గొడ్డు మాంసం వివాదం: నేపాలీ నగరంలో ఎందుకింత ఉద్రిక్తత ఏర్పడింది?

నేపాల్‌లోని ధరన్ నగరం
    • రచయిత, బిక్రమ్ నిరోలా
    • హోదా, బీబీసీ నేపాల్ కోసం, బిరాట్‌నగర్

నేపాల్‌లోని ధరన్ నగరంలో స్థానిక అధికార అధికార యంత్రాంగం విధించిన నిషేధపు ఉత్తర్వుల తర్వాత, శనివారం ఉదయం నుంచి అక్కడ ప్రజలు పెద్దగా రాకపోకలు సాగించడం లేదు.

ఈ నిషేధంతో, ధరన్ మీదుగా కోషి జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు ఆగిపోయాయి.

ధరన్ మీదుగా వచ్చిపోయే దాదాపు అన్ని వాహనాలు నిలిచిపోయాయని ధరన్‌లొ ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌ చేస్తున్న కుమార్ కర్కి తెలిపారు.

ధరన్‌లో మార్కెట్ మాత్రం ఓపెన్‌లో ఉంది. నగరంలో టెంపోలు, బైకులు వంటి కొన్ని ప్రైవేట్ వాహనాలు మాత్రమే తిరుగుతున్నాయి.

ధరన్ సిటీ ప్రవేశ ద్వారం వద్ద, ప్రధాన మార్కెట్ ప్రాంతంలో భారీ ఎత్తున భద్రతా దళాలు మోహరించినట్లు స్థానిక ప్రజలు చెప్పారు.

ఇథారి మీదుగా ధరన్‌కు వచ్చే అన్ని వాహనాలను తహేరా ప్రాంతంలోనే పోలీసులు ఆపివేసి, వెనక్కి పంపిస్తున్నారని స్థానిక వ్యాపారవేత్తలు చెప్పారు.

ధరన్ నగరంలో భద్రత కట్టుదిట్టం

నేపాల్ ధరన్ నగరంలో ఏం జరిగింది?

కొందరు వ్యక్తులు గొడ్డు మాంసం తిన్నారని వివాదం చెలరేగిన తర్వాత అక్కడ ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి.

శనివారం పలు మత సంస్థలు ఆధ్యాత్మిక ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పడంతో, ధరన్‌లో శుక్రవారం రాత్రి నుంచే ఈ నిషేధ ఉత్తర్వులను స్థానిక యంత్రాంగం అమల్లోకి తెచ్చింది.

ఇక్కడ పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటానికి స్థానిక అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

సున్సారి లో రాజకీయ, సామాజిక, మతపరమైన సమావేశాలను, కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు ఆ జిల్లా అధికారి తెలిపారు.

ధరన్‌లోకి వెళ్లే అన్ని ప్రవేశ మార్గాల వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేసినట్లు సున్సారి సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రభు ధాకల్ చెప్పారు.

ధరన్ నగరంలోకి ప్రవేశం నిషేధం

శాంతి భద్రతా, సామాజిక సామరస్యం దెబ్బతినకుండా అవసరమైన చర్యలు

ధరన్‌లో భద్రతా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉంచేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని హోమ్ మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు.

ధరన్‌లో ప్రస్తుతం కొనసాగుతోన్న వివాదం నేపథ్యంలో, శాంతి భద్రతలు, ప్రజల మధ్య సామరస్యం దెబ్బతినకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక యంత్రాంగం చెప్పింది.

ప్రతి ఒక్కరూ సామాజిక సామరస్యానికి కట్టుబడి ఉండాలని అభ్యర్థిస్తూ ధరన్‌లోని పలు రాజకీయ పార్టీలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.

తమ కులం, సంస్కృతి, లౌకికవాదం ఇచ్చిన హక్కుగా గొడ్డు మాంసం తిన్నారని ఒక వర్గం వారు వ్యాఖ్యానిస్తున్నారు.

కానీ, హిందూ కమ్యూనిటీలో కొందరు వ్యక్తులు, కొన్ని మత సంస్థలు మాత్రం దీన్ని మతపరమైన, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు.

గోహత్యకు వ్యతిరేకంగా నిరసనలు

గత వారానికి చెందిన ఈ సంఘటన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. దీని తర్వాత, ఈ ఘటనకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి.

ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, ధరన్‌లో సామాజిక సామరస్యం కార్యక్రమం కూడా చేపట్టారు. శనివారం గోహత్యకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టే కార్యక్రమాన్ని నిలిపివేయాలని హిందూ మతానికి చెందిన పలు సంస్థలు నిర్ణయించాయి.

‘‘మరో కమ్యూనిటీపై ద్వేషాన్ని పెంచడం, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడం అంతకు ముందు ఎన్నడూ జరగలేదు. సోదరభావాన్ని, ఐక్యతను పాటించాలి’’ అని ధరన్ సబ్ మెట్రోపాలిటన్ మున్సిపాలిటీకి చెందిన నలుగురు మాజీ మేయర్లు సంయుక్త ప్రకటన జారీ చేశారు.

భద్రతా బలగాలు

అన్ని పార్టీల సమావేశం

సామాజిక సామరస్యాన్ని, సోదరభావాన్ని, ఐక్యతను పాటించాలని ధరన్ నగర ప్రజలకు మేయర్ హర్కా రాజ్ సంపంగ్ రాయ్ అభ్యర్ధించారు.

ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న జాతి, మత సామరస్యానికి విఘాతం కలుగకుండా ఉండేందుకు అన్ని రాజకీయ పార్టీలతో, సంస్థలతో, ఇతర పార్టీలతో తాను మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు నగర మాజీ మేయర్ తిలక్ రాయ్ వెల్లడించారు.

శుక్రవారం అన్ని పార్టీల సమావేశం జరిగిందని, సామాజిక సామరస్యాన్ని నిర్వహించాలని తామందరం నిర్ణయించినట్లు నేపాలీ కాంగ్రెస్ ధరన్ అధ్యక్షుడు శ్యామ్ పోఖ్రెల్ ‌బీబీసీతో చెప్పారు.

నిరసనలకు మద్దతుగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోమన్నారు. అంతకుముందు ధరన్‌లో క్రిస్టియన్ల కోసం నిర్మించే చర్చి విషయంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.

ఇలాంటి మత, సాంస్కృతి వివాదాలను ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించకపోతే, ప్రజల మధ్య సామరస్యం దెబ్బతింటుందని సామాజిక కార్యకర్తలు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)