మర్డర్ మిస్టరీ: ఆ 11 మంది నన్‌లు ఎలా చనిపోయారు?

జర్మనీ

ఫొటో సోర్స్, By arrangement

ఫొటో క్యాప్షన్, 1943 ఆగస్టు 1న 11 మంది నన్‌లను నాజీలు హత్య చేశారు
    • రచయిత, స్వామినాథన్ నటరాజన్
    • హోదా, బీబీసీ న్యూస్

‘‘వారు మరణించిన విధానమే ఈ కథలో చాలా ముఖ్యమైనది. వారు సాధారణ నన్‌లు, కానీ ఒక అసాధారణ పనిని వారు పూర్తిచేశారు. అదే వారి ప్రత్యేకత’’ అని సిస్టర్ క్లారా వోల్చెక్ చెప్పారు

80 ఏళ్ల క్రితం 1943, ఆగస్టు 1న 11 మంది రోమన్ క్యాథలిక్ నన్‌లను జర్మనీలోని నాజీ బలగాలు హత్య చేశాయి.

మేరీ స్టెల్లా, ఆమెతోపాటు మరణించిన మరో 10 మందిని సమాధి చేసిన ప్రాంతాన్ని ‘మాటస్ ఆఫ్ నోవోగ్రోడెక్’గా పిలుస్తారు. ఇక్కడకు సిస్టర్ క్లారా వోల్చెక్ తరచూ వస్తుంటారు.

‘‘నాజీల చేతిలో 120 మంది ఉరి శిక్షకు గురికాకుండా ఆ నన్‌లు కాపాడారు’’ అని తూర్పు యూరప్‌లోని బెలరూస్‌ నుంచి ఫోన్‌లో బీబీసీతో మాట్లాడిన సిస్టర్ క్లారా చెప్పారు.

2000, మార్చి 5న ఈ 11 మంది నన్‌లను పోప్ జాన్ పాల్ 2 ‘బీటిఫై’ చేశారు. దైవ సేవకులను పునీతులుగా ప్రకటించే ముందు ఇలా బీటిఫై చేస్తారు. ఫలితంగా వీరి ద్వారా సాధారణ ప్రజలు దేవుడిని ప్రార్థించేందుకు వీలుపడుతుందని క్రైస్తవులు నమ్మకం.

‘‘నోవోగ్రోడెక్‌లో బంధీ అయినవారిని తమ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడే శక్తి ఈ నన్‌లకు ఎలా వచ్చింది?’’ అని ఆనాడు పోప్ కూడా ఆశ్చర్యపోయారు.

అయితే, ఆ ఖైదీలను విడుదల చేసినందుకు బదులుగా వీరిని హత్యచేసినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపించడం లేదు.

జర్మనీ

ఫొటో సోర్స్, Klara Volchek

ఫొటో క్యాప్షన్, నన్‌లను సమాధి చేసిన ప్రాంతాన్ని ‘మాటస్ ఆఫ్ నోవోగ్రోడెక్’గా పిలుస్తారు. ఇక్కడకు సిస్టర్ క్లారా వోల్చెక్ తరచూ వస్తుంటారు.

అసలేం జరిగింది?

ఈ కథ 1929 సెప్టెంబరు 4న మొదలైంది. ఆనాడు ‘హోలీ ఫ్యామిలీ ఆఫ్ నజరేత్‌’కు చెందిన ఇద్దరు నన్‌లు చిన్న పట్టణమైన నోవోగ్రోడెక్‌కు వచ్చారు.

దాదాపు 20,000 మంది జీవించే ఈ పట్టణం శతాబ్దాల కాలంలో చాలా మంది పాలకుల చేతులు మారింది. అయితే, రెండో ప్రపంచ యుద్ధం మొదట్లో ఇది పోలండ్ నియంత్రణలోకి వచ్చింది.

1939 సెప్టెంబరులో దీన్ని సోవియట్ యూనియన్ బలగాలు నియంత్రణలోకి తీసుకున్నాయి. దీంతో నన్‌లు తమ కాన్వెంట్‌ను వదిలిపెట్టి, ఖైదీల ఇళ్లకు వెళ్లిపోయారు.

జర్మనీ

అయితే, 1941లో నాజీ జర్మనీ బలగాలు సోవియట్ సేనలను వెళ్లగొట్టాయి. మళ్లీ కాన్వెంట్‌లకు వచ్చి ఉండాలని నన్‌లను వారు ఆహ్వానించారు. అయితే, ఈ పట్టణంలో సగం మంది యూదులే ఉండేవారు. వీరిపై నాజీలు ఉక్కుపాదం మోపేవారు.

ఇక్కడ యూదుల మొదటి ఊచకోత 1941 డిసెంబరులో జరిగింది. ఆనాడు 5,100 మంది యూదులను హత్యచేశారు. ఆ తర్వాత 1942 ఆగస్టులో మరో 4,500 మందిని హతమార్చారు.

1943 నాటికి ఇక్కడ కొన్ని యూదు తిరుగుబాటు సంస్థలు క్రియాశీలంగా పనిచేసేవి. అయితే, ఆ తిరుగుబాటుకు కళ్లెం వేసేందుకు నాజీ సీక్రెట్ పోలీస్ సంస్థ జెస్టపో పనిచేసేది. ఆ సంస్థకు చెందిన వారు జులై 17 నుంచి 19 మధ్య 180 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ఉరి తీస్తారని వదంతులు వ్యాపించాయి.

జర్మనీ

ఫొటో సోర్స్, Klara Volchek

వారిని ఏం చేశారు?

నోవోగ్రోడెక్‌లో అప్పట్లో క్యాథలిక్ ఫాదర్‌లలో అలెగ్జాండెర్ జీయెంకీవిక్ మాత్రమే మిగిలారు. నన్‌లు మాత్రం 12 మంది ఉండేవారు. వీరిలో 55 ఏళ్ల సిస్టర్ మేరీ స్టెల్లా పెద్దవారు. 27 ఏళ్ల సిస్టర్ మేరీ బొరొమీయా చిన్నవారు.

యూదుల అరెస్టుపై మదర్ స్టెల్లా ఎలా స్పందించారో అప్పట్లోనే ఫాదర్ జీయెంకీవిక్ ఒక లేఖలో వివరించారు.

‘‘దేవుడా నీకు బలి కావాలంటే మమ్మల్ని తీసుకో. మాకు ఎలాంటి కుటుంబ బంధాలూ లేవు. పిల్లలు, భార్యలతో ఉండే వారిని వదిలిపెట్టు’’ అని ఆనాడు స్టెల్లా చెప్పినట్లు జీయెంకీవిక్ రాసుకొచ్చారు.

జర్మనీ

ఫొటో సోర్స్, Tamara Vershitskaya

ఫొటో క్యాప్షన్, నోవోగ్రోడెక్‌లో యూదు మ్యూజియంను తమారా ఏర్పాటుచేశారు, ఆనాటి యూదుల నరమేధంపై చాలా విషయాలను ఆమె సేకరించారు

ఆ అరెస్టులకు వారం రోజుల తర్వాత నన్‌లను పోలీస్ స్టేషన్‌కు రావాలని సూచించారు.

31వ తేదీన సిస్టర్ స్టెల్లాను ఫాదర్ జీయెంకీవిక్ కలిశారు. ఆ రోజు ఆమె చాలా ఆందోళన పడుతున్నట్లు ఫాదర్ గుర్తించారు. అదే ఆమెను కలవడం చివరిసారి అవుతుందని ఆయన ఊహించలేదు.

జర్మనీలో వెట్టి చాకిరీ చేసేందుకు తనను పంపిస్తారేమోనని ఆయనతో సిస్టర్ స్టెల్లా చెప్పారు.

