'గాండీవధారి అర్జున' రివ్యూ: వరుణ్ తేజ్ సిన్సియర్‌గా ప్రయత్నించినా...

ఫొటో సోర్స్, Twitter/IAmVarunTej
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
కొంత మంది దర్శకులకు సినిమాను వినోద సాధనంగా మాత్రమే కాకుండా ఓ సామాజిక కోణంలోనూ చూసే అలవాటు ఉంది. ప్రవీణ్ సత్తారు కూడా అలాంటి దర్శకుడే.
'చందమామ కథలు', 'గరుడవేగ' సినిమాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.
ఈ కథల్లో అంతర్లీనంగా ఒక సామాజిక సమస్య ఉంది. ప్రవీణ్ తాజాగా తీసిన 'గాండీవధారి అర్జున'లోనూ ఆ ఉద్దేశం కనిపిస్తుంది.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం టైటిల్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. మరి సినిమా ఎలా ఉంది? ఈ సినిమాతో ప్రవీణ్ సత్తారు ఏం చెప్పాలనుకొన్నాడు?

ఫొటో సోర్స్, YouTube / Junglee Music Telugu
కథాంశం ఏమిటి?
లండన్‌లో ప్రపంచ పర్యావరణ సదస్సు జరుగుతుంటుంది. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనే ప్రతిష్ఠాత్మక సదస్సు అది.
భారతదేశం తరఫున మంత్రి ఆదిత్య రాయ్ బహదూర్ (నాజర్) పాల్గొంటాడు.
ఈ సదస్సులో మంత్రి కొన్ని కీలకమైన అంశాల్ని చర్చిస్తే, చెత్తను అడ్డం పెట్టుకొని, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన రణ్‌వీర్ (వినయ్ రాయ్) పతనం అవుతాడు.
అందుకే ఆదిత్యరాయ్‌ను చంపాలని, ఆయన దగ్గరున్న ఆధారాల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తుంటాడు రణ్‌వీర్.
ఆదిత్యను కాపాడే బాధ్యత ప్రైవేట్ సెక్యురిటీ ఏజెంట్ అర్జున్(వరుణ్ తేజ్) తీసుకొంటాడు.
ఓరకంగా ఆదిత్యకు అర్జున్ బాడీగార్డ్ అన్నమాట. మరి ఆదిత్యను రక్షించే క్రమంలో అర్జున్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.
చెత్త చుట్టూ అసలేం జరుగుతోంది? ఆదిత్య రాయ్ సెక్రటరీ ఐరా (సాక్షి వైద్య)కూ, అర్జున్‌కూ ఉన్న సంబంధం ఏమిటి? రణ్‌వీర్ ఎంతటి కిరాతకుడు? - ఇదే మిగిలిన కథ.

ఫొటో సోర్స్, Twitter/IAmVarunTej
చెత్త ఏం చేస్తున్నాం?
ఈ సినిమా ఎలా తీశారు? ఎవరికి నచ్చుతుంది? కమర్షియల్ ఫలితం ఏమిటి? అనేది పక్కన పెడితే, ఈ సినిమా ద్వారా ప్రవీణ్ సత్తారు ఓ కఠినమైన నిజాన్ని వెండితెరపై చూపించే ప్రయత్నం చేశాడు.
ఆ విషయంలో దర్శకుడ్ని అభినందించాలి. ప్రపంచంలోని అగ్ర దేశాలు తమ దగ్గర ఉన్న చెత్త డంప్ చేయడానికి పేద దేశాల్ని ఎలా వాడుకొంటున్నాయో, ఆ చెత్త ద్వారా కాలుష్యం పెరిగి, ప్రజలు ఎంతటి ఘోరమైన అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో చూపించాడు.
నిజంగానే చెత్త విషయంలో ప్రభుత్వాలూ, ప్రజలూ మేలుకోవాల్సిన అవసరం ఉందని ఈ సినిమా గుర్తు చేస్తుంది.
ఈ సినిమాలో కొన్ని విజువల్స్ కనిపించినప్పుడు ప్రేక్షకులు ఉలిక్కి పడతారు. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
అయితే, చెప్పదలచుకొన్న పాయింట్ మంచిదైతే సరిపోదు. చెప్పే విధానం కూడా బాగుండాలి. ఈ విషయంలో దర్శకుడు తడబడ్డాడు.
ఏదో చెప్పాలన్న తాపత్రయం మినహాయిస్తే, దాన్ని ఆసక్తిగా మలుస్తున్నామా, లేదా? ఈ కథ ఎవరికి కనెక్ట్ అవుతుంది? ఎందుకు అవుతుంది? అనేది సరిచూసుకోలేదు.
ఆదిత్య రాయ్‌కు ప్రమాదం పొంచి ఉందన్న సంగతి అర్థం అవుతుంది కానీ, ఎవరి నుంచో, ఎందుకో తెలియడానికి సగం సినిమా అయిపోతుంది.
అసలు కథే అది అయినప్పుడు దర్శకుడు ఎంత త్వరగా ఆ పాయింట్ టచ్ చేస్తే అంత మంచిది. కానీ కాలయాపన చేశాడు.

ఫొటో సోర్స్, YouTube / Junglee Music Telugu
అక్కడ అంత 'బిల్డప్' ఎందుకో!
హీరో, హీరోయిన్ల ఫ్లాష్ బ్యాక్‌కీ ఈ కథకీ సంబంధమే లేదు. దాని చుట్టూ కనీసం 20 నిమిషాల కథ తిరుగుతుంది. ఆ నరేషన్ కూడా చాలా వీక్‌గా అనిపిస్తుంది.
అర్జున్ - ఐరా నిలబడి రెండు నిమిషాలు మాట్లాడితే సమస్య తీరిపోయే దానికి.. వాళ్ల వెనుక ఏదో విషాదకరమైన, మర్చిపోలేని గతం ఉన్నట్టు బిల్డప్ ఇచ్చారు.
చివరికి ఆ అపార్థం ఎలా తొలగిందో కూడా చెప్పలేకపోయాడు దర్శకుడు.
సదస్సుకి మంత్రి వెళ్లాలి. తనకు కొన్ని ఆధారాలు కావాలి. అవి ఓ అమ్మాయి దగ్గర ఉంటాయి. ఆ ఆధారాల్ని మంత్రికి ఇవ్వడానికి తను ఆపసోపాలు పడుతుంటుంది.
జస్ట్ మెయిల్ చేస్తే సరిపోయే విషయం అది, దాని కోసం ఇన్ని తిప్పలు పడాలా అనే సందేహం సగటు ప్రేక్షకులకు వస్తే అది తన తప్పు కాదు.
ఇలా లాజిక్ లేని విషయాలు తెరపై నడుస్తూనే ఉంటాయి.
ప్రవీణ్ సత్తారు తీసిన సినిమాల్లో 'ఘోస్ట్' ఒకటి. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.
అందులోని కొన్ని పాయింట్లు 'అర్జున'లో కనిపిస్తుంటాయి. ఘోస్ట్ ఫలితం అచ్చి రాకపోయినా ఆ 'రక్షకుడు' ఫార్ములానే ప్రవీణ్ మళ్లీ వాడుకొన్నారు.

ఫొటో సోర్స్, YouTube/Junglee Music Telugu
థ్రిల్లింగ్ మూమెంట్స్ ఏవి?
ఇదో యాక్షన్ సినిమా. అస్తమానూ గన్‌తో పేల్చుకోవడాలూ, ఛేజింగులు అంటే సరిపోదు. ఏదో ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉండాలి.
అది నూటికి నూరుపాళ్లూ ఈ సినిమాలో మిస్ అయ్యింది.
హీరో ఓ మంత్రిని కాపాడాలి. అంటే ఆ మంత్రి ఓ భయంకరమైన పద్మవ్యూహంలో చిక్కుకొన్నాడు అనే భావన ఆడియన్స్‌కు కలగాలి. కానీ, అదేం జరగదు.
విలన్ కూడా చుట్టపు చూపుకు వచ్చినట్టు అప్పుడప్పుడూ కనిపిస్తుంటాడంతే. దాంతో ఏదో ప్రమాదం ముంచుకొస్తోంది అనే భయం ప్రేక్షకులకు కలగదు.
తెరపై పాత్రలో ఏదో ఇంటెన్సిటీ ఫీలవుతుంటాయి తప్ప ఆడియన్స్ దాన్ని ఫాలో అయ్యే పరిస్థితి కనిపించదు.
పతాక సన్నివేశాలు మరింత బోరింగ్‌గా సాగుతాయి. మూడు చోట్ల జరిగే వ్యవహారాల్ని స్క్రీన్ ప్లే టెక్నిక్‌తో అటూ, ఇటూ తిప్పి చూపించారు కానీ, ప్రేక్షకుల్లో థ్రిల్ కలిగించలేకపోయారు.
సదస్సులో నాజర్ ప్రసంగంలా సినిమా కూడా చాలా నిదానంగా సాగుతుంది.

ఫొటో సోర్స్, Twitter/IAmVarunTej
మేకింగ్ బాగుంటే చాలా..?
సినిమాలో వరుణ్ తేజ్ సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. తనకు తగిన పాత్ర ఇది. ఓ సోల్జర్‌లా కనిపించాడు. అయితే ఎక్కువ వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కలేదు.
సాక్షి వైద్య హుందాగా, అందంగా కనిపించింది.
నాజర్ తన సీనియారిటీ చూపించారు. స్క్రిప్టులో సగం ఆయన కోసం రాసిందే అనిపిస్తుంది.
వినయ్ రాయ్‌ది అతిథి పాత్రా, విలనా అనేది అర్థం కాదు. తెరపై స్టైల్‌గా కనిపించడం మినహా ఆ పాత్ర చేసిందేం లేదు.
ప్రవీణ్ సత్తారుకు కొత్త కథలతో సినిమాలు తీయాలన్న కోరికైతే ఉంది.
తనపై హాలీవుడ్ సినిమాల ప్రభావం కూడా ఉంది. ఆ స్టైలిష్ మేకింగ్ మాయలో పడిపోయి, కథ, కథనాలపై శ్రద్ద పెట్టడం లేదనిపిస్తుంది.
మేకింగ్ విషయంలో క్వాలిటీ ఉంది. కీలకమైన స్క్రిప్టు విషయంలో తప్పులు జరిగాయి.
ఓ సీరియస్ ఇష్యూను, ప్రజలకు అర్థమయ్యేలా, వాళ్లు ఇన్‌స్పైర్ అయ్యేలా, తెరపై జరుగుతున్న విషయాలతో కనెక్ట్ అయ్యేలా ప్రవీణ్ చెప్పలేకపోయాడు.
తన కథనంతో బోర్ కొట్టించాడు.
సినిమాకు స్టైల్, మేకింగ్ ఒక్కటే సరిపోదని, కథ, కథనం విషయంలో రాజీ పడిపోతే.. ఎవరెంత కష్టపడినా వృథానే అని చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి
- బేబీ సినిమా రివ్యూ: అమ్మాయిని ఓ అబ్బాయి ఇంతలా ప్రేమిస్తాడా... ఈ కథలో నిజమైన ప్రేమ ఎవరిది?
- రంగబలి రివ్యూ: కొత్త పాయింట్, అనూహ్యమైన సంఘర్షణ.. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందంటే?
- సినిమాల్లో నటించే జంతువులను ఎలా ఎంపిక చేస్తారు? వీటికి రోజుకు ఎంతిస్తారు?
- పసూరీ: పాకిస్తాన్ పాటను బాలీవుడ్ సినిమాలో వాడడంపై భారత్‌లో ఏమంటున్నారు
- టైటానిక్: 25 ఏళ్లు గడచినా హీరో జాక్ మరణంపై ఆగని చర్చ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














