సురబయ యుద్ధం: ఇండోనేషియా స్వాతంత్య్ర సమరయోధులపై పోరాటానికి పంపితే, బ్రిటన్‌కు షాక్ ఇచ్చి, వారికే సాయపడిన భారత సైనికులు

1945లో సురబయ యుద్ధం

ఫొటో సోర్స్, IWM SE 5866

ఫొటో క్యాప్షన్, 1945లో సురబయ యుద్ధం
    • రచయిత, త్రిషా హుసాడా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సురబయ యుద్ధంలో ఇండోనేషియా స్వాతంత్య్ర సమరయోధులతో పోరాడేందుకు 1945లో బ్రిటిష్ సైన్యం 600 మంది భారతీయ సైనికులను ఆ దేశంలో మోహరించింది.

ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్‌లోని వజీరాబాద్‌లో నివసిస్తున్న ఈ సైనికులను, వారి వారసులను గుర్తించి, వారితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది.

1945 భారత దళాల 5వ డివిజన్‌కు చెందిన సైనికులను, వారి వారసులను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది.

ఈ యుద్ధం గురించి అనుభవాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం.

సుమారు 25 ఏళ్లుగా సురబయలో నివసిస్తున్న భారతీయ వ్యక్తి సంయోగ్ శ్రీవాస్తవ సురబయ యుద్ధం గురించి బీబీసీతో పంచుకున్నారు.

భారతీయులకు, ఇండోనేషియన్లకు సురబయ యుద్ధం ఒక భావోద్వేగ ప్రాధాన్యం కలిగిన అంశమని శ్రీవాస్తవ చెప్పారు.

‘‘ఈ రెండు దేశాలు కూడా చాలా కాలం పాటు విదేశీ ఆక్రమణదారుల చేతిలో బందీగా ఉన్నాయి. బ్రిటిష్ సైన్యం తరఫున భారతీయ సైనికులు ఎప్పుడైతే ఇండోనేషియాకు వచ్చారో, అప్పుడు సొంత ప్రజలపైనే యుద్ధం చేస్తున్నట్లు వారు గుర్తించారు’’ అని సురబయలోని తన ఇంటి నుంచి బీబీసీ ఇండోనేషియాకు ఇచ్చిన వర్చ్యువల్ ఇంటర్వ్యూలో శ్రీవాస్తవ చెప్పారు.

ఈ యుద్ధంలో మరణించిన సైనికుల గుర్తుగా ఏర్పాటు చేసిన జాతీయ స్మారక చిహ్నం తుగు పహ్లావన్‌ను సందర్శించినప్పుడు, ఇండోనేషియా స్వాతంత్య్ర సమరయోధులతోపాటు మరణించిన భారత సైనికుల పేర్లను కూడా ఆయన చూస్తుంటారు.

‘‘ఈ స్మారక చిహ్నం వద్దకు వెళ్తే, మరికొన్ని వివరాలను మీరు తెలుసుకోవచ్చు. ఇండోనేషియా స్కూలింగ్ సిస్టమ్‌లో చదివిన భారతీయ ప్రజలు ఇక్కడ ఉన్నారు. వారికి చరిత్ర గురించి బాగా తెలుసు’’ అని ఆయన తెలిపారు.

అయినప్పటికీ, తమ కమ్యూనిటీలోని చాలా మంది ప్రవాస భారతీయులకు ఇండోనేషియా, భారత్‌ మధ్యనున్న చరిత్ర గురించి పూర్తిగా తెలియదని ఆయన భావిస్తున్నారు.

‘‘భారతీయ డయాస్పొరాలో ఇరు దేశాల పట్ల మళ్లీ సాన్నిహిత్యాన్ని, మానవత్వాన్ని, ఇరు దేశాల మధ్యనున్న బాధ్యతలను ఇది మరింత పెంచుతుందని భావిస్తున్నా. ఇరు దేశాల సాంస్కృతిక కలయికతో ఒకరినొకరు గౌరవించుకుంటూ, కలిసి పనిచేయాలని, సామరస్యాన్ని చాటుకోవాలని ఆశిస్తున్నా’’ అని తెలిపారు.

1945లో సురబయ యుద్ధం

ఫొటో సోర్స్, IWM SE 5979

ఫొటో క్యాప్షన్, ఇండోనేషియాలో తిరుగుబాటును అణచివేసేందుకు భారత దళాలను ఉపయోగించకూడదంటూ నెహ్రూ 1945 సెప్టెంబర్ 30న జారీ చేసిన ఆదేశాల పోస్టర్.

సురబయ యుద్ధంలో భారత దళాల పాత్ర ఏమిటి?

సురబయ యుద్ధం చరిత్రాత్మక పోరాటం. ఎందుకంటే, ఆసియాలో బ్రిటిష్ సామ్రాజ్యం జరిపిన పెద్ద పోరాటాల్లో ఆఖరిది ఇదే. ఆ సమయంలో బ్రిటన్, ఆస్ట్రేలియా పలు దళాలను 1945 సెప్టెంబర్‌లో సురబయకు పంపాయి.

కానీ, దీనిపై ఇండోనేషియన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే, తమ దేశాన్ని తిరిగి అధీనంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో బ్రిటన్‌తో కలిసి డచ్ వారు ఇక్కడకు వచ్చారు.

‘‘ఈ విధంగా, 1946లో డచ్ వారు తిరిగి ఇక్కడికి వచ్చేందుకు బ్రిటన్ తలుపులు తెరిచింది. 1945 సెప్టెంబర్ నుంచి 1946 మార్చి మధ్య కాలంలో జరిగిన పరిణామాలకు బ్రిటన్‌దే బాధ్యత’’ అని ఇండోనేషియా ఆధునిక చరిత్ర నిపుణుడు, ఆక్స్‌ఫర్డ్ చరిత్రకారుడు పీటర్ కారీ చెప్పారు.

ఈ సమయంలో భారత్ కూడా బ్రిటిష్ పాలనలో ఉంది. అప్పటికీ ఇంకా భారత్‌కు స్వాతంత్య్రం రాలేదు.

శాంతిని నెలకొల్పేందుకు బ్రిటన్ మోహరించిన వేల మంది భారత సైనికుల్లో ఎక్కువ మంది పంజాబ్, మద్రాస్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల వారు ఉన్నారు.

‘‘మేజర్ జనరల్ రోబర్ట్ మాన్సెర్ఘడ్ నేతృత్వంలో సురబయ యుద్ధంలో పాల్గొనేందుకు ఐదో డివిజన్‌కు చెందిన భారతీయ సైనికులు ఇండోనేషియాకు వచ్చారు.

ఎయిర్, నావెల్ సపోర్ట్ ఇచ్చేందుకు భారతీయ డివిజన్‌కు చెందిన 600 మందిని ఇక్కడికి తీసుకొచ్చారు’’ అని ప్రొఫెసర్ కారీ చెప్పారు.

ఈ 600 మంది సైనికులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారనే విషయాన్ని బ్రిటన్ ఆర్మీ కనిపెట్టలేకపోయింది. డచ్ వారికి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇండోనేషియా స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి పోరాడాలని భారత సైనికులు నిర్ణయించారు.

స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తున్న ఇండోనేషియన్లను నాశనం చేయాలని మాన్సెర్ఘడ్ నుంచి ఐదో డివిజన్‌కు ఆదేశాలు అందాయి.

కానీ బ్రిటన్ నుంచి తాము కూడా స్వాతంత్య్రం కోరుకుంటున్నప్పుడు తామెందుకు అలా చేస్తామని భారతీయులు ప్రశ్నించినట్లు ఆయన వివరించారు.

ఇండోనేషియా స్వాతంత్య్ర సమరయోధులకు భారతీయ సైనికుల నుంచి అందిన ఈ అనూహ్య సహకారం జాతీయవాదమనే భావనతోపాటు విశ్వాసంతో కూడా ముడిపడి ఉంది.

జహీర్ ఖాన్ రాసిన ‘ఇండోనేషియా పోరాటంలో పాకిస్తాన్ పాత్ర’ అనే పుస్తకంలో, బ్రిగేడ్ 1కి చెందిన డివిజన్ 32లోని కమాండర్‌ గులామ్ అలి చెప్పిన విషయాలను ప్రస్తావించారు. ఇండోనేషియన్లకు ఈ సమయంలో ఇతర ముస్లిం సైనికులు బట్టలను, బియ్యాన్ని, పంచదారను, ఉప్పును, ఇతర పదార్థాలను అందించారని తెలిపారు.

చాలా మంది ఇండోనేషియన్లు సరైన ఆహారం దొరకక, తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.

సురబయ యుద్ధంలో భారత దళాలు

ఫొటో సోర్స్, IWM SE 6735

ఫొటో క్యాప్షన్, సురబయ యుద్ధంలో భారత దళాలు

మతం కంటే జాతీయవాదానికే ప్రాధాన్యం

‘‘ఇది కేవలం మతానికి సంబంధించిన విషయం కాదు. దీనిలో జాతీయవాదానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. వలసవాద వ్యతిరేక స్ఫూర్తితో జాతీయవాదానికి మరింత ప్రాధాన్యం లభించింది’’ అని ప్రొఫెసర్ కారీ అన్నారు.

ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. 1,50,000 మంది శరణార్థులుగా మారగా, 27 వేల మంది మరణించారు. వీరిలో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.

600 మంది భారతీయ సైనికుల్లో కేవలం 75 మంది సైనికులే ప్రాణాలతో మిగిలారు.

800 మంది సైనికులను బ్రిటన్ కోల్పోయిందని ప్రొఫెసర్ కారీ చెప్పారు.

బ్రిటన్ ఆర్మీలో భారత కెప్టెన్‌లా పనిచేసి, ఆ తర్వాత ఫ్రీ ప్రెస్ జర్నల్ ఆఫ్ బాంబేకి విదేశీ ప్రతినిధిగా వ్యవహరించిన పీఆర్ఎస్ మణి స్టోరీ ఆఫ్ ఇండోనేషియన్ రివల్యూషన్, 1945-1950 పేరుతో పుస్తకం రాశారు.

‘‘ఇండోనేషియా సైనికుడు షూట్ చేసిన బుల్లెట్ నా గుండెలోకి దూసుకెళ్లడంతో నేను చావు అంచు వరకు వెళ్లాను. డచ్ వారి కోసం నేనెందుకు చనిపోవాలి అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను’’ అని మణి తన పుస్తకంలో రాశారు.

ఇండోనేషియా నుంచి భారత దళాలను వెనక్కు రప్పించి, వారిని ఇంటికి పంపించాలని అభ్యర్థిస్తూ భారత తొలి ప్రధాని జవహర్ నెహ్రూ నేతృత్వంలో బ్రిటన్ సైన్యంపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు మణి తన పుస్తకంలో రాశారు.

1945 నవంబర్ 20న బ్రిటన్ సైన్యం ఈ ఫిర్యాదును స్వీకరించింది. భారత సైనికులను మెల్లగా స్వదేశానికి తరలించింది. ఈసారి తమ దేశ స్వాతంత్య్రం కోసం భారత సైనికులు మరో పోరాటానికి సిద్ధం కావాల్సి వచ్చింది.

ఈ యుద్ధం తర్వాత, ఇండోనేషియా ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారాలతో వారిని గౌరవించింది. చాలా మందికి చనిపోయిన తర్వాత ఈ గౌరవం దక్కింది.

ఇండియా, ఇండోనేషియాపై ఈ యుద్ధ ప్రభావం

ఇండియన్లు-ఇండోనేషియన్లు చరిత్ర నుంచి నేర్చుకోవాలని, ఇరు దేశాలు, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఇండియన్ అసోసియేషన్ ఇన్ సురబయ(ఐఏఎస్) అధ్యక్షుడు మనోజిత్ దాస్ నాటి ఘట్టాన్ని తలచుకుంటూ చెప్పారు.

‘‘భారత్, ఇండోనేషియా మధ్య కొన్ని సాంస్కృతిక సారూప్యాలు ఉన్నాయి. చాలా విషయాలు కలుస్తాయి. సంస్కృతి, సంప్రదాయాలు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. రెండు దేశాలు కూడా ప్రపంచంలో ఎక్కువ జనాభా గల దేశాలుగా ఎలా మారాయో మనం చూడొచ్చు’’ అని ఆయన బీబీసీకి తెలిపారు.

ఐఏఎస్ రికార్డుల ప్రకారం సురబయలో 55 భారతీయ కుటుంబాలకు చెందిన సుమారు 180 మంది నివసిస్తున్నట్లు తెలిపారు.

వీరిలో చాలా మంది భారత్ నుంచి తరలి వచ్చిన ప్రవాసులని మనోజిత్ దాస్ చెప్పారు. వీరితోపాటు మూడు నుంచి నాలుగు తరాలుగా ఇండోనేషియాలో నివసిస్తున్న వారున్నారు.

ఐదో డివిజన్‌కు చెందిన భారత దళాల కుటుంబాలు, ఇతర బ్రిటిష్-ఇండియన్ డివిజన్లకు చెందినవారు ఇతర ఆగ్నేయాసియా దేశాలకు లేదా స్వదేశానికి వెళ్లినట్లు ఆయన తెలిపారు.

అయినప్పటికీ, ఇండోనేషియాలో నివసించిన భారతీయ సైనికుల సమాచారాన్ని, స్వాతంత్య్రం కోసం ఇరు దేశాలు పరస్పరం ఎలా సాయం చేసుకున్నాయో ఈ కథనం ద్వారా మరింత మంది తెలుసుకుంటారని ఆయన చెప్పారు.

భారత్ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు, ఇండోనేషియా 1947లో పశ్చిమ బెంగాల్‌లోని ప్రభావిత కుటుంబాలకు 10 వేల టన్నులకు పైగా బియ్యాన్ని ఎగుమతి చేసింది.

భారత్‌, ఇండోనేషియాకు మంచి ఫ్రెండ్‌ అని, ఇది తమ మిత్ర దేశమని ప్రొఫెసర్ పీటర్ కారీ అన్నారు.

ఇండోనేషియా అతిథిగా వ్యవహరించిన బాండుంగ్‌లో జరిగిన ఆసియా-ఆఫ్రికా కాన్ఫరెన్స్ సందర్భంగా నెహ్రూ, సుకర్ణో మధ్య సహకారానికి సంబంధించి ఒక ఘటనను పీటర్ గుర్తుకు చేసుకున్నారు.

యుద్ధంలో మరణించిన సైనికుల గుర్తుగా ఏర్పాటు చేసిన జాతీయ స్మారక చిహ్నం తుగు పహ్లావన్‌ను సందర్శించిన శ్రీవాస్తవ, ఆయన భార్య
ఫొటో క్యాప్షన్, సురబయ యుద్ధంలో మరణించిన సైనికుల గుర్తుగా ఏర్పాటు చేసిన జాతీయ స్మారక చిహ్నం తుగు పహ్లావన్‌ను సందర్శించిన శ్రీవాస్తవ, ఆయన భార్య

‘‘ఇండోనేషియన్లు ఆతిథ్యం ఇచ్చిన తీరు నన్నెంతో ఆకట్టుకుంది. ఇంత మంచిగా మేం చేయలేమని నేను కొండబద్దలు కొట్టినట్లు చెప్పగలను అని ఎడ్వినా మౌన్‌బాటెన్‌కు రాసిన లేఖలో నెహ్రూ పేర్కొన్నారు’’ అని ప్రొఫెసర్ కారీ తెలిపారు.

ఇండోనేషియాకు స్వాతంత్య్రం రాక ముందు నుంచే దీర్ఘకాలంగా సురబయలో ఇండియన్ అసోసియేషన్ ఇన్ సురబయ ఉందని శ్రీవాస్తవ చెప్పారు. ఇండోనేషియాలో ఉంటే తాము భారత్‌కు దూరంగా ఉన్నట్లు అనిపించదని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాల మధ్య సారూప్యం వల్ల చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుందన్నారు.

ఇండోనేషియాలో భారత సైనికుల కథను భారత డయాస్పోరా మరింత తెలుసుకుంటుందని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘‘మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ దేశ సరిహద్దులను, భూమిని సంరక్షించడం, మద్దతివ్వడం మన నైతిక బాధ్యత. ఆ దేశ, దేశ ప్రజల అభివృద్ధికి సాయం చేయాలి’’ అన్నారు.

ఇవి కూడా చదవండి: