ప్రజ్ఞానంద: ఆటకు ఖర్చుల కోసం అప్పులు చేసే స్థితి నుంచి వరల్డ్ చాంపియన్‌ రన్నరప్ స్థాయికి ఎలా ఎదిగాడు?

ప్రజ్ఞానంద

ఫొటో సోర్స్, FIDE

    • రచయిత, చెరిలాన్ మొల్లన్
    • హోదా, బీబీసీ న్యూస్, ముంబయి

భారత చెస్ ఆటగాడు ప్రజ్ఞానంద ప్రపంచ కప్‌ ట్రోఫీ నెగ్గకపోయినప్పటికీ తన అత్యద్భుత ప్రదర్శనతో దేశంలో చెస్ క్రీడపై బలమైన ముద్ర వేశారని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకు ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్ చేతిలో ఓటమితో భారత గ్రాండ్‌మాస్టర్ రన్నరప్ టైటిల్‌‌‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తొలుత జరిగిన రెండు రౌండ్లు డ్రా కాగా, గురువారం జరిగిన టై-బ్రేకర్స్ రౌండ్‌లో మాగ్నస్ నెగ్గాడు.

కానీ, బాకులో జరిగిన ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్‌ ఆసాంతం భారత యువ ఆటగాడు చూపిన అసమాన ప్రతిభ, ధైర్యం గురించే క్రీడా నిపుణులు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.

ఈ యువ ఆటగాడి అద్భుతమైన ప్రతిభ, ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వడాన్ని ప్రశంసిస్తూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్(ట్విటర్‌) ద్వారా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో వరల్డ్ టాప్ ర్యాంకర్ కార్ల్‌సెన్‌కు పోటీ ఇవ్వడం భారత్‌లో భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ టోర్నీలో ప్రజ్ఞానంద ప్రయాణమేమీ అనూహ్యమైనది కాదు.

ప్రజ్ఞానంద

ఫొటో సోర్స్, AFP

ఈ దశాబ్దం భారత యువ ఆటగాళ్లదేనా..

ప్రజ్ఞానంద విజయాలు చెస్‌ క్రీడా ప్రపంచంలో అతని ప్రతిష్టను పెంచాయి. ''యువ ఆటగాళ్లు బలమైన ముద్ర వేస్తున్నారు. చెస్‌లో కొత్త తరం ప్రవేశాన్ని అది సూచిస్తోంది. ఆ మార్పు భారత చెస్ క్రీడలో భారీ మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది'' అని ఫెడ్ రేటింగ్ పొందిన చెస్ ప్లేయర్, కాలమిస్ట్ దేవాంగ్షు దత్తా ది టైమ్స్ ఆఫ్ ఇండియా కాలమ్‌లో రాశారు.

ఈ ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో నలుగురు భారత ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. అక్కడి వరకూ చేరుకుని, క్వార్టర్స్‌లో 50 శాతం స్లాట్‌లను వారే దక్కించుకున్నారు.

ప్రపంచంలో జూనియర్ విభాగంలో వంద మంది ఉత్తమ ఆటగాళ్లలో 21 మంది భారత ఆటగాళ్లే ఉన్నారు. వారంతా 20 ఏళ్ల‌లోపు వారే. వారిలో నలుగురు టాప్ 10లో నిలవగా, ఏడుగురు టాప్ 20లో ఉన్నారు.

''ఒక దశాబ్దం, అంతకంటే ఎక్కువ కాలమే ఈ యువ ఆటగాళ్ల ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది'' అని దత్తా చెప్పారు.

ఈ సిద్ధాంతం ఆమోదయోగ్యమైనదే. ఎందుకంటే, వేలాది మంది భారతీయులు ఇప్పుడు చెస్‌లో రాణిస్తున్నారు. 2000లలో ఆనంద్ విజయం తర్వాత ఈ ట్రెండ్ మొదలైంది. క్రమంగా అది వేగం పుంజుకుంది.

స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్ చౌకగా అందుబాటు ఉండడంతో ఆన్‌లైన్ టోర్నమెంట్‌ల ద్వారా యాప్‌లు పిల్లలు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడాన్ని సులభతరం చేశాయి. అలాగే, ప్రాథమిక స్థాయిలో చెస్ కోచింగ్ కూడా అందుబాటులో ఉంటోంది.

రెండు దశాబ్దాల కిందటి పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పులొచ్చాయి.

''ఆనంద్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన రెండు దశాబ్దాల తర్వాత కూడా భారత్‌లో ఆటగాళ్లకు గ్రాండ్‌ మాస్టర్లతో శిక్షణ ఇప్పిస్తారని ఇప్పటికీ ఊహించలేం'' అని మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌‌లో క్రీడా రచయిత సుసాన్ నినాన్ తెలిపారు.

ప్రజ్ఞానంద

ఫొటో సోర్స్, AFP

ఆట కోసం అప్పులు..

అప్పటి నుంచి భారత్‌లో చెస్‌ స్వరూపం మారిపోయినా, తమ ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికలపై ముద్ర వేసేందుకు భారత్ మరింత చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికి కూడా, ఆటకు అవసరమైన వసతులు లేవు. పిల్లల కలలు నెరవేరాలంటే తల్లిదండ్రులు నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

''తమ పిల్లలు చెస్‌లో ఉన్నతంగా రాణించాలనే కోరికతో, తమ 8 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు టోర్నమెంట్‌లకు వెళ్తున్నారు. ఉద్యోగాలను విడిచిపెట్టి, ఇళ్లు కూడా తనఖా పెట్టి నిధులు సమకూర్చుకుంటున్నారు. ఆ నిధులతో తమ బిడ్డల కలలు నెరవేరాలని కోరుకుంటున్నారు'' అని నినాన్ రాశారు.

ప్రజ్ఞానందది కూడా దాదాపు అలాంటి కథే.

ఆయన తండ్రి ఓ బ్యాంక్ మేనేజర్. తల్లి గృహిణి. ప్రజ్ఞానంద ఆట కోసం వారు అప్పులు చేశారు. 2016 వరకూ అదే పరిస్థితి. పదేళ్ల వయసుకే వరల్డ్స్ యంగెస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్( ప్రపంచ యువ అంతర్జాతీయ మాస్టర్)గా నిలిచిన తర్వాతే ఆయనకు స్పాన్సర్‌షిప్ లభించింది.

తమ పూర్వీకులకు చెస్‌తో అనుబంధం ఉండడంతో,వారి నుంచి స్ఫూర్తి పొందిన ప్రజ్ఞానంద, అతని సోదరి చెస్ ఆడడం మొదలుపెట్టారు. ఇప్పుడు పలుదేశాల్లో జరుగుతున్న టోర్నమెంట్‌లలో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రజ్ఞానందతో అతని తల్లి ఎప్పుడూ వెంట ఉంటారు. తనకు నచ్చిన తమిళ వంటకాలను ఆమె వండి పెడుతుంటారు.

ప్రజ్ఞానంద ఉన్నత స్థాయికి ఎదగడం ద్వారా చాలా మందికి ప్రేరణగా నిలిచాడు. అది ఆయన కృషి, ప్రతిభకు దక్కిన ఘనత.

''ప్రజ్ఞానంద ఓడిపోయి ఉండొచ్చు. కానీ, భారత్ విజయ పరంపర ఇప్పుడే ప్రారంభమైందని కూడా అనుకోవచ్చు'' అని దత్తా రాశారు.

ఇవి కూడా చదవండి: