శత్రు భీకరమైన నేపాలీ గూర్ఖాలు ఇక భారత సైన్యంలో చేరరా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అన్బరసన్ ఎతిరాజన్
- హోదా, బీబీసీ న్యూస్
నేపాల్‌లో మూలవాసులైన గూర్ఖా సైనికులను భారత సైన్యంలో చేరేందుకు కొన్ని దశాబ్ధాల క్రితం కుదిరిన ప్రత్యేక ఒప్పందం కింద నేపాల్ ప్రభుత్వం అనుమతిస్తోంది. అయితే భారత ప్రభుత్వం ఆర్మీలో నియామకాలకు సంబంధించి వివాదాస్పద అగ్నిపథ్ ప్రణాళికను ప్రవేశపెట్టిన తర్వాత నిరుడు ఒప్పందం అకస్మాత్తుగా ఆగిపోయింది. అంతేకాదు, అది భారత్- నేపాల్ సంబంధాలను దెబ్బ తీసింది.
నేపాలీ గూర్ఖాలు ధైర్యానికి, శత్రు భీకరమైన పోరాటాలకు ప్రసిద్ధి చెందినవారు. భారత, బ్రిటన్ సైన్యాల్లో పని చేస్తూ దశాబ్దాలుగా అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు.
నేపాల్‌తో చేసుకున్న శాంతి ఒప్పందం ప్రకారం 1815లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటిసారి వారిని తమ సైన్యంలో నియమించుకుంది.
1947లో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత ఇండియా, నేపాల్, బ్రిటన్ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా భారత్, బ్రిటన్‌లు నేపాలీ గూర్ఖాలను సైన్యంలో చేర్చుకోవడాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.
భారత ప్రభుత్వం సైనిక నియామకాల కోసం అగ్నిపథ్ అనే కొత్త పథకాన్ని ప్రకటించిన తర్వాత భారత్‌తో నేపాల్, బ్రిటన్ చేసుకొన్న ఒప్పందం ఆగిపోయింది.
అగ్నిపథ్ పథకం కింద సైనికుల్ని ఎంపిక చేసేటప్పుడు వారిని నాలుగేళ్ల నిర్ణీత సమయం కోసం మాత్రమే తీసుకుంటారు. అందులో అద్భుతమైన పని తీరు కనబరిచిన 25 శాతం మందిని నాలుగేళ్ల తర్వాత కూడా భారతీయ కేంద్ర బలగాల్లో కొనసాగిస్తారు. మిగిలిన వారికి పెన్షన్ సదుపాయం, ఇతర ప్రయోజనాలేమీ లేకుండా 11.71 లక్షల రూపాయలు ఇచ్చి పంపించేస్తారు.
ఈ నిబంధనలన్నీ చాలా కాలంగా బ్రిటిష్, భారత సైన్యంలో సేవలందిస్తున్న గూర్ఖా సైనికులకు కూడా వర్తిస్తాయి.

ఫొటో సోర్స్, SURENDRA PHUYAL
భారత సైన్యంలో నేపాలీ గూర్ఖాలు ఎంత మంది?
సైనిక నియామక ప్రక్రియలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు తమను సంప్రదించలేదని, భారత ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో తాము ఆశ్చర్యపోయామని నేపాలీ అధికారులు చెబుతున్నారు.
"త్రైపాక్షిక ఒప్పందానికి ఏదైనా మార్పు జరిగితే, దానిని రాజకీయ ఏకాభిప్రాయం ద్వారా అమలు చేయాలని మాకు ఒక విధానం ఉంది" అని నేపాల్ విదేశాంగ మంత్రి ఎన్‌పీ సౌద్ బీబీసీతో చెప్పారు. గూర్ఖాల రిక్రూట్‌మెంట్ ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామన్నారు.
నేపాల్ రాజకీయ పార్టీలు ఈ మార్పును తీవ్రంగా వ్యతిరేకించడంతో, ప్రస్తుత ప్రభుత్వానికి ఏకాభిప్రాయం సాధించడం మరింత కష్టంగా మారింది.
"మేము కొత్త ప్రణాళికను అంగీకరించడం లేదు. భారతదేశం పాత గూర్ఖా రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉంటే, దానిని తిరిగి ప్రారంభించవచ్చు" అని ప్రధాన ప్రతిపక్షం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ సీనియర్ నాయకుడు ప్రదీప్ కుమార్ గ్యావాలి బీబీసీతో చెప్పారు.
అగ్నిపథ్ పథకం ప్రకటించడానికి ముందు, భారతదేశం ఏటా సగటున 1,400 మంది నేపాలీ పౌరులను తన గూర్ఖా రెజిమెంట్లలో చేర్చుకుంది.
ప్రస్తుతం భారత సైన్యంలో దాదాపు 35,000 మంది నేపాలీ గూర్ఖాలు పనిచేస్తున్నారు. వీరంతా కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ పని చేస్తున్నారు.
అగ్నిపథ్ పథకం వల్ల సైనికుల జీతాలు, పింఛన్ల కోసం చెల్లించాల్సిన ఖర్చు తగ్గుతుందని భారత ప్రభుత్వం వాదిస్తోంది. ఇప్పుడు రక్షణ బడ్జెట్ కేటాయింపుల్లో సగానికి పైగా నిధులు జీతాలు, పింఛన్ల కోసమే చెల్లిస్తున్నారు.
నాలుగేళ్ల పాటు సైన్యంలో పని చేసేలా నియామకాలు జరపడం వల్ల భారత సైనిక దళాల సగటు వయసు తగ్గుతుందని కూడా భారత ప్రభుత్వం చెబుతోంది.

ఫొటో సోర్స్, SURENDRA PHUYAL
నేపాల్ ఆందోళన ఏమిటి?
ఇలా చెయ్యడం వల్ల తిరుగుబాటుదారుల ముప్పు మరింత పెరుగుతుందని నేపాల్ ఆందోళన చెందుతోంది.
"నాలుగేళ్లు ఇండియన్ ఆర్మీలో పని చేసి బయటకు వచ్చిన వ్యక్తిని దేశంలోని అరాచక శక్తులు లేదా విదేశీ కిరాయి సైనికులు అవసరాల కోసం నియమించుకునే ప్రమాదం ఉంది" అని నేపాలీ రిటైర్డ్ ఆర్మీ అధికారి ప్రేమ్ సింగ్ బస్న్యాత్ బీబీసీతో చెప్పారు.
దశాబ్ధ కాలానికి పైగా మావోయిస్టుల సాయుధ తిరుగుబాటు పోరాటం వల్ల నేపాల్ చాలా నష్టపోయింది. ఇది 2006లో ముగిసింది. ఈ అంతర్యుద్ధ కాలంలో వేల మంది ప్రజలు చనిపోయారు. భారత్ నుంచి తిరిగి వచ్చిన వారందరికీ తాము ఉపాధి కల్పించలేమని నేపాల్ ప్రభుత్వం చెబుతోంది.
అగ్నిపథ్ పథకం నుంచి నేపాలీ గూర్ఖాలను మినహాయించాలని భారత్ నుంచి కూడా ప్రతిపాదనలు వస్తున్నాయి.
అగ్నిపథ్ పథకం నేపాల్‌తో భారత్ సంబంధాలను సంక్లిష్టంగా మారుస్తుందని ఇండియన్ గూర్ఖా రెజిమెంట్‌లో పనిచేసి, పదవీ విరమణ చేసిన మేజర్ జనరల్ అశోక్ మెహతా చెప్పారు.
"భారత ప్రభుత్వం దౌత్యపరమైన మర్యాదను పాటించడంలో తన బాధ్యతను విస్మరించింది. ముఖ్యంగా భారత దౌత్య విధానంలో ప్రత్యేకమైన బంధం ఉందని చెప్పుకుంటున్న నేపాల్ లాంటి దేశం విషయంలో ఇలా వ్యవహరించకూడదు’’ అని ఆయన చెప్పారు.
అగ్నిపథ్ స్కీమ్ కింద నేపాలీ గూర్ఖాలు భారత సైన్యంలో చేరకుంటే, వారికి కేటాయించిన కోటాను రానున్న రోజుల్లో భారతీయులకే ఇవ్వవచ్చని భారత అధికారులు సూచిస్తున్నారు.
బీబీసీ దీనిపై భారత విదేశీ వ్యవహారాలశాఖ స్పందన కోరింది.

ఫొటో సోర్స్, SURENDRA PHUYAL
భారత్-నేపాల్ సంబంధాలపై ప్రభావం చూపుతుందా?
భారత్ నిర్ణయాలతో ఇప్పటికే మనస్తాపంతో ఉన్న నేపాల్‌ను ఈ చర్య మరింత దూరం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
చైనా సరిహద్దుకు దగ్గరగా నేపాల్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న కొన్ని భూభాగాలను తమవిగా పేర్కొంటూ 2019లో భారత్ ప్రచురించన మ్యాప్ విషయంలో నేపాల్ కోపంగా ఉంది.
ఆ వివాదాస్పద ప్రాంతాలు తమవిగా పేర్కొంటూ నేపాల్ కూడా ఓ మ్యాపు విడుదల చెయ్యడంతో దౌత్యపరమైన వివాదం తీవ్రం అయ్యింది.
మ్యాప్ వివాదానికి కొన్నేళ్ల ముందు నేపాల్‌లోని మాథేసీ సంఘం తమ హక్కుల కోసం డిమాండ్ చేస్తూ 2015లో చేపట్టిన నిరసనల్లో భాగంగా భారతదేశం నుండి వస్తువుల రాకపోకలను అడ్డుకుంది. దీని వెనుక భారత్ ఉందన్న వాదననను భారత ప్రభుత్వం తిరస్కరించింది. నేపాల్‌లో చాలా కొద్ది మంది మాత్రమే భారత ప్రభుత్వ వాదనను నమ్ముతున్నారు.
కాఠ్‌మాండూ వెలుపల ఒక మైదానంలో, బ్రిటిష్ సైన్యంలో గూర్ఖాల నియామకాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఓ ట్రైనర్ డజన్ల కొద్దీ యువకులకు వేగంగా పరుగు తీసేలా శిక్షణ ఇస్తున్నారు.
వారిలో 19 ఏళ్ల అనీష్ థాపా మగర్ తన బంధువుల మాదిరిగా తాను కూడా భారత సైన్యంలో చేరాలని భావిస్తున్నారు.
"అగ్నిపథ్ స్కీమ్ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. నాలుగేళ్ల తర్వాత ఏం చేయాలో తెలియక ఇంటికి తిరిగి వస్తాం. అందుకే బ్రిటిష్ సైన్యానికి ఎంపిక కావడానికి శ్రమిస్తున్నా" అని మగర్ థాపా చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అగ్నిపథ్: వ్యతిరేకత అందరిలోనూ లేదు
నేపాలీ గూర్ఖాలకు భారతీయ సైన్యంతో బలమైన బంధం ఉంది. నేపాల్‌లోని పర్వత ప్రాంతాల్లో నివసించే గూర్ఖాలు, భారత సైన్యంలోని గూర్ఖా రెజిమెంట్‌లో భాగమయ్యారు.
భారత సైన్యంలో పనిచేసి రిటైరైన గూర్ఖాలు నేపాల్‌లో దాదాపు 1,20,000 మంది ఉన్నారు. వీరికొచ్చే పెన్షన్, ఇతర ప్రయోజనాలు నేపాల్ పర్వత ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాయి.
అగ్నిపథ్ స్కీమ్ పట్ల గట్టి వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఈ నియామక ప్రక్రియను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించడం లేదు. భారత సైన్యంలో పని చేసిన లక్ష్మీకాంత్ పాండే వంటి నేపాలీ గూర్ఖాలు అగ్నిపథ్ పథకం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని, దాన్ని పూర్తిగా తిరస్కరించడం సమంజసం కాదని వాదిస్తున్నారు.
ఈ పథకంలో పదవీకాలం ముగిసిన తర్వాత కొంత సొమ్ము ఇస్తారని, ఇండియన్ ఆర్మీలో పని చేసిన అనుభవం నేపాల్‌తో పాటు ఇతర దేశాల్లో అవకాశాలను అందిస్తుందని ఆయన చెప్పారు.
సైనిక నియామకాలకు సంబంధించి అగ్నిపథ్ స్కీమ్ కింద మరిన్ని రాయితీలు పొందడానికి భారత ప్రభుత్వంతో చర్చించడం ఉత్తమమని ఆయన సూచించారు.
ఇదంతా పక్కన పెడితే, అగ్నిపథ్ స్కీమ్ కింద భారత సైన్యంలో పని చేసేందుకు ఎంపికైన మొదటి బ్యాచ్ భారతీయ సైనికులు ఆగస్టు మొదటి వారంలో శిక్షణ పూర్తి చేసుకుని సైన్యంలో చేరారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














