విశ్వనాథన్ ఆనంద్: చదరంగంపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం ఎలా ఉంటుందంటే...

విశ్వనాథన్ ఆనంద్‌
    • రచయిత, శరణ్య నాగరాజన్
    • హోదా, బీబీసీ తమిళ్

భారత్ తొలిసారిగా చెస్ ఒలింపియాడ్‌ను నిర్వహిస్తోంది. 44వ చెస్ ఒలింపియాడ్‌కు తమిళనాడు వేదిక కానుంది.

జులై 28 నుంచి ఆగస్టు 10 మధ్య చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో దీన్ని నిర్వహిస్తున్నారు.

ఈ ఒలింపియాడ్‌లో 186 దేశాలకు చెందిన 2,000 మందికిపైగా క్రీడాకారులు పాలుపంచుకోనున్నారు.

ఒలింపియాడ్‌కు సంబంధించిన టార్చ్ రిలేను జూన్ 19న దిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతర్జాతీయ చెస్ సంస్థ ఎఫ్ఐడీఈ అధ్యక్షుడు వోర్కోవిచ్ దీనికి సంబంధించిన టార్చ్‌ను మోదీకి అందించారు. అనంతరం మోదీ ఈ టార్చ్‌ను చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు ఇచ్చారు.

దేశ వ్యాప్తంగా 75 నగరాల్లో తిరిగిన అనంతరం ఈ టార్చ్ చివరగా ఒలింపియాడ్‌కు వేదికైన మహాబలిపురం చేరుకుంటుంది.

ఈ ఒలింపియాడ్‌కు భారత్‌ నుంచి పెద్దయెత్తున ప్లేయర్లు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌తో బీబీసీ రిపోర్టర్ శరణ్య నాగరాజన్ మాట్లాడారు. తన కెరియర్ ఎలా మొదలైందో కూడా ఆనంద్ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు.

విశ్వనాథన్ ఆనంద్‌

ఫొటో సోర్స్, ANI

మీకు చదరంగాన్ని మీ అమ్మ పరిచయం చేశారని ఇదివరకటి ఇంటర్వ్యూల్లో చెప్పారు. దీని గురించి కాస్త వివరిస్తారా?

నాకు ఆరేళ్ల వయసున్నప్పుడు మా అన్నయ్య, అక్క చెస్ ఆడుతుంటే చూసేవాణ్ని. ఒకరోజు మా అమ్మ దగ్గరకు వెళ్లి నాకు కూడా ఈ గేమ్ నేర్పించమని అడిగాను. మొదట నాకు కొంచెం కష్టంగా అనిపించింది. అయితే, నెమ్మదిగా నేర్చుకున్నాను. నాకు చెస్ అంటే బాగా ఇష్టమని మా అమ్మ గుర్తించడంతో.. చెన్నై చెస్ క్లబ్‌లో చేర్పించింది. నేను ట్రైనింగ్ సెషన్లకు కూడా వెళ్లాను. మరుసటి రోజుకు నాకు ట్రైనింగ్ ఉంటే, ముందు రోజే హోంవర్క్ మొత్తం పూర్తిచేసుకునేవాణ్ని.

మా నాన్నగారు ఒక ఏడాది ఫిలిప్పీన్స్‌లో పనిచేయడానికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు మేం మొత్తం ఆయనతో వెళ్లాం. అక్కడ కూడా చెస్‌కు మంచి ఆదరణ ఉండేది. అక్కడ టీవీల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు వచ్చేవి. వాటిలో వచ్చే పజిల్స్‌ను మా అమ్మ నా కోసం నోట్ చేసి పెట్టేవారు. నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఆ పజిల్స్‌ను ఛేదించేందుకు ప్రయత్నించేవాణ్ని. అక్కడ తరచూ చెస్ టోర్నమెంట్లు కూడా జరిగేవి. దీంతో నాలో ఆసక్తి మరింత పెరిగింది. నేను మళ్లీ భారత్‌కు వచ్చిన తర్వాత తమిళనాడు జూనియర్ డివిజన్‌లో ఆడటం మొదలుపెట్టాను.

విశ్వనాథన్ ఆనంద్‌

ఫొటో సోర్స్, PM INDIA

‘‘చెస్ మైండ్ గేమ్ అంటారు కదా’’, నిజంగానే దీనికి మెదడుతో సంబంధం ఉంటుందా? దీనిపై మీరేమంటారు?

అవును నిజమే. ఇది మైండ్ గేమ్. ఒకేచోట మనం రెండు నుంచి మూడు గంటలు కూర్చొని ఆడాల్సి ఉంటుంది. అదే సమయంలో దీని వల్ల మనం శారీరకంగానూ అలసిపోతుంటాం. దీని వల్ల మన ఆట తీరు కూడా దెబ్బతినే ముప్పుంటుంది. ఎప్పుడు, ఏం చేయాలి అనే అంశంపై మనం జాగ్రత్తగా దృష్టిపెట్టాలి. మన ఎత్తులను తగిన సమయంలో ముందుకు తీసుకెళ్లాలి. అనుభవంతో మనకు మంచి నైపుణ్యం వస్తుంది.

ఏకాగ్రతను మెరుగుపరచుకోవడానికి మీరు ఏం చేస్తారు?

నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తాను. మనం ఎక్కువగా చెస్ ఆడటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. నేను పుస్తకం చదివేటప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. మిగతా వారు ఎలా ఆడతారు? వారు ఎలా ఎత్తులు వేస్తారు? నా ఎత్తులను ఎందుకు సరిగ్గా వేయలేకపోతున్నాను? నా గేమ్‌ను మెరుగుపరచుకోవడం ఎలా? లాంటి ఆలోచనలు నా బుర్రలో తిరుగుతుంటాయి. ఈ ఆలోచనల వల్లే నేను మెరుగ్గా ఆడగలుగుతున్నాను.

వీడియో క్యాప్షన్, 15 ఏళ్ల వయసులో భారత్ తరఫున ఇంటర్నేషనల్ T20 ఆడిన చిన్న వయస్కురాలు షెఫాలీ

క్రికెట్, బ్యాడ్మింటన్‌ల విషయంలో ఎలా శిక్షణ తీసుకోవాలో చాలా మందికి అవగాహన ఉంది. అలానే చెస్ విషయంలోనూ అలాంటి అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారా?

ఉంది. ఈ గేమ్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో చాలా మందికి అవగాహన ఉంది. నిజానికి ఈ ట్రైనింగ్‌లో కంప్యూటర్ల అవసరం చాలా ఉంటుంది. ఒకసారి మనం ఇంటర్నేషనల్ మాస్టర్ లేదా గ్రాండ్ మాస్టర్ అయితే, మన ముందున్న మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఛాంపియన్‌షిప్‌లో భిన్న అంచెలను దాటుకుంటూ వచ్చినప్పుడు భిన్న అంశాలను మనం నేర్చుకుంటాం. నేనూ ఇలానే నేర్చుకున్నాను.

మేం ప్రస్తుతం స్కూలు పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కువ మంది ఈ గేమ్‌ను నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ఇలా మనం కొత్తతరం చెస్ ప్లేయర్లను సృష్టించొచ్చు. తమిళనాడులో దీనికి సరపడా మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, ఉమ్రాన్ మాలిక్: బుల్లెట్‌ లాంటి బంతుల వెనుక రహస్యమిదే

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది చెస్ ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది. ప్లేయర్లు ఇతర ప్లేయర్లతో ఆడేందుకు ఇష్టపడుతున్నారా? లేదా ఏఐతో ఆడేందుకు మొగ్గు చూపుతున్నారా?

మ్యాచ్ విషయానికి వస్తే, ఒక ప్లేయర్‌తో ఆడేందుకే ప్లేయర్‌లు ఇష్టపడుతుంటారు. అదే సమయంలో కంప్యూటర్‌లతో ఆడినప్పుడు సరదాగా ఉంటుంది. మరోవైపు రెండు కంప్యూటర్లు గేమ్ ఆడినప్పుడు చూస్తుంటే మనకు చాలా సరదాగా అనిపిస్తుంది. దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ట్రైనింగ్‌లో ఏఐ కీలక పాత్ర పోషించే అవకాశముంది. గేమ్‌ను లోతుగా అర్ధంచేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. దీని సాయంతో మన ట్రైనింగ్‌ను మెరుగుపరచుకోవచ్చు.

మీరు 25 ఏళ్ల క్రితం చెస్ ఆడటం మొదలుపెట్టారు. అయితే, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే కనిపిస్తున్నారు. దీని రహస్యం ఏమిటి?

నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను. హాయిగా పడుకుంటాను. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను. ఇప్పుడు నాకు 50ఏళ్ల వచ్చాయి. కొన్నిసార్లు ఆడుతున్నప్పుడు నేను కూడా అలసిపోతాను. ఇక్కడ రహస్యం ఏమిటీ లేదు. చేసే పనిపైనే నేను ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)