'ఖుషి' రివ్యూ: విజయ్ దేవరకొండ - సమంతల కెమిస్ట్రీ మ్యాజిక్ చేసిందా?

ఫొటో సోర్స్, Twitter/TheDeverakonda
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ప్రేమ కథలు ఎవర్ గ్రీన్. మంచి పాటలు, హీరో - హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, కాస్త కాన్‌ఫ్లిక్ట్ కుదిరితే చాలు. వర్కవుట్ అయిపోతాయి.
అందుకే.. వెండి తెరపై లవ్ స్టోరీలు వెల్లువలా వస్తుంటాయి. కానీ, ఈమధ్య ఆ హవా కాస్త తగ్గింది. చాలా కాలం తరవాత... ఓ ప్రేమ కథ 'ఖుషి' రూపంలో మన ముందుకు వచ్చింది.
హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి ఇచ్చిన పాటలు ఇప్పటికే హిట్టయ్యాయి.
విజయ్ - సమంతల మధ్య సన్నివేశాలు పోస్టర్ల దగ్గర్నుంచే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇక కావాల్సింది కాన్‌ఫ్లిక్ట్. నాస్తికులు - ఆస్తికులు పేరుతో.. ఓ బలమైన సంఘర్షణని కథలో మేళవించారు.
మరి.. ఈ దినుసులన్నీ సరిగా కుదిరాయా? ఖుషి కథ ద్వారా దర్శకుడు శివ నిర్వాణ ప్రేమలో ఆవిష్కరించిన కొత్త కోణమేంటి?
బేగమ్ కా ప్రేమలో..!
విప్లవ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ)కి బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం వస్తుంది. తొలి పోస్టింగ్ కశ్మీర్‌లో. అక్కడ ఆరాధ్య (సమంత)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు.
తాను ఓ ముస్లింనని, పాకిస్థాన్ నుంచి వచ్చానని విప్లవ్‌ని నమ్మిస్తుంది ఆరాధ్య. ముస్లిం అయినా సరే... `బేగమ్..బేగమ్` అనుకొంటూ.. తన వెంట పడతాడు.
విప్లవ్‌ని తప్పించుకొని తిరుగుతూ, తిరుగుతూనే చివరికి తన ప్రేమలో పడిపోతుంది ఆరాధ్య. అయితే వీరిద్దరి కుటుంబ నేపథ్యాలు వేరు.
విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం (సచిన్ ఖేడ్కర్) నాస్తికుడు. సైన్స్‌ని తప్ప దేన్నీ నమ్మడు.
ఆరాధ్య తండ్రి చదరంగం శ్రీనివాస్ (మురళీ శర్మ)కి దేవుడి మీదే.. భరోసా. శాస్త్రాలే.. ప్రపంచాన్ని శాసిస్తున్నాయని గట్టి నమ్మకం.
లెనిన్ సత్యం, చదరంగం శ్రీనివాస్ మధ్య పచ్చ గడ్డి వేయక పోయినా భగ్గుమంటుంది.
వారిద్దరినీ ఒప్పించి విప్లవ్, ఆరాధ్య ఒక్కటయ్యారా? పెళ్లయ్యాక వారిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి?
ఆస్తికత్వం, నాస్తికత్వం మధ్య ప్రేమ, ఓ యువ జంట ఎలా నలిగింది? ఇదంతా తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
కశ్మీర్ అందాల మధ్య..
ప్రేమకథలకు తాజాదనాన్ని తీసుకొచ్చేది.. ఈ నేపథ్యమే.
ఆ నేపథ్యాన్ని ఎంచుకోవడంలో దర్శకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది.
ఈ ప్రేమకథని కశ్మీర్‌లో మొదలెట్టి.. ఆ ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చాడు దర్శకుడు.
కశ్మీర్ అందాల మధ్య.. విప్లవ్ - ఆరాధ్యల ప్రేమను నడిపి... మనసులకు ఆహ్లాదాన్ని కలిగించాడు.
కశ్మీర్ అంటే పడి చచ్చిపోయే విప్లవ్‌కి కశ్మీర్‌లో అడుగు పెట్టగానే ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో సరదా సన్నివేశాలతో వివరిస్తూ... కథలోకి ప్రేక్షకుడ్ని లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
ఆ తరవాత ఆరాధ్య ఎంట్రీ ఇస్తుంది. ఆరాధ్యని చూసీ చూడంగానే హీరో ప్రేమించేయడంలో లాజిక్ లేకపోయినా.. ఎవ్వరూ పట్టించుకోరు.
ఆరాధ్య - విప్లవ్ మధ్య సరదా ట్రాకులతో కాస్త కాలక్షేపం చేశాడు దర్శకుడు.
అవసరం లేకపోయినా.. ఓ ఛేజ్‌ని ఇరికించాడు. బహుశా... బడ్జెట్ తనకు ఆ స్వేచ్ఛ ఇచ్చి ఉంటుంది.
హీరో నుంచి తప్పించుకోవడానికి హీరోయిన్ ఓ డమ్మీ కథ చెబుతుంది. దాన్ని నమ్మి హీరో, హీరోయిన్‌కి లేని తమ్ముడిని వెదికే పనిలో పడతాడు.
ఆ సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెడతాయి. లవ్ స్టోరీలో అక్కడక్కడా ఎత్తుపల్లాలు, గతుకులు తగులుతూ ఉన్నా, చక్కటి సంగీతం, పాటలు, కశ్మీర్ అందాలు.. వీటితో ఆ ఇబ్బంది కూడా మటుమాయం అయిపోతుంది.
విశ్రాంతి కార్డుకి ముందు హీరో ఇంట్లో ఉన్న నాస్తికత్వం, హీరోయిన్ ఇంట్లో ఉన్న ఆస్తికత్వం రెండూ గుమ్మరించారు.
ఈ రెండింటి మధ్య హీరో, హీరోయిన్లు భవిష్యత్తులో ఎలా నలిగిపోతారో? అనే ఆసక్తిని కలిగించాడు. దాంతో ఫస్టాఫ్ గట్టెక్కుతుంది.

ఫొటో సోర్స్, Twitter/TheDeverakonda
ద్వితీయార్థంలో విషమ పరీక్ష
ఏ ప్రేమకథకైనా.. ద్వితీయార్థంలోనే అసలు పరీక్షలు ఎదురవుతాయి. ఖుషి కూడా అందుకు మినహాయింపు కాదు.
పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్న జంట ఎలా కాపురం చేసింది? వాళ్ల మధ్య గిల్లికజ్జాలు ఎలా ఉద్భవించాయి? వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? ఇవన్నీ ఆసక్తిని రేకెత్తించేవే.
సెకండాఫ్‌ని చాలా ప్రామిసింగ్‌గా స్టార్ట్ చేసిన దర్శకుడు మెల్లమెల్లగా ట్రాక్ తప్పుతూ వెళ్లాడు. శివ నిర్వాణపై దర్శకుడు మణిరత్నం ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ సినిమాలో మణిరత్నం గత చిత్రాల తాలుకూ రిఫరెన్సులు పుష్కలంగా ఎదురవుతుంటాయి. సఖి ఎఫెక్ట్ ఈ సినిమాపై ఉంది.
ద్వితీయార్థ ప్రారంభం, కథ మలుపు తీసుకొనే విధానం.. ఇవి రెండూ సఖిని స్ఫూర్తిగా తీసుకొని రాసుకున్నవే అనిపిస్తాయి.
విప్లవ్ పబ్‌లో ఓ పాట పాడుకొంటాడు. భార్యలు ఇంట్లో పెట్టే నరకాన్నీ, వాళ్ల చాదస్తాన్నీ పాటలో వర్ణిస్తాడు.
అంటే.. ఇంట్లో విప్లవ్ ఎంత స్ట్రగుల్ అయి ఉండాలి? కానీ అలాంటి సన్నివేశాలేం విప్లవ్ - ఆరాధ్యల మధ్య జరగవు.
కొత్తగా పెళ్లయిన జంట మధ్యన.. వారి నేపథ్యాలు వేరయినప్పుడు స్వతహాగానే కాస్త గ్యాప్ వస్తుంది.
దాన్ని ఎంత ఆర్గానిక్‌గా చూపిస్తే అంత బాగుంటుంది.
విప్లవ్ కోసం ఆరాధ్య చాలా మారుతుంది. ఆఖరికి చేపల పులుసు కూడా వండడం నేర్చుకొంటుంది.
ఆరాధ్య కోసం విప్లవ్ ఓ వినాయకుడి ప్రతిమ తీసుకొస్తాడు. అంటే.. ఇద్దరూ తమ తమ నేపథ్యాల్ని మర్చిపోయి, ఒకరి కోసం ఒకరు బతుకుతున్నట్టు అన్నమాట.
ఇంత అందంగా వాళ్ల మధ్య అనుబంధం చూపించి సడన్‌గా.. పెళ్లొద్దు.. ఈ పెళ్లాలొద్దూ అని పాడుకోవడం విడ్డూరంగా కనిపిస్తుంది.
ఓ దశలో ఇది... విప్లవ్ - ఆరాధ్యల కథా? లేదంటే చదరంగం శ్రీనివాస్ - లెనిన్ సత్యం ఈగో క్లాషా అనిపిస్తుంది.
ఈ రెండింట్లో దర్శకుడు దేన్ని ఫాలో అయి కథ రాసుకొన్నా బాగానే ఉండేది. కానీ.. రెండూ కావాలనుకొన్నాడు, చివరికి రెండింటికీ న్యాయం చేయలేకపోయాడు.
విప్లవ్ - ఆరాధ్య పిల్లల కోసం పడుతున్న ఆరాటం, వాళ్లకు పిల్లలు పుట్టకపోవడం... వీటిపై బలమైన సన్నివేశాలు రాసుకొంటే - హీరో సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లినా, తన భార్య కోసం హోమం చేయడానికి సిద్ధపడినా ఆ సన్నివేశాలు నిలబడేవి.
కానీ.. అలాంటివేం జరగవు.
దాంతో చాలా సన్నివేశాలు పునాదుల్లేని భవంతుల్లా, బొమ్మల్లా నిలబడిపోయాయంతే.
చివర్లో లెనిన్ సత్యం కోసం చదరంగం శ్రీనివాస్ మారినా, చదరంగం శ్రీనివాస్ కోసం లెనిన్ సత్యం పది మెట్లు దిగి వచ్చినా అంత ప్రభావితంగా అనిపించలేదు.

ఫొటో సోర్స్, Twitter/TheDeverakonda
విజయ్‌కి హుషారొచ్చింది
విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. తను చాలా గ్లామర్‌గా కనిపించాడు.
ప్రేమకథలు తనకు బాగా సూటవుతాయి. బేగమ్ బేగమ్ అంటూ సమంత వెంట పడడం చూస్తే గీత గోవిందంలో `మేడమ్ మేడమ్` అనే మేనరిజం గుర్తొస్తుంది.
చిన్న చిన్న డైలాగుల్నే.. విజయ్ తనదైన ఈజ్‌తో చెబుతుంటే.. బాగా పేలాయి.
సమంత ఒక్కో ఫ్రేమ్‌లో ఒక్కోలా కనిపించింది. ఇది వరకటి హుషారు లేదు.
కొన్ని చోట్ల మరీ డల్‌గా కనిపించింది. బహుశా.. ఈ పాత్రకు ఇదే కరెక్ట్ అనుకొని ఉంటుంది.
లెనిన్ సత్యంగా సచిన్ ఖేడ్కర్, చదరంగం శ్రీనివాస్ పాత్రలో మురళీ శర్మ ఆకట్టుకొన్నారు.
ఓ రకంగా బాబు గోగినేని, చాగంటి కోటేశ్వరరావులే... ఈ పాత్రలకు ఆదర్శం కావొచ్చు.
తొలి సగంలో వెన్నెల కిషోర్, ద్వితీయార్థంలో రాహుల్ రామకృష్ణ కాస్త నవ్విస్తారు. జయరాం - రోషిణి పాత్రల్ని కథకు కాస్త బలంగా రాసుకోవాల్సింది.

ఫొటో సోర్స్, Twitter/TheDeverakonda
సంగీతం సగం బలం
ఈ సినిమాతో తాను ఏం చెప్పదలచుకొన్నాడో దర్శకుడు ట్రైలర్‌లోనే చూపించేశాడు.
దానికంటే కొత్త కథ, కొత్త సరంజామా ఖుషిలో ఉంటుందని ఎవ్వరూ అనుకోరు.
కొన్ని సినిమాల్లో.. తరువాతి సన్నివేశంలో ఏం జరగబోతుందో ఊహించడం ఏమంత కష్టం కాదు.
కానీ శివ నిర్వాణ స్క్రీన్ ప్లే వల్ల రాబోయే పది సన్నివేశాల్లో తను ఏం రాసుకొన్నాడో ముందే చదివేయగలం. రొటీన్ సన్నివేశాలు, స్క్రీన్ ప్లే మధ్య కూడా ఈసినిమాని చూడగలిగామంటే అది సంగీతం వల్లే.
ఖుషీ టైటిల్ సాంగ్, ఆరాధ్య గీతం... ఇవి రెండూ చక్కటి ప్లేస్‌లో కుదిరాయి. ఆ పాటలు సంగీత పరంగానూ, సాహిత్య పరంగానూ ఆహ్లాదకరంగా సాగిపోయాయి.
నేపథ్య సంగీతం, కెమెరా పనితనం కూల్‌గా ఉన్నాయి.
2 గంటల 45 నిమిషాల నిడివి గల సినిమా ఇది. ఎడిటర్ కత్తెరకు పని చెప్పాల్సిన సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి.
ఈ కథలో అనవసరంగా ఒకట్రెండు చోట్ల అర్జున్ రెడ్డి రిఫరెన్స్‌లు తీసుకొచ్చారు.
ఆ సమయానికి థియేటర్లో కాస్త కిక్ ఇవ్వొచ్చేమో కానీ.. వాటి వల్ల ఉపయోగం ఏమీ కనిపించదు.
మంచి టైటిల్, స్టార్ బలం, సాంకేతిక నిపుణుల నైపుణ్యం.. ఇవన్నీ తోడుగా ఉన్నా - వాటిని బాలెన్స్ చేసేలా, ఆ ప్రతిభని పూర్తి స్థాయిలో వాడుకొనేలా శివ నిర్వాణ ఓ బలమైన కథ రాసుకోలేకపోయాడు.
రెగ్యులర్ లవ్ స్టోరీని, రెగ్యులర్ ఎమోషన్స్‌తో నింపేశాడు.
ఆస్తికత్వం - నాస్తికత్వం అనే రెండు భిన్న ధృవాల్ని లవ్ స్టోరీలో మేళవించాలన్న ఆలోచన బాగుంది కానీ, ఆచరణలో మాత్రం పూర్తి న్యాయం చేయలేకపోయాడు.
ఇవి కూడా చదవండి:
- ఇస్రో: దేశం గర్వించేలా ఎదిగిన ఈ సంస్థ 60 ఏళ్ల కథ ఇదీ...
- భారత్‌లో ‘కర్రీ ప్రాబ్లమ్’, ఇది ప్రపంచానికి కూడా పెద్ద సమస్య కానుందా?
- అదానీ గ్రూపును చుట్టుముట్టిన మరో వివాదం.. ‘స్టాక్ మాన్యుపులేషన్’పై ఓసీసీఆర్పీ ఆరోపణలు
- ‘మోదీయే 80 శాతం మంది భారతీయుల తొలి ప్రాధాన్యం’.. ప్యూ రీసర్చ్ సెంటర్ నివేదికలో ఇంకా ఏముంది?
- పప్పు: ఇండియా మెచ్చిన శుద్ధ శాకాహార పోషకాహార వంటకం.. నోరూరించేలా వండడం ఇలా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