సిస్టర్ మల్గోరజాటాను క్వాన్వెంట్‌లోనే ఉండాలని సిస్టర్ స్టెల్లా సూచించారు. మిగతా పది మంది నన్‌లు స్టెల్లాతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

ఆ మరుసటి రోజు ఫాదర్ జీయెంకీవిక్ ప్రార్థనలు నిర్వహించారు. కానీ, ఆ రోజు చర్చిలో నన్‌లు కూర్చొనే చోటు ఖాళీగా కనిపించింది. అప్పుడే ఆయన మనసు కీడు శంకించింది.

ప్రజల మనసులో మాటను వినేందుకు ఆయన కూర్చున్నప్పుడు, ఆ రోజు ఉదయమే అంటే 1943 ఆగస్టు 1న ఆ నన్‌లను హత్య చేశారని ఆయనకు తెలిసింది.

అయితే, వారిని ఎందుకు హత్య చేశారో తెలియలేదు. సోవియట్ గెరిల్లాలకు సాయం చేస్తున్న వేరే చర్చి ప్రతినిధులకు బదులుగా వీరిని పొరపాటుపడి హత్య చేశారని కొన్ని వార్తలు ఫాదర్ వరకూ వచ్చాయి.

ఆ తర్వాత ఫాదర్ జీయెంకీవిక్ కూడా కొన్ని నెలలపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మళ్లీ 1945 మార్చిలో నాజీల ఓటమి తర్వాత ఆ నన్‌ల మృతదేహాలను ఫాదర్ తవ్వితీయించారు. వారి దేహాలను తమ చర్చి ఆవరణలో పూడ్చిపెట్టారు.

జర్మనీ

ఫొటో సోర్స్, USHMM

ఫొటో క్యాప్షన్, జర్మనీకి పంపించిన పోలిష్ ప్రజల్లో మారియా కరవైస్కా సోదరులు కూడా ఉన్నారు

పరిశోధకులు ఏం చెబుతున్నారు?

ఫాదర్ చెబుతున్న విషయాలు తమారా వెర్షిట్స్‌కాయా చేపట్టిన పరిశోధనతో సరిపోలుతున్నాయి. నోవోగ్రోడెక్‌లో యూదు మ్యూజియంను తమారా ఏర్పాటుచేశారు. ఆనాటి యూదుల నరమేధంపై చాలా విషయాలను ఆమె సేకరించారు.

‘‘ఆ రెండు ఘటనలూ ఒకే సమయంలో జరగొచ్చు. కానీ, వీటికి ఒకదానితో మరొకటికి సంబంధం లేదు’’ అని తమారా చెప్పారు.

2011లో అమెరికా హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియంతో ఆమె కలిసి పనిచేశారు. ఆనాటి ఊచకోత నుంచి తప్పించుకున్న వారితోపాటు వీటిని దగ్గర నుంచి చూసిన వారిని ఆమె వీడియో ఇంటర్వ్యూలు చేశారు.

‘‘అసలు అక్కడ ఏం జరిగిందో మారియా కరవైస్కా నాకు చెప్పారు. జర్మనీకి పంపించిన పోలండ్ ప్రజల్లో ఆమె ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు’’ అని తమారా చెప్పారు.

బహుశా వీరిని జులై 24న పోలండ్ నుంచి జర్మనీకి పంపించి ఉండొచ్చని తమారా తెలిపారు.

తమ సోదరులను ఎలా అరెస్టు చేశారో తమారాతో మారియా చెప్పారు.

‘‘నా ముగ్గురు సోదరులను అరెస్టు చేశారు. అయితే, వీరిలో ఒకరు తప్పించుకున్నారు. వీరంతా ఒక తిరుగుబాటు సంస్థను నడిపిస్తున్నారనే ఆరోపణలతో చేశారు. వీరందరినీ ఉరి తీయాలని జర్మన్లు భావించారు. వీరి సమాధుల కోసం గొయ్యిలు కూడా తవ్వారు’’ అని మరియా వివరించారు.

జర్మనీ

ఫొటో సోర్స్, Klara Volchek

జెస్టపో మొత్తంగా 180 మందిని అరెస్టు చేసింది. ఆఫీసర్ ఇన్‌చార్జి విల్‌హెల్మ్ ట్రాబ్ లేనప్పుడు ఈ అరెస్టులు జరిగాయి. ఆయన జర్మనీలోని ఒక భూస్వామి కుటుంబానికి చెందినవారు.

‘‘అరెస్టుల గురించి తెలిసిన వెంటనే ఆయన మిన్స్‌క్‌కు వెళ్లారు. తన పొలంలో పని చేయించేందుకు వారందరినీ పంపించాలని అనుమతి కోరేందుకు ఆయన వెళ్లారు’’ అని తమారా చెప్పారు.

‘‘నా సోదరులతో పోలిష్‌లో ట్రాబ్ మాట్లాడారు. ప్రయాణానికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకోవాలని వారికి సూచించారు. ఆ మరుసటి రోజు ఖైదీలు అందరూ రైల్వే స్టేషన్‌కు రావాలని చెప్పారు’’ అని తమారా తెలిపారు.

‘‘అరెస్టుల తర్వాత సాయం కోసం ఆ పోలిష్ కుటుంబాలు చర్చి దగ్గరకు వెళ్లడం నిజమే’’ అని తమారా చెప్పారు.

‘‘అక్కడ నన్‌లు ప్రార్థనలు నిర్వహించారు. ఆ ప్రార్థనలో పెద్ద నన్‌ స్పందిస్తూ.. బలి కావాలంటే మా ప్రాణాలు తీసుకోమని చెప్పారు. ఇది కూడా నిజమే’’ అని తమారా వివరించారు.

అయితే, ఈ ఖైదీల కోసం నాజీలు, నన్‌ల మధ్య చర్చలు జరిగాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవని తమారా తెలిపారు.

‘‘నన్‌ల అరెస్టుకు పోలిష్ ప్రజల విడుదలకు మధ్య సంబంధమున్నట్లు ఆధారాలేమీ కనిపించడం లేదు’’ అని తమారా చెప్పారు.

వీడియో క్యాప్షన్, నాలుగేళ్లలో 60 లక్షల మందిని చంపేశారు

జర్మనీలో వెట్టిచాకిరీ చేసేందుకు తీసుకెళ్లిన ప్రజలందరూ యుద్ధం తర్వాత కూడా ప్రాణాలతోనే మిగిలారని తమారా చెప్పారు. ప్రస్తుతం హోలీ ఫ్యామిలీ నజరేత్‌లోని నన్‌లకు హెడ్‌గా పనిచేస్తున్న సిస్టర్ అంబిలిస్ ఆనాటి ఘటనలపై స్పందించారు.

‘‘దేవుడి కోసం, పొరుగు వారి కోసం ఆ నన్‌లు ప్రాణాలు అర్పించారని వారితోపాటు కలిసి జీవించిన వారు చెప్పారు’’ అని ఆమె తెలిపారు.

మరిన్ని వివరాలను కోరినప్పుడు ‘‘తమ ప్రాణాలు అర్పిస్తున్నట్లు ఆ నన్‌లు దేవుడి ఎదుట చెప్పారు. దేవుడు వారి బలిని స్వీకరించారు’’ అని ఆమె అన్నారు.

నోవోగ్రోడెక్‌లో ప్రస్తుతం చర్చికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతోంది. అయితే, సిస్టర్ క్లారాకు మాత్రం దేవుడిపై విశ్వాసముంది.

‘‘ఆ ఖైదీల ప్రాణాలు కాపాడేందుకు మా సిస్టర్లు ప్రాణాలు అర్పించారని నేను భావిస్తున్నాను. మనుషులు ఆధారాలు ఉంటేకానీ నమ్మరని నాకు తెలుసు. కానీ, దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు, వారు అర్పించిన బలిని స్వీకరించాడు’’ అని ఆమె అన్నారు.

(కథనం కోసం లూ యాంగ్ సాయం అందించారు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)