తిరుపతి జిల్లా: దళితులను గొల్లపల్లి గుడిలోకి రానివ్వలేదా? ఇది తెలుగు దళితులతో తమిళ దళితుల పోరాటమా?

దళితులు
ఫొటో క్యాప్షన్, గొల్లపల్లి ఆలయం ముందు గ్రామస్థులు
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

చుట్టూ పచ్చటి పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం.. మధ్యలో ఒక గ్రామశక్తి ఆలయం. ఆ గుడి చుట్టూ కూర్చోడానికి అరుగులు ఉన్నాయి. చెట్ల కింద ఖాళీ ప్రదేశం కనిపిస్తోంది.

అయితే, ఆలయం దగ్గర గుమిగూడిన వందల మంది జనంలో ఆందోళన కనిపిస్తోంది. అక్కడకు చేరుకున్న వారిలో ఏడు గ్రామాలకు చెందిన రైతులు, వివిధ కులాల వారు ఉన్నారు.

అమ్మవారి ఆలయంలోకి దళితులను అనుమతించలేదంటూ ఇటీవల చర్చనీయాంశమైన తిరుపతి జిల్లా పుత్తూరు మండలం గొల్లపల్లిలోని ఆలయం ఇది.

గ్రామశక్తి పోలాక్షమ్మ ఆలయం మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

పోలాక్షమ్మను గొల్లపల్లి ప్రజలే కాదు, చుట్టుపక్కల ఏడు గ్రామాల ప్రజలు వారి గ్రామదేవతగా పూజిస్తారు.

దళితులు
ఫొటో క్యాప్షన్, పోలాక్షమ్మ అమ్మవారి విగ్రహం

వివాదం ఎలా మొదలైంది?

ఇది తెలుసుకోడానికి ముందు గొల్లపల్లిలో చాలా కాలంగా తమిళ దళితులకు, తెలుగు దళితులకు మధ్య విభేదాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

చాలా కాలం కిందట తమిళనాడుకు చెందిన దళితులు కొందరు ఆ రాష్ట్రం నుంచి వచ్చి గొల్లపల్లిలో స్థిరపడగా, ఆ గ్రామంలో తరతరాల నుంచి ఉంటున్న దళితులను తెలుగు దళితులుగా పిలుస్తున్నారు.

ప్రస్తుత వివాదం ఆగస్టు 19 శనివారం మొదలైంది. ఆ రోజు మధ్యాహ్నం పొంగళ్లు పెట్టడానికి తమిళ దళితులు పోలాక్షమ్మ గుడి దగ్గరకు చేరుకున్నారు. కానీ, కాసేపటి తర్వాత గుడి తలుపులకు తాళాలు వేశారని, తమను లోపలికి అనుమతించలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయంలో అధికారులు గ్రామస్థులతో చర్చించి, తమిళ దళితులు ఆలయంలోకి వెళ్లేలా చూశారు. వారితో పూజలు చేయించి హారతులు కూడా ఇప్పించారు. గ్రామంలో కలిసి మెలిసి ఉండాలని అందరికీ సర్ది చెప్పారు.

గ్రామస్థులు
ఫొటో క్యాప్షన్, గ్రామస్థులు

తమిళ దళితులను గుడిలోకి రానివ్వలేదా?

ఆగస్టు 23న బీబీసీ ప్రతినిధి పోలాక్షమ్మ గుడి దగ్గరకు వెళ్లినప్పుడు, అక్కడ ఏడు గ్రామాల ప్రజలు భారీగా గుమిగూడి కనిపించారు. తమిళ దళితులను ఆలయంలోకి రానివ్వకపోవడం నిజమేనా అని బీబీసీ ప్రతినిధి వారిని ప్రశ్నించారు. వారు స్పందిస్తూ తమిళ దళితుల వల్లే ఈ వివాదం మొదలైందని ఆరోపించారు. పోలాక్షమ్మ ఆలయం చుట్టూ వాళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏడు గ్రామాల ప్రజలు కలిసి తమ గ్రామశక్తికి పూజలు చేస్తుంటామని, తమిళ దళితులు చేస్తున్న ఆరోపణలు నిజం కాదని ఆ గ్రామంలోని తెలుగు దళిత మహిళ నాగభూషణ బీబీసీతో అన్నారు.

‘‘ఆ కాలంలో తమిళ వాళ్లు వచ్చి చేరినారంట. వాళ్లకు ఇళ్ల జాగా కూడా మా పెద్దోళ్లు ఇచ్చినారంట. తర్వాత వాళ్లూ, మేము కలిసే చేసుకుంటున్నాం. ఎలాంటి పట్టింపులూ ఉండేవి కావు. ఇప్పుడు ఇట్లా రాజకీయం జరుగుతోంది. తమకు కూడా వేరుగా పూజలు కావాలని మా ఊరి పెద్దమనుషులను డిమాండ్ చేస్తున్నారు. ఏడూళ్ల రైతులపై బురదజల్లుతున్నారు. వాళ్లకు సంబంధంలేని దాంట్లో వాళ్లను లాగుతున్నారు. ఎప్పుడు గాని ఎక్కడకు గానీ, మీరు దళితులు రాకూడదు పోకూడదు అని మా ఏడు ఊళ్ల రైతులు ఎప్పుడూ అనలేదు. దీన్ని రాజకీయం చేస్తున్నారు. మొదటి నుంచి ఏ ఆనవాయితీ ప్రకారం ఇవి జరుగుతున్నాయో, అలాగే ఇక ముందూ జరగాలి’’ అని ఆమె చెప్పారు.

దళితులు
ఫొటో క్యాప్షన్, తమిళ దళిత మహిళలు

తెలుగు దళితులకు రైతులతో సత్సంబంధాలు

గొల్లపల్లి దళితవాడలో దాదాపు 50 వరకు ఇళ్లు ఉన్నాయి. దళితవాడలోకి వెళ్లగానే మొదట తమిళ దళితుల ఇళ్లు కనిపిస్తున్నాయి. తమిళ దళితుల ఇల్లు రెండు వీధుల్లో ఉన్నాయి.

ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో ఉండే పుత్తూరులోని ఈ గ్రామంలో బయట నుంచి వచ్చి స్థిరపడిన తమిళ దళితుల సంఖ్య బాగా పెరిగింది. ఆర్థికంగా స్థిరపడిన దాదాపు 30 కుటుంబాలు అక్కడ ఉన్నాయి.

తమిళ దళిత కుటుంబానికి చెందిన గజపతి అనే వ్యక్తి గతంలో కాంగ్రెస్ తరపున ఎంపీటీసీగా పోటీ చేశారు. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు.

తమిళ దళితుల ఇళ్లు దాటి సుమారు 10 మీటర్లు ముందుకు వెళ్తే తెలుగు దళితుల వీధి వస్తుంది. అక్కడ తెలుగు దళితుల ఇళ్లు 20 వరకూ ఉంటాయి.

ఈ కుటుంబాల్లో చాలా మంది తరతరాలుగా గ్రామాల్లో ఉత్సవాలు, పెళ్లిళ్లు, మరణాలు వంటి సందర్భాల్లో పనులు చేస్తుంటారు. వీరిని స్థానికంగా తోటివాళ్లు అని వ్యవహరిస్తారు.

వీరికి ఏడు గ్రామాల్లోని రైతులతో మంచి సంబంధాలు ఉన్నాయి.

తెలుగు దళితులు ఉండే వీధిలోకి వెళ్లగానే ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది. గ్రామశక్తి జాతర సమయంలో ఏడు రోజులు 7 గ్రామాల్లో ఊరేగే అమ్మవారిని చివరగా అక్కడకు తీసుకురావడం ఆనవాయితీ అని స్థానికులు చెప్పారు.

ఆ సమయంలో అక్కడి దళితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారని, కులమతాలకు అతీతంగా ఏడు గ్రామాల ప్రజలకూ తమ చేతులతో ప్రసాదాలు అందించి, వారికి మర్యాద చేస్తారని గ్రామస్థులు చెబుతున్నారు.

తర్వాత అక్కడ నుంచి అమ్మవారు తిరిగి ఆలయం చేరుకోవడంతో జాతర వేడుకలు ముగుస్తాయి. కానీ, తెలుగు దళితుల వీధిలో ఉంచుతున్న అమ్మవారిని తమ వీధిలోకి కూడా తీసుకురావాలని, తమకూ పూజలు చేసే హక్కు కల్పించాలని తమిళ దళితులు కోరుతున్నారు. ఈ వివాదం అక్కడ నుంచే మొదలయ్యింది.

తమకూ దేవుడు కావాలని, తాము కూడా మొక్కులు తీర్చుకోవాలని, అవసరమైతే మొదట తెలుగు దళితులు పూజలు చేసిన తర్వాతే తమకు ఆ అవకాశం కల్పించాలని తమిళ దళిత మహిళ సంపూర్ణ చెప్పారు.

‘‘మేమూ పూజలు చేయాలి. మాకూ దేవుడు కావాలి. ముందు మీరే చేసుకోండి, ముందు మీరే మొక్కులు తీర్చుకోండి, మేం తర్వాత తీర్చుకుంటాం అన్నాం. దేవుడిని మా వీధికి నేరుగా పెట్టండి అని మేము అడిగాం. మా వీధి కాలనీలో తిప్పించి పెట్టారు. మంచి చెడ్డ అంతా చేసుకొని మళ్లా దేవుడిని తీసుకెళ్లిపోయారు. పోయినసారిలాగే వస్తుందని ఈసారి కూడా ఆశగా ఉన్నాం. కానీ రాలేదు’’ అని ఆమె అన్నారు.

దళితులు
ఫొటో క్యాప్షన్, ఆలయ ధర్మకర్త శ్రీనివాసరెడ్డి

మేం ఎవరినీ అడ్డుకోలేదు: ధర్మకర్త శ్రీనివాస రెడ్డి

ఆలయంలోకి గ్రామ దళితులను నిజంగానే అడ్డుకున్నారా? ఇది తెలుసుకోవడానికి బీబీసీ ఆ గ్రామశక్తి ఆలయ ధర్మకర్త శ్రీనివాసరెడ్డితో మాట్లాడింది.

గొల్లపల్లి చుట్టూ ఉన్న 7 గ్రామాల్లో 14 కులాలవారు ఉన్నారని, గుడి దగ్గర అందరూ ఒక్కటై పూజలు చేసుకుంటున్నారని, తాము ఎవరినీ గుడిలోకి రావద్దని చెప్పలేదని ఆయన చెప్పారు.

తమకు ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ప్రకారమే అమ్మవారి పూజలు జరుగుతున్నాయన్న శ్రీనివాసరెడ్డి, తమిళ దళితులు గుడిని సాకుగా చేసుకుని ఏడు గ్రామాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.

‘‘గ్రామంలో తోటివాళ్ల ( తెలుగు దళితులు) దగ్గరకు మాత్రమే దేవుడిని తీసుకువెళ్లే ఆనవాయితీ ఉంది. ఇప్పుడు దానిపై గొడవ జరగుతుండడంతో వాళ్లే మా దగ్గరికి తీసుకురావద్దని చెప్పేశారు. ఇప్పుడు ఆ గ్రామంలో దళితుల మధ్య సమస్య ప్రభావం ఈ ఏడు గ్రామాలపై ఉంటుంది. ఈ గుడి ప్రవేశాన్ని సాకుగా చేసుకుని మా ఏడు గ్రామాల వారిని ఇబ్బంది పెడుతున్నారు. మా దగ్గరకు విడిగా తీసుకురండి అని ఎవరికి వారు డిమాండ్ చేస్తుంటే మా ఆనవాయితీని ఏం చేయాలి. ఇలా పక్క గ్రామాలవారు కూడా అడుగుతుంటే మేం అందరికీ ఇవ్వలేం కదా’’ అని ఆయన అన్నారు.

దళితులు
ఫొటో క్యాప్షన్, తమిళ దళిత మహిళ సంపూర్ణ

గుడి దగ్గర ఏం జరిగింది?

ఆగస్టు 19న శనివారం మధ్యాహ్నం సమయంలో తమిళ దళితులు పొంగళ్లు పెట్టడానికి ఆలయం దగ్గరకు చేరుకున్నారు. ఆలయం తలుపులకు తాళాలు ఉండడంతో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించలేదంటూ ఆందోళన చేశారు. దీంతో దీనిపై స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

జాతరలో దళితులందరూ కలిసి పొంగళ్లు పెడదామని తెలుగు దళితులతో చెబితే, తమను విడిగా పెట్టుకోమన్నారని, గ్రామస్థులు కూడా తమను దూరం పెడుతూ, అమ్మవారిని తమ వీధిలోకి రానివ్వడం లేదని తమిళ దళిత మహిళ సంపూర్ణ ఆరోపించారు.

‘‘పోయినసారి మనం కలిసి పొంగళ్లు పెడదామంటే, మీరు మాతోపాటూ వద్దు, విడిగా పెట్టుకోండి అని ముందు వాళ్లే పోయి పెట్టుకున్నారు. వాళ్లు శుక్రవారం పెట్టుకుంటే మేము శనివారం పెట్టుకుంటాం. పోయినసారి కూడా దేవుడు (పోలాక్షమ్మ అని ఆమె ఉద్దేశం) వస్తుంటే మా దగ్గర పెట్టడానికి వీల్లేదని మాకు దూరం చేశారు. మాకూ మొక్కులు ఉంటాయి, అంటే వాళ్లు ఒప్పుకోలేదు. ఆ పక్కవాళ్లు రెడ్లు కూడా ఒప్పుకోలేదు. వాళ్లకు పనులు చేసేవారికే దేవుడు, మీకు లేడు అన్నారు. మాకు కూడా దేవుడు కావాలి. వాళ్లే మనుషులా మేము మనుషులు కాదా అని అడిగాం’’ అని ఆమె అన్నారు.

గత శనివారం(ఆగస్టు 19) పొంగళ్లు పెట్టాలని, గుడిలోకి వెళ్లి కొబ్బరికాయ కొట్టాలని వెళ్లామని, కానీ ఆలయం తలుపులకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారని సంపూర్ణ ఆరోపించారు.

దళితులు
దళితులు
ఫొటో క్యాప్షన్, గొల్లపల్లి దళితవాడలో తెలుగు దళితులు నివసించే ప్రాంతం

కావాలనే విషయం పెద్దది చేశారు: ధర్మకర్త

ఆలయ ధర్మకర్త శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ- అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించే ఈశ్వరి మధ్యాహ్నం భోజనం చేయడానికి గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లారని చెప్పారు.

‘‘పూజారమ్మ ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో వీళ్లు పూజకు వచ్చారు. మాకు చెప్పలేదు. వచ్చిన తర్వాతయినా చెప్పి ఉంటే మేం తాళాలు తీసేవాళ్లం. పొంగళ్లు పెట్టుకోవడానికి వచ్చిన వారు నాకు ఫోన్ కూడా చేయలేదు. లేకపోతే నేనే స్వయంగా వెళ్లి గుడి తాళాలు తీసుండేవాడిని. కానీ అక్కడ ధర్నాలు చేసి గుడి తాళాలు పగలగొట్టాలని ప్రయత్నించారు. ఆగస్టు 20న యథాప్రకారం గుడిలోకి వచ్చి పొంగళ్లు పెట్టి, పూజలు చేసి వెళ్లారు. ఆలయ ప్రవేశం, పూజలకు వాళ్లకు ఎలాంటి అడ్డం లేదు. దేవుడు దళిత వాడకు వెళ్లడానికి మాకు ఏ అభ్యంతరాలూ లేవు’’ అన్నారు.

తమిళ దళితులకు తమతో సమానంగా హక్కులు ఇవ్వడంపై తెలుగు దళితులు, అసంతృప్తితో ఉన్నారు.

గ్రామస్థులకు అన్ని పనులూ చేసే తాము కావాలో, లేక వాళ్లు కావాలో తేల్చుకోవాలని అగ్రకులాలుగా చెప్పుకొనే వారిని తెలుగు దళితులు అడుగుతున్నారు.

గ్రామస్థులు తెలుగు దళితుల వైపే నిలవాలని నిర్ణయించుకున్నారు.

ఆ పూజలకు మేం ఎందుకు అర్హులం కాదు?: తమిళ దళితుడు

అమ్మవారిని గ్రామంలో ఉన్న వీధుల్లో అంతా ఊరేగిస్తారని, అలాగే దళితవాడ అంతటా అమ్మవారిని ఊరేగించాలని తాము కోరినట్లు తమిళ దళితుడైన గజపతి చెప్పారు.

‘‘అప్పుడు ఒక వీధి ఉన్నప్పుడు అక్కడే చేసేవారు. ఇప్పుడు 3 వీధులు ఉన్నాయి. అందుకే అన్ని వీధుల్లో తిరగాలని కోరుతున్నాం. అమావాస్య పూజ చేస్తుంటారు. ఆ పూజలకు మేం ఎందుకు అర్హులం కాదు’’ అని ఆయన ప్రశ్నించారు.

అయితే, దీనికి సమయం కావాలని ఆలయ ధర్మకర్త శ్రీనివాసరెడ్డి అధికారులను కోరారు. 23న ఏడు గ్రామాల ప్రజలతో మాట్లాడిన ఆయన, ఇది ఆలయానికి దళితులు వచ్చి పూజలు చేసుకోవచ్చు కానీ, ఒక గ్రామంలో రెండు చోట్ల దేవుడిని ఆపడానికి లేదని చెప్పారు.

తెలుగు, తమిళ దళితుల మధ్య వివాదం పరిష్కారమయ్యేవరకు అమ్మవారిని తమ గ్రామంలో కూడా ఊరేగింపు చేయవద్దని, లేదంటే అక్కడ గొడవలు జరుగుతాయని తెలుగు దళితులే తనకు చెప్పారని ఆయన అన్నారు.

దళితులు
ఫొటో క్యాప్షన్, దళితవాడలోని ఆలయం

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తమిళ దళితులు

తెలుగు దళితులు తమతో కలవనీయడం లేదని, గ్రామస్థులు కూడా వారి వైపే నిలుస్తూ తమను ఆలయంలోకి కూడా వెళ్లనివ్వలేదని తమిళ దళితుల నాయకుడు గజపతి దళిత సంఘాలతో కలిసి అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అధికారులు ఇరు వర్గాలను పిలిపించి చర్చలు జరిపి, ఆగస్టు 20న తమిళ దళితులకు ఆలయ ప్రవేశం చేయించారు. వారితో పొంగళ్లు కూడా పెట్టించారు.

ఆలయ కమిటీలో తమిళ దళితులకు కూడా సభ్యత్వం ఇవ్వాలని, దళితవాడలో వారి వీధుల్లో కూడా దేవుడిని ఊరేగించేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు.

పోలాక్షమ్మ ఆలయం గొడవ కలెక్టర్ వరకూ వెళ్లడంతో తాము చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పుత్తూరు తహశీల్దార్ పరమేశ్వరస్వామి చెప్పారు.

‘‘తమిళ దళితులు దీనిపై కలెక్టర్ దగ్గరికి వెళ్లడంతో ఆయన మాకు ఫోన్ చేసి మీరు దగ్గరుండి వారు ఆలయంలో పొంగళ్లు పెట్టుకునేలా, పూజలు చేసుకునేలా ఏర్పాట్లు చేయించండి అన్నారు. దాంతో మేం లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా పోలీసులతోపాటూ అక్కడికి వెళ్లి వాళ్ల దగ్గర పొంగళ్లు పెట్టించాం’’ అని ఆయన అన్నారు.

దళితులు
ఫొటో క్యాప్షన్, పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు

పరోక్ష రాజకీయాలే రెండు దళిత వర్గాల మధ్య వివాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. ఇందులో ‘అగ్రవర్ణాల వారికి’ ఎలాంటి సంబంధమూ లేదని, దళితులను ఆలయంలోకి రానివ్వడం లేదని మీడియా ప్రచారం చేయడం సబబు కాదని పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.

‘‘19న గొల్లపల్లిలో దళితుల్ని ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు అని మీడియాలో వచ్చింది. నిజానికి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ ఆలయంలో మిగతా కులాలతోపాటూ దళితులు కూడా వెళ్తున్నారు. గ్రామంలో తెలుగు దళితులు, తమిళ దళితులు ఉన్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన తమిళ దళితులు అనాదిగా తెలుగు దళితులకు గ్రామస్థులు ఇస్తున్న గౌరవం తమకూ ఇవ్వాలని కోరుతున్నారు’’ అని డీఎస్పీ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)