హ్యాండ్‌షేక్ ఇచ్చినా ‘షాక్’ కొడుతోందా? ఎందుకు?

షాక్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురుగేశ్ మాడకన్ను
    • హోదా, బీబీసీ తమిళ్

రెండు రోజుల కిందట ఓ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా ఆయన చేతికి నా చేయి తగిలింది. వెంటనే కరెంట్ షాక్ కొట్టినట్లు అయింది.

ఒక్కోసారి ఆఫీసులో కేఫ్టీరియా తలుపు తీయడానికి డోర్ హ్యాండిల్ పట్టుకున్నప్పుడు కూడా నాకు ఇలాగే షాక్ కొడుతుంటుంది.

మీలో చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఉండే ఉంటాయి. ఎవరినైనా తాకినప్పుడో, ఏదైనా వస్తువును పట్టుకున్నప్పుడో కరెంట్ షాక్ కొట్టినట్లుగా అనిపించి ఉండొచ్చు. దీన్ని స్టాటిక్ షాక్ అంటారు.

ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?

డోర్ హ్యాండిల్

ఫొటో సోర్స్, Getty Images

ఎలక్ట్రాన్, ప్రోటాన్‌ల సమతౌల్యం లోపిస్తే..

ఏదైనా వస్తువును తాకినప్పుడు షాక్ ఎందుకు కొడుతుందో అన్నామలై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రమెంటేషన్ ప్రొఫెసర్‌గా పనిచేసే జి.శక్తివేల్ వివరించారు.

ప్రతి పదార్థం పరమాణు నిర్మితమే అని చెప్పిన శక్తివేల్.. పరమాణువుల ఎలక్ట్రాన్, ప్రోటాన్‌లలో అసమతౌల్యం ఉన్నప్పుడు ఇలా షాక్ కొట్టినట్లవుతుందని చెప్పారు.

‘‘ప్రతి పరమాణువులో ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్‌లు ఉంటాయి. ప్రోటాన్‌ను ధనావేశంగా, ఎలక్ట్రాన్‌ను రుణావేశంగా పిలుస్తారు. ఒక పరమాణువులో ప్రోటాన్‌లు, ఎలక్ట్రాన్‌లు సమాన సంఖ్యలో ఉంటే దాన్ని న్యూట్రల్‌గా ఉన్నట్లు పరిగణిస్తారు. కానీ ఒక్కోసారి పరమాణువులోని ప్రోటాన్, ఎలక్ట్రాన్‌ల సంఖ్యలో అసమతౌల్యం ఉంటుంది. దీన్నే స్టేటిక్ ఇండక్షన్ అంటారు’’ అని ఆయన తెలిపారు.

షాక్

ఫొటో సోర్స్, Getty Images

షాక్ ఎందుకు కొడుతుంది?

ఏదైనా వస్తువును కానీ, ఎవరైనా వ్యక్తిని కానీ తాకినప్పుడు ఒకటి ధనావేశంలో, రెండోది రుణావేశంలో ఉంటే ఒకదాన్నుంచి ఇంకో దానికి ఎలక్ట్రాన్‌లు ప్రయాణిస్తాయి.

ఈ ఎలక్ట్రాన్‌ల ప్రవాహం బదిలీ కావడం వల్ల శరీరానికి షాక్ కొట్టినట్లు అవుతుందని శక్తివేల్ చెప్పారు.

ఎలక్ట్రాన్‌ల ప్రవాహం స్వల్ప మొత్తంలో ఉంటే తక్కువగా, ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువగా షాక్ కొడుతుంది.

చలికాలంలో ఎక్కువగా.. వేసవిలో తక్కువగా

సాధారణంగా చలికాలంలో కానీ పొడి వాతావరణంలో కానీ ఇలా ఎక్కువగా జరుగుతుందని శక్తివేల్ చెప్పారు. ఇలాంటి వాతావరణంలో చర్మంపైకి ఎలక్ట్రాన్‌లు చేరుతాయని, ఏదైనా వస్తువును తాకినప్పుడు అవి అందులోకి ప్రయాణించి షాక్‌కు కారణమవుతాయని చెప్పారు.

అదే వేసవిలో అయితే రుణావేశిత ఎలక్ట్రాన్లను వాతావరణంలో తేమ ఎప్పటికప్పుడు న్యూట్రల్ చేస్తుందని చెప్పారు.

దానివల్ల వేసవిలో ఏదైనా వస్తువును తాకినా షాక్ కొట్టినట్లు అనిపించడం చాలా తక్కువగా జరుగుతుందని చెప్పారు శక్తివేల్.

డోర్

ఫొటో సోర్స్, Getty Images

స్టాటిక్ షాక్ నుంచి తప్పించుకోవడం ఎలా?

ఇలా స్వల్ప షాక్ వల్ల హాని ఏమీ జరగదు కాబట్టి దీని గురించి ఆందోళన చెందనవసరం లేదని శక్తివేల్ చెప్పారు.

అయినా, ఇలా జరుగుతుండడం వల్ల అసౌకర్యానికి గురవుతున్నామని భావిస్తే ఏం చేయాలో చెప్పారు శక్తివేల్.

  • నిత్యం మీరు తిరిగే ప్రాంతాల్లో హ్యుమిడిఫయర్ వాడితే ఈ పరిస్థితిని నివారించొచ్చు.
  • ఇంట్లో, ఆఫీసులో ఉన్నప్పుడు దళసరిగా ఉండే సాక్స్ ధరించొద్దు. వీలైతే సాక్స్‌ లేకుండా ఖాళీ పాదాలతో నడిస్తే మంచిది.
  • నైలాన్, పాలిస్టర్ దుస్తులు ధరిస్తే ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు కాటన్ దుస్తులు ధరించడం మంచిది.
  • యాంటీ స్టాటిక్ పరికరాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. యాంటీ స్టాటిక్ బేండ్, షూస్ వంటివి దొరుకుతున్నాయి. వీటిని ధరించడం వల్ల ఫలితం ఉంటుంది.
వీడియో క్యాప్షన్, స్టాటిక్ షాక్: షేక్ హ్యాండిచ్చినా షాక్ కొడుతోందా, ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)