అనువైనదో తెలుసుకునేందుకు ఆయా నగరాల్లో నివసిస్తున్న వారి నుంచి సేకరించిన సమాచారం, వారి అనుభవాలతోనే ఈ నివేదిక రూపొందించినట్లు తెలిపారు.
ఈ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఉన్న నగరాల్లో 5 నగరాల్లో నివసిస్తున్న వారితో, మీరు ఆ నగరాలనే ఎందుకు ఎంచుకున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నాం.

ఫొటో సోర్స్, Getty Images
వియన్నా, ఆస్ట్రియా
మెరుగైన జీవన ప్రమాణాలున్న నగరాల్లో ఆస్ట్రియా రాజధాని వియన్నా తొలి స్థానంలో నిలిచింది.
2021లో వియన్నా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ఆ తర్వాత కరోనా కారణంగా అక్కడి మ్యూజియంలు, రెస్టారెంట్లు మూతపడ్డాయి.
అయినప్పటికీ, స్థిరత్వం, వైద్యం, విద్య, మౌలిక సదుపాయాల పరంగా వియన్నా ఉత్తమ నగరమని అక్కడి స్థానికులు చెప్పారు.
2 మిషెలిన్ స్టార్ రెస్టారెంట్స్ మేనేజర్ మనుఎలా ఫిలిప్పో. ఆమె వ్యాపారంలో తన భర్తకు తోడుగా ఉంటున్నారు.
నగర చరిత్ర, నమ్మకమైన రవాణా వ్యవస్థ, కేఫ్‌లు, థియేటర్లకు సులభంగా వెళ్లే అవకాశం, వినోద కార్యక్రమాలు వంటివి వియన్నాలో జీవనం మెరుగ్గా ఉండడానికి కారణమని ఆమె చెప్పారు.
''కొన్నిసార్లు చాలా పని ఉంటుంది. ఎక్కడికైనా దూరంగా వెళ్లాలనుకున్నా కుదరదు. అలాంటి సమయాల్లో నగరంలోనే ఎంజాయ్ చేయొచ్చు. అందుకు తగిన వినోద సదుపాయాలున్నాయి'' అని ఆమె అన్నారు.
వియన్నాలోని హోటల్ దస్ టిగ్రాలో సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు రిచర్డ్ వోస్.
సాంస్కృతిక చరిత్ర, సాంస్కృతిక కార్యక్రమాలు నగర జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని ఆయన విశ్వసిస్తున్నారు.
''వియన్నాలో స్కాన్‌బ్రన్ ప్యాలెస్, హాఫ్‌బర్గ్, వియెన్నా సిటీ హాట్ వంటి అద్భుతమైన చారిత్రక భవనాలున్నాయి. సంప్రదాయ సంగీతం మొజార్ట్, బీతోవెన్, స్ట్రాస్ కూడా ఇక్కడ ప్రసిద్ధి'' అని ఆయన చెప్పారు.
నగరంలో చాలా మ్యూజియంలు, థియేటర్లు, ఒపెరా హౌసెస్ ఉన్నాయి. చాలా ఆప్షన్లు ఉన్నాయి.
వియన్నా ఆహారాన్ని కూడా ఆస్వాదించవచ్చని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ ఈ జాబితాలో మూడు, నాలుగు స్థానాలు దక్కించుకున్నాయి.
మరీ ముఖ్యంగా సంస్కతి, పర్యావరణం విభాగాల్లో మెల్‌బోర్న్ మెరుగ్గా ఉంది. స్థానికులు అందుకు గర్వపడుతున్నారు కూడా.
జేన్ మారెల్ కెరీర్ సొల్యూషన్స్ కంపెనీ సీఈవోగా ఉన్నారు.
మెల్‌బోర్న్ ఉత్తమ నగరమని ఆమె అన్నారు. ఆహారం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆస్ట్రేలియాన్ ఫార్ములా వన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ వంటి అంతర్జాతీయ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయని ఆమె చెప్పారు.
ట్రామ్ కారణంగా నగరంలో ప్రయాణం కూడా చాలా సులభమని ఆమె అన్నారు.
మెల్‌బోర్న్‌కి దగ్గర్లోనే ప్రపంచంలోని అత్యుత్తమ బీచ్‌లు కూడా ఉన్నాయి.
కాలిఫోర్నియాకు చెందిన బ్లాగర్ కిమి కానర్ మాత్రం మెల్‌బోర్న్ కంటే సిడ్నీ బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
''సిడ్నీ చాలా అందమైన ప్రదేశం. అక్కడ బీచ్‌లు, చారిత్రక భవనాల వంటి చాలా అందమైన ప్రదేశాలున్నాయి. కానీ మెల్‌బోర్న్ అలాంటి భవనాలున్న నగరం కాదు. అదొక సాంస్కృతిక నగరం. తిరగడానికి కూడా సమయం పడుతుంది'' అని అన్నారు.
''మెల్‌బోర్న్‌ని ఆస్వాదించాలంటే ఒక కెఫేకి వెళ్లి కూర్చుని కప్పు కాఫీ తాగితే చాలు. అది మీ జీవితంలోనే బెస్ట్ కాఫీ అవుతుంది. రకరకాల రెస్టారెంట్లకు, బార్లకు కూడా వెళ్లొచ్చు'' అని ఆమె చెప్పారు.
అయితే, సిడ్నీ కంటే మెల్‌బోర్న్ ప్రజలు త్వరగా కలిసిపోతారని ఆమె అన్నారు.
మెల్‌బోర్న్ ఉత్తమ ప్రదేశంగా నిలవడానికి అక్కడి ప్రజల పాజిటివ్ యాటిట్యూడ్ కూడా ఒక కారణమని జేన్ మారెల్ అభిప్రాయపడ్డారు.
''మెల్‌బోర్న్ ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాంకోవర్, కెనడా
కెనడాలోని వాంకోవర్, కాల్గరి, టొరంటో నగరాలు టాప్ 10 జాబితాలో ఉన్నాయి.
అయితే, సంస్కృతి, ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల వాంకోవర్ సిటీ తొలి ఐదు స్థానాల్లో చోటు దక్కించుకుంది. అక్కడి ప్రజలు నగరాన్ని ప్రేమించేందుకు కూడా అవే కారణం.
టోన్ హో ఒక వ్యాపారవేత్త.
''వాంకోవర్ సిటీ అటవీ ప్రాంతాలు, ఎత్తైన పర్వతాలు, తీరప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది'' అని ఆయన అన్నారు.
ఒకే రోజులో అందమైన బీచ్ నుంచి ఎత్తైన పర్వత ప్రాంతానికి వెళ్లేందుకు రోడ్లు అనువుగా ఉంటాయి. బస్సు, బోటు, సైకిల్ ఇలా దేనిపై అయినా వెళ్లిపోవచ్చు.
''ఇక్కడ దొరికే రకరకాల ఆహార పదార్థాలను ఆస్వాదించొచ్చు. అది నగరంలోని భిన్నసంస్కృతులకు నిదర్శనం. ఇథియోపియన్ ఇంజెరా నుంచి టిబెటన్ మోమోస్ వరకూ అన్నీ ఇక్కడ దొరుకుతాయి'' అని ఆయన అన్నారు.
టోన్‌కు ఒక చిన్న పాప ఉంది. పిల్లలను తీసుకెళ్లేందుకు నగరంలో లెక్కలేనన్ని పార్కులున్నాయి. కేవలం 20 నిమిషాల్లో బీచ్‌కు కూడా వెళ్లొచ్చు.
ఇక్కడి ఇమ్మిగ్రేషన్ విధానం వల్ల ప్రపంచంలోని చాలా దేశాల నుంచి ఇక్కడకు వస్తుంటారు.
రాకెట్ ప్లాన్ అనే మొబైల్ ప్లాట్‌ఫాంకి సీఈవోగా పనిచేస్తున్నారు జోయ్ టోజ్‌మన్.
''నేను క్రొయేషియా నుంచి వచ్చాను. మన అభివృద్ధికి ప్రోత్సాహకరంగా ఉండడంతో పాటు జీవితాన్ని ఉత్సాహంగా గడిపేలా ఉండే నగరంలో ఉండాలనుకున్నాను'' అని ఆయన అన్నారు.
వాంకోవర్‌లో వ్యాపారం ప్రారంభించడం ఉత్తమం, ఇక్కడి ప్రజలు కూడా బావుంటారని ఆయన అన్నారు.
''మీకు ప్రతి సందర్భంలోనూ ఇక్కడి ప్రజలు సహకరిస్తారు. ఇక్కడి వ్యాపార వర్గాలు అండగా ఉంటాయి''
వ్యాపారం పక్కన పెడితే, ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలున్నాయి.
''నాకు ఎప్పుడైనా పని నుంచి విరామం కావాలని అనిపిస్తే, ఆహ్లాదకరంగా గడిపేందుకు ఇక్కడే బీచ్‌లు, పర్వత శ్రేణులు ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్లేందుకు రోడ్లు ఉన్నాయి'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒసాకా, జపాన్
ఉత్తమ నగరాల జాబితాలో ఆసియా నుంచి జపాన్‌లోని ఒసాకాకి మాత్రమే టాప్ 10లో చోటు దక్కింది. స్థిరత్వం, విద్య, వైద్యంలో వంద శాతం మార్కులు సాధించినా పదో స్థానంలో నిలిచింది.
ప్రపంచమంతా ద్రవ్యోల్బణం సమస్య ఎదుర్కొంటున్నా ఒసాకాలో ధరలు అందుబాటులోనే ఉన్నాయి. ద్రవ్యోల్బణం ప్రభావం అంతగా లేకపోవడంపై అక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారు.
వాంకోవర్‌కి చెందిన షిర్లే జెంగ్ ప్రస్తుతం ఒసాకాలో నివసిస్తున్నారు.
ప్రపంచంలోని నగరాలు, జపాన్‌లోని ఇతర నగరాలతో పోలిస్తే ఒసాకాలో అద్దెలు తక్కువని ఆమె చెబుతున్నారు.
''నా ఇంటి అద్దె 410 యూరోలు లేదా 700 కెనడియన్ డాలర్లు (సుమారు రూ.37 వేలు). నీళ్లు, ఇంటర్నెట్, ఇతర ఖర్చులు కూడా అందులోనే. చిన్న అపార్ట్‌మెంటే అయినా కొత్తది, చాలా శుభ్రంగా ఉంటుంది. అదే వాంకోవర్‌లో ఇలాంటి ఇళ్లు కావాలంటే కనీసం 1200 కెనడియన్ డాలర్లకు పైగా పెట్టాల్సిందే'' అని అన్నారు.
''నేను బ్రిటన్ నుంచి వచ్చాను. అక్కడ బయట తినాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఒసాకాలో చాలా తక్కువ ధరకే రెస్టారెంట్‌లో భోజనం చేయొచ్చు. మీరు రోజూ బయటే తినేయొచ్చు'' అని జేమ్స్ హిల్స్ చెప్పారు.
మిగిలిన నగరాలతో పోలిస్తే ఇక్కడ భద్రత కూడా ఎక్కువే.
''రాత్రిళ్లు నడుచుకుంటూ వెళ్తున్నా భయం అవసరం లేదు'' అని షిర్లే జెంగ్ చెప్పారు.
పర్సు దొంగతనం చేస్తారేమోనని ఆమె ఎప్పుడూ భయపడలేదు. వాటితో పాటు రవాణా వ్యవస్థ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది.
నగర నలుమూలలకూ రైలు సౌకర్యం ఉంది. క్యోటో, నారా, కోబ్ వంటి నగరాలకు కూడా సులభంగా వెళ్లొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఆక్లాండ్, న్యూజిలాండ్
ఒసాకాతో పాటు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ కూడా పదో స్థానాన్ని పంచుకుంటోంది. ఈ నగరం నిరుడు 25వ స్థానంలో ఉంది. కరోనా తర్వాత కూడా 2022 సెప్టెంబర్ వరకూ అక్కడ ఆంక్షలు అమల్లో ఉండడమే అందుకు ప్రధాన కారణం.
విద్యతో పాటు సంస్కృతి, పర్యావరణంలో ఈ నగరం మెరుగ్గా ఉంది. అది నిజమేనని అక్కడి ప్రజలు కూడా నమ్ముతున్నారు.
తాము నివసించే ప్రాంతానికి కేవలం 20 నిమిషాల దూరంలో అందమైన బీచ్ ఉందని బ్లాగర్ మెగన్ లారెన్స్ చెప్పారు.
''న్యూజిలాండ్‌లో అతిపెద్ద నగరం ఆక్లాండ్. నగరంలో ఎక్కడికెళ్లినా పచ్చదనం కనిపిస్తుంది. అంతర్జాతీయ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతుంటాయి. 2023 ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఇక్కడే నిర్వహించారు.''
గ్రెగ్ మారియెట్ ఒక ట్రావెన్ కంపెనీలో పనిచేస్తున్నారు. ''ఇక్కడ పెద్దపెద్ద కాన్సర్ట్‌లు, షోలు, క్రీడా కార్యక్రమాలు జరుగుతుంటాయి. వచ్చే వారం ఆక్లాండ్ మ్యూజియంలో ఈజిప్ట్ ఫారోల ప్రదర్శన ఉంది'' అని ఆయన చెప్పారు.
న్యూజిలాండ్‌లో నివసించేందుకు ప్రపంచంలోని చాలా దేశాల నుంచి వస్తుంటారు. అందువల్ల ప్రపంచంలో దొరికే వంటకాలన్నీ ఇక్కడ దొరుకుతాయి.
ఇక్కడి ప్రజలు అందరితో స్నేహపూర్వకంగా ఉంటారని, అది అన్నింటికంటే ముఖ్యమైనదని లారెన్స్ చెప్పారు.
''ఇక్కడి ప్రజలు సాయం చేసేందుకు ముందుంటారు. నవ్వుతూ హాయ్, బై చెప్పడాన్ని ఇష్టపడతా'' అని అన్నారు.














