మహిళ మెదడులో ప్రాణంతో ఉన్న మూడు అంగుళాల పాము... కనీవినీ ఎరుగని విచిత్రం

మెదడులో బతికున్న పురుగు

ఫొటో సోర్స్, ANU

    • రచయిత, ఫిల్ మెర్సెస్
    • హోదా, బీబీసీ న్యూస్, సిడ్నీ

ప్రపంచంలోనే తొలిసారి ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ మెదడులో బతికున్న ఎనిమిది సెంటీమీటర్ల పాములాంటి పురుగును గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.

గత సంవత్సరం కాన్‌బెర్రాలో రోగికి చికిత్స చేసేటప్పుడు దెబ్బతిన్న ఫ్రంటల్ లోబ్‌ నుంచి తాడు ఆకారంలో ఉన్న ఒక పురుగును బయటకు తీశారు.

కడుపు నొప్పి, దగ్గు, రాత్రి పూట చెమటలు, ఒత్తిడి, మతిమరుపు పెరగడం వంటి వాటితో ఆ మహిళ బాధపడిందని డాక్టర్లు చెప్పారు.

రెండు నెలల వరకు ఎరుపు రంగులో ఉన్న ఈ పురుగు మహిళ మెదడులోనే ఉంది.

పశువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులు పెరుగుతున్నాయని ఈ కేసు తెలియజేస్తుందని పరిశోధకులు హెచ్చరించారు.

‘‘ఏదో అసాధారణమైన దాన్ని, పట్టుకుని బయటికి తీసినప్పుడు ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా షాకయ్యారు. 8 సెంటిమీటర్ల ఎర్రటి పురుగు కదులుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు’’ అని కాన్‌బెర్రా ఆస్పత్రిలో అంటురోగాల డాక్టర్ సంజయ సేనానాయకే చెప్పారు.

దీన్ని బయటికి తీసినప్పుడు మనషులలో ఇంతకుముందు గుర్తించని ఒక కొత్త రకం వ్యాధిగా దీన్ని పేర్కొన్నారు.

ఓఫిడస్కారిస్ రోబర్టిసి అనే చుట్టులు తిరిగే ఈ పురుగులు, ఆస్ట్రేలియాలో విషం లేని పురుగులలో సాధారణమైనవి.

సరస్సు పక్కనే నివసించే ఈ మహిళ ఆకుకూరలు, గడ్డి సేకరించే సమయంలో ఈ పురుగు ఆమె మెదడులోకి వెళ్లుంటుందని సైంటిస్ట్‌లు చెప్పారు.

పారాసైట్ ఎగ్స్‌, కొండచిలువ మలంతో కలుషితమైన మొక్కలను వంట కోసం వాడిన తర్వాత ప్రమాదవశాత్తు ఈ పరాన్నజీవి మహిళ మెదడులోకి వెళ్లుంటుందని అనుమానిస్తున్నట్లు పారాసైటాలజీ ఆస్ట్రేలియా నిపుణులు మెహ్రాబ్ హుస్సేన్ ఎమర్జింగ్ ఇన్‌ఫెక్షన్స్ డిసీజస్‌ జర్నల్‌లో రాశారు.

2021 జనవరి చివరిలో ఈ పేషెంట్ ఆస్పత్రిలో చేరారు.

మెదడులో కుడిపైపునున్న ఫ్రంటల్ లోబ్‌ దెబ్బతిన్నట్లు స్కాన్‌లో గుర్తించారు.

2022 జూన్‌లో సర్జన్లు బయాప్సీ చేసే సమయంలో ఆమె ఈ పరిస్థితికి గల కారణాన్ని వైద్యులు కనుగొన్నారు.

వైద్య చరిత్రలోనే ఇది అరుదైన కేసు అయినప్పటికీ, ఆమె ఈ శస్త్రచికిత్స తర్వాత బాగానే కోలుకుంటున్నారు.

‘‘ఓఫిడస్కారిస్ లార్వా ద్వారా మెదడుపై ప్రభావం చూపిన కేసు ఇంతకుముందు ఎన్నడూ నమోదు కాలేదు’’ అని డాక్టర్ హుస్సేన్ చెప్పారు.

ఈ కేసు మనకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తోందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ(ఏఎన్‌యూ) మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ సేనానాయకే బీబీసీకి తెలిపారు.

గత 30 ఏళ్లలో 30 రకాల కొత్త ఇన్‌ఫెక్షన్లు వెలుగులోకి వచ్చాయని ఏఎన్‌యూ టీమ్ నివేదించింది.

పశువుల నుంచి మనషులకు వ్యాప్తి చెందే అంటురోగాలైన జూనోటిక్‌లు మూడింతలు పెరిగాయి.

‘‘మానవ జనాభా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నందున మనం చాలా దగ్గరగా పశువులు, జంతువులు నివసించే ప్రాంతాలకు వెళ్తున్నాం. మనం పదేపదే చూస్తున్న సమస్య ఇదే. గబ్బిలాలు, పందుల నుంచి వ్యాప్తి చెందిన నిఫా వైరస్ అయినా, సార్స్ లేదా మెర్స్ లాంటి కరోనావైరస్‌లు అయినా.. తొలుత జంతువుల నుంచి, ఆ తర్వాత మనుషులకు వ్యాప్తి చెందాయి’’ అని ఏఎన్‌యూ టీమ్ తెలిపింది.

కోవిడ్ ప్రస్తుతం తగ్గినా.. వైద్య నిపుణులు, ప్రభుత్వాలు ఇలాంటి వ్యాధులను నిర్మూలించే నిఘాలను ఏర్పాటు చేయడం అత్యంత కీలకం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)