వాగ్నర్ బాస్ ప్రిగోజిన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద తిరుగుబాటు తర్వాత దినదినగండంగానే బతికారా?

2011లో భోజనం చేసే సమయంలో పుతిన్‌కు వడ్డిస్తున్న ప్రిగోజిన్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, 2011లో భోజనం చేసే సమయంలో పుతిన్‌కు వడ్డిస్తున్న ప్రిగోజిన్
    • రచయిత, పౌల్ కిర్బీ
    • హోదా, బీబీసీ న్యూస్

రష్యాలోని ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ రెండు నెలల కిందట పుతిన్ మీద తిరుగుబాటుకు విఫలయత్నం చేసింది. ఆ తిరుగుబాటు అణచివేతకు గురైన తరువాత వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌జెనీ ప్రిగోజిన్ మరణం అంచున జీవించారు.

తనకు తాను బలమైన వ్యక్తిగా భావించిన ప్రిగోజిన్ రష్యా అధినేతపై తిరుగుబాటుకు దిగారు.

ఈ పరిణామాల అనంతరం మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్తోన్న సమయంలో ఆయన సొంత ప్రైవేట్ జెట్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించినట్లు రష్యా అధికారికంగా ధ్రువీకరించింది.

బుధవారం జరిగిన విమాన ప్రమాదం ఘటనలో లభించిన మృతదేహాలకు జన్యుపర్యమైన పరీక్షల అనంతరం ఈ ధ్రువీకరణకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఆయనతోపాటు మరణించిన పది మందినీ గుర్తించినట్లు దర్యాప్తు కమిటీ తెలిపింది.

ఈ ప్రమాదం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అల్లకల్లోలమైన ప్రిగోజిన్ జీవితానికి ఒక విషాద ముగింపును ఇచ్చింది.

ఎన్నో ఏళ్లుగా వ్లాదిమిర్ పుతిన్ , ప్రిగోజిన్ సేవలను వాడుకుంటూ వచ్చారు. కానీ, వాగ్నర్ సేనలలో వేలాది మంది సైనికుల తిరుగుబాటు మాత్రం పుతిన్‌కు మింగుడు పడలేదు.

ప్రిగోజిన్ తొలిసారి ప్రెసిడెంట్ పుతిన్‌కు ఎదురుతిరిగినప్పుడు, దీన్ని ఒక దేశద్రోహంగా పుతిన్ అభివర్ణించారు.

తొమ్మిదేళ్లు జైలులోనే గడిపిన ప్రిగోజిన్

ప్రిగోజిన్ యవ్వనంలో దాదాపు సెయింట్ పీటర్స్‌బర్గ్ జైలులోనే గడిపారు. తొమ్మిదేళ్లు జైలులోనే ఉన్నారు.

జైలు నుంచి విడుదలైన తరువాత సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో హాట్ డాగ్స్ అమ్మే స్టాళ్లు ఆయన నెలకొల్పారు.

వ్యాపారం బాగా సాగడంతో కొద్ది కాలానికే ఆ నగరంలో ఖరీదైన రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు.

ఆ రెస్టారెంట్లు కేంద్రంగా ప్రిగోజిన్‌కు రష్యా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి.

ఈ కేటరింగ్ వ్యాపారాల ద్వారానే పుతిన్ నుంచి సంపద, ప్రోత్సాహం కూడా లభించింది ప్రిగోజిన్‌కి.

ఆఫ్రికా, సిరియా, యుక్రెయిన్‌లో ప్రిగోజిన్ కిరాయి వెంచర్లు, ఆయన్ను సైనిక నేతగా నిలబెట్టాయి.

మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్తుండగా ట్వెర్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఆయన ఎంబ్రేయర్ లెగసీ విమానం కుప్పకూలినట్లు రష్యా విమానయాన అధికారులు ధ్రువీకరించారు.

అయితే, వాగ్నర్ టెలిగ్రామ్ చానెల్‌ గ్రేజోన్‌లో ఆ విమానాన్ని రష్యా సైన్యం కూల్చేసినట్లు చెప్పారు. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు.

కానీ, ఒకవేళ కావాలనే ప్రిగోజిన్ విమానాన్ని కూల్చివేసే ప్రిగోజిన్ శత్రువులు తక్కువేమీ కాదని కొందరు భావిస్తున్నారు.

చనిపోయిన ఈ విమాన ప్రయాణికుల జాబితాలో ప్రిగోజిన్‌తో పాటు ఆయన తొలి వాగ్నర్ కమాండర్ డిమిట్రీ ఉత్కిన్ కూడా ఉన్నారు.

ప్రిగోజిన్

ఫొటో సోర్స్, TELEGRAM/GREY ZONE

రష్యా ప్రభుత్వం క్రెమ్లిన్‌కు వ్యతిరేకంగా 62 ఏళ్ల ప్రిగోజిన్ లేవనెత్తిన స్వల్పకాల తిరుగుబాటుకి శిక్ష నుంచి తప్పించుకున్నట్లే మనకు కనిపించింది.

ఆ తిరుగుబాటు తర్వాత రష్యా అధినాయకత్వంతో ఆయనకు ఒప్పందం కుదిరింది. ఆయన బెలారూస్‌కు మకాం మారుస్తానని దీనిలో అంగీకరించారు. దీనికి ప్రతిగా ఆయనపై మోపిన అభియోగాలను వెనక్కి తీసుకుంటామని రష్యా అధినాయకత్వం కూడా స్పష్టంచేసింది.

కానీ, ఆయన రష్యావ్యాప్తంగా ప్రయాణిస్తూనే ఉన్నారు.

బెలారూస్‌లో ఫైటర్లకు ప్రిగోజిన్ ఆహ్వానం పలుకుతున్న దృశ్యాలు టెలిగ్రామ్ చానెళ్లలో జులై రెండో వారంలో వైరల్ అయ్యాయి.

దీనికి నెల రోజుల తర్వాత సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఆఫ్రికా-రష్యా సదస్సుకు ప్రిగోజిన్ హాజరయ్యారు.

ప్రిగోజిన్ రష్యా నాయకత్వం నుంచి తప్పించుకునేందుకు బెలారూస్‌లో నిశ్శబ్దంగా కూర్చోలేదు. తిరుగుబాటు తర్వాత ప్రిగోజిన్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

తన తిరుగుబాటు లేవనెత్తినప్పటి నుంచి తన తొలి వీడియో ప్రసంగాన్ని కూడా విడుదల చేశారు.

ఈ వీడియోలో కనిపించిన ప్రాంతాన్ని బట్టి ఆఫ్రికాలో దాన్ని షాట్ చేసినట్లు తెలిసింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 50 సెల్సియస్ ఉన్నాయని ప్రిగోజిన్ చెప్పారు.

అయితే, ఆ వీడియో ఎక్కడ చిత్రీకరించారో బీబీసీ ధ్రువీకరించలేదు.

అన్ని ఖండాలలో రష్యాను మరింత ఉన్నతంగా మార్చేందుకు, ఆఫ్రికాను మరింత స్వేచ్ఛగా మార్చేందుకు వాగ్నర్ గ్రూప్ రిక్రూట్‌మెంట్ కొనసాగిస్తుందని కూడా తెలిపారు.

సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని 'ట్రోల్ ఫ్యాక్టరీ'గా పిలిచే వ్యవస్థతో ఆయనకు ఉన్న సంబంధాలున్నాయంటూ కథనాలు వచ్చేవి.

క్రెమ్లిన్ పాలన వ్యవస్థను సానుకూలంగా చూపించడం, రష్యా ప్రతిపక్షాల విశ్వసనీయత దెబ్బతీసే కంటెంట్‌ను ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉంచడం ఈ వ్యవస్థ లక్ష్యం.

2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు వచ్చాయి.

ప్రిగోజిన్ మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తూ వచ్చారు. తనకు, ట్రోల్ ఫ్యాక్టరీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

వాగ్నర్ గ్రూపుతో తనకున్న సంబంధాలనూ ఆయన ఖండిస్తూ వచ్చారు.

అయితే, పశ్చిమ దేశాల కఠిన, రష్యా వ్యతిరేక ప్రచారం నుంచి రష్యన్ ఇన్‌ఫర్మేషన్ స్పేస్‌ను రక్షించుకునేందుకు దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రిగోజిన్ ఈ ఏడాదే ఒప్పుకున్నారు.

ప్రిగోజిన్

ఫొటో సోర్స్, TELEGRAM

పుతిన్ వంటమనిషిగా ఎలా మారారు?

దొంగతనం, మోసం కింద సోవియట్ కాలంలో చివరి ఏళ్లలో సుమారు దశాబ్దం పాటు జైలులోనే గడిపారు ప్రిగోజిన్.

సోవియట్ నుంచి సరికొత్త రష్యా ఏర్పడిన తర్వాత, ప్రిగోజిన్ కేటరింగ్ వ్యాపారాల్లోకి వచ్చారు. తొలుత హాట్‌డాగ్-స్టాళ్ల ఏర్పాటు నుంచి నుంచి ఆ తర్వాత ఖరీదైన రెస్టారెంట్లు తెరవడం వరకు విస్తరించారు.

1990లలో పుతిన్ సెయింట్ పీటర్స్‌బర్గ్ మేయర్‌ కార్యాలయంలో పనిచేశారు.

అదే సమయంలో ప్రిగోజిన్‌కు అక్కడ నెవా నదిపై ‘న్యూ ఐలాండ్’ అనే రెస్టారెంట్ ఉండేది. పుతిన్ అక్కడికి తరచూ వస్తుండడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.

‘‘కియోస్క్ నుంచి నేనెలా వ్యాపారాలను అభివృద్ధి చేశానో వ్లాదిమిర్ పుతిన్ చూశారు’’ అని కొన్నేళ్ల తర్వాత ప్రిగోజిన్ చెప్పారు.

పుతిన్ అధ్యక్షుడైన తరువాత కూడా ఆ రెస్టారెంట్‌కు తన విదేశీ అతిథులను తీసుకొచ్చేవారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్ వంటి విదేశీ అతిథులకు ప్రిగోజిన్ రెస్టారెంట్లలోనే భోజనాలు ఏర్పాటు చేసే వారు.

ఆ తర్వాత పుతిన్ వంటమనిషిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

ప్రిగోజిన్ కిరాయి వ్యాపారం ఆయనకు మిలటరీలో పేరును, డబ్బును సంపాదించినట్లయితే, ఆయన కేటరింగ్ వ్యాపారాలు ఈ ఏడాది వరకు కూడా స్థిరమైన సంపదను ప్రిగోజిన్‌కు అందించాయి.

ప్రిగోజిన్ ప్రైవేట్ సైన్యానికి 12 నెలల్లో ప్రభుత్వం నుంచి 1 బిలియన్ డాలర్ల నిధుల సమకూర్చినట్లు వాగ్నర్ తిరుగుబాటు అనంతరం అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు.

అలాగే మిలటరీకి ఆహారం అందించేందుకు ప్రిగోజిన్ కేటరింగ్ సంస్థకు మరో 1 బిలియన్ డాలర్లు ఇచ్చినట్లు తెలిపారు. ఇవి కేవలం ఒక సంవత్సరంలోనే.

2014 నుంచి ప్రభుత్వ కాంట్రాక్ట్‌ల ద్వారా 18 బిలియన్ డాలర్లకు పైగా ప్రిగోజిన్ పొందినట్లు రిపోర్టులు తెలిపాయి.

‘‘రక్షణ మంత్రిత్వ శాఖను, ప్రభుత్వాన్ని, అధ్యక్షుడిని వ్యక్తిగతంగా సవాలు చేయగలనని అతను అనుకున్నాడు’’ అని క్రెమ్లిన్ ప్రచారకర్త డీమిట్రీ కిసెల్యోవ్ తెలిపారు.

తూర్పు యుక్రెయిన్‌లోని బఖ్‌ముత్‌ నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో వాగ్నర్ సైనికులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఇది నెలల తరబడి కొనసాగింది.

గత సెప్టెంబర్‌లో రష్యాలో ఉన్న జైళ్లను ప్రిగోజిన్ తిరిగారు. వాగ్నర్‌తో కలిసి పనిచేయడం ద్వారా తమ శిక్షా కాలాన్ని తగ్గించుకోవచ్చని చెప్పారు.

బఖ్‌ముత్‌ కోసం జరిగిన పోరాటంలో వేలాది మంది సైనికులు చనిపోయారు. వీరిలో చాలా మంది అనుభవం లేని వారు, సరైన ఆయుధాలు లేని మాజీ ఖైదీలు ఉన్నారు.

ప్రిగోజిన్

ఫొటో సోర్స్, REUTERS

యుద్ధం ముగింపుకు వచ్చిందనగా.. చనిపోయిన సైనికుల మృతదేహాల మద్యలో నిల్చుని మందుగుండు సామాగ్రి కావాలని ప్రిగోజిన్ సోషల్ మీడియా వీడియోల్లో డిమాండ్ చేశారు.

రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, సాయుధ దళాలు చీఫ్ వాలెరి గెరాసిమోవ్‌లపైనున్న కోపాన్ని ప్రదర్శించారు.

‘‘షోయిగు! గెరాసిమోవ్! ఎక్కడ.. మందుగుండు సామాగ్రి?.. వారు ఇక్కడికి వాలంటీర్లు లాగా వచ్చారు. మీ కోసం మరణించారు’’ అని అన్నారు.

పుతిన్‌ను నేరుగా విమర్శించకుండా ఆయన కమాండర్లను ఎల్లప్పుడూ విమర్శిస్తూ వచ్చారు ప్రిగోజిన్.

కానీ, వాగ్నర్ దళాలు, ఇతర వాలంటరీ దళాలను ప్రధాన కమాండ్ విభాగంలోకి తీసుకురావాలనే ప్లాన్లు కొనసాగుతున్నాయని మిలరటీ అధినేతలు ప్రకటించినప్పుడు, ప్రిగోజిన్ దీన్ని తిరస్కరించారు.

రక్షణ మంత్రి కాంట్రాక్ట్‌లపై సంతకం చేసేలా యుక్రెయిన్‌లో యుద్ధం చేస్తోన్న అన్ని కిరాయి గ్రూప్‌లు ముందుకు రావాలన్న రక్షణ మంత్రి ఆదేశాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్థించడంతో, ప్రిగోజిర్ తిరుగుబాటు చేశారు.

యుక్రెయిన్‌ యుద్ధంలో జరుగుతోన్న పరిమాణాలను ప్రశ్నిస్తూ.. "న్యాయం కోసం కవాతు" అనే దాన్ని లాంచ్ చేశారు.

వేలాది మంది రష్యన్ సైనికులు చనిపోయేందుకు బాధ్యత రక్షణ శాఖ మంత్రి అంటూ ఆరోపించారు.

ఇలా పలు సందర్భాల్లో పుతిన్‌పై పరోక్షంగా విమర్శలు చేసుకుంటూ వచ్చారు ప్రిగోజిన్.

ప్రిగోజిన్ తిరుగుబాటు వ్లాదిమిర్ పుతిన్ అధికారాన్ని దెబ్బతీసిందనే వాదనను క్రెమ్లిన్ ఖండిస్తూ వచ్చింది.

పుతిన్ నాయకత్వంపై ప్రిగోజిన్ దీర్ఘకాలిక ప్రభావానికి ఈ విధంగా తెరపడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)